అయోధ్య గురించి మోదీ ట్విట్ ఏంటి?
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొంటున్న ప్రధాని మోదీ ట్విట్టర్లో ఏమని పోస్టు చేశారు. ఆడియో ప్రసంగంలో ఏం చెప్పారు.
ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనుంది. అదే రోజు బాలరాముడు (రామ్‌లల్లా) విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జనవరి 12) తన ఆడియో సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘రామమందిర ప్రారంభోత్సవంలో సాక్షిగా ఉండటం నా అదృష్టం. ఈ శుభ సందర్భానికి భారతీయులందరి ప్రాతినిధ్యం వహించే సాధనంగా దేవుడు నన్ను ఎంచుకున్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాను. ప్రజలంతా దీవించాలని కోరుతున్నాను," అని మోదీ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేశారు.
జనవరి 12 ఎంతో శుభదినమని మోదీ పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి , ఛత్రపతి శివాజీ తల్లి జిజాబాయి జయంతి కూడా ఇదే రోజు అని గుర్తు చేశారు. 140 కోట్ల మంది భారతీయులు తన హృదయంలో ఉంటారని, రామ మందిర నిర్మాణం మాత్రమే లక్ష్యంగా చేసుకున్న అనేక మంది వ్యక్తుల జ్ఞాపకాలు కూడా అలాగే ఉంటాయని మోదీ అన్నారు.