స్వచ్ఛంద సంస్థ పిటిషన్ ను పెండింగ్ లో పెట్టిన సుప్రీంకోర్టు
ఓటింగ్ పూర్తయిన 48 గంటల్లో పోలింగ్ శాతాన్ని ఎన్నికల వెబ్ సైట్లో పెట్టాలని ఓ స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు పెండింగ్ లో పెట్టింది.
By : The Federal
Update: 2024-05-24 11:28 GMT
దేశంలో లోక్ సభ ఎన్నికలు నడుస్తున్నాయని , ఈ ప్రక్రియ మధ్యలో ఉండగా మేము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. బూత్ ల వారీగా ఓటర్ల సంఖ్యను ప్రచురించాలని అలాగే ఓటింగ్ ఫారమ్ 17 సీ రికార్డులను కూడా వెబ్ సైట్లో పెట్టాలని కూడా సదరు స్వచ్చంద సంస్థ ఏడీఆర్ తన పిటిషన్ లో కోరింది.
న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మలతో కూడిన వేకేషన్ ధర్మాసనం కేసును విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఎన్నికల మధ్య హ్యాండ్ అప్ విధానాన్ని అనుసరించాలి. ప్రధాన రిట్ పిటిషన్ తో పాటు దరఖాస్తును విచారించనివ్వండి. మేము ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించలేము. మాకు అధికారంపై విశ్వాసం ఉంది’’ అని జస్టిస్ దత్తా అన్నారు. ఈ కేసులో తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వూలు ఇవ్వలేమని న్యాయమూర్తులు చెప్పారు. సెలవుల తరువాత ఇదే అంశంపై తిరిగి సాధారణ బెంచ్ లో వాదనలు వినిపించాలని అక్కడ మధ్యంతర ఉపశమనం కోసం కాకుండా తుది ఉపశమనం కోసం ప్రయత్నించాలని సూచించింది.
స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమెక్రాటిక్ రిఫార్మ్(ఏడీఆర్) 2019లో ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపిస్తూ కూడా టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా కూడా ఓ పిటిషన్ దాఖలు చేసింది. పోలింగ్ పూర్తయిన 48 గంటల్లో పూర్తి సమాచారాన్ని వెబ్ సైట్లో అప్ లోడ్ చేసేలా ఎన్నికల సంఘానికి నోటీస్ లు జారీ చేయాలని కోరింది. ఈ రెండు పిటిషన్ లను కూడా కలిపి విచారిస్తామని ప్రకటించింది. ఈ రెండు కేసుల్లో ఏడీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి దుష్యంత్ దవే, మొయిత్రా తరఫున అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు.
అవన్నీ ఉత్తుత్తి అనుమానాలు..
ఈ కేసులో ఎన్నికల సంఘం తరుఫున సీనియర్ న్యాయవాదీ సింగ్ వాదనలు వినిపించారు. ఏడీఆర్ ఊహగానాలలో కూడిన ఆరోపణలతో కేసు దాఖలు చేసిందని అన్నారు. ఇంతకుముందు మే 9 న సుప్రీంకోర్టు ఇచ్చిన వీవీప్యాట్ తీర్పును ఉల్లఘించేదిగా ఉందని తెలిపారు. అధికరణ 329 ప్రకారం దేశంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో న్యాయస్థానాల జోక్యాన్ని నివారించిందని అన్నారు. సెకండరీ ఆధారాల ద్వారా ఏడీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేసిందని ఎప్పుడు ఓటింగ్ 6 శాతం తేడా ఉండదని అన్నారు. మొదటి, చివరి ఓటింగ్ మధ్య కేవలం 1 నుంచి 2 శాతం మాత్రమే తేడా ఉందని అన్నారు.