“ఫార్మా సిటీ” పేరుతో ప్రభుత్వాల అన్యాయం ఇంకెన్నాళ్ళు ?

రైతుల కన్నీటికి కారణం అవుతున్న ఫార్మా సిటీ కాలుష్యం.

Update: 2025-11-07 06:18 GMT

కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగా ఫార్మా సిటీ జీ.ఓ ని రద్దు చెయ్యాలనీ, అప్పటి BRS ప్రభుత్వం తమకు భూములు ఇవ్వని కారణం అడ్డుపెట్టుకుని ధరణి పోర్టల్ నుండీ తొలగించిన ఫార్మా సిటీ ఏరియా లో కొన్ని గ్రామాల రైతుల పేర్లు ఆన్లైన్ లో మళ్ళీ ఎక్కించాలనీ, ఫార్మా సిటీ కి భూములు ఇవ్వని రైతులకు రిజిస్ట్రేషన్ తో సహా అన్ని హక్కులు కల్పించాలనీ డిమాండ్ చేస్తూ నవంrబర్ 5 హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యాచారం మండలానికి చెందిన నాలుగు గ్రామాల రైతులు, మహిళా రైతులు, ప్రజా సంఘాల, పౌర సమాజ ప్రతినిధులు హాజరయ్యారు.

ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఇప్పటికే తమ ప్రాంతంలో హెటిరో ఫార్మా కంపనీ సృష్టిస్తున్న విష కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్న దోమడుగు రైతులు కూడా హాజరై తమ సమస్యను వివరించారు. రాష్ట్రంలో కాలుష్య కారక ఇథనాల్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న చిత్తనూరు,పెద ధనవాడ గ్రామాల ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు కూడా వచ్చి కాలుష్య పరిశ్రమలకు వ్యతిరేకంగా తాము చేసిన పోరాటాలను,వీటిపై ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధాలను, ఆయా పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక వైఖరులను సమావేశంలో ప్రస్తావించారు.

ఈ సమావేశానికి సామాజిక కార్యకర్తలు డాక్టర్ బాబూరావు,సైంటిస్ట్, డాక్టర్ విజయ్,ప్రొఫెసర్ , పాశం యాదగిరి,జర్నలిస్టు, డాక్టర్ నారాయణ రావు, పర్యావరణ వేత్త, బండారి లక్ష్మయ్య,KANPS, వి.బాలరాజు,మన హక్కుల వేదిక, కన్నెగంటి రవి,TPJAC, వై.అశోక్ కుమార్, TPJAC , సరస్వతి కవుల,ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ, మీరా సంఘమిత్ర, NAPM, కె.సజయ,మహిళా ట్రాన్స్ జండర్ సంఘాల JAC, వి.సంధ్య,POW, విస్సా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక, ఆశాలత, మహిళా రైతుల హక్కుల వేదిక, జి.ఝాన్సీ, న్యూ డెమోక్రసీ పార్టీ, పవన్ , పెద దన్వాడ ఇథనాల్ వ్యతిరేక కమిటీ, బాల్ రెడ్డి,కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ,దోమడుగు, కరుణాకర్ దేశాయ్, TPJAC, అఖిల్ సూర్య, NAPM, నల్సార్ లా విద్యార్థులు హాజరై రైతుల పోరాటాలకు సంఘీభావం ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లాలో గత BRS ప్రభుత్వం ఫార్మా సిటీ పేరుతో యాచారం, కందుకూర్ మండలాల్లో రైతులను మభ్యపెట్టి, బెదిరించి 13,000 ఎకరాల భూమి సేకరించింది. అందులో అధ్యధికం దళితుల చేతుల్లో ఉన్న అసైన్మెంట్ భూములే. “ఈ కాలుష్య కారక ఫార్మా సిటీ మా కొద్దు, మా వ్యవసాయమే మాకు కావాలి” అని యాచారం మండలంలో మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, మర్లకుంట తండ, మంగల్ గడ్డ తండ రైతులు, రైతు కూలీలతో పాటు ఆయా గ్రామాల ప్రజలందరూ ఫార్మా సిటీ రద్దు చెయ్యాలని ఉద్యమించారు. 2500 ఎకరాల పట్టా భూముల రైతులు భూ సేకరణని కూడా సవాల్ చేస్తూ గౌరవ తెలంగాణా హైకోర్టులో కేసులు పెట్టారు. ఆ కేసుల్లో 12 కేసుల్లో ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు, డిక్లరేషన్లు రద్దయినాయి. కొన్ని ప్రాధమిక ప్రకటనలు కూడా రద్దయ్యాయి. మిగతా కేసుల్లో భూమి తీసుకోవద్దని స్టే ఆర్డర్లు ఉన్నాయి.

2021 లో అప్పటి భూ సేకరణ అధికారి స్టే ఉన్న భూముల రైతుల పేర్లను ధరణి రికార్డుల నుంచి తీసివేసారు. ఇది చట్ట వ్యతిరేకం, మరలా రైతుల పేర్లు ఎక్కించాలని కోర్టు ఆదేశం ఇచ్చింది. కోర్టు ధిక్కారణ కేసులో RDO, జిల్లా కల్లెక్టర్లు కూడా మా వల్ల తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. కొంతమంది రైతుల పేర్లు ఆన్లైన్ లో ఎక్కించారు. మిగతా వారివి ఎక్కించలేదు.

ఈ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ – రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జీవన్ రెడ్డి, ప్రస్తుత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఆ ప్రాంత ఎం ఎల్ ఎ మల్రెడ్డి రంగారెడ్డి యాచారం మండలంలో అనేక సార్లు మీటింగులు పెట్టి, రైతుల, గ్రామస్తుల ఉద్యమానికి అండగా ఉంటామనీ, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే, ఫార్మా సిటి రద్దు చేసి, రైతుల భుములకు అన్ని హక్కులూ కల్పిస్తామనీ, మీరు భూములు ఇయ్యకండి, మీకు అండగా మేము ఉంటామనీ భరోసా ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో లో కూడా ఫార్మా సిటీ రద్దు చేస్తామని మాట ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొద్ది రోజుల్లోనే, ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం అని ప్రకటించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ పెడతాము, మీ భూములు ఇయ్యాలన్నారు. ఫార్మా సిటీ రద్దు చేసారు కాబట్టి, ఫార్మా సిటీ కోసం చేసిన భూ సేకరణ రద్దు చెయ్యాలని రైతులు కోర్టుకి వెళ్లారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, “ ఫార్మా సిటీ రద్దు చెయ్యలేదు, తుచ తప్పకుండా నిర్మిస్తాం” అని కోర్టు ముందు తెలియచేసారు. కోర్టు బయట మాత్రం “ఫ్యూచర్ సిటీ కట్టాలి, మీ భూములు ఇయ్యల్సిందే” అని బలవంతం చేస్తున్నారు.

“మేము ఇయ్యము, మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి” అని రైతులు ఉద్యమిస్తే, పొలిసు బలగాలతో ఆపుతున్నారు.ఈ రైతుల భూములకు రైతు భరోసా వేయడం లేదు. ఆయా భూముల వివరాలు ఆన్లైన్ లో లేనందున, బ్యాంకు లో పంట రుణం కూడా ఇవ్వడం లేదు. ఆఖరికి రైతులు పత్తి, ధాన్యం కూడా ప్రభుత్వ సంస్థలకి అమ్ముకోలేక పోతున్నారు.

రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన ఈ ప్రాంత వ్యవసాయ కూలీల కేసుల్లో “ ఈ కేసు తేలే వరకూ సేకరణకు ఆమోదం ఇచ్చిన భూముల్లో కూడా అధికారులు కాలు పెట్టవద్దు” అని స్టే ఉండగా, పోలీసు బలగాలను మోహరించి, ఊరిలో ఉన్న భూమి మొత్తానికి కంచెలు వేస్తున్నారు. గతంలో ప్రాంతంలో ఉద్యమాన్ని బలపరిచిన కాంగ్రెస్ నాయకులందరికీ తమ కమిటీ తరపున పేరు, పేరునా, లేఖలు రాసి “మా గోడు వినండి, మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి” అని రైతులు కోరుతున్నా ఒక్కరూ కలవటం లేదు. గతంలో ఆ గ్రామాలకు పిలవకుండా వచ్చిన నాయకులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.

రౌండ్ టేబుల్ సమావేశంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ సరస్వతి కవుల మాట్లాడుతూ, “అనివార్యమైన స్థితిలో రైతుల గోస ప్రభుత్వానికి చెప్పుకుందామని, తమకు జరిగుతున్న అన్యాయాన్ని బయట ప్రపంచానికి కూడా తెలియచేయ్యలని, జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలో రైతులందరి తరఫునా పది మంది నామినేషన్ లు వేసారు. కానీ, ఆ నామినేషన్లు కూడా వెయ్యకుండా చెయ్యాలని, రైతులకు సర్టిఫైడ్ ఎలెక్టోరల్ రోల్స్ కూడా వెంటనే ఇవ్వకుండా వేధించారు. చివరకి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసాక మాత్రమే వాటిని ఇచ్చారు. కానీ స్క్రూటినీలో నామినేషన్ వేసిన పది మంది రైతులవి తిరస్కరించారు. ఇందుకు దరఖాస్తులో బ్లాంకులు ఉన్నాయన్నారు. కానీ తీసుకున్న రోజున ఇచ్చిన చెక్ లిస్టు లో అన్నీ సవ్యంగానే ఉన్నట్టు రాసారు. ఇదే విధమైన ఖాళీలు కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్ధుల అఫిడవిట్లలో కూడా ఉన్నాయి. కానీ వారి అఫిడవిట్లని ఆమోదించి, రైతులవి మాత్రమే తిరస్కరించారు.

ఇది కావాలనే, కుట్రపూరితంగా చేసారని రైతులు అర్థం చేసుకున్నారు. నామినేషన్ వేసే రోజు పచ్చ కండువాలు వేసుకున్న రైతులందరి వివరాలు ఇంటలిజెన్స్ వారు సేకరించారు. రైతులు నామినేషన్ వేస్తున్నారన్న వార్త తెలిసిన వెంటనే, స్పెషల్ బ్రాంచ్, పోలీసులు రైతులకు ఫోన్లు చేసి మీరెందుకు వేస్తున్నారు, మీకేమి అవసరమంటూ రైతులను బెదిరించేందుకు ప్రయత్నిచారు” అని విమర్శించారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని కడిగేశారు. గతంలో ఫార్మా సిటీ కి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటానికి మద్ధతు ఇచ్చి, అసెంబ్లీ ఎన్నికలలో ఫార్మా సిటీ రద్ధు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారని, రైతుల మీద ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిగా నమ్మి, ఇబ్రహిం పట్నం కాంగ్రెస్ గెలవాలని రైతులు రాత్రి, పగలు స్వచ్ఛంధంగా శ్రమించి, మల్రెడ్డి రంగారెడ్డిని గెలిపించినందుకు ఇది తమకు ఇస్తున్న బహుమానమా అని నిలదీశారు.

రాష్ట్రంలోకి పరిశ్రమలు రావడాన్ని ఎవరూ వ్యతిరేకించరని, కానీ ఎలాంటి పరిశ్రమలు రాష్ట్రంలోకి వస్తున్నాయో పరిశీలించుకోవాలని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి సూచించారు. అమెరికా, యూరప్ దేశాలు తరిమేస్తున్న పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయని, అవి విచ్చలవిడిగా కాలుష్యానికి కారణమవుతున్నాయని అన్నారు. ఈ పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదని గుర్తు చేశారు.

నగరం చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భువనగిరి జిల్లాలలో ఏర్పాటు అవుతున్న పరి శ్రమలు ప్రజల పట్లా, పర్యావరణం పట్లా ఎలాంటి బాధ్యతా లేకుండా వ్యవహరిస్తున్నాయి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పేరుతో అనుమతులు తీసుకుని, మొత్తం విష వ్యర్ధాలను స్థానిక నదులు, చెరువులు , బోర్లు వేసి భూమి లోపలికి వదిలేస్తున్నారు. ఈ పరిశ్రమలు చేస్తున్న ఈ దారుణాలను పట్టించుకోవాలసిన కాలుష్య నియంత్రణ మండలి పూర్తిగా పెట్టుబడిదారుల చేతుల్లో బానిసల మారి, వారు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నది .

రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు కూడా కాలుష్య కారక పరిశ్రమల వల్ల ప్రజలు పడుతున్న బాధలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. స్థానిక ప్రజా ప్రతినిధులకు, శాసన సభ్యులకు , మంత్రులకు, రాజకీయ పార్టీల నాయకులకు లంచాలు ఇస్తూ, కంపనీల యాజమాన్యాలు, ప్రజల తరపున ఎవరూ మాట్లాడకుండా చేస్తున్నాయి. రైతులు ఈ బాధలు పడలేక రోడ్డెక్కి పోరాడితే వారిపై, వారి నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ ఉద్యమాలకు మద్ధతు ప్రకటిస్తున్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సస్పెండ్ చేస్తున్నారు. అన్ని చోట్లా ప్రజలకు ఇదే అనుభవం ఎదురవుతున్నది.

అడ్డగోలు భూసేకరణ, కాలుష్య కారక పారిశ్రామికీకరణ, నగరీకరణ విషయాలలో BJP, BRS, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఒకే రకంగా ఉంది. వాళ్ళు ముగ్గురూ ప్రస్తుత అభివృద్ధి నమూనాకు అనుకూలంగానే ఉన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన వామపక్ష పార్టీలు కూడా ఈ అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి ఇప్పటికీ తీసుకోవడం లేదు. అందువల్ల పోరాడే ప్రజల బలం తగ్గిపోతున్నది. ఎ విషయాలన్నీ నిన్నటి రౌండ్ టేబుల్ సమావేశంలో సామాజిక కార్యకర్తలు లేవనెత్తారు. తమ జీవనోపాధుల రక్షణ, తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న ప్రజలను ఐక్యం చేయాలని, అందుకు అందరం కలసి పని చేయాలని సమావేశం తీర్మానించింది.

Tags:    

Similar News