సీనియర్ జర్నలిస్టు మురళీధర్ రెడ్డి మృతి

మూడు దశాబ్దాల పాటు ఆయన ది హిందూ ఇంగ్లీష్ దినపత్రికలో పనిచేశారు.

Update: 2024-06-23 13:18 GMT


ప్రముఖ ఇంగ్లీష్ ‘ది హిందూ’ మాజీ కరెస్పెండెట్ బైరెడ్డి మురళీధర్‌ రెడ్డి (64) శనివారం రాత్రి ఢిల్లీలో మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిన్న రాత్రి ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ది హిందూ ఢిల్లీ బ్యూరోలో దాదాపు మూడు దశాబ్దాలపాటు రాజకీయ వ్యవహారాల కరెస్పాండెంట్ గా మురళీధర్‌ రెడ్డి పని చేశారు. ఆ పత్రిక పాకిస్తాన్‌ శ్రీలంక కరస్పాండెంట్‌గా పనిచేశారు. 1980లో ది హిందూ ఢిల్లీ ఎడిషన్‌ను ప్రారంభించినప్పుడు మురళీధర్‌ రెడ్డి జర్నలిస్టుగా పని చేస్తున్నారు. రాజకీయ ప్రతినిధిగా, వార్తాపత్రిక కోసం అనేక ప్రధాన సంఘటనలను రిపోర్టు చేశారు. ముఖ్యంగా 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత గురించి కూడా ఆయన రాసిన వార్తా కథనాలకు మంచిపేరొచ్చింది.

2000లో, ది హిందూ అతనిని పాకిస్తాన్‌ కరస్పాండెంట్‌గా ఇస్లామాబాద్‌కు, ఆ తర్వాత వార్తాపత్రిక శ్రీలంక కరస్పాండెంట్‌గా కొలంబోకు పంపింది.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ (IIMC) పూర్వ విద్యార్థి అయిన మురళీధర్ రెడ్డి ది హిందూలో చేరడానికి ముందు మెయిన్‌ స్ట్రీమ్‌, నేషనల్‌ హెరాల్డ్‌ లలో పనిచేశారు. ఆయన భార్య అపర్ణ శ్రీవాత్సవ పూర్వం పిటిఐ కరెస్సాండెంట్. ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు.

చంద్రబాబు నాయుడు సంతాపం

సీనియర్‌ పాత్రికేయులు బి.మురళీధర్‌ రెడ్డి మఅతికి సిఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ది హిందూ పత్రికతో పాటు పలు పత్రికల్లో ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీతో పాటు శ్రీలంక, పాకిస్థాన్‌ లో కూడా కరస్పాండెంట్‌ గా పని చేసిన మురళీధర్‌ రెడ్డి రిపోర్టింగ్‌ లో తనదైన ముద్ర వేశారని అన్నారు. మురళీధర్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మఅతి విచారకరమని సిఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.



Tags:    

Similar News