అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించే ‘రామ్‌లల్లా’ విగ్రహాన్ని చెక్కిందెవరు?
అయోధ్య రామమందిరం అత్యంత ప్రతిష్టాత్మకం. ఆలయంలో ప్రతిదీ ప్రత్యేకమే. బాలరాముడి విగ్రహం కూడా. అయితే ఈ విగ్రహాన్ని చెక్కిందెవరు?
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతులమీదుగా బాలరాముడి (రామ్‌లల్లా) విగ్రహాన్ని ఆలయంలో ఈ నెల 22న ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్టించనున్నట్లు సమాచారం. ఈ వార్తను సోమవారం (జనవరి 1) బీజేపీ నాయకుడు బీఎస్ యెడియూరప్ప ప్రకటించగా.. దాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్లో (X) ధృవీకరించారు.
‘‘అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన కోసం విగ్రహం ఎంపిక ఖరారైంది. మన దేశానికి చెందిన ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ అరుణ్ చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు’ అని జోషి తెలిపారు.
"ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು"
— Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024
ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q
దైవత్వం ప్రతిబింబించేలా..
తన విగ్రహం ఎంపికపై తనకు అధికారికంగా సమాచారం రాలేదని శిల్పి అరుణ్ పేర్కొన్నారు. విగ్రహాన్ని చూసే భక్తులు దైవత్వాన్ని అనుభూతి పొందేలా శిల్పం చెక్కానని తెలిపారు.
‘‘బిడ్డలాంటి ముఖాన్ని దృష్టిలో ఉంచుకుని, నేను ఆరు నుంచి ఏడు నెలల క్రితం నా పనిని ప్రారంభించాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎంపిక కంటే, ప్రజలు దానిని అభినందించాలి. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను’’ అని చెప్పాడు
కేదార్‌నాథ్‌లో ఉంచిన 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని, ఢిల్లీలోని ఇండియా గేట్‌కు సమీపంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని అరుణ్ ప్రముఖంగా చెక్కారు.
రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఎంపిక చేసిన ముగ్గురు శిల్పులలో అరుణ్ కూడా ఉన్నాడు.
అరుణ్ కు యడ్యూరప్ప అభినందనలు..
‘‘మైసూర్‌లోని శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీరాముని విగ్రహం అయోధ్యలోని అద్భుతమైన శ్రీరామ మందిరంలో ప్రతిష్టించడానికి ఎంపికయ్యింది. ‘శిల్పి అరుణ్’కి హృదయపూర్వక అభినందనలు.’’ అని తెలిపారు.
యడియూరప్ప కుమారుడు, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర కూడా అరుణ్‌ను కొనియాడారు. ‘‘అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్ని జనవరి 22 న అయోధ్యలో ప్రతిష్టించడం కర్ణాటక గర్వించదగ్గ మైసూరుకు గర్వకారణం’’ అని ఆయన పోస్ట్ చేశారు.
కిష్కింధ రాష్ట్రంలో ఉన్నందున కర్ణాటకకు రాముడితో లోతైన అనుబంధం ఉందని ఆయన అన్నారు. రామాయణం ప్రకారం, రాముని భక్తుడైన హనుమంతుడు కిష్కింధలో జన్మించాడు.
అరుణ్ యోగిరాజ్ ఎవరు?
మైసూర్‌కు చెందిన ఐదో తరం శిల్పి అరుణ్ ప్రస్తుతం దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న శిల్పులలో ఉన్నారు. అతని తండ్రి యోగిరాజ్ కూడా నైపుణ్యం ఉన్న శిల్పి. అతని తాత బసవన్న శిల్పిని మైసూర్ రాజు పోషించారని అతని వెబ్‌సైట్ పేర్కొంది. అరుణ్‌కు చిన్నప్పటి నుంచి చెక్కడం అంటే చాలా ఇష్టం. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పనిచేశాడు. తర్వాత తనలో అంతర్లీనంగా ఉన్న కళపై దృష్టి సారించాడు. 2008 నుంచి కార్వింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. మైసూరు జిల్లాలోని చుంచనకట్టే వద్ద 21 అడుగుల హనుమాన్ విగ్రహం, బీఆర్ అంబేద్కర్ 15 అడుగుల విగ్రహం అతను చేసినవే.