నిజామాబాద్ బియ్యం రైతుకి ట్రంప్ దెబ్బ భయం

ట్రంప్ బియ్యం దిగుమతుల మీద సుంకం పెంచేస్తానని బెదిరించినప్పటి నుంచి నిజామాబాద్ బియ్యం మిల్లర్లలో ఆందోళన

Update: 2025-12-15 10:15 GMT

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో వివిధ రంగాలపైన తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఇప్పటికే కుదేలయిన తమ వ్యాపారం యిక ఏమాత్రం అదనపు భారాన్ని తట్టుకునే పరిస్థితి లో లేదని నిజామాబాద్ నుండి అమెరికా కు బియ్యం ఎగుమతి చేసే వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

భారత్ రష్యా నుండి చమురు దిగుమతి చేసి ఆ దేశం ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధానికి ఆజ్యం పోస్తోందని అమెరికా ఆరోపిస్తూ సుంకాలు వేసి వివిధ ఆంక్షలు విధించింది. చైనా మన దేశం కంటే అధికంగా చమురు దిగుమతులు చేస్తున్నా ఆ దేశం పై మొదట విధించిన 145 శాతం నుండి 30 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం భారత దేశం పై మాత్రమే అత్యధికంగా 50 శాతం సుంకం అమలులో వుంది. దీనితో మన దేశం నుండి ఎగుమతి అయ్యి అమెరికా లో మన వాళ్ళు కొని తినే సరుకుల ధరలు పెరిగాయి.

మన దేశ బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా కేవలం మూడు శాతం మాత్రమే. “ఈ బియ్యం ఎక్కువగా అక్కడ వినియోగించేది మన దక్షిణ భారత దేశం వాళ్ళు, అందులోనూ తెలుగు వాళ్ళు. సుంకాలు పెరగక ముందు అమెరికా లో 10 కేజీల బియ్యం బ్యాగు 25 లేదా 26 డాలర్లు అయ్యేది, పెరిగాక 32 నుండి 35 డాల్లర్లు అయ్యింది. ఇంకా పెరిగితే 40 డాలర్లకు చేరుకుంటుంది. ఇంత ధర పెట్టి అధిక సంఖ్యలో ఉన్న మన విద్యార్థులు, చిరుద్యోగులు కొని తినలేరు. సగటు జీవనానికి అయ్యే ఖర్చు 3,000 డాలర్స్ నుండి యిటీవల 4,200 నుండి 4,500 డాలర్ల చేరింది. మరిన్ని సుంకాలు వేస్తే ఖర్చు 6,000 డాలర్లకు చేరుతుంది. మన బియ్యం మానేసి బ్రెజిల్, లేదా థాయిలాండ్ బియ్యం తినాలి. మన బియ్యం వినియోగం యిప్పటికే 30 శాతం పడిపోయింది,” అని నిజామాబాద్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (Nizamabad Millers Welfare Association) సెక్రెటరీ ధన్పాల్ దత్తాత్రి (Dhanpal Dattatri) అన్నారు.

జిల్లాలో జై శ్రీ రామ్ (Jai Sriram), ఆర్ఎన్ఆర్ (RNR), హెచ్ఎమ్టీ (HMT) రకాల బియ్యం పండుతాయి. పండిన బియ్యం పురుగు మందులు, కృత్రిమ ఎరువులు తక్కువగా వేసి పండిస్తారు. మేమే రైతులకు విత్తనం యిచ్చి పంట కొంటాము, అని వివరించారు.

మన బియ్యానికి ఇతర దేశ మార్కెట్లు తెరుచుకున్నా అవి అంత లాభదాయకం కాదు. స్థానిక మార్కెట్లో కిలో బియ్యం రు. 60 రూపాయలకు అమ్ముడుపోతే అమెరికా లో రు. 85 మన దగ్గర ధర క్వింటాల్ కు వెయ్యి నుండి రు. 1,500 తక్కువ వుంటుంది. ఆమెరికన్స్ ఎవరు మన బియ్యం కొనరు. ఇటీవల ఆహార సరుకుల పైన మన వాళ్ళు చేసే ఖర్చు 2,000 డాలర్స్ పెరిగింది. ఈ ఎగుమతులు నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లా నుండి జరుగుతాయి. సంవత్సరానికి సగటున 2,000 కంటైనర్స్ (ప్రతి కంటైనర్ లో 20 నుండి 21 టన్నుల బియ్యం ఉంటుంది) అమెరికా వెళ్తాయి. ఆవి కాస్తా 50 శాతం పడిపోయాయి. ట్రంప్ బియ్యం పై చేసిన ప్రకటన తరువాత గత కొన్ని రోజుల నుండి ఒక్క ఆర్డర్ కూడా లేదు,” అని ఆయన అన్నారు.

ఎగుమతులు ఆగితే దాని ప్రభావం స్థానిక మార్కెట్లో ధరపైన పడుతుంది. 15 రోజుల నుండి క్వింటాల్ రు. 2,900 కు అమ్ముడుపోతోంది. రైతులు నష్టపోతున్నారు, అని బియ్యం వ్యాపారి సామ గంగా రెడ్డి అన్నారు. రైతుల దగ్గర ముందే ఒప్పందం చేసుకున్న ధరకు మేము కొంటాము. దీని వలన రైతుకు మాకు ఇరువురికీ లాభమే. మిల్లర్స్ పాత బియ్యం స్టాక్ వున్నాయని బియ్యం కొనటం లేదు, అని ఆయన వివరిస్తూ దీని వలన వచ్చే ఏడు పంట పైన దీని ప్రభావం ఉంటుందన్నారు.

రైతుల గోడు:

మా ప్రాంతంలో రైతులు వడ్లను వ్యాపారస్తులకు నేరుగా అమ్మేస్తాం. వాళ్ళు 30, 35 తేమ శాతం వున్నా కళ్లెం మీదే కొంటారు. పౌర సరఫరాల శాఖ 14 శాతం తేమ శాతం వుంటేనే కొంటుంది. ఖరీఫ్ లో 80 శాతం బియ్యం ఎగుమతి అవుతాయి. 10 శాతం విత్తనాలకు, మిగిలినవి పౌర సరఫరాల శాఖ కొనేది. ఈ సారి 30 శాతం దాకా ప్రభుత్వానికే అమ్మారు. పచ్చి బియ్యం అమ్మడం వలన మాకు ప్రకృతి విపత్తుల నుండి కాపాడే పని లేకుండా పోయింది. అకాల వర్షాల వలన నష్టాలు పెరుగుతున్నాయి. కల్లంలోనే అమ్మడం వలన మాకు ఇటీవల నష్టం తగ్గింది. 35 శాతం తేమ శాతం వున్న బియ్యాన్ని రు. 2,300 కు వ్యాపారస్తులు కొన్నా మాకు లాభమే. మెండోరా (Mendora), భీంగల్ (Bheemgal), బోధన్ (Bodhan), మాక్లూర్ (Maklur), వర్ని (Varni), నందిపేట్ (Nandipet) మండలాలలో వరి పంట రాష్ట్రంలో అన్ని ప్రాంతల కంటే ముందే వస్తుంది. అప్పటికి పౌర సరఫరా వాళ్ళ కేంద్రాలు తెరుచుకోవు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మాకు నష్టం చేస్తున్నాయి, అని మెండోరా గ్రామం, నిజామాబాద్ జిల్లా రైతు మాచర్ల రాజా రెడ్డి ఆవేదనతో అన్నారు.

ఐదు ఎకరాల స్వంత పొలానికి అదనంగా మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పంట పెడతాను, అని రాజా రెడ్డి వివరించారు.

మెండోరా మండలంలో నాలుగు ఎకరాలలో వరి పండించే మరో రైతు గొల్లమ్ శ్రీను బియ్యం ధరలు పడిపోవటాన్ని ధృవీకరించారు. కొద్ది మంది వరి రైతులు పత్తి పెడదామా అని ఆలోచిస్తున్నారు. సన్న బియ్యం బోనస్ యింకా ఇవ్వలేదు కాబట్టి మరి కొందరు రెండవ పంటగా దొడ్డు బియ్యం వేస్తున్నాము.

అమెరికాలో మన వాళ్ళ అభిప్రాయం:

అమెరికాలో తన కుటుంబంతో ఉన్న సి. సమత మేము ఎక్కువగా అమెరికన్ స్టోర్స్ లో కొంటాము కాబట్టి భారత దేశం నుంచి వచ్చే వస్తువుల ధరల ప్రభావం తెలీదు అన్నారు. డిస్కౌంట్స్ దేనిలో వుంటే ఆ స్టోర్ లో కొనటం నాకు అలవాటు అన్నారు.

అమెరికాలో ఉన్న మన వాళ్ళు ధరలు చూసుకుని ఖర్చు పెడతారు. కాబట్టి ధరలు పెరిగితే ఖచ్చితంగా తక్కువ ధర వున్న బియ్యం వైపు మొగ్గు చూపుతారు, అని అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేసి కుటుంబంతో సహా స్వదేశం తిరిగి వచ్చిన గుండ్లూరు రోహిణి అన్నారు. ఇండియా నుంచి వచ్చే వస్తువులు కొని తినాలంటే ఖర్చులు పెరుగుతాయి పెద్దగా మిగిలించలేరు, అని ఆమె వివరించారు.

అయితే  భారత్ నుంచి వచ్చే బియ్యం ధరలు పెరిగితే అర్థిక సమస్యలు వస్తాయని మరొక సాఫ్ట్ వేర్ ఉద్యోగి వాఖ్యానించారు. " తెలంగాణ నుంచి వచ్చే బియ్యం మాత్రమే మేము తినగలం. ఇది ధరలు పెరిగితే నెల సరిఖర్చు పెరుగుతుంది. అపుడు పొదుపు తగ్గిపోతుంది. లేదంట చౌకగా వచ్చే ఇతర దేశాల బియ్యానికి మారాలి. ఇది కష్టం. ఎందుకంటే, అన్నం పొడిపొడిగా ఉన్నపుడే మనం తినగలం. చాలా రకాల బియ్యం అన్న ముద్దముద్ద అవుతుంది.  ఇలాంటి సమస్యలుంటాయి," అని డల్లాస్ లో ఉంటున్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి చెప్పారు. పేరు రాయడానికి ఆయన అంగీకరించలేదు. 

తెలంగాణ బియ్యం ఎక్కువగా పండిస్తున్నందున వచ్చే సమస్య ఇదని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (Administrative Staff College of India) లో విశ్రాంత అధ్యాపకుడు ప్రొ. గౌతం పింగ్లే అన్నారు.


Tags:    

Similar News