చైనా ‘డ్రాగన్’ దేనికి ప్రతీక?

చైనా డ్రాగన్ మూసివున్న తన పంజాలను విప్పుతోందా?;

Update: 2025-09-06 04:38 GMT

ప్రపంచ ఫాసిస్ట్ వ్యతిరేక యుద్ధంలో భాగమై, జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనా ప్రజల ప్రతిఘటనా యుద్దం లో విజయం సాధించిన 80 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ మూడున బీజింగ్ ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ స్క్వేర్లలో ఒకటైన తియానన్మెన్ స్క్వేర్ లో ఒక భారీ సైనిక కవాతును నిర్వహించింది.

అక్కడ ఉన్న గేట్ ఆఫ్ హెవెన్లీ పీస్ లో జనచైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ చిత్రపటంపై ఎనిమిది భారీ చైనా జెండాలు రెప రెప లాడాయి. .“చరిత్రను దృష్టిలో పెట్టుకొని, అమరవీరులను గౌరవించడం, శాంతిని గౌరవించడం, మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేయడం'' ఈ స్మారక కార్యక్రమం నిర్వచించుకొన్న ఉద్దేశ్యం.

వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా చరిత్రకు నివాళి అర్పించింది, భవిష్యత్తు పట్ల తన నిబద్ధతను ప్రకటించింది. 61 మంది విదేశీ దేశాధినేతలు, ప్రభుత్వాధినేత లు, సంబంధిత దేశాల సీనియర్ ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల నాయకులు, మాజీ రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం అంతర్జాతీయ సమాజం చైనాతో భుజం భుజం కలిపి నిలబడటాన్ని ప్రతిబింబించింది.

ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంలో, చైనా ప్రతిఘటన ఎంతో ముందుగా ప్రారంభమై అతి ఎక్కువ కాలం కొనసాగింది. 14 ఏళ్ల రక్తసిక్త పోరాటంలో 3.5 కోట్లకు పైగా చైనా దేశస్థులు మరణించారు. 15 లక్షలకు పైగా జపాన్ దళాలను వారు నాశనం చేశారు. జపాన్ ప్రధాన దళాలను అణచివేసి, వారు ఉత్తరాన సోవియట్ యూనియన్ వైపు, దక్షిణాన పసిఫిక్ లోకి విస్తరించే ప్రణాళికలను చైనా వమ్ము చేసింది. ఇది ప్రపంచ ఫాసిస్టు వ్యతిరేక కూటమి విజయానికి సానుకూల మైన పరిస్థితులను సృష్టించింది.

కొంత కాలంగా, రెండవ ప్రపంచ యుద్ధ చరిత్రను వివరించడంలో తూర్పు యుద్ధ భూమిగా చైనా నిర్వహించిన పాత్రను, మిత్ర పక్షాలకు అందించిన అపారమైన సహకారాన్ని విస్మరిస్తున్నారు. యుద్ధమంతా పశ్చిమంలోనే జరిగినట్లు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు ఫాసిజాన్నిఓడించి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినట్లు చిత్రిస్తు న్నారు. నిరుపమానమైన త్యాగాలు చేసి జర్మనీని మట్టి కరిపించిన సోవియట్ రష్యా పాత్రను కూడా తక్కువ చేసి చూపు తున్నారు. ఇటువంటి చర్యలు చరిత్రలోని సత్యాన్ని చెరిపేయలేవు.

రెండవ ప్రపంచ యుద్ధ విజయాలలో ముఖ్యమైనది ఐక్యరాజ్యసమితి స్థాపన, అది ఒక అంతర్జాతీయ వ్యవస్థకు, ఐక్యరాజ్య సమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలను నియంత్రించే ప్రాథమిక నిబంధనలకు దారితీసింది . మానవాళి అపారమైన త్యాగాల ద్వారా సాధించిన అమూల్యమైన వారసత్వం ఇది. అయితే ఈ నాడు తిరిగి ఆ విలువలను కాలరాసి వేచే పరిస్థితులు, తమ ఆధిపత్యానికి అనుగుణంగా ప్రపంచ గమనాన్ని నిర్దేశించే ధోరణులు నెలకొంటున్నాయి. అందువల్ల ఈ రోజు ప్రపంచం శాంతియుతంగా లేదు; దురాక్రమణ భయం ఇంకా కొనసాగుతూనే ఉంది. సైనికవాదాన్నిబలీయం చేసే, శత్రు కూటములుగా ప్రపంచాన్ని విభజించే ప్రహసనం తరచుగా ప్రదర్శించ బడుతోంది. ఈ నేపథ్యంలో, శాంతిని పరిరక్షించడానికి చైనా సంకల్పం, సామర్ధ్యం వెల్లడి చేస్తూ, ప్రపంచ క్రమాన్ని సవాలు చేయడానికి ప్రయత్నిస్తున్న అన్ని శక్తులకు ఒక హెచ్చరికగా చైనా ప్రదర్శన జరిగింది.

ఈ ప్రదర్శనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, 26 మంది విదేశీ దేశాధినేతలు దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ స్పీకర్ వూ వోన్-షిక్ తో సహా సుమారు 50,000 మంది ఆహ్వానితులు పాల్గొన్నారు. రష్యా, ఇరాన్, తుర్క్మెనియన్, ఉజ్బెక్, మంగోలియా, తాజిక్ అధ్యక్షులు, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సహా పలు దేశాల నేతలతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశమయ్యారు. ఇరాన్, మయన్మార్, జింబాబ్వే, మధ్య ఆసియా దేశాల నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. యూరప్, పాశ్చాత్య దేశాలలో సెర్బియా, స్లొవేకియా దేశాల నేతలు ఈ మహా ప్రదర్శనలో ఉన్నారు.

వారితో జిన్ పింగ్ మాట్లాడుతూ ఒక శతాబ్ద కాలం లో చూడనన్ని మార్పులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నందున దేశాల వైఖరిలో మార్పులు రావలసిన అవసరం వుందని చెప్పారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య బలమైన సంబంధాలు ప్రాంతీయ శాంతి, అభివృద్ధిని పరిరక్షించడానికి దోహదపడతాయని అన్నారు. కొత్త శకంలో భాగస్వామ్య భవిష్యత్తు తో దేశాలు మరింత సహకరించుకునే సమాజాన్ని నిర్మించడం, ఇరుపక్కల ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడం, పొరుగు దేశాలతో విస్తృత మైన సంబంధాలను నిర్వహించడం వేగవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

ఐక్యరాజ్యసమితితో అంతర్జాతీయ వ్యవస్థను దృఢంగా నిలబెట్టాలని, నిజమైన బహుళపక్షవాదాన్ని పాటించాలని, గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ (జిజిఐ) ను సంయుక్తంగా అమలు చేయాలని, రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం యొక్క ఫలితాలను రక్షించాలని, కష్టపడి సాధించిన శాంతి, ప్రశాంతతలను పరిరక్షించాలని నొక్కి చెప్పారు. మానవ జాతి గతంలో నడిచి వచ్చిన ప్రపంచ యుద్ధాల మహావిపత్తు లను గుర్తు చేసుకుని తిరిగి అటువంటి పొరపాట్లు చేయకూడడదని జిన్ పింగ్ ఈ ప్రదర్శనలో పిలుపునిచ్చారు.

ఈ పెరేడ్ ప్రపంచ దేశాల మధ్య ఒక నూతన క్రమపద్దతికి చైనా రూపొందిస్తున్న అనేక వర్తమాన విధానాల విజయాలకు నీరాజనం కూడా. దాదాపు 150 దేశాలు చైనా అభివృద్ధి, భద్రత చొరవలను, శాంతి ప్రయత్నాలను ఆహ్వానిస్తున్నాయి. భిన్ననాగరికతల మధ్య సామరస్యాన్ని నెలకొల్పే వారి భావన లను అంది పుచ్చుకుంటు న్నాయి. ఈ వారం లోనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీఓ) శిఖరాగ్ర సమావేశానికి 20 మందికి పైగా ప్రపంచ నాయకులు హాజరయ్యారు. ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించారు. అయితే ఆయన ఈ విజయోత్సవాలలో పాల్గొన లేదు.

ఇప్పుడు అందరి దృష్టి బీజింగ్ లో జరిగిన పరేడ్ మీద వుంది. యుద్ధ నౌకలను అక్కడికక్కడే ముంచివేయ గల హైపర్ సోనిక్ క్షిపణులు, ఖండాంతర దూరాలను అధిగమించి [అమెరికాపై సైతం] దాడి చేయగల అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణులు, రవాణా విమానాల నుండి కిందికి వేయ గల కొత్త సాయుధ సంపత్తి, దీర్ఘశ్రేణి రాకెట్ లాంచర్లు మానవ రహిత విమానాలు, సముద్రగర్భంలో వాహనాల శ్రేణి, డ్రోన్ యుద్ధానికి సిద్దం చేయగల పరికరాలు,అధు నాతన లేజర్ ఆయుధాలు, ఐదో తరం రక్షణ సాధనాలు, వాయు రక్షణ ఛత్రాలు, సీజే -1000 హైపర్ సానిక్ క్రూయిజ్ మిస్సయిల్సు వంటి అనేక రకాల యుద్ధ సామగ్రిని చైనా ప్రదర్శించింది. యుద్ధోన్మాది అమెరికాను నిలువరించటానికి, దాని ఆధిపత్యాన్నిఎదుర్కుం టున్న బడుగు బలహీన దేశాలకు ధైర్యం నింపటానికి, ఎలాంటి సంఘర్షణనైనా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని కలిగిస్తూ ఈ ప్రదర్శన చైనా సామర్థ్యాన్ని బహిర్గతం చేస్తున్నది.

ఈనాడు జిన్ పింగ్ పక్కన పుతిన్, కిమ్ ఆశీనులై వున్నారు. పాశ్చాత్య విశ్లేషకులు వారిని "తిరుగుబాటు అక్షం" గా అభివర్ణిస్తున్నారు. ఈ పరేడ్ చైనా దేశమూ, జాతి గర్వించదగిన చరిత్రకు, వారి దేశభక్తికి, జాతి పునరుజ్జీవనానికి, వారి సోషలిస్టు అభివృద్ధి పంథా విజయానికి ఒక స్పష్టమైన సందేశమూ, నిదర్శనమూ కాగా పాశ్చాత్య వ్యాఖ్యాతలు దీన్ని చైనా మిలిటరీ బలానికి, ఆధిపత్యానికి, చైనా విస్తరణ వాదానికి, జీన్ పింగ్ వ్యక్తిగత అధికార పట్టుకు, ప్రతిష్ట కు చిహ్నం గా వక్రీకరిస్తున్నారు. అయితే చైనా ప్రపంచ సహకారానికి కొత్త దశను కల్పిస్తోందని పాశ్చాత్య దేశాలు దీన్ని గుర్తించాలని, వారు కూడా ఇందులో భాగస్వాములు కావాలని అనేకమంది వ్యాఖ్యానిస్తున్నారు

విజయ వార్షికోత్సవం, చరిత్ర నుండి నేర్చుకోవడానికీ, వినాశకరమైన యుద్ధ భయాల నుండి విముక్తి పొంది భవిష్యత్తు ను నిర్మించు కోవడానికి అందరూ కలిసి పనిచేయ వలసిన ఆవశ్యకతను చాటి చెప్పుతున్నదని చైనా భావిస్తున్నది. ప్రపంచ శాంతిని సమర్థవంతంగా నిర్మించి, పరిరక్షించడానికి రెండో ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ క్రమాన్ని దృఢంగా పరిరక్షించడానికి, ఇతర దేశాలతో కలిసి అంతర్జాతీయ న్యాయాన్ని కాపాడటానికి చైనా సిద్ధంగా ఉందని ఈ సందర్భంలో చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది.

చైనా రెండవ ప్రపంచ యుద్ధాన్ని "జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రజల ప్రతిఘటన యుద్ధం"గా అభివర్ణించింది, ఆ ప్రతిఘటనలో ఎక్కువ భాగం చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుండి, దేశ భక్త జాతీయవాదుల నుండి వచ్చింది. ఆ తరువాత అంతర్యుద్ధంలో మావో అతని దళాల విజయం తో జన చైనా ఏర్పడింది. ఈ తూర్పు భాగం లో జపాన్ పై చైనా సాధించిన విజయం గణనీయమైనది. అటు పశ్చిమాన రష్యా ధారవోసిన అసువులు, రక్త తర్పణాలతో ఇటలీ, జర్మనీ ల ఫాసిజాన్ని అంతం చేయటం జరిగినది.

అప్పుడే అభివృద్ధి చెందుతున్న అమెరికా ఆనాడు జర్మనీ, జపాన్ ల వ్యతిరేక శిబిరంలో ప్రజా శక్తుల పక్షాన నిలిచింది. ఈ పెరేడ్ కు హాజరుకావద్దని యూరోపియన్, ఆసియా ప్రభుత్వాలను జపాన్ కోరటాన్ని బీజింగ్ ఖండిస్తూ గతవారం టోక్యోకు తన నిరసన తెలిపింది. 80 సంవత్సరాల తరువాత చూస్తే అమెరికా ఈ నాడు ప్రపంచంలో అనేక యుద్దాలకు తెరతీస్తూ, తానే ఒక ఆధిపత్య శక్తిగా మారి; జపాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లతో కలిసి చైనా, రష్యాలకు, ప్రపంచ దక్షిణాది దేశాలకు, శాంతి సామరస్యాలకు శత్రువుగా నిలిచివున్నది. పెద్ద ఆయుధ వ్యాపారిగా సొమ్ము చేసుకుంటున్నది. కానీ ప్రపంచ శాంతిని ప్రజాస్వామ్యాన్ని తానే నిలబెట్టుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నది. సామ్రాజ్య వాద వ్యతిరేక యుద్దంలో అశేష త్యాగాలు చేసి ఫాసిజాన్ని ఓడించి ఈనాటికీ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్న ప్రజా చైనాను ప్రపంచానికి పెనుముప్పుగా చిత్రిస్తున్నది. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొన్నినిమిషాల్లోనే, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా చైనాకు సహాయం చేసిందని జిన్పింగ్ అమెరికా పాత్రను విస్మరించారని, జిన్పింగ్, పుతిన్, కిమ్ లు అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ట్రంప్ ఆరోపించారు. ఈ ఆధిపత్య హూంకరింపులు ఇక పై చెల్లవు.

రెండవ ప్రపంచ యుద్ధం, చరిత్రపై సరైన దృక్పథాన్ని పెంపొందించడానికి చైనా ఈ సందర్భాన్ని వినియోగిస్తున్నది. “ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో చేసిన అన్ని త్యాగాలను తాను గౌరవిస్తానని, రెండో ప్రపంచ యుద్ధంలో చైనా, సోవియట్ యూనియన్ గొప్ప త్యాగాలు చేశాయని, ఈ వాస్తవాన్ని విస్మరించడానికి లేదా చరిత్రను వక్రీకరించ డానికి తాను నిరాకరిస్తున్నానని స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఈ సందర్భంలో పేర్కొన్నారు. ఇయు సభ్య దేశాలలో స్లోవేకియా మాత్రమే బీజింగ్ లో ప్రాతినిధ్యం వహించింది. "కొత్త ప్రపంచ క్రమం సృష్టించబడుతోంది.

బహుళ ధృవ ప్రపంచంలో కొత్త నియమాలు, కొత్త అధికార సమతుల్యత ఏర్పడుతున్నది. అంతర్జాతీయ సహకారానికి కొత్త వేదిక ఏర్పడుతున్నది. ఇది ప్రపంచంలో స్థిరత్వానికి చాలా ముఖ్యమైనది. అలాంటి చర్చల్లో పాల్గొనడం మద్దతు ఇవ్వడం యూరోప్ కు చాలా అవసరం. అయితే ఈ బాధ్యతను గుర్తించకుండా ఈయూ, దాని ప్రతినిధులు నేడు చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నారు' అని స్లోవేకియా ప్రధాని వ్యాఖ్యానించారని యూరోపియన్ న్యూస్ రూమ్ పేర్కొంది. 'చైనా సైనిక కవాతు శక్తివంతమైన దౌత్య ప్రదర్శన' అనే శీర్షికతో ‘ఫారిన్ పోలసీ’ అన్న అమెరికన్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

2015లో జరిగిన పరేడ్ తో పోలిస్తే ఈనాటి పరేడ్ విస్తృత మైనదని, అనేక మధ్య ఆసియా, పశ్చిమా సియా, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన నాయకులు దీనికి హాజరు హాజరుకావడం ప్రాంతీయ దౌత్యంలో బీజింగ్ పురోగతిని ఎత్తిచూపుతోందని ఒక నిపుణుడిని ఉటంకిస్తూ ప్రఖ్యాత రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. “ఇది గతం గురించే కాదు, ఈ రోజూ, భవిష్యత్తులోనూ ప్రపంచాన్ని పునర్నిర్మించే శక్తుల గురించి ఈ ప్రదర్శన చాలా చెబుతున్నది" అని ది గార్డియన్ నివేదించింది.

రెండవ ప్రపంచ యుద్ధం అందించిన విలువైన పాఠాలు మానవాళి భవితవ్యం దేశాల మధ్య సంబంధాలతో ముడిపడి ఉందని, దగ్గరి సంబంధం కలిగి వున్నాయని మనకు చెబుతున్నాయి. పక్షపాతం, ద్వేషం, శత్రుత్వం, ఘర్షణ కొత్త యుద్ధాలకు, విపత్తులకు మాత్రమే దారితీస్తుంది. పరస్పర గౌరవం, సమానత్వం, ఉభయులకు ప్రయోజనకరమైన సహకారమే అంతర్జాతీయ సంబంధాలకు సరైన మార్గం. మానవాళికి భాగస్వామ్య భవిష్యత్తుతో కూడిన సమాజా న్ని నిర్మించాలనే చైనా ప్రతిపాదన. దాని నాలుగు ప్రపంచ చొరవలు ఈ చారిత్రక అనుభవానికి తార్కాణం. కాలానికి తగ్గ ప్రతిస్పందనల సారాంశం."అన్నిబలమైన దేశాలు ఆధిపత్యాన్ని కోరుకుంటాయి" అనేది కాలం చెల్లిన తర్కం "విజేత అయితే అన్నీ తీసుకోగలం, ఓడిపోతే సర్వం కోల్పోతాము" అనేది కూడా ఈ యుగానికి చెందిన భావన కాకూడదు. శాశ్వత శాంతి, సార్వత్రిక భద్రత, భాగస్వామ్య శ్రేయస్సుతో కూడిన భవిష్యత్తును నిర్మించుకోవాలి. అందుకు బహిరంగ, సమ్మిళిత పద్దతులు అనుసరించాలి. పరిశుద్ధమైన, అందమైన ప్రపంచం నెలకొల్పటమే మానవాళికి లక్ష్యం కావాలి.

“టావోగువాంగ్ యాంగ్హుయి" అనే చైనా పద బంధం వారి నిర్వహణ విధానాలకు మార్గదర్శక సూత్రం. ‘తన సామర్ధ్యాన్ని దాచి వుంచి సరైన సమయం కోసం వేచి ఉండాలి’ అనేది దాని అర్ధం. ఆధునిక చైనా రూపకర్త డెంగ్ సియావో పింగ్ 1992 లో, "మనం కొన్ని సంవత్సరాలు దృష్టి మరల్చుకోకుండా, ఇతరుల దృష్టిని ఆకర్షించ కుండా, కష్టపడి పనిచేసి అభివృద్ధి చెందితే అంతర్జాతీయ సమాజంలో మన ప్రభావాన్ని చూపగలుగుతాము. అప్పుడే మనం ప్రపంచ రంగంలో గొప్ప శక్తిగా ఎదగగలం" అనే విధానం రూపొందించారు. దాన్నే"మీ బలాన్ని దాచుకోండి, మీ సమయానికై వేచి ఉండండి" అనే పదబంధం రూపంలో డెంగ్ వారసుడు, అప్పటి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి జియాంగ్ జెమిన్ వాడుకలోకి తెచ్చారు. ఇప్పుడు చైనాకు ఆ సమయం వచ్చిందా?

డ్రాగన్ అంటే అత్యున్నత ప్రాకృతిక శక్తికి ప్రతీక. జలపాతాల ఝరీ వేగానికి, రెక్క విప్పకుండా విహాయసంలో విహరించే మాంత్రిక శక్తికి, పరిసరాలలో కలిసిపోయేలా రంగూ రూపు మార్చుకునే అనువర్తనా శక్తికి, సముద్ర గర్భం లో అగ్నితుఫాన్లను నిలువరించే ప్రతిఘటనా శక్తికి, ప్రకృతి విలయాలను నియంత్రించే అద్భుత విరాట్ శక్తికి, ఖగోళం నుంచి మానవాళిని సంరక్షించే దివ్యశక్తికి ప్రతి రూపం అన్న విశ్వాసమే డ్రాగన్. ఇప్పుడు చైనా డ్రాగన్ మూసివున్న తన పంజాలను విప్పుతోందా? ఇప్పటివరకు విజృంభిస్తున్న హీన జంతువుల ఆట ఇక ముగియనున్నదా? బిక్కు బిక్కుమంటున్న బక్క ప్రాణులకు అండగా తన సంరక్షణా శక్తిని జండాగా విప్పుతున్నదా? అంటే నేటి పరిణామాలు అవుననే అంటున్నాయి.

“అన్నివేళలా మన హృదయాలు ప్రజలతోనే ఉండాలి, మన దృష్టి ప్రజల కోసం ఉండాలి, ప్రజలందరి శ్రేయస్సును మెరుగుపర్చడానికి మన వంతు కృషి చేయాలి” అని చైనా అధ్యక్షుదు జిన్ పింగ్ అంతర్జాతీయ నాయకుల నుద్దేశించి మాట్లాడారు. "న్యాయం గెలుస్తుంది; శాంతి నెలకొంటుంది; ప్రజలే గెలుస్తారు" అన్న విశ్వాసాల చైనా అంతర్జాతీయ సమాజానికి దృఢమైన నిబద్ధతతో కట్టుబడి వుంటుందని స్పష్టమయ్యింది.

ప్రపంచ దార్శనికతను కొనసాగిస్తూ, చరిత్రలో సరైన దిక్కున నడిచి, మానవ నాగరికత పురోగతి వైపున దృఢంగా నిలబడటం వల్ల శాంతి, అభివృద్ధి అనే ఉదాత్త తీరాలను నిస్సందేహంగా చేరుకోగలుగుతాము. ఫాసిజం పై మానవాళి సాధించిన విజయ వార్షికోత్సవాల సందేశం ఇదే.



Tags:    

Similar News