ఇద్దరు పిల్లలు, సెక్యూరిటీ గార్డు పని: షమర్ ఇన్ స్పైరింగ్ స్టోరీ

రోజు గడవాలంటే చెక్కలు చేయడమే దిక్కు ఆ పనిలో చావు దగ్గర నుంచి వెళ్లిపోయింది. సెక్యూరిటీ గార్డుగా పొద్దంతా పని. కానీ ఏం జరిగిన క్రికెట్ మాత్రం వదల్లేదు.. షమర్

Update: 2024-01-30 07:05 GMT
షమర్ జోసెఫ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అటు టెస్టుల్లోనూ.. ఇటు వన్డేల్లోను ప్రపంచ ఛాంపియన్.. అది ఏ మైదానం లో ఆడిన గెలుపు తన సొంతం చేసుకుంటుంది. అలాంటి సొంత గడ్డపై.. అది కూడా ప్రపంచంలోనే అత్యంత పేస్, బౌన్సీ వికెట్ పై పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. ప్రత్యర్థి జట్టు వెస్టిండీస్.. ఆస్ట్రేలియాలో ఓ టెస్ట్ మ్యాచ్ గెలిచి ఏకంగా 27 సంవత్సరాలయింది. గబ్బాలో జరిగేది రెండో టెస్ట్ మ్యాచ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా సునాయాసంగా గెలిచింది. ఇంకా ఈ టెస్ట్ లో కూడా ఫలితం అదే అనుకుని చాలా మంది ఈ మ్యాచ్ సంగతే మరిచిపోయారు.

కానీ విండీస్ జట్టు అద్భుత ఆటతీరుతో 8 పరుగుల తేడాతో ప్రపంచ ఛాంపియన్ ఆసీస్ ను వారి గడ్డ మీదే ఓడించింది.. ఈ విజయం ఎంతలా ప్రభావం చూపిందంటే.. ఆస్ట్రేలియా లెజెండరీ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ కూడా కామెంటరీ బాక్స్ లో ఉండి.. విండీస్ విజయాన్ని తాను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ అసాధారణ విజయం వెనక ఓ యోధుడు ఉన్నాడు. అతనే 24 ఏళ్ల షమర్ జోసెఫ్.. ఎవరతను.. ఏమిటా జీవితం..

వెస్టిండీస్ ఒకప్పటి ప్రపంచ చాంఫియన్.. అయితే అది గతం.. మూడు దశాబ్దాలుగా దాని క్రికెట్ ప్రమాణాలు పడిపోతూనే ఉన్నాయి. లీగ్ శకం ఆరంభం అయ్యాక దేశ ఆటగాళ్లందరూ జాతీయ జట్టు కంటే ఈ లీగ్ ల్లోనే ఆడడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం టీ20 ఆట ఆడుతూ డబ్బు సంపాదనపై పడ్డారు. కానీ విండీస్ మాత్రం నాణ్యమైన పేస్ బౌలర్ల కర్మాగారంగా ఇప్పటికీ కొనసాగుతోంది. ఆరడుగుల ఎత్తు, బలమైనదేహంతో అలవోకగా 140 కి.మీ వేగంతో బంతులు విసురే ఆటగాళ్లు వస్తూనే ఉన్నారు.

షమర్ జోసెఫ్ మొన్నటి మ్యాచ్ లో హీరో.. ఒకప్పుడు తన గ్రామం బరకరాలో చెక్కలు చెక్కే పనిలో ఉండేవాడు. రోజు గడవాలంటే.. ఆ పనే తప్పని సరి. షమర్ వాళ్లది మారుమూల గ్రామం. 2018 వరకూ కూడా ఆ ఊరికి ఇంటర్నెట్ లేదు. సెల్ ఫోన్లు లేవు, ఏదైన అవసరం ఉంటే ల్యాండ్ లైన్ ల ద్వారా మాత్రమే సమాచారం అందేది. గ్రామంలో ఇప్పటికీ కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీలే దిక్కు.

"ఒకరోజు చెక్కల కోసం చెట్లను కొట్టడానికి వెళ్లాను. అయితే సడన్ గా చెట్టు నా పక్కనేపడిపోయింది అది వెంట్రుక వాసులో తప్పిపోయింది.. ఆ రోజు నాపక్కనే నా తోబుట్టువులు, మా నాన్న ఉన్నారు, కానీ ఒక్కక్షణం నామనస్సంతా ఏదో అయింది. ఇక నేను ఈ పని చేయను అని నా వాళ్లతో చెప్పాను" అని షమర్ క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు. తరువాత నేను జీవనోపాధి కోసం 121 కిలోమీటర్ల దూరంలో ఉన్నన్యూఆమ్ స్టర్ డామ్ కు రావాల్సి వచ్చింది.

కుటుంబం గడవడం కోసం మొదట ఓ నిర్మాణ సంస్థలో కార్మికుడిగా పని చేశాడు. అయితే ఎత్తుగా ఉన్న వాటిపై పనిచేయాలంటే భయపడుతున్నాడని, సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాడు. షిప్టుల వారీగా పనికావడంతో క్రికెట్ ఆడేందుకు సమయం కుదరకపోయేదీ. మరో వైపు భార్య గర్భవతి కూడా కావడంతో అసలు గ్రౌండ్ మొకం కూడా చూసే సమయం చిక్కలేదతనికి.

"అయితే ఆదివారం మాత్రం టేప్ బాల్ తో క్రికెట్ ఆడేవాళ్లం. సెక్యూరిటీ గార్డుగా పనిచేసినందుకు నాకేం చిన్నతనంగా అనిపించట్లేదు. అలా చేయగా వచ్చిన డబ్బుతోనే నేను కుటుంబాన్ని పోషించాను. నేను మంచి ప్రదేశంలో, మంచి వ్యక్తులతో కలిసి పనిచేశాను. అది చాలా గొప్పవిషయం" అని షమర్ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

తొలి వికెట్ స్మిత్ దే

షమర్ జోసెఫ్ కు ఇదే తొలి టెస్ట్ సిరీస్. ఆసీస్ తో జనవరి 17,2024న జరిగిన మొదటి టెస్ట్ లోనే అరంగ్రేటం చేశాడు. కానీ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఓ ఘనత సొంతం చేసుకున్నాడు. తన కెరీర్ మొదటి బాల్ కే స్మీవ్ స్మిత్ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు షమర్ కు కేవలం ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. అది కూడా 2023 లోనే అరంగ్రేటం చేశాడు. కానీ తన పేస్ తో అందరిని ఆకట్టుకున్నాడు.

ఎన్నికష్టాలు వచ్చిన తనకు క్రికెట్ పై ఉన్న మక్కువ మాత్రం చావలేదని చెప్పుకొచ్చాడు షమర్. " నా చేతిలో బాల్ ఎప్పుడు ఉంటుంది. నిద్రపోతే బెడ్ పక్కనే ఉంటుంది. ఇదీ కూడా నా పిల్లలాగే అయిపోయింది. నా పిల్లలు( అమరీ, అమలి), నా భార్య( త్రిషనా) కోసమే ఈ బంతిని పట్టుకున్నానా అని అనిపిస్తుంది. నా ప్రపంచం వాళ్లే. మైదానంలోకి వచ్చిన ప్రతిసారీ ఎందుకో నెర్వస్ గా ఫీలవుతా. కానీ బంతిని చూడగానే అవన్నీ మర్చిపోతా" అని షమర్ అంటున్నారు.

బౌలింగ్ కు ముందు గాయం

షమర్ రెండో ఇన్సింగ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిచెల్ స్టార్క్ వేసిన యార్కర్ నేరుగా షమర్ కాలివేలికి తగిలింది. గాయం కారణంగా రెండో ఇన్సింగ్స్ లో బౌలింగ్ చేయలేనేమో అని షమర్ భయపడ్డాడు. అయితే మా డాక్టర్ ఏం మాయ చేశాడో ఏమో.. నా కాలు మామూలుగా అయిపోయింది. జట్టులో ఉన్న కుర్రాళ్లంతా సపోర్ట్ చేయడానికి నువ్వు రావాలని జట్టు కోరింది.

అందుకే తిరిగి గ్రౌండ్ లోకి తిరిగి వచ్చాను. అలిసిపోయే వరకూ, లేదా చివరి వికెట్ తీసే వరకూ బౌలింగ్ చేస్తానని చెప్పాను, ఇప్పుడు నేను గర్వపడుతున్నా అని షమర్ సంతోషంతో చెప్పాడు. ఈ మ్యాచ్ లో షమర్ తన కెరీర్ లోనే బెస్ట్ బౌలింగ్ అనదగ్గ 7/68 గణాంకాలను నమోదు చేశాడు. ఈ సిరీస్ లో అతను మొత్తం 13 వికెట్లు తీసుకున్నాడు.

షమర్ జోసెఫ్ దశ ఇక తిరిగినట్లే. ఐపీఎల్, బిగ్ బాష్ వంటి లీగ్ ల్లో షమర్ కు మంచి డిమాండ్ ఉంటుంది. మంచి పేస్ తో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే వారికోసం అక్కడి యాజమాన్యాలు డేగ కళ్లతో వెతుకుతుంటాయి. ఇదే ప్రతిభ మరో రెండు సిరీస్ లో షమర్ కనబరిస్తే.. వేలంలో అతని డిమాండ్ ఊహించలేనంతగా ఉంటుంది. 

Tags:    

Similar News