వాణిజ్య యుద్ధభయాలతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఇనుము, అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించిన ట్రంప్;
By : The Federal
Update: 2025-02-11 13:31 GMT
వాణిజ్య యుద్దభయాల కారణంగా, అమ్మకాలు నిరంతర ఒత్తిడి, విదేశీ నిధులు తరలిపోవడం వంటి కారణాల వల్ల సెన్సెక్స్ 1018 పాయింట్లు కోల్పోయి, రెండువారాల కనిష్ట స్థాయి చేరుకుంది. నిఫ్టీ 23,100 కంటే దిగువకు పడిపోయింది.
వరుసగా ఐదో రోజు కూడా బీఎస్ఈ సెన్సెక్స్ 1018. 20 పాయింట్లు లేదా 1.32 శాతం క్షీణించి 76,293.60 వద్ద తన రోజువారీ ట్రేడింగ్ ముగించింది. ఇంతకుముందు రోజు 1281 పాయింట్లు లేదా 1.65 శాతం క్షీణించి 76,030. 59 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 309.80 పాయింట్లు లేదా 1.32 శాతం పతనమై 23,071 వద్ద ముగిసింది. దానిలో నమోదైన వ్యాపార సంస్థల్లో 44 షేర్లు నష్టాల్లో ట్రేడవగా , కేవలం ఆరు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.
ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా తాజాగా 25 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించడంతో ఆ రంగాలు కూడా నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా రియాలటీ, పారిశ్రామిక, మూలధన వస్తువుల రంగ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. వాణిజ్య యుద్ధభయాలను రేకిత్తిస్తూ యూరోపియన్ నాయకులు కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించారు. దీనిపై ప్రపంచ మదుపర్లు తీవ్రంగా భయాందోళనలకు గురైయ్యారు.
సెన్సెక్స్ లో 30 షేర్లలో జోమాటో 5 శాతానికి పైగా నష్టపోయింది. టాటా స్టీల్, బజాబ్ ఫిన్ సర్వే, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, లారెన్స్ అండ్ టూబ్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందూస్థాన్ యూనిలీవర్, ఐటీసీ చాలా పెద్ద నష్టాలను చవిచూశాయి.
సెన్సెక్స్ లో భారతీ ఎయిర్ టెల్ మాత్రమే లాభపడింది. గత ఐదురోజుల్లో బీఎస్ఈ బెల్ వెదర్ గేజ్ 2,290 పాయింట్లు లేదా 2.91 శాతం క్షీణించింది. నిఫ్టీ 667.45 పాయింట్లు లేదా 2.81 శాతం పడిపోయింది.
ఈ సంక్షోభానికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) రూ. 2,463.72 కోట్ల విలువైన ఈక్విటీలను తరలిపోయినట్లు ఎక్స్ఛేంజ్ డేటా తెలిపింది. ఈ పరిణామాలు అన్నీ కూడా మదుపర్ల సెంటీమెంట్ ను దెబ్బతీశాయి.
అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల చుట్టూ కొనసాగుతున్న అనిశ్చిత, దేశీయ ఆర్థిక వృద్ది ఆందోళనలు, ఎఫ్ఐఐల నిరంతర అమ్మకాలు మార్కెట్ సెంటీమెంట్ ను దెబ్బతీశాయి. డిమాండ్ లోపం, అధిక విలువల కారణంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్ లు గణనీయమైన క్షీణతను చవిచూశాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాధిపతి వినోద్ నాయర్ అన్నారు.
బీఎస్ఏ స్మాల్ క్యాప్ గేజ్ 3.40,మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.88 శాతం పడిపోయాయి. బీఎస్ఇలో అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. రియాల్టీ 3.14 శాతం, ఇండస్ట్రీయల్ 2.87 శాతం, కన్యూమర్ డిస్క్రీప్షనరీ 2.73 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.59 శాతం, ఆటో 2.49 శాతం, మెటల్ 2.23 శాతం మేర నష్టపోయాయి.
బీఎస్ఇలో 3,478 స్టాక్ లు క్షీణించగా, 525 లాభాలతో ముగిశాయి. ఆసియా మారెట్లలో షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో ట్రేడవగా, సియోల్ లాభాలతో ముగిసింది.
యూరోపియన్ మార్కెట్లు ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ కూడ్ 1.15 శాతం పెరిగి బ్యారెల్ కు 76.74 డాలర్లకు చేరుకుంది.
సోమవారం సెన్సెక్స్ 548.39 పాయింట్లు లేదా 0.70 శాతం తగ్గి, 77,311.80 వద్ద స్థిరపడింది. నిప్టీ 178.35 పాయింట్లు లేదా 0.76 శాతం తగ్గి 23,381.60 వద్ద ముగిసింది.