రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును భారత్ తగ్గిస్తుందా?
ఆర్టీఐ డేటా ఏం చూపిస్తోంది?
By : The Federal
Update: 2025-10-27 11:57 GMT
మహాలింగం పొన్నుస్వామి
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. భారత్, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేస్తుందని చెప్పారు. ఆ మేరకు తనకు స్పష్టమైన హమీ లభించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం మనకు లభిస్తున్న డేటాను చూస్తే అది నిజమని తెలుస్తోంది. ముడి చమురు ద్వారా లభించే ఆదాయాన్ని రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధానికి ఖర్చు చేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే వెంటనే ముడి చమురు కొనుగోలును నిలిపివేయాలని న్యూఢిల్లీపై ఒత్తిడి చేస్తున్నారు.
ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీ, భారత ముడి చమురు దిగుమతులను నిర్వహించే ఏజెన్సీలో ఒకటైన హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) నుంచి ఆర్టీఐ ద్వారా ‘ది ఫెడరల్’ సమాచారం సేకరించింది.
భారత్, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును క్రమంగా తగ్గిస్తున్నట్లుగా డేటా చెబుతోంది. అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గుతుందనే ప్రతిపక్షాల విమర్శలను విదేశాంగ శాఖ నిరాకరిస్తూ వస్తున్నారు. కానీ ఆర్టీఐ ద్వారా లభించిన డేటా మాత్రం అది నిజమని చెబుతున్నాయి.
హెచ్పీసీఎల్ దిగుమతి డేటా..
జనవరి 2022 నుంచి సెప్టెంబర్ 2025 మధ్య రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల నెలవారీ వివరాలను ఫెడరల్ సమాచార హక్కు ద్వారా సేకరించింది. దీనిపై కొన్ని వివరాలను హెచ్పీసీఎల్ అందించింది. కీలకమైన కొంత సమాచారం మాత్రం పీఎస్ యూ కింద గోప్యత నిబంధనలను పేర్కొంటూ స్పందించలేదు.
హెచ్పీసీఎల్ ప్రకారం.. కంపెనీ ఏప్రిల్ 2022 నుంచి జూలై 2025 వరకు నిరంతరాయగా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఈ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 2025 లో అత్యల్పంగా 131 టీఎంటీలు ఉండగా, అత్యధికంగా అక్టోబర్ 2024 లో 1,146 టీఎంటీలుగా ఉంది.
కానీ ఆగష్టు 2022, అక్టోబర్ 2022 లో ఎలాంటి ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోలేదు. అలాగే ఆగష్టు 2025 లో కూడా దిగుమతి సున్నాగా చూపిస్తోంది. ఇదే సమయంలో ట్రంప్ భారత్ పై సుంకాలు విధించారు. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు విమర్శించారు.
పెరుగుదల..
హెచ్ పీసీఎల్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. జనవరి- మార్చి 2022 త్రైమాసికంలో అంటే రష్యా- ఉక్రెయిన్ యుద్దం ప్రారంభంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎలాంటి దిగుమతులు చేసుకోలేదు.
2022 మధ్యకాలంలో యూరల్స్ గ్రేడ్ ముడి చమురు బ్రెంట్ బెంచ్ మార్క్ లకు 20 నుంచి 30 డాలర్లకు తగ్గడంతో దిగుమతులు క్రమంగా పెరిగాయి. ఈ ముడిచమురు శుద్దికి మన కర్మాగారాలు అనుగుణంగా ఉన్నాయి. (యురల్స్ ముడి చమురు అనేది యురల్స్, ఓల్గా ప్రాంతాల నుంచి భారీ ముడి చమురు. పశ్చిమ సైబీరియా లభించే తేలికైన చమురు. ఇది రష్యన్ చమురు ఎగుమతులకు బెంచ్ మార్క్ గా ఉంది)
2024 ఆర్థిక సంవత్సరానికి హెచ్పీసీఎల్ మొత్తం ప్రాసెసింగ్ లో రష్యన్ ముడి చమురు వాటా 13 శాతంగా ఉంది. ఇంటర్ కంపెనీ బ్రేక్ డౌన్ ల వివరాలు రహస్యంగా ఉంచినప్పటికీ రష్యన్ ముడిచమురు దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నోటిఫికేషన్లు లేదా మార్గదర్శకాలు రాలేదని హెచ్పీసీఎల్ స్పష్టం చేసింది.
సమాచారం ఇవ్వడానికి నిరాకరణ..
సమాచార హక్కు ద్వారా హెచ్ పీసీఎల్ వివరాలు అందించినప్పటికీ దాని పరిధి పరిమితం. మిగిలిన వివరాల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), ఓఎన్జీసీ, మంగళూర్ రిఫైనరీ, పెట్రో కెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్పీఎల్) వంటి ఇతర సంస్థలను ఆర్టీఐ ద్వారా ప్రశ్నలు సంధించగా గోప్యత నిబంధనలను పేర్కొంటూ సమాచారం ఇవ్వడానికి అవి నిరాకరించాయి.
దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ది సంస్థ ఐఓసీఎల్, సెక్షన్ 8(1)(డీ) కింద ఆర్టీఐ ప్రశ్నలకు తిరస్కరించింది. మీడియా నివేదికల ప్రకారం.. పీఎస్యూ దుబాయ్ బెంచ్ మార్క్ లను బ్యారెల్ కు 1.5 డాలర్ల తగ్గింపుతో ముడి చమురును కొనుగోలు చేస్తోంది.
బీపీసీఎల్, ఎంఆర్పీఎల్ ఈ సంవత్సరం మూడో క్వార్టర్ లో రష్యా నుంచి 35 నుంచి 40 శాతం ముడి చమురును సేకరించాయి. రిలయన్స్ ప్రయివేట్ సంస్థ కాబట్టి ఆర్టీఐ పరిధిలోకి రాదు. అయితే జామ్ నగర్ లోని రిఫైనరీ ద్వారా భారీ మొత్తంలో రష్యన్ ముడి చమురును శుద్ది చేసి పశ్చిమ దేశాలకు మంచి ధరలకు అమ్ముకుందని ఇతర మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. కంపెనీ ఆంక్షలకు అనుగుణంగా ఉందని చెబుతున్నప్పటికీ ఇది రెండు శాతం పెరుగుదల నమోదు చేసింది.
భారత దిగుమతులు..
కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ(ఎంఓపీఎన్జీ) కీలక విభాగం అయిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిస్ సెల్(పీపీఏసీ) సెప్టెంబర్ 11, 2025 న ది ఫెడరల్ అడిగిన ప్రశ్నలకు తిరస్కరించింది. ఈ సమాచారాన్ని వాణిజ్యపరమైన, గోప్యమైనదిగా పేర్కొంది. ఆర్టీఐ చట్టం-2005, సెక్షన్ 8(1)(డీ) (ఈ) కింద మినహయింపు పొందిందని స్పష్టం చేసింది. ఇందులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న వివరాలను వివరణాత్మకంగా కోరింది.
భారత్ తన ముడి చమురు అవసరాలలో దిగుమతుల ద్వారానే 85 శాతం ఆధారపడి ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 230 మిలియన్ టన్నులకు పైగా ముడి చమరును దిగుమతి చేసుకుంది. వీటిలో రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాలు మనకు ఎగుమతి చేస్తున్నాయి. కానీ వీటిలో కచ్చితమైన వాటా మనకు తెలియదు.
చవకగా రష్యన్ ఆయిల్..
పాశ్చాత్య దేశాల ఆంక్షలు, రష్యన్ ముడి చమురును నిషేధించడంతో భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారుడిగా ఆవిర్భవించింది. రష్యా డిస్కౌంట్ ధరలకు చమురు విక్రయించడంతో భారత్ దిగుమతి బిల్లులపై ఏటా 10 నుంచి 15 బిలియన్ డాలర్లను ఆదా చేసింది. అయితే ట్రంప్ చేసిన కథనాలపై అనేక సందేహాలు ఉన్నాయి.
ఇంతకుముందు భారత్ లో అమెరికా రాయబారిగా పనిచేసిన ఎరిక్ గార్సెట్టీ మాట్లాడుతూ.. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రపంచ ముడి చమురు సంక్షోభం ఏర్పడనుందని, మేమే న్యూఢిల్లీకి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయమని చెప్పినట్లు ధృవీకరించారు. ‘‘భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిందంటే కారణం మేమే. ఎందుకంటే ఎవరైన కొనుగోలు చేస్తే బాగుండని మేము వాంఛించాము’’ అని గార్సెట్టీ 2024 లో అన్నారు.
ప్రభుత్వం చమురు సంస్థలు అయిన హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ 2025 జూలై- ఆగష్టు లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు నిలిపివేశాయని, ప్రభుత్వ అధికారిక ఆదేశాలు లేకుండా సెప్టెంబర్ లో తాత్కాలికంగా తిరిగి ప్రారంభమయ్యాయని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ‘‘కొనడానికి, ఆపడానికి ఎలాంటి దిశా నిర్దేశం లేదు’’ అని హెచ్పీసీఎల్ చైర్మన్ వికాశ్ కౌశల్ ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పారు.
కెప్లర్ డేటా పరిశీలనలు..
ముడి చమురు ఎగుమతులు, దిగుమతుల డేటా విశ్లేషణ చేసే స్వతంత్య్ర సంస్థ కెప్లర్ ప్రకారం.. భారత్ తన మొత్తం ముడి చమురు అవసరాలలో 40 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది ఇరాక్, సౌదీ అరేబియా నుంచి చేసుకునే దిగుమతుల కంటే ఎక్కువగా ఉంది. రష్యన్ చమురు వీటి కంటే చవకైనది. భారతీయ ముడి చమురు పరిశ్రమకు, ముఖ్యంగా ప్రయివేట్ రంగానికి భారీగా లాభాలు తెచ్చిపెడుతోంది.
అక్టోబర్ 2023 నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలం వరకూ రష్యా నుంచి నెలకు సగటున 1.735 మిలియన్ టన్నుల దిగుమతి జరిగింది. ఇది మొత్తం 4.26 మిలియన్ టన్నుల దిగుమతులలో 40 శాతంగా ఉంది. ఇరాక్ నుంచి (9,36,000 టన్నులు), సౌదీ (6,45,000 టన్నులు) అధిగమించిందని కెప్లర్ డేటా చెబుతోంది.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ రష్యా అక్టోబర్ 14, 2025 వరకూ 17.5 మిలియన్ టన్నులు సరఫరా చేసింవది. గత ఏడాది జూన్ నాటికి మొత్తంలో 47.8 శాతంగా ఉంది. తరువాత మెల్లగా 37 నుంచి 41 శాతంతో స్థిరంగా కొనసాగుతోంది.
అమెరికా ఆంక్షలు విధించే ముందు భారత్ లోని చాలా ప్రయివేట్ రంగ సంస్థలు రష్యన్ ముడి చమురును తక్కువ ధరకు దిగుమతి చేసుకుని దానిని శుద్ది చేసి ప్రీమియం ధరకు ఎగుమతి చేసేవని మీడియా నివేదికలు తెలుపుతున్నాయి. రష్యా నుంచి చవక ధరకు ముడి చమురు దిగుమతి అయిన భారతీయులకు మాత్రం ధరల ఉపశమనం లభించలేదు.