ఈడీని లెక్కపెట్టని టీఎంసీ నేత.. ప్రచారంలో మొయిత్రా బిజీ..బీజీ

"అనైతిక ప్రవర్తన" కారణంగా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన టీఎంసీ కృష్ణానగర్‌ లోక్‌సభ అభ్యర్ధి మహుమా మొయిత్రా ఈడీని ఏ మాత్రం లెక్కచేయడం లేదు.

Update: 2024-03-28 07:49 GMT
పశ్చిమ బెంగాల్‌ కృష్ణానగర్‌ లోక్‌సభ అభ్యర్ధి, తృణముల్‌ కాంగ్రెస్‌ మహిళా నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గురువారం తాజాగా సమన్లు జారీ చేశారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కేసులో ఆమెతో పాటు దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త దర్శన్ హిరానందనీకి సమన్లు పంపింది ఈడీ.
ఇప్పటికే రెండుసార్లు..
49 ఏళ్ల మొయిత్రాకు ఈడీ ఇప్పటికే రెండుసార్లు సమన్లు పంపింది. అయితే ఏదో కారణం చెబుతూ నోటీసు వాయిదా వేయాలని ఆమె కోరుతోంది. తాజాగా గురువారం జారీ చేసిన సమన్లను లెక్కచేయకుండా.. "నేను మధ్యాహ్నం కృష్ణనగర్ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తాను" అని ఆమె విలేఖరులతో చెప్పడం గమనార్హం.
ఈడీ అధికారులు మొయిత్రాను నాన్‌ రెసిడెన్షియల్‌ ఎక్స్‌ట్రనల్‌ (ఎన్‌ఆర్‌ఈ), అకౌంట్స్‌, ఒక దేశం నుంచి మరో దేశానికి చెందిన అకౌంట్లకు నగదు చెల్లింపులు, ఇతర లావాదేవీల గురించి ప్రశ్నించనున్నారు.
మొయిత్రాను ఎందుకు బహిష్కరించారు?
"అనైతిక ప్రవర్తన" కారణంగా డిసెంబర్‌లో లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించిన విషయం తెలిసిందే. కాగా రాబోయే ఎన్నికలలో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి ఆమెను తిరిగి పార్టీ నామినేట్ చేసింది.
గత ఏడాది మొయిత్రా స్నేహితుడు, న్యాయవాది జై అనంత్ దెహాద్రాయ్ ఆమెపై ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త హీరానందానీకి మహువా తన పార్లమెంట్ పాస్‌వర్డ్‌ను ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీనివల్ల హీరానందానీ అవసరమైనప్పుడు నేరుగా పార్లమెంట్‌లో తనకు కావాల్సిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని అనంత్ అన్నారు.
డబ్బులు తీసుకొని హీరానందానీ గ్రూప్ తరఫున పార్లమెంట్‌లో మహువా ప్రశ్నలు అడిగారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మహువా మొయిత్రాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించారు. కొద్ది రోజులకే ఆమె పార్లమెంట్‌ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
క్యాష్ ఫర్ క్వైరీ..
పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రశ్నలను అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా మొయిత్రా రూ.2 కోట్ల నగదు, లగ్జరీ ఐటమ్స్‌ తీసుకున్నారని.. ప్రతిఫలంగా ఆమె తన పార్లమెంటు వెబ్‌సైట్‌ లాగిన్ వివరాలను దర్శన్‌ హీరానందానీకి షేర్‌ చేశారని..ఇదే అంశం గురించి ప్రశ్నించేందుకు ఈడీ హీరానందనీకి కూడా సమన్లు జారీ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
కాగా క్యాష్‌ ఫర్‌ క్వైరీ ఆరోపణలను గతంలో మోయిత్రా ఖండించారు. ఈ కేసును మేలో సుప్రీంకోర్టు విచారించనుంది.
Tags:    

Similar News