ఉగ్రవాదులను వారి సొంతగడ్డపై మట్టికరిపించాం: మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. 'శక్తి'ని నాశనం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ఓటుతో సరైన సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు.
బీజేపీ సుస్థిర పాలనకు నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. రిషికేశ్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ పాలనలో దేశ భద్రతా దళాలు తమ సొంత గడ్డపై ఉగ్రవాదులను నిర్మూలిస్తున్నాయని చెప్పారు. గతంలో బలహీన, అస్థిర ప్రభుత్వాల పాలనలో శత్రువులు రెచ్చిపోయారని, ఉగ్రవాదం విస్తరించిందన్నారు.
అయోధ్యలో రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉండడంపై మోదీ మాట్లాడారు. “రాముడి ఉనికిపై కాంగ్రెస్ చాలా ప్రశ్నలు లేవనెత్తింది. 'ప్రాణ్‌ప్రతిష్ఠ'ను బహిష్కరించారు. ఇప్పుడు, హిందూ మతంలోని 'శక్తి'ని నాశనం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లోని దేవతలు - మా ధారీ దేవి, జ్వల్పా దేవికి ప్రతీక అయిన 'శక్తి'ని తొలగించడం గురించి మాట్లాడిన కాంగ్రెస్‌కు తగిన సమాధానం చెప్పాలి’’ అని మోదీ ప్రజలను కోరారు. గతంలో ఉన్న బలహీన కాంగ్రెస్ ప్రభుత్వం సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందని, ఇప్పుడు తాము రోడ్లు వేస్తున్నామని, సొరంగాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు.