ఋగ్వేద విష్ణువు, పౌరాణిక విష్ణువు ఒకరేనా?!

రామాయణంలో నిరుత్తరకాండ-43. ప్రముఖ పరిశోధకుడు కల్లూరి భాస్కరం చెబుతున్న రామాయణ విశేషాలు;

Update: 2025-02-01 04:35 GMT

విష్ణువు అనగానే ఈరోజున మనలో చాలామందికి ఒక నిర్దిష్టరూపమూ, కొంత ప్రాథమిక సమాచారమూ వెంటనే స్ఫురిస్తాయి. విష్ణువు క్షీరసముద్రంలో శేషతల్పం మీద శయనించి ఉంటాడు; పీతాంబరం ధరిస్తాడు; లక్ష్మీదేవి ఆయనను సేవించుకుంటూ ఉంటుంది; ఆయన గరుడధ్వజుడు, గరుడవాహనుడు; సుదర్శనమనే చక్రాన్ని, పాంచజన్యమనే శంఖాన్ని, కౌమోదకి అనే గదను, నందకమనే ఖడ్గాన్ని, శార్ఙ్గమనే వింటినీ ధరిస్తాడు; త్రిమూర్తులలో ఒకడు; మిగతా ఇద్దరిలో బ్రహ్మ సృష్టికర్తా, శివుడు లయకర్తా అయితే ఈయన స్థితికర్త; దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అనేక అవతారాలు ధరిస్తాడు, వాటిలో పది, దశావతారాల పేరుతో ప్రసిద్ధాలు...

ఇక ఆయన పేరుతో వెలసిన వైష్ణవంలోకి, అది ప్రతిపాదించిన విష్ణుతత్వంలోకి వెళ్ళినకొద్దీ పై ప్రాథమికసమాచారాన్ని దాటి మరింత సంక్లిష్టమైన, అలౌకికమైన ఆధ్యాత్మికభావజగత్తులోకి; దానికి సంబంధించిన పరిభాషలోకి అడుగుపెడతాం.

పై విధంగా విష్ణువును మనకు పరిచయం చేసి ప్రాచుర్యంలోకి తెచ్చింది, వేదాల అనంతరకాలానికి చెందిన రామాయణ, మహాభారతాలు, పురాణాలు. వేదాలలోనూ ఋగ్వేదం ఇంకా ప్రాచీనం; మరి ఋగ్వేదం విష్ణువును ఎలా పరిచయం చేసింది; ఋగ్వేదకవులు విష్ణువును ఎలా భావనచేశారు?!

అది తెలుసుకోవడం ఆసక్తికరమే కాక; విష్ణువు స్వరూప, స్వభావాల కల్పనలో వచ్చిన క్రమపరిణామం కూడా అర్థమవుతుంది.

ఋగ్వేదంలో పది మండలాలు, ఆ మండలాలు అన్నింటిలోనూ కలిపి వెయ్యికి పైగా సూక్తాలు ఉంటాయి; మళ్ళీ ఒక్కో సూక్తంలోనూ కొన్నేసి చొప్పున అనేకమైన ఋక్కులు ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఋగ్వేదంలో ఇంద్రుడే ప్రధానదైవం; మొత్తం ఋగ్వేద సూక్తాలలో ఇంద్రుని విడిగానూ, ఇతరదేవతలతోనూ కలిపి స్తుతించినవి 260కి పైగా ఉంటాయి; ఆ తర్వాతి స్థానంలో అగ్ని(201 సూక్తాలు), సోముడు(112 సూక్తాలు) మొదలైన దేవతలు ఉంటారు. విష్ణువును, రుద్రుని ఉద్దేశించిన సూక్తాలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి.

కాకపోతే, ‘విశ్’ తోపాటు విష్ణుశబ్దం కూడా ఋగ్వేదం ప్రథమమండలంలోనే ప్రముఖంగా వస్తుంది. కొన్ని సూక్తాలలోని ఋక్కులు విష్ణువును ఇంద్రునితో కలిపి చెబితే, కొన్ని విడిగా చెబుతాయి. ఉపేంద్రుడనే పేరుతో విష్ణువును ఇంద్రుని తమ్ముడిగా చెప్పడం పౌరాణికప్రసిద్ధమే కాగా; ఋగ్వేదం విష్ణువును ఇంద్రునికి మిత్రుడిగా చెప్పడం కూడా కనిపిస్తుంది.

ఋగ్వేదం ప్రథమమండలంలోని 22, 154, 155, 156 సూక్తాలలోని 21 ఋక్కులు విష్ణువు గురించి ఏం చెబుతున్నాయో -బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, హెచ్. హెచ్. విల్సన్ లు ఇచ్చిన వివరణల వెలుగులో స్థూలంగా చూద్దాం:

22వ సూక్తంలోని 19వ ఋక్కు ‘విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా’ అని చెప్పి -విష్ణువు ఎప్పుడూ ఇంద్రుని వెంట ఉండే మిత్రుడనీ, అతను చేసే కర్మల వల్లనే యజమానుడు అగ్నిహోత్రాది కర్మలు చేయగలుగుతున్నాడనీ అంటుంది. యజమానుడంటే యజ్ఞం చేసేవాడు.

155వ సూక్తంలోని మొదటి మూడు ఋక్కులు విష్ణువును, ఇంద్రుని కలిపీ; చివరి మూడు ఋక్కులు విష్ణువును మాత్రమే ఉద్దేశించీ చెబుతాయి. కలిపి చెప్పిన ఋక్కుల ప్రకారం, ఇంద్రుడూ, విష్ణువూ ఎవరూ జయించలేని మహావీరులు; స్తోత్రప్రియులు; ప్రకాశించే ఎత్తైన మేఘాల మీద సుశిక్షితమైన గుర్రంలా విహరిస్తూ ఉంటారు; వారి గమనం కూడా ఎంతో ప్రకాశమానంగానూ, చక్కగానూ ఉంటుంది; తమను స్తుతించే యజమాని ఏది కోరుకుంటే దానిని వారు అగ్ని ద్వారా ప్రసాదిస్తారు.

మూడవ ఋక్కు ఇంద్రుడు ఒక్కడి గురించే చెబుతున్నట్టు ఉన్నా; హెచ్. హెచ్. విల్సన్ తన ఋగ్వేదానువాదంలో ఉటంకించిన సాయనాచార్యుని వివరణ ప్రకారం విష్ణువుకు కూడా అన్వయిస్తుంది. దాని ప్రకారం, యజమాని అర్పించే సోమరూపంలోని హవిస్సు ఇంద్రుని మగటిమిని వృద్ధి చేస్తుంది; ఆ మగటిమి స్వర్గంలోనూ, భూమి మీదా ఉన్న జీవులందరిలోనూ సంతానశక్తినీ, సంతోషాన్నీ నింపుతుంది; వారు పుత్రపౌత్రాభివృద్ధిని పొందుతారు.

యజమాని అర్పించే హవిస్సు సూర్యమండలానికి చేరి ఇంద్రుడికీ, విష్ణువుకీ పుష్టిని కలిగిస్తుందనీ; వారిద్దరూ ఆదిత్యులుగా సూర్యుని ప్రతిరూపాలు కనుక వర్షం కురిపిస్తారనీ; ఆ వర్షంవల్ల భూమి ఫలవంతమై అనేక తరాలపాటు మానవులను పోషిస్తుందనీ, వారు పుత్రపౌత్రాభివృద్ధితో జీవిస్తారనీ దీనికి సాయనాచార్యుని అన్వయం. ఋగ్వేదభాష్యకారుడైన సాయనాచార్యుని ఆంధ్రుడిగానూ, 14వ శతాబ్దిలో విజయనగరరాజ్యంలో జీవించినవాడిగానూ చెబుతారు.

ఆ తర్వాతి 4-5-6 ఋక్కులూ విష్ణువు ఒక్కడినే చెబుతాయి. వాటి ప్రకారం, విష్ణువు సర్వానికీ ప్రభువు, పరిపాలకుడు, ఎవరినీ హింసించనివాడు, వర్షం కురిపించేవాడు; భూమీ మొదలైన లోకాలను తన మూడు పాదాలతో ఆక్రమించినవాడు; అతని రెండు పాదాలు స్వర్గాన్ని తాకుతూ ఉంటాయి; విష్ణువు మూడవ పాదాన్ని(అంటే ద్యులోకాన్ని) ఎవరూ మనసుతో తెలుసుకోలేరు; ఎక్కడికైనా వెళ్లగలిగిన వాయువులు, పక్షులూ కూడా తెలుసుకోలేవు; విష్ణువు 94 నడకలతో చక్రంలా తిరుగుతూ ఉంటాడు, అవే- 1 సంవత్సరం + 2 అయనాలు + 5 ఋతువులు + 12 మాసాలు + 24 పక్షాలు + 30 రోజులు + 8 జాములు + 12 రాశులు = 94 -రూపంలో ఆయా కాలాలను, లేదా కాలవిభాగాలను సృష్టిస్తాయి; విష్ణువు విశాలమైన దేహం కలిగినవాడు; అనేక రూపాల్లోకి మారుతూ ఉంటాడు; నిత్యబాలుడిగా ఉంటాడు; ఆహ్వానించగానే వస్తాడు.

విష్ణువును ఉద్దేశించిన 156వ సూక్తంలోని 5 ఋక్కులూ కూడా విష్ణువును ప్రధానంగా మేఘాలను తెరచి నీటిని పుట్టించేవాడిగా, పుష్కలంగా అన్నం పెట్టేవాడిగా, రక్షించేవాడిగా, మూడులోకాలను ఆవరించి ‘ఆర్యు’డైన యజమానికి ప్రీతి కలిగించేవాడిగా చెబుతాయి.

పైన విష్ణువు మూడు పాదాల గురించి, అవి మూడులోకాలను ఆవరించడం గురించిన ప్రస్తావన చూడండి; విశేషమేమిటంటే, విష్ణువుకు సంబంధించి ఋగ్వేదంలో ఈ పాదాల ప్రస్తావనే ఎక్కువచోట్ల వస్తుంది. ఉదాహరణకు, 22వ సూక్తంలోని విష్ణువు గురించిన 3 ఋక్కులూ; 154వ సూక్తంలోని 5 ఋక్కులూ విష్ణువు పాదాలు, లేదా అడుగుల గురించే చెబుతాయి. వాటి ప్రకారం, విష్ణువు ఏడు విధాలుగా భూమిమీద అడుగుపెట్టాడు; ఈ జగత్తు అంతటా నడిచాడు; మూడు అడుగులు మోపాడు; అతని పాదానికి అంటిన ధూళిలోనే జగత్తు అంతా ఇమిడి ఉంది; విష్ణువు ధర్మాలను, అంటే కర్మలను పోషిస్తూ మూడు లోకాల్లోనూ మూడడుగులు వేశాడు; లోకాలను మూడు అడుగులతో ఒక్కడే ఆక్రమించాడు; విష్ణువు మూడు పాదాలే ఎప్పటికీ క్షీణించని అన్నాన్ని ఇస్తాయి; విష్ణువు భూమి, నీరు, తేజస్సు అనే మూడు ధాతువులతో భూమినీ, స్వర్గాన్నీ పుట్టించాడు; అతనివి విస్తారమైన అడుగులు.

ఇలా ఋగ్వేదంలో విష్ణువు మూడడుగుల గురించిన వర్ణన -ఆయన ధరించిన దశావతారాలలోని ఒక అవతారాన్ని మీకు గుర్తుచేసి ఉండాలి; అది, వామనావతారం. బలి అనే రాక్షసుడు మూడులోకాలనూ జయించి, ఇంద్రుడి సంపదను హరించడం, ఇంద్రుడి తమ్ముడిగా ఉపేంద్రుడైన విష్ణువు వామనావతారమెత్తి బలి దగ్గరికి వెళ్ళి మూడడుగుల నేల యాచించడం, బలి ఇవ్వడం, అప్పుడు వామనుడు రెండడుగులతో భూమ్యాకాశాలను ఆక్రమించుకుని మూడవ అడుగును బలి నెత్తిమీద ఉంచి పాతాళానికి అణగదొక్కడం- ఇతిహాసపురాణ ప్రసిద్ధమైన కథ. అంటే, వామనుని త్రివిక్రముడిగా కూడా చిత్రించే ఈ కథ మూలాలు ఋగ్వేదంలో ఉన్నాయన్నమాట. సాయనాచార్యులు కూడా ఈ సంగతిని ఎత్తిచూపుతాడు. కాకపోతే, బలి గురించిన ప్రస్తావన మాత్రం ఋగ్వేదంలో లేదు.

దీనినిబట్టి, ఇతిహాస, పురాణాల్లోని కొన్ని కథలూ; వాటిలోని దేవతలూ మొదలైన పాత్రల తాలూకు మూలాలు ఋగ్వేదంలో ఉన్నట్టు అర్థమవుతుంది. అవి ఏమేరకు ఉన్నాయన్నది విడిగా మరింత లోతుగా, విస్తృతంగా పరిశోధించవలసిన కోణం. అలా ఋగ్వేదం ఆధారంగా కథలు సృష్టించడంలోఇతిహాస, పురాణకథకులు ఋగ్వేదకవుల భావననుంచి, ఆయా దేవతలకు వారు కల్పించిన రూపురేఖలనుంచి, వారినుంచి ఆశించిన ప్రయోజనాలనుంచి ఎంత దూరం జరిగారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది; అది కూడా మరింత విపులంగా పరిశీలించవలసిన అంశం.

ఉదాహరణకు, విష్ణువు గురించి ఋగ్వేదకవులు చెప్పిన పై సూక్తాలనే చూడండి; వాటిలో ఎక్కడా మనకు పురాణ, ఇతిహాసాలు పరిచయం చేసిన విష్ణువు కనిపించడు; అంటే ఈ ఋగ్వేదవిష్ణువు శేషతల్పం, క్షీరసముద్రం, లక్ష్మీదేవి, గరుడధ్వజం, గరుడవాహనం, శంఖం, చక్రం, గద, ధనుస్సు, దుష్టశిక్షణ-శిష్టరక్షణ, దశావతారాలు వగైరా అలంకారాలూ, ఆయుధాలూ, ఆర్భాటాలూ, అవతారాలూ ఏవీలేని విష్ణువన్నమాట. అలాగే, ఈ విష్ణువు మోక్షాన్నో, సాయుజ్యాన్నో ఇచ్చే ఆధ్యాత్మిక, తాత్విక దైవం కాదు; ఇంద్రుడికి మిత్రుడిగా ఉంటూ, ఇంద్రునిలానే వర్షాన్ని కురిపించి మనిషి మనుగడకు అవసరమైన అన్నాన్ని ప్రసాదించే దైవం. ఇలాంటి తమ లౌకిక అవసరంతో ఇంద్రునీ, విష్ణువునూ ముడిపెట్టి, వారు మేఘాలపై విహరిస్తూ ఉంటారనీ, మేఘాలను తెరవగలరనీ అంటూ ఋగ్వేదకవి ఆలంకారికంగా చెబుతాడు.

ఋగ్వేదకవి ఊహలో ఇలా వర్షం కురిపించే శక్తి ఇంద్రుడికి గానీ, విష్ణువుకి గానీ ఎలా వస్తుందంటే; యజ్ఞంలో యజమాని వారికి సమర్పించే హవిస్సు ద్వారా వస్తుంది. ఆ హవిస్సు వారి మగటిమిని వృద్ధిచేస్తే, అది వర్షరూపంలో కురిసి భూమిని ఫలవంతం చేసి మనుషులకు తరతరాలపాటు అన్నాన్ని, తద్వారా సంతానశక్తినీ, సంతానాన్నీ ఇచ్చి పుత్రపౌత్రాభివృద్ధికి తోడ్పడుతుంది.

ఇదే సమయంలో, సూర్యగమనం వల్లనే కాలమూ, ఋతువులూ ఏర్పడుతున్నాయనీ; ఆవిధంగా వర్షానికి కారకుడు సూర్యుడేనని కూడా ఋగ్వేదకవికి తెలుసు. అందుకే యజ్ఞంలో యజమాని అర్పించే హవిస్సు సూర్యమండలానికి చేరి ఇంద్రుడికీ, విష్ణువుకీ పుష్టి కలిగిస్తుందని ఊహిస్తాడు. ఇంద్రుడూ, విష్ణువూ సూర్యుని ప్రతిరూపాలేనన్నది ఇందులోని సూచన. ఆదిత్యుడనేది సూర్యుడికి మరోపేరు; ద్వాదశాదిత్యులుగా పేర్కొనే పన్నెండుగురు ఆదిత్యులలో ఇంద్రుడూ, విష్ణువూ కూడా ఉన్నారు. అర్యముడు, మిత్రుడు, వరణుడు, త్వష్ట, భగుడు, పూషుడు మొదలైన మరికొందరు ఋగ్వేదదేవతలు కూడా ద్వాదశాదిత్యులలోకి వస్తారు.

దీనినిబట్టి అర్థమవుతున్నదేమిటి? వాస్తవంగా ఋగ్వేదజనాల దృష్టిలో ఉన్నదీ, వారు దైవంగా భావిస్తున్నదీ తమ కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తున్న, తమ మనుగడతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న సూర్యుడే; ఆయన ఊహాదైవమూ, పరోక్షదైవమూ కాదు; ప్రత్యక్షదైవం!

అలా చూసినప్పుడు, ఇంద్రుడు కానీ, విష్ణువు కానీ, మరొకరు కానీ ప్రత్యక్షదైవమైన సూర్యుడికి భిన్నరూపాలు మాత్రమే అవుతారు. విష్ణువు 94 నడకలతో చక్రంలా తిరుగుతూ సంవత్సరాన్ని, అయనాలను, ఋతువులను, మాసాలను, పక్షాలను, రోజులను సృష్టిస్తున్నాడని చెప్పడంలో వాస్తవంగా ఋగ్వేదకవి దృష్టిలో ఉన్నది ప్రత్యక్షదైవమైన సూర్యుడే తప్ప పరోక్షదైవమైన విష్ణువు కాదు; విష్ణువనే పేరుతో సూర్యుడినే చెబుతున్నాడు. అసలు ఆ మాటకొస్తే ఋగ్వేదకవులు, జనాల ఊహలో ప్రత్యక్షదైవాలే తప్ప పరోక్షదైవాల ఉనికి చాలా తక్కువ. లౌకికమైన తమ మనుగడతో ముడిపడిన ప్రకృతిలోని భూమి, నీరు, వెలుగు, వాయువు, ఆకాశాలనే పంచభూతాలకే వారు దైవత్వాన్ని ఆపాదించుకుని ఆరాధించారు; ఈ పంచభూతాలను సంకేతించే వరుణుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, ఉషస్సు మొదలైనవారే వారికి దేవతలయ్యారు; వారికే రకరకాల పేర్లు పెట్టుకుని కొలిచారు.

ఈవిధంగా వారిది ఈ నేలతో, ఇక్కడి ప్రకృతితో, ప్రత్యక్షదైవాలతో పెనవేసుకున్న సరళమైన, సహజమైన దార్శనికత! అలాంటిది, ఇతిహాస, పురాణకాలానికి వచ్చేసరికి ఈ దార్శనికత ఎందుకు, ఎలా తలకిందులైంది? పరోక్షదైవాలూ, నేల విడిచిన సామును తలపించే సంక్లిష్ట దార్శనికతా ఎలా అడుగుపెట్టాయి???

ఇవి కూడా విడిగా, లోతుగా పరిశీలించాల్సిన ప్రశ్నలు.

***

ఇంతకీ సారాంశమేమిటంటే, ప్రోటో-ఇండో-యూరోపియన్ మూలాలు కలిగి, ఇతర ఇండో-యూరోపియన్ భాషల్లోకి కూడా వెళ్ళిన ‘విశ్’ అనే ధాతువునుంచి పైన చెప్పుకున్న విధంగా ఋగ్వేదకవులు పుట్టించిన విష్ణువూ; అనంతరకాలపు భారతీయ ఇతిహాస, పురాణాలు రూపురేఖలు దిద్దిన విష్ణువూ ఒకరు కాదు; కాకపోతే ఋగ్వేద విష్ణువే ఇతిహాస, పురాణ విష్ణువుకు ఒకమాదిరి మాతృక అయ్యాడన్నది స్పష్టమే.

అలాగే, ఇక్కడ మరికొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు, పరిశీలనకు అవకాశముంది. ‘విశ్’ అనే ధాతువునుంచి ఋగ్వేదకవి విష్ణువనే నామరూపాలను పుట్టించడం వెనుక అతని ఇండో-యూరోపియన్ ఉమ్మడి భాషావారసత్వమే కాక, ఉమ్మడి దార్శనికత కూడా ఉండి ఉండవచ్చా అన్నది వాటిలో ఒకటి. అలాగే, ఇండో-యూరోపియన్ భాషాకుటుంబంలోకి వచ్చే ఇతర భాషలకు చెందిన ప్రాచీనజనాలు కూడా ఋగ్వేదకవుల్లానే విష్ణువు స్వరూప, స్వభావాలే కలిగిన దైవాన్ని కల్పించికొని ఉండవచ్చా; వారి ప్రాచీన దైవాలలో ఎవరిలోనైనా ఆ ఛాయలను గుర్తించగలమా అన్నది మరో ప్రశ్న. ఈ ప్రశ్నలకు సానుకూలమైన సమాధానాలు లభ్యమైనప్పుడు ఋగ్వేద విష్ణువు ఉనికి భారతదేశపు సరిహద్దులను దాటిపోతుంది.

అదలా ఉంచి, తిరిగి రామాయణ సందర్భానికి వస్తే, రామాయణంలో రాముని అడుగడుగునా పోల్చి చెప్పింది ఇంద్రునితోనే నని ఇంతకుముందు అనుకున్నాం. యుద్ధకాండలో, సీత అగ్నిప్రవేశం చేసిన ఘట్టంలో బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమై ‘నువ్వు సకలదేవతాస్వరూపుడి’వనే కాకుండా, “ఇంద్రుడు చేసే పనులే నువ్వూ చేయగల’వని రామునితో అన్నట్టు చెప్పుకున్నాం. అంతేకాదు, ‘నువ్వే ఇంద్రుడి’వని కూడా(ఇంద్రకర్మా మహేంద్రస్త్వం...యుద్ధకాండ, స. 117, శ్లో. 17) వారు అంటారు.

ఈ మాటల్లో ఎంతైనా నిజముందనడానికి రామాయణం మొత్తం సాక్ష్యమే. ఋగ్వేదంలో ఇంద్రుడు కానీ, రామాయణంలో రాముడు కానీ ప్రధానంగా చేసినది ఋషుల యాగసంరక్షణ, రాక్షససంహారాలే. ఆ కోణంలో ఇంద్రుడు ఋగ్వేద రాముడైతే; రాముడు రామాయణ ఇంద్రుడు; ఆవిధంగా రామాయణం ఋగ్వేదానికి పొడిగింపు. ఋగ్వేదంలో ఇంద్రుడి మిత్రుడిగా చెప్పిన విష్ణువే రామాయణంలో రాముడయ్యాడన్నమాట; అలాగే, రాముని విష్ణువు అవతారంగా చెప్పినా, ఋగ్వేదంలో ఇంద్రునికున్న ప్రముఖస్థానం రామాయణంలోనూ పదిలంగానే ఉంది. ఈ దృష్ట్యా చూసినప్పుడు రాముని విష్ణువు అవతారమని చెప్పడం, విష్ణువు ఇంద్రుని మించిన దైవంగా మారడం అనంతరకాలంలో జరిగాయని మరింత స్పష్టంగా అనిపిస్తుంది.

బ్రహ్మాది దేవతలు రాముని ఉపేంద్రునిగానే కాక; సేనానిగానూ, గ్రామణిగానూ చెప్పడం ఆసక్తికరం.

సేనానీః గ్రామణీశ్చ త్వం త్వం బుద్ధి స్త్వం క్షమా దమః

ప్రభావశ్చాప్యయశ్చ త్వ ముపేంద్రో మధుసూదనః – యుద్ధకాండ, స.117, శ్లో.16

నువ్వే సేనానాయకుడివి, గ్రామాధిపతివి; నువ్వే బుద్ధి, ఓర్పు, ఇంద్రియనిగ్రహం, సృష్టిప్రళయాలు; నువ్వే ఉపేంద్రుడివి, నువ్వే మధుసూదనుడి వని ఈ శ్లోకభావం.

గణమనే ప్రాథమిక సామాజికరూపం నుంచి అంతకంటె ఉన్నతమైన రాజ్యమనే రాజకీయరూపానికి జరిగిన ప్రస్థానంలో సేనాని పదవి ఒక ముఖ్యమైన మజిలీ అని- ‘కుమారస్వామి చెప్పే గణసమాజ చరిత్ర’ అనే వ్యాసభాగం(29)లోఇంతకుముందు చెప్పుకున్నాం; ఆవిధంగా రాజు కన్నా ముందు పుట్టింది సేనాని పదవి. బహుశా ఋగ్వేదకాలానికి చెందిన ఇలాంటి సామాజికదశను ఈ మాట సూచిస్తూ ఉండవచ్చు. అలాగే, ‘గ్రామణి’ అనే పదం ఋగ్వేదంలోని ‘విశ్’ తో సంబంధాన్ని చెబుతూ ఉండవచ్చు. సంస్కృతంలోనే కాక, ఇతర అనేక ఇండో-యూరోపియన్ భాషల్లోకి వెళ్ళిన ‘విశ్’ కు గ్రామమనే అర్థం కూడా ఉన్నట్టు ఇంతకుముందు ఉదహరించుకున్నాం. వైశ్యుడు గృహపతి అయిన తర్వాత గ్రామణి అనే శబ్దం ప్రాచుర్యంలోకి వచ్చిందని కూడా అనుకున్నాం.

మిగతా విశేషాలు తర్వాత...







Tags:    

Similar News