26న హైవేలపై ట్రాక్టర్ మార్చ్: రాకేష్ టికాయత్
రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 26న న్యూఢిల్లీకి వెళ్లే హైవేలపై ట్రాక్టర్ మార్చ్‌ను నిర్వహిస్తున్నామని బీకేయూ నాయకుడు రాకేష్ టికాయత్ ప్రకటించారు.
By : The Federal
Update: 2024-02-23 09:19 GMT
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కోసం కేంద్ర ప్రభుత్వం చట్టపర హామీ ఇవ్వడంతో పాటు ఇతర డిమాండ్‌లను పరిష్కరించాలంటూ రైతులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఢిలో చలో’’ కార్యక్రమంలో భాగంగా పంజాబ్, హర్యానా రైతులు కొన్ని రోజుల క్రితం దేశ రాజధానికి బయల్దేరారు. అయితే వారిని భద్రతా బలగాలు ఢిల్లీ సరిహద్దుల్లో అడుకున్నాయి. దీంతో అప్పటి నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా సరిహద్దులో భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో 21 ఏళ్ల రైతు శుభకరన్ సింగ్ మరణించాడు. ఇందుకు నిరసనగా శుక్రవారాన్ని (ఫిబ్రవరి 23) "బ్లాక్ ఫ్రైడే"గా పేర్కొంది సంయుక్త కిసాన్ మోర్చా (SKM).
యువ రైతు మృతికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ బాధ్యత వహిస్తూ.. వారిపై కేసు నమోదు చేయాలని రైతు కూటమి ఎస్‌కెఎం డిమాండ్ చేసింది. వారిద్దరూ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని SKM నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ అన్నారు.
న్యూఢిల్లీకి వెళ్లే హైవేలపై ఫిబ్రవరి 26న ఎస్‌కెఎం ట్రాక్టర్ మార్చ్‌ను నిర్వహిస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నాయకుడు రాకేష్ టికాయత్ ప్రకటించారు. అలాగే మార్చి 14న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మహాపంచాయతీ నిర్వహించాలని రైతులు నిర్ణయించారు.
కోటి రూపాయల పరిహారం ప్రకటించిన పంజాబ్ సీఎం..
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కాల్పుల్లో చనిపోయిన శుభకరన్ సింగ్ కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం, అతని సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన విషయం తెలిసిందే.
పంజాబ్ ప్రభుత్వంపై ఆగ్రహం..
యువ రైతు మృతిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పంజాబ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రభుత్వం అమరవీరుల బలిదానాన్ని అవమానించేలా వ్యవహరిస్తోందని కమిటీ నాయకులు విమర్శించారు.
ఆస్తులు జప్తు చేస్తాం..
ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించే ఆందోళనకారుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారి బ్యాంకు ఖాతాలను అటాచ్ చేస్తామని హర్యానా పోలీసులు హెచ్చరించారు.
ప్రత్యేక సమావేశం పెట్టాలి : కాంగ్రెస్
రైతుల సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. రైతుల డిమాండ్లపై చర్చించేందుకు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కూడా పంజాబ్ ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఇప్పటికే కేంద్ర మంత్రుల కమిటీ రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రైతుల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ.. ఏకాభిప్రాయానికి రావాలంటే ఇరుపక్షాల నుంచి ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు.
శుభకరన్ సింగ్ మరణం తరువాత రెండు రోజుల పాటు తమ "ఢిల్లీ చలో" మార్చ్‌ను నిలిపివేశారు. ఇప్పటికే వేలాది మంది రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉన్నారు.