USTAD ZAKIR | ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి విషమం
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (Ustad Zakir Hussain) అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (Ustad Zakir Hussain) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన అమెరికాలోన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్ 15న శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రి ఐసీయూ లో చేరారు. డాక్టర్లు ఐసీయూలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థించండి అని విజ్ఞప్తి చేశారు. జాకీర్ హుస్సేన్ మరణించినట్టు వచ్చిన వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
తబలా మ్యాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్‌హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు.
1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. జాకీర్ హుస్సేన్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకున్నారు. ఆరు దశాబ్దాల సంగీత ప్రయాణం ఆయనది. ఇండియాతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు.
జాకీర్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి, అంతర్జాతీయ మ్యూజిక్‌కు వారధిగా నిలిచిన లెజెండరీ తబలా విద్యాంసుడని, ఆయన త్వరగా కోలుకోవాలని అన్నారు.