ముఖ్యమంత్రులూ డాలర్ కలలు కంటున్నారు, నిజమవుతాయా?
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల GSDP, 2047 నాటికి 3 ట్రిలియన్ల GSDP ముఖ్యమంత్రి
“2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల GSDP సాధించిన మొదటి రాష్ట్రాల సమూహంలో తెలంగాణను నిలబెట్టాలని మేము ప్రతిన పూనుకున్నాము . ప్రస్తుత జాతీయ అంచనాల ప్రకారం, దీనికి సుమారు 15 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ మేము ఈ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి, ఈ లక్ష్యాన్ని ఒక దశాబ్దం లోపు సాధించడానికి కట్టుబడి ఉన్నాము. ఇది కేవలం ఆశయం మాత్రమే కాదు, వ్యూహాత్మక ప్రణాళిక, స్పష్టమైన దిశా నిర్దేశం ద్వారా రూపొందించుకున్న లక్ష్యం”
“గత మూడు దశాబ్దాలలో తెలంగాణ ప్రాంత వృద్ధి, దేశంలోని ఏ రాష్ట్రం వృద్ధి కంటే స్థిరంగా ఉంది. గత ఆరు సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చేయగల సామర్థ్యాన్ని మేము నిరూపించాము. ఈ ఊపును పెంచుకుంటూ, ప్రస్తుత దశాబ్దంలో మా స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) ని ఐదు రెట్లు పెంచాలనే లక్ష్యంపై మేము దృష్టి సారించాము. ఈ ధైర్యమైన లక్ష్యం మా ఆర్థిక స్థితిస్థాపకతను(Economic Resilience) పరివర్తనాత్మక అభివృద్ధి (Transformative Development) కోసం మా అలుపెరగని ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది”
నీతీ ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్
ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో విడుదల చేసిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో 2035 నాటికి 1 ట్రిలియన్ GSDP, 2047 నాటికి 3 ట్రిలియన్ల GSDP ఆర్ధిక వ్యవస్థగా మారతామని ప్రకటించారు.
అంటే ఏమిటో తెలుసా ?
1 ట్రిలియన్ అమెరికా డాలర్లు అంటే అమెరికన్ సంఖ్యా మానంలో (International Numbering System): 1,000,000,000,000 (1 తర్వాత 12 సున్నాలు)
2. అదే భారత రూపాయలలో) సుమారుగా(2025 డిసెంబర్ 4 నాటి మారకపు రేటు ప్రకారం 1 డాలర్ మారకపు విలువ 90.15 రూపాయలు అనుకుంటే 90,150,700,000,000 రూపాయలు
3. 1 ట్రిలియన్ డాలర్ అంటే భారత సంఖ్యామానంలో (లక్షల కోట్లలో) సుమారుగా 90.15 లక్షల కోట్లు అవుతుంది.
4. 3 ట్రిలియన్ డాలర్లు అంటే -2,70,36,675 కోట్లు
(రెండు కోట్ల డెభై లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల డెభై ఐదు కోట్లు)
ఈ అంకెలు చూసి మీరు భయపడుతున్నారా ? కానీ తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత పాలకులు ఈ అంకెలను ఎలాంటి భయం లేకుండా ప్రకటిస్తున్నారు. భవిష్యత్ కలలు కనడానికి ఎలాంటి బిడియం, భయం లేని ప్రభుత్వాలను చూసి మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. మీ బీద అరుపులు ఇక మానేయండి.
“జీడీపీ పెరిగితే ప్రజల తలసరి ఆదాయాలు పెరుగుతాయి. జీడీపీ పెరగకపోతే అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగకపోతే రాష్ట్రంలో పేదరికం పోదు. ప్రజల బతుకులు మారవు” – ఇదీ సాధారణంగా ప్రభుత్వాలు చెప్పే మాట. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పే మాట. సందర్భం ఉన్నా , లేకపోయినా, ప్రజలకు సంబంధించిన ఏ సభలలో, సమావేశాలలో అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రభుత్వ పెద్దలు చాలా కాలంగా చెబుతున్న మాట, దాని భావమూ, సారాంశమూ అర్థం కాకపోయినా, ప్రజలు పదే పదే వింటున్న మాట ఇది.
ఈ జీడీపీ వృద్ధి రేటు, తలసరి ఆదాయం, 3 ట్రిలియన్ ల ఆర్ధిక వ్యవస్థ అంశాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలను లోతుగా చూడాలి. ఈ జీడీపీ లెక్కలు ఎవరికి మేలు చేస్తున్నాయో, నిజంగా సాధారణ ప్రజల జీవితాలను మారుస్తున్నాయో లేదో చూడాలి. ఇందు కోసం 2014 నుండి 2024 వరకూ రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి (GSDP) లో ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం.
2014 - 2015 లో తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరంలో GSDP సుమారు ₹5.05 లక్షల కోట్లుగా ఉంది. కానీ 2023-2024 నాటికి GSDP 15.75 లక్షల కోట్లకు పెరిగింది.
కానీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి GSDP సుమారు ₹16.47 లక్షల కోట్లు గా అంచనా వేశారు. అంటే పదేళ్ళలో మూడు రెట్లు మాత్రమే పెరిగినట్లు.
2023-2024 సంవత్సర ₹15.75 లక్షల కోట్ల GSDP ని 2047 నాటికి 2,70,36,675 కోట్లకు చేరుస్తామని తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తున్నది. అంటే రాబోయే 22 సంవత్సరాలలో GSDP సుమారు 2,70,36,675 కోట్లకు 49 లక్షల కోట్లకు పెరిగితే, సుమారుగా 15.81 రెట్లు పెరిగినట్లు లెక్క. ఇది సాధ్యమేనా అని ఆడగకండి.
ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటి నుండీ రాబోయే 22 సంవత్సరాల పాటు స్థిరంగా సగటున 13.5 % వార్షిక వృద్ధి రేటు (CAGR) ను నమోదు చేయవలసి ఉంటుంది. ప్రపంచంలో ఏ పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా 22 సంవత్సరాల పాటు స్థిరంగా ఇప్పటి వరకూ 13.5 % వృద్ధి రేటును సాధించలేదు. దీన్ని సాధించాలంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆర్ధిక సంక్షోభాలు రాకుండా ఉండాలి. పాలనలో ఎలాంటి రాజకీయ అస్థిరత ఉండకూడదు. పర్యావరణ వ్యవస్థలు కూడా సహకరించాలి.
కానీ, ఇవాళ పెట్టుబడిదారీ సమాజాలు ఉన్న అంతర్జాతీయ పరిస్థితులలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొని ఉంది. అనేక దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. అన్ని దేశాలలో నిరుద్యోగం భారీగా పెరుగుతున్నది. AI ప్రవేశం కారణంగా , అనేక బడా కంపనీలు ప్రతి సంవత్సరం ఉద్యోగులను తగ్గిస్తున్నాయి.
తెలంగాణ ప్రస్తుత వృద్ధి రేటు సంవత్సరానికి 8.5 శాతం మాత్రమే. ఇందులో సేవల రంగం (GSDP లో 66% వాటా) వృద్ధి రేటు 10% - 11% గా ఉంది . ఇది రాబోయే 22 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 14- 15 శాతంగా ఉండాల్సి ఉంటుంది. AI సిటీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCC), శ్రేణి II నగరాలకు IT విస్తరణ ద్వారా దీనిని సాధిస్తామని ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ లో అంటోంది.
తయారీ రంగం ( GSDP లో 20-25% వాటా) వృద్ధి రేటు ప్రస్తుతం 7 – 8 శాతంగా ఉంది. ఇది రాబోయే 22 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 15-16 శాతం గా ఉండాల్సి ఉంటుంది . సెమీ కండక్టర్, క్లీన్ మొబిలిటీ, ఫార్మా స్యూటికల్ క్లస్టర్లలో భారీ పెట్టుబడులు రప్పించడం ద్వారా, 119 అసెంబ్లీ నియోజక వర్గాలలో పారిశ్రామిక ప్రాంతాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా MSME వృద్ధిని రెట్టింపు చేసి దీనిని సాధిస్తామని ప్రభుత్వం తన విజన్ లో ప్రకటించింది.
రాష్ట్రంలో అత్యధిక మందికి ( కనీసం 50 శాతం జనాభాకు) ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం మాత్రం ఇప్పటికీ 14-16 శాతం GSDP వాటా మాత్రమే కలిగి ఉంది. దీని వృద్ధికి అవసరమైన ప్రత్యేక చర్యలేవీ తెలంగాణ ప్రభుత్వ తాజా విజన్ డాక్యుమెంట్ లో పెద్దగా కనపడలేదు.
తెలంగాణ GSDP వివరాలు
రాష్ట్ర ఆర్థిక శాఖ, అధికారిక ఆర్థిక సమీక్షల నివేదికల ఆధారంగా 2014-15 లో రాష్ట్ర GSDP ₹5,05,849 కోట్లు కాగా, 2015-16 సంవత్సరానికి 5,75,417 కోట్లకు, 2016-17 సంవత్సరానికి 6,57,597 కోట్లకు, 2017-18 సంవత్సరానికి 7,57,301 కోట్లకు, 2018-19 సంవత్సరానికి 8,66,808 కోట్లకు, 2019-20 సంవత్సరానికి 9,74,077 కోట్లకు, 2020-21 సంవత్సరానికి 10,34,510 కోట్లకు, 2021-22 సంవత్సరానికి ₹12,05,815 కోట్లకు 2022-23 సంవత్సరానికి 13,08,034 కోట్లకు పెరిగింది. 2023-24 సంవత్సరానికి సవరించిన అంచనా ₹ 15,01,000 కోట్లు కాగా, 2024-25 సంవత్సరానికి బడ్జెట్ లో GSDP అంచనా16,47,324 కోట్లు.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థ , ఈ ఆచరణ సాధ్యం కాని విజన్ డాక్యుమెంట్ పై ఒక ప్రకటన విడుదల చేసింది. దానిని మీరూ చదవండి.
“ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను అనేకమంది ప్రముఖ ఆర్థికవేత్తలు, ప్రజా విధాన నిపుణుల భాగస్వామ్యం, ఆమోదంతో తయారు చేశారు. తెలంగాణ దీర్ఘకాలిక భవిష్యత్తును ఊహించే ఆశయానికి ఇది మేధో పరమైన బలాన్ని ఇస్తుంది. అలాంటి విజన్‌ను రూపొందించడానికి చేసిన ప్రయత్నాన్ని మనం తప్పకుండా అభినందించాలి.
ఈ విజన్ రూపకల్పనలో ప్రముఖుల పేర్లు ఉన్నంత మాత్రాన, ఏ ఆశావహ ఆర్థిక అంచనా కూడా కఠినమైన పరిశీలన నుండి తప్పించుకోలేదు. ప్రొఫెసర్ ఆల్బర్ట్ బార్ట్‌లెట్ విధాన నిర్ణేతలకు పదే పదే గుర్తుచేసినట్లుగా, అంక గణితం మన కోరికలకు అనుగుణంగా నడవదు. అత్యంత విశిష్ట రచయితలు కూడా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిపై ఉన్న భౌతిక, పర్యావరణ, గణిత పరమైన పరిమితులను అధిగమించలేరు.
విజన్ 2047 డాక్యుమెంట్‌లో ఉన్న వృద్ధి అంచనాలను ప్రశ్నిస్తే, దాని రూపకల్పనలో పాల్గొన్న ఆర్థిక వేత్తల చిత్త శుద్ధినీ , స్థాయినీ, ఉద్దేశాలను సవాలు చేయడంగా చూడ కూడదు. ప్రభుత్వాలు అనుసరించే అభివృద్ధి మార్గాలు పారదర్శకమైన హేతుబద్ధత, వాస్తవిక అంచనాలపై ఆధారపడి ఉన్నాయని నిర్ధారించడానికి నిర్ధిష్టంగా శాస్త్రీయ వ్యాఖ్య చేయడం కూడా పౌర సమాజ విధానపరమైన బాధ్యత, ప్రజాస్వామ్య కర్తవ్యం .
రాబోయే దశాబ్దాలలో ఆర్ధిక పరమైన అంచనాలు అపరిమిత వృద్ధి కంటే పరిమితులు, ఆటంకాల ద్వారా ఎక్కువగా రూపొందించబడతాయని ప్రపంచ వాతావరణ, ఆర్థిక అంచనాలు ఇప్పుడు బహిరంగంగా చెబుతున్నాయి.
మేము రాసిన ఈ నోట్, ఇందులో పాల్గొన్న ఆర్థిక వేత్తల నైపుణ్యాన్ని ప్రశ్నించడం లేదు. ఇది కేవలం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక లక్ష్యం సాధించ కలిగినదా ? కాదా ? అని అంచనా వేయడానికి కఠినమైన అంకగణితాన్ని, పర్యావరణ వాస్తవికతను దృష్టిలో ఉంచుకుంది.
వృద్ధి లక్ష్యాన్ని అనుభవపూర్వక సాక్ష్యాల అద్దంలో ఉంచడం ద్వారా, ఈ నోట్ ప్రజల మధ్య చర్చను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర భవిష్యత్ ఆశయాలు వేగంగా మారుతున్న కాలంలో అభివృద్ధి లక్ష్యాలు స్థిరంగా, సాధించదగినవిగా ఉండేలా చూడాలని మా అభిప్రాయం.
మానవుల ఆశయాల పట్ల ప్రకృతి ఉదాసీనంగా ఉంటుంది. నిజంగా విజయం సాధించాలంటే , ఏదైనా వ్యవస్థ దాని చట్టాలకు, నిబంధనల కట్టుబడి ఉండాలి. వాటి నుండి వైదొలగడం ఆత్మహత్యా సదృశం. అది తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తుంది.
“మానవ జాతిలో ఉండే గొప్ప లోపం ఏమిటంటే, ఘాతాంక విధిని (exponential function) అర్థం చేసుకోలేక పోవడం” అంటారు ప్రొఫెసర్ ఆల్బర్ట్ బార్ట్‌లెట్
"తెలంగాణ రైజింగ్ 2047" విజన్ రాబోయే 22 సంవత్సరాలలో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రతిపాదిస్తున్నది. ప్రొఫెసర్ ఆల్బర్ట్ బార్ట్‌లెట్ హెచ్చరించినట్లుగా, దీర్ఘకాలిక అంచనాలు భౌతిక, గణిత వాస్తవికతను మర్చిపోకూడదు.
సుమారు $ 0.16 ట్రిలియన్ నుండి రాబోయే 22 సంవత్సరాలలో $3 ట్రిలియన్ డాలర్లకు తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే అవసరమైన CAGR (సంయుక్త వార్షిక వృద్ధి రేటు) 13.5 % గా ఉండాల్సి ఉంటుంది.
దీనిని ఇతర ప్రాంతాల వృద్ధి రేటుతో పోల్చి చూద్దాం. భారతదేశం చారిత్రక వృద్ధి రేటు 6–7 % గా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఇటీవలి వృద్ధి రేటు 5.5–7 % గా ఉంది. అనేక సంవత్సరాల పాటు అద్భుతంగా అభివృద్ధి చెందిన చైనా వృద్ధి రేటు 10–11 % గా ఉంది. అంటే ప్రపంచ చరిత్రలో ఏ ప్రాంతం కూడా రెండు దశాబ్దాలు వరసగా 13–14 % వృద్ధిని కొనసాగించలేదని స్పష్టమవుతుంది.
ప్రొఫెసర్ బార్ట్ లెట్ రెట్టింపు సమయం ( వాస్తవికత తనిఖీ)
$13.5% వద్ద, ఆర్థిక వ్యవస్థ ప్రతి 5.3 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది:
2025: $ 0.16T ఉన్నది, 2030: $ 0.32 T కు, 2035 నాటికి $ 0.64 T కు, 2040 నాటికి $ 1.28 T కు, 2045 నాటికి $ 2.56 T కు, 2047 నాటికి $ 3.0 T కు పెరుగుతుంది. దీనికి ప్రతి ఐదేళ్లకోసారి తెలంగాణ ప్రస్తుత మొత్తం ఆర్థిక వ్యవస్థకు సమానమైన మొత్తాన్ని జోడించాల్సి ఉంటుంది. ఇది అసాధారణమైనది. గత కొన్ని దశాబ్ధాలలో ఎన్నడూ లేని వృద్ధి రేటు.
పైగా UN GEO-7 నివేదిక ఒక హెచ్చరిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి ప్రపంచ GDP లో 4% నష్టం జరుగుతుంది. పర్యావరణ క్షీణత కారణంగా ఇప్పటికే గంటకు $ 5 బిలియన్ల నష్టాలు కొనసాగుతున్నాయని చెప్పింది.
ప్రస్తుతం తెలంగాణ అనేక పర్యవరణ పరమైన ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా పెరుగుతున్న ఉష్ణ ఒత్తిడి (Heat Stress), నీటి కొరత, కరువు సంభావనతో పెరుగుదల, పట్టణ వరద ప్రమాదం, వ్యవసాయ దిగుబడుల క్షీణత, ఉష్ణ తరంగాల సమయంలో పారిశ్రామిక కార్యకలాపాలు ఆగిపోయే ప్రమాదం లాంటి సమస్యలు ఉన్నాయి. ఇవి తప్పకుండా భవిష్యత్తు వృద్ధిపై ఒత్తిడిని కలిగిస్తాయి,
పైగా 3 ట్రిలియన్ డాలర్ల సాధించడం అంటే, విద్యుత్ డిమాండ్ 6 నుండి 8 రెట్లు పెరుగుతుంది. పారిశ్రామిక నీటి వినియోగం 4 నుండి 5 రెట్లు పెరుగుతుంది. నగరాలు, కారిడార్ల కోసం వ్యవసాయ భూమిని భారీగా వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేయవలసి ఉంటుంది భూమి నుండి ముడి పదార్థాల వెలికితీతలో తీవ్ర పెరుగుదల అవసరమవుతుంది. ఆధునిక సాంకేతికతతో పర్యావరణంలో కూడా కాలుష్య భారం పెరుగుతుంది.
ప్రతి సంవత్సరం 13–14 % వృద్ధిని కొనసాగించడానికి అసాధారణంగా అధిక పెట్టుబడి అవసరం. భారీగా రుణాలు కూడా సేకరించవలసి ఉంటుంది.
ఈ సమయంలో సామాజిక, మౌలిక సదుపాయాల పరిమితులు కూడా ఎదురవుతాయి. శ్రామిక శక్తి సరఫరా నిరంతరంగా జరగాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థల పాలనా సామర్థ్యం పెరగాల్సి ఉంటుంది. అధిక స్థాయిలో నీరు, విద్యుత్ సరఫరా ఖచ్చితంగా అవసరం. సుస్థిర పర్యావరణం కూడా అవసరమవుతుంది. కానీ, ఆచరణలో ఈ వ్యవస్థలు క్రమంగా పెరుగుతాయి తప్ప, ఒకేసారి అందుబాటులోకి రావు.
ఆధునిక పర్యావరణ ఆర్థిక శాస్త్రానికీ, GDP వృద్ధి వనరుల వినియోగానికీ మధ్య గట్టి సంబంధం ఉంది. ఒక పరిమితిని దాటిన తర్వాత ఇది విధించే పరిమితులు కూడా ఉంటాయి. అందుకే ప్రొఫెసర్ బార్ట్‌లెట్ ఇలా అంటారు:
“పరిమిత వాతావరణంలో అపరిమిత వృద్ధి అనే ఆలోచన మన కాలపు వైరుధ్యం ”
తెలంగాణకు ఒక వాస్తవిక, శాస్త్రీయంగా ఆధారితమైన విజన్ ద్వారా వృద్ధి పరిమితులను గుర్తించాలనీ, ఈ ప్రక్రియలో వాతావరణ అంతరాయాలకు కూడా సిద్ధం కావాలని సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ (ప్రజల కోసం శాస్త్రవేత్తలు) బృందం ప్రభుత్వానికి సూచించింది.