సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ వెనుకబాటుకు అసలు కారణాలు...
తెలంగాణ గ్రామీణ ఓటరు మనస్తత్వం , సామాజిక– రాజకీయ మనోభావ (socio-political psychology) కోణం: సైకియాట్రిస్టు డాక్టర్ కేశవులు విశ్లేషణ
Update: 2025-12-18 03:12 GMT
తెలంగాణ గ్రామీణ ఓటరు ఒక గణాంకం కాదు. అతడు ఒక వ్యక్తి కూడా కాదు. అతడు ఒక సమూహం. ఆ సమూహానికి జ్ఞాపకాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే అతడు కేవలం ఒక అభ్యర్థిని ఎంచుకోవడం కాదు; తన భద్రత, తన పరిచయ వలయం, తన సామాజిక సమతౌల్యాన్ని కాపాడుకోవడం. ఈ మానసిక కోణాన్ని అర్థం చేసుకోకుండా తెలంగాణ గ్రామ రాజకీయాలను చదవడం అసాధ్యం.
గ్రామీణ ఓటరు మనస్తత్వంలో మొదటి కీలక అంశం పరిచయం. పట్టణ ఓటరు “ఎవరు మంచి పాలసీ చెబుతున్నారు?” అని ఆలోచించవచ్చు. గ్రామీణ ఓటరు మాత్రం “ఎవడు మనవాడు?” అని ఆలోచిస్తాడు. ఈ ‘మనవాడు’ అన్న భావనలో పార్టీ లేదు, సిద్ధాంతం లేదు. ఒకే కులం, ఒకే బంధుత్వం, ఒకే వీధి, ఒకే పాఠశాల—ఇవే రాజకీయ మూలధనం. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు అంటే ఈ పరిచయ మూలధనాన్ని( సమీకరించగలగడం. బీజేపీ గ్రామాల్లో ఈ మూలధనాన్ని(Political capital) ఇంకా సంపాదించలేదు.
గ్రామీణ ఓటరు మానసికంగా రిస్క్ తీసుకునే స్థితిలో ఉండడు. అతడి జీవితం ఇప్పటికే అనిశ్చితులతో నిండినది—వర్షం పడుతుందా? పంట వస్తుందా? ధర వస్తుందా? అప్పు తీరుతుందా? ఇలాంటి జీవితంలో రాజకీయంగా కూడా ఒక ప్రయోగం చేయడానికి అతడు సిద్ధంగా ఉండడు. సర్పంచ్ ఎన్నికల్లో అతడు తెలిసిన వ్యక్తినే ఎంచుకుంటాడు, అధికారంతో సంబంధాలు ఉన్నవాడినే ఎంచుకుంటాడు. “కొత్త పార్టీ” లేదా “కొత్త నాయకుడు” అంటే అతడికి ఒక ప్రమాదం. ఈ మానసిక భద్రతా కోరిక బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసింది.
తెలంగాణ గ్రామంలో ఓటు నిర్ణయం ఎక్కువగా సామూహికంగా తీసుకోబడుతుంది. కుటుంబ పెద్దలు, కుల పెద్దలు, గ్రామ పెద్దలు మాట్లాడుకుంటారు. టీ దుకాణం దగ్గర, గుడి దగ్గర, పొలం గట్లపై చర్చలు జరుగుతాయి. అక్కడ వ్యక్తిగత అభిప్రాయం కంటే సమూహ అభిప్రాయం బలంగా ఉంటుంది. బీజేపీ రాజకీయాలు ఎక్కువగా వ్యక్తిగత భావోద్వేగాలపై ఆధారపడి ఉంటాయి—మోదీ నాయకత్వం, జాతీయ గర్వం, భావజాలం. కానీ గ్రామంలో ఓటు ఒక వ్యక్తి నిర్ణయం కాదు; అది ఒక సమూహ ఒప్పందం. ఈ సమూహ నిర్ణయ ప్రక్రియలో బీజేపీకి సరైన స్థానం దక్కలేదు.
గ్రామీణ ఓటరు మనస్తత్వంలో మరో కీలక అంశం అనుభవం. అతడు మాటలు నమ్మడు, అనుభవాన్ని నమ్ముతాడు. “ఇంతకు ముందు ఎవరు ఏమిచేశారు?” అన్న ప్రశ్న అతడికి చాలా ముఖ్యం. తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ జీవితంలో వచ్చిన మార్పులు—నీళ్లు, రోడ్లు, పెన్షన్లు, రైతు బంధు—ఇవన్నీ ఓటరు రోజూ చూసిన అనుభవాలు. ఈ అనుభవాలు ఒక మానసిక ఋణబంధాన్ని (psychological contract) సృష్టించాయి. ఆ బంధాన్ని బీజేపీ తెంచలేకపోయింది.
ఇక్కడే సంక్షేమ రాజకీయాల మానసిక ప్రభావం అర్థం అవుతుంది. సంక్షేమ పథకాలు గ్రామీణ ఓటరికి కేవలం డబ్బు కాదు; అవి గుర్తింపు. “రాష్ట్రం నన్ను చూస్తోంది” అన్న భావన. ఈ భావన ఒకసారి ఏర్పడితే, దాన్ని వాదనలతో మార్చడం కష్టం. బీజేపీ ఈ పథకాలను “ఫ్రీబీలు”గా అభివర్ణించడం గ్రామీణ ఓటరు మనసులో ఒక దూరాన్ని సృష్టించింది. అతడికి అది విమర్శగా కాదు, నిరాకరణగా అనిపించింది.గ్రామీణ ఓటరు రాజకీయంగా దగ్గరగా కనిపించే అధికారాన్ని ఇష్టపడతాడు. జిల్లా కలెక్టర్, మండల అధికారి, ఎంపీడీవో, సర్పంచ్—ఇవన్నీ అతడికి రోజూ కనిపించే శక్తులు. కేంద్ర ప్రభుత్వం అతడికి చాలా దూరంగా ఉంటుంది. మోదీ పేరు గౌరవంగా అనిపించవచ్చు, కానీ సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేయలేని నాయకుడు. ఈ దూరం ఒక మానసిక అంతరాన్ని సృష్టిస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఈ అంతరం నిర్ణాయకమైంది.
కులం తెలంగాణ గ్రామంలో ఇంకా ఒక మానసిక భద్రతా కవచం. అది కేవలం రాజకీయ సాధనం కాదు; అది సంక్షోభంలో నిలిచే సమూహం. బీజేపీ హిందుత్వ రాజకీయాలతో ఈ కుల గుర్తింపును మించిపోవచ్చని భావించింది. కానీ గ్రామీణ మనస్తత్వంలో మతం ఒక సాంస్కృతిక భావనగా ఉండవచ్చు, కులం మాత్రం రోజువారీ జీవితం. పెళ్లి నుంచి పంచాయతీ గొడవ వరకు, కులం ఒక రక్షణ వలయం. ఈ వాస్తవాన్ని బీజేపీ పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోవడం గ్రామీణ ఓటరు మనస్తత్వాన్ని మరింత స్పష్టంగా బయటపెట్టింది. గుర్తు లేకపోయేసరికి అతడు పూర్తిగా వ్యక్తిపై ఆధారపడ్డాడు. ఈ పరిస్థితిలో బీజేపీ అభ్యర్థికి ప్రత్యేక గుర్తింపు లేకుండా పోయింది. గ్రామీణ ఓటరు “ఈ అభ్యర్థి గెలిస్తే నాకు ఏం లాభం?” అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనపడలేదు.
ఈ మొత్తం విశ్లేషణ ఒక విషయం స్పష్టం చేస్తుంది. బీజేపీ వెనుకబాటు ఒక ఎన్నికల వ్యూహ వైఫల్యం మాత్రమే కాదు; అది గ్రామీణ మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయిన ఫలితం. తెలంగాణ గ్రామం రాజకీయంగా నెమ్మదిగా మారుతుంది. అక్కడ విశ్వాసం సంపాదించడానికి కాలం పడుతుంది. భావోద్వేగాలు కాదు, అనుభవాలు ఓటును నిర్ణయిస్తాయి. సర్పంచ్ ఎన్నికలు బీజేపీకి ఇచ్చిన అసలు పాఠం ఇదే— గ్రామీణ ఓటరు నినాదాలతో కదలడు. అతడు భద్రతతో, పరిచయంతో, అనుభవంతో మాత్రమే కదులుతాడు.ఈ మానసిక సత్యాన్ని అర్థం చేసుకున్న రోజు మాత్రమే, తెలంగాణ గ్రామ రాజకీయాల్లో బీజేపీకి నిజమైన స్థానం దక్కుతుంది.