సీనియర్లంతా లైన్లో నిలబడండి అంటున్న మోదీ
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే బీజేపీ తన రెండో జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో మాజీ ముఖ్యమంత్రులను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదేశించడం..
By : Gyan Verma
Update: 2024-03-14 10:21 GMT
సార్వత్రిక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నందున, అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండవ జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల జాబితాను పరిశీలిస్తే సీనియర్ నాయకులందరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయక తప్పదని స్పష్టమైన సందేశాన్ని పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రుల పేర్లు ఈ రెండో జాబితాలో ఉండడం కూడా మనం గమనించవచ్చు.
హర్యానా ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు పని చేసిన మనోహార్ లాల్ ఖట్టర్ పేరు ను రెండో జాబితాలో ప్రకటించారు. ఆయన కర్నాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా బీజేపీ ఆదేశించింది.
ముగ్గురు మాజీ సీఎంలు ..
బుధవారం సాయంత్రం కమల దళం విడుదల చేసిన 72 మంది అభ్యర్థుల జాబితాలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ పేర్లు ఉన్నాయి. బీజేపీ ప్రకటించిన 72 మంది పేర్లలో కనీసం 29 మంది కొత్తవారు ఉన్నారు.
పార్లమెంటరీ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించాలని మాజీ ముఖ్యమంత్రులను బిజెపి నాయకత్వం కోరుతూనే, మరోవైపు రాజ్యసభ సభ్యులైన కొంతమంది ప్రముఖ కేంద్ర మంత్రులను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాలని బీజేపీ అధినాయకత్వం లక్షిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ సీనియర్ నేతలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను ఉత్తర ముంబైలోని లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ కోరింది.
“ఎన్నికల్లో పోటీ చేయమని ముగ్గురు ముఖ్యమంత్రులను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమైంది. బసవరాజ్ బొమ్మై గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడపడంలో విఫలం అయ్యారు. అలాగే ఖట్టర్ తన పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారు. వీరిని జాతీయ రాజకీయాల్లో తీసుకెళ్లడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఇక నుంచి రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పడమే ”అని కర్ణాటకకు చెందిన సీనియర్ బిజెపి నాయకుడు ఫెడరల్ తో చెప్పారు.
ఎట్టకేలకు గడ్కరీ!
అనేక నెలల ఊహాగానాలకు ముగింపు పలికి, నాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును బిజెపి నాయకత్వం నిర్ణయించింది. గడ్కరీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా, మహారాష్ట్రలో పార్టీ కోసం పనిచేయించాలనే ఊహాగానాలు వచ్చాయి.
72 మంది అభ్యర్థులలో ఐదుగురు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శోభా కరంద్లాజే, ప్రహ్లాద్ జోషి ఉన్నారు.
మిత్రులకు సందేశం
బిజెపి నాయకత్వం మహారాష్ట్ర, కర్నాటకలో తన కూటమి భాగస్వాములతో సీట్ల పంపక సూత్రాన్ని ఖరారు చేయడానికి ముందే, పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రెండవ జాబితాలో మహారాష్ట్రలోని 48 సీట్లలో 20.. కర్ణాటకలోని 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
కర్ణాటకలో బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) మధ్య సీట్ల షేరింగ్ ఫార్ములా అధికారికంగా ప్రకటించనప్పటికీ, బీజేపీ నాయకత్వం మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అల్లుడు సీఎన్ మంజునాథ్ పేరును ప్రకటించింది. బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఆయనను పోటీ చేయాలని కోరారు.
“జేడీఎస్ నేతలకు హసన్, మాండ్య, కోలార్ నియోజకవర్గాలను ఆఫర్ చేయగా, మంజునాథ్ బీజేపీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. కాబట్టి సాంకేతికంగా, JDS నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలను కలిగి ఉంటుంది, కానీ ఆ పార్టీ మూడు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది, ”అని బిజెపి నాయకుడు ఒకరు చెప్పారు.
మహారాష్ట్రలో కూటమి భాగస్వామ్య పక్షాలకు సీట్ల పంపకాల ఫార్ములా కూడా ప్రకటించనప్పటికీ, మహారాష్ట్రలోని మెజారిటీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, సిట్టింగ్ సీట్ల విషయంలో రాజీ లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌లకు గట్టిగానే చెప్పినట్లు అయింది.
ప్రధాన మార్పులు
వచ్చే ఎన్నికల్లో ఎన్నికలలో పోటీ చేయాలని బీజేపీ నాయకత్వం పెద్దలందరినీ కోరడమే కాదు. వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖ నేతలను కూడా జాతీయ ఎన్నికల్లో పోటీ చేయవద్దని కోరింది.
ఢిల్లీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఏడుగురు సిట్టింగ్ పార్లమెంటు సభ్యులలో (ఎంపీలు) ఆరుగురిని పార్టీ మార్చింది. కేవలం భోజ్ పురి నటుడు, రాజకీయ వేత్తగా మారిన మనోజ్ తివారీ మాత్రమే ఇక్కడ తిరిగి పోటీ చేస్తున్నాడు.క్రికెటర్ నుండి రాజకీయవేత్తగా మారిన గౌతమ్ గంభీర్, గాయకుడు హన్స్ రాజ్ హన్స్ ఎన్నికల నుంచి తప్పుకున్నారు.
అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధిష్టానం పలువురు ప్రముఖులకు టికెట్లు నిరాకరించింది. వారిలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద్ గౌడ, అనంత్ కుమార్ హెగ్డే, నళిన్ కుమార్ కటీల్, ప్రతాప్ సింహా తదితరులకు కమల దళం టికెట్లు ఇవ్వలేదు.
“గెలవగల సామర్థ్యం, ఆమోదయోగ్యత అనే రెండు అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఈ సారి ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయించింది. ఈసారి టికెట్ నిరాకరించబడిన చాలా మంది నాయకులు ఇప్పటికే అనేకసార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైయ్యారు. రాష్ట్రంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు” అని బీజేపీ సీనియర్ నాయకుడు ఫెడరల్ తో చెప్పారు.