అయోధ్య రామాలయ గర్భగుడిలో ప్రతిష్టించే బాలరాముడి విగ్రహం ఇదే..

అయోధ్య రామాలయంలో ప్రతిష్టించే రామ్‌లల్లా విగ్రహం ఎత్తు ఎంత? ఎన్ని గంటలకు ప్రాణప్రతిష్ట జరగనుంది? తెలుసుకుందా..

Update: 2024-01-20 13:47 GMT

అయోధ్య రామాలయంలో జనవరి 22న బాలరాముడి (రామ్‌లల్లా) విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గర్భగుడిలో కొలువుదీరే రాముడి విగ్రహం చిత్రాన్ని విడుదల చేశారు.

51 అంగురాల బాలరాముడి నల్లరాతి విగ్రహం కళ్లకు పసుపు గుడ్డ కప్పి, గులాబీ దండతో అలంకరించారు. మైసూరుకు చెందిన కళాకారుడు అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కిన ఈ విగ్రహాన్ని బుధవారం రాత్రి ఆలయానికి తెచ్చారు.

ఇప్పటికే ప్రారంభమైన పూజ కార్యక్రమాలు..

ఆలయంలో ఇప్పటికే ముందస్తు పూజాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలోపు సంప్రోక్షణ కార్యక్రమం ముగుస్తుందని ఆలయ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. అదే రోజు రామాలయంలో జరిగే ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు చేశామని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ తెలిపారు. రామ్‌లల్లాను ఆలయంలో ఉంచామని, సంప్రోక్షణ వేడుకకు దేశం మొత్తం ఎదురుచూస్తుందని ఆయన అన్నారు.

సిద్ధంగా అంబులెన్సులు.. ఆసుపత్రులు

ఇటు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

అయోధ్యలోని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సంజయ్‌ జైన్‌ మాట్లాడుతూ 16 ముఖ్యమైన ప్రదేశాలలో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిల్లో డాక్టర్‌, ఫార్మాసిస్ట్‌, వార్డు బాయ్‌ ఉంటారని పేర్కొన్నారు. సాకేత్‌ పెట్రోల్‌ పంప్‌, కనక్‌ భవన్‌ హనుమాన్‌ గర్హి వంటి రద్దీగా ఉండే ప్రదేశాల కోసం వ్యూహాత్మకంగా ప్లాన్‌ చేశారు.

ప్రతి యూనిట్‌లో మందులు, నెబ్యులైజర్‌, ఆక్సిజన్‌ సౌకర్యాలు, అన్ని అవసరమైన వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. 10, 20 పడకలు ఉన్న రెండు ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అయోధ్యలోని వివిధ ముఖ్యమైన ప్రదేశాలలో 40 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుతామని చెప్పారు. అత్యవసర వైద్యం కోసం జిల్లాలోని వైద్య కళాశాల, శ్రీ రామ్‌ చికిత్సలయ అయోధ్య, జిల్లా ఆసుపత్రి అయోధ్య, మహిళా జిల్లా ఆసుపత్రి, కుమార్‌గంజ్‌ ఆసుపత్రులను వినియోగించుకుంటామని వివరించారు. పవిత్రోత్సవం సందర్భంగా ఎవరికైనా మెడికల్‌ ఎమర్జెన్సీ అవసరమైతే, వెంటనే ప్రథమ చిక్సిత అందించి, మెరుగైన వైద్యం కోసం శ్రీరామ్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News