తెలంగాణ కాంగ్రెస్ “అభయ హస్తం” మానిఫెస్టో లో అమలు కాని హామీలు
హామీ ఇచ్చిన సుపరిపాలన, సూపర్ సిక్స్, ఇతరత్రా హామీలను ఇవ్వడంలో కాంగ్రెస్ ఎంత సక్సెస్ అయ్యింది.
2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మేనిఫెస్టో విడుదల చేసింది. గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ హామీలు ఏ మేరకు అమలయ్యాయి ? అన్ని హామీలను మేము విశ్లేషించ లేకపోయాము కానీ, లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసే కొన్ని హామీల అమలును పరిశీలిద్దాం.
1. సుపరిపాలన :
1. BRS ప్రభుత్వ నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామిక పరిపాలనను అందిస్తామని చెప్పారు. ప్రజాస్వామిక పాలనను 7 వ హామీగా కూడా ఇచ్చారు. కానీ ఆచరణలో ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ప్రజాస్వామిక స్పూర్తి లోపించింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా , తగిన ప్రాధాన్యతలను నిర్ణయించుకుని పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం , తనకు తోచిన విధంగా అభివృద్ధి నమూనాను రూపొందించుకుని ముందుకు పోతున్నది. ప్రజల, ప్రజా సంఘాల , పౌర సమాజ గొంతులకు రాష్ట్ర అభివృద్ధి నమూనా రూపకల్పనలో ప్రాధాన్యత లేకుండా పోయింది. అనేక సందర్భాలలో ప్రజల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలకు కూడా అవకాశం దొరకడం లేదు.
2. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పిన హామీ అమలు కాలేదు. ఎవరో కొద్ది మంది వ్యక్తులకు తప్ప, మొత్తంగా ప్రజా సంఘాల నాయకులకు, పౌర సమాజ ప్రతినిధులకు తమ సమస్యలపై ముఖ్యమంత్రిని, మంత్రులను కలవడం కష్టంగా మారింది.
3. పౌర సేవల హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు ఒక సమగ్రమైన పోర్టల్ ను ఏర్పాటు చేసి ,ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పారదర్శకంగా పరిష్కరిస్తాం అనే హామీ కూడా అమలు కాలేదు. పౌర సేవల హక్కుల చట్టం తేలేదు. సమగ్ర పోర్టల్ రూపొందలేదు.
కానీ ప్రగతి భవన్ పేరు ప్రజా భవన్ గా మార్చి , మొదట ప్రతి రోజూ ప్రజా వాణి పేరుతో ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్నారు. తరువాత దీనిని వారానికి రెండు రోజులకు మార్చారు ( మంగళ వారం, శుక్రవారం).
మండల స్థాయి ప్రజా వాణి నిర్వహణపై ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ నిర్వహించినప్పటికీ, దాని అనుభవాల నుండి రాష్ట్ర స్థాయిలో మానాల స్థాయి ప్రజా వాణి ని విస్తరించడానికి ప్రభుత్వం పూనుకోలేదు. పూర్తి స్థాయిలో ప్రజా వాణి నిర్వహణపై ఇప్పటి వరకూ జీవో కూడా విడుదల కాలేదు.
4. ప్రజా ఫిర్యాదుల కొరకు ఒక టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తీసుకువస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు. నంబర్ ను ఏర్పాటు చేయలేదు.
5. అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కానీ అలాంటి వ్యవస్థ ఏదీ ఏర్పాటు కాలేదు.
6 గ్యారంటీల కార్డు :
1. మహా లక్ష్మి పథకం క్రింద మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయలు చెల్లిస్తామన్న హామీ అమలు కాలేదు.
2. రైతు భరోసా పథకం క్రింద రైతులకూ, కౌలు రైతులకూ ఎకరానికి 15,000 రూపాయలు అందిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించలేదు. వారికి రైతు భరోసా సహాయం అందించలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం క్రింద లబ్ధి దారులను ఎంపిక చేసినా, అందులో కొద్ది మందికి మాత్రమే మొదటి విడతగా 6,000 రూపాయలు అందించారు.
3. తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చినా ,హామీ అమలు కాలేదు.
4. యువ వికాసం పథకం క్రింద విద్యార్ధులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చినా, ఆ హామీ అమలు కాలేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, ఆ హామీ అమలు కాలేదు.
5. చేయూత పథకం క్రింద నెలలవారీ పింఛన్ 4,000 చెల్లిస్తామన్న హామీ అమలు కాలేదు. పైగా గత రెండేళ్లుగా కొత్తగా పెన్షన్ కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు.
వరంగల్ రైతు డిక్లరేషన్ :
1. అన్ని పంటలను మెరుగైన మద్ధతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చినా ఈ హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. FCI కోసం లేదా సన్న బియ్యం పంపిణీ కోసం వరి ధాన్యం మాత్రమే సేకరిస్తున్నది. నాఫెడ్ సంస్థ కోసం కొన్ని పంటలను చాలా తక్కువ మోతాదులో కొనుగోలు చేసింది.
2. మూతపడిన చక్కరా కర్మాగారాలను తెరిపిస్తామనే హామీ కూడా అమలు కాలేదు.
3. వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణ పరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చినా, హామీ అమలు కాలేదు.
4. రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపా చేస్తామని హామీ ఇచ్చినా, ఈ హామీ అమలు కాలేదు.
5. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. అమలు కాలేదు. నిజానికి ఇది తప్పుడు హామీ. చట్టం స్పూర్తికి భిన్నమైన హామీ. రాష్ట్రం స్వయంగా నిర్ణయం తీసుకోలేని హామీ.
6. పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ, విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చినా, అమలు కాలేదు.
7. నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ఉక్కుపాదం, కారణ వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులతో కఠిన చర్యలు . వారి ఆస్తులు జప్తు చేసి రైతులకు పరి హరామ్ చెల్లిస్తామనే హామీ కూడా అమలు కాలేదు.
8. రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, ఈ కమిషన్ ను చట్టపరమైన అధికారాలతో కాకుండా , కేవలం ఒక జీవో ద్వారా ఏర్పాటు చేశారు. కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బ తీస్తూ, అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులను నింపేశారు.
9. లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా , తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చినా, అటువైపు ఆలోచన చేయలేదు. అడుగులు కూడా పడలేదు.
10. ధరణి పోర్టల్ రద్ధు చేస్తామన్న హామీ అమలు చేశారు. కానీ అందరి భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్న హామీ పూర్తి స్థాయిలో అమలు లోకి రాలేదు.
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ :
1. ఈ చాప్టర్ లో 5 హెడ్డింగుల క్రింద మొత్తం 17 హామీలు ఉన్నాయి కానీ , వాటిలో ఒకటి రెండు హామీలపై మాత్రమే కొన్ని చర్యలు చేపట్టారు. ఆ హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. చాలా వాటిపై చర్చలు కూడా లేవు.
చేవెళ్ల ఎస్. సిఎస్. టి డిక్లరేషన్ :
1. ఈ డిక్లరేషన్ లో 12 హెడ్డింగుల క్రింద 16 హామీలు ఉన్నాయి. వీటిలో ఎన్ని హామీలు ఏ మేరకు అమలయ్యాయనేది ఆయా రంగాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్న వాళ్ళు మరో వివరమైన నివేదిక తేవాల్సి ఉంటుంది.
2. కానీ BRS ప్రభుత్వం గుంజుకున్న ఎస్. సి, ఎస్. టి ల అసైన్డ్ భూములను తిరిగి అసైనీ లకే అన్ని హక్కులతో పునరుద్దరిస్తామనే హామీ మాత్రం అమలు కాలేదు.
3. ప్రజా ప్రయోజనార్థం , భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు,అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం అందిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు. కారణం రైతులకు ఎంతో కొంత న్యాయం చేసే 2013 భూసేకరణ చట్టాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. బలవంతంగా భూములు గుంజుకోవడానికి 2016 లో KCR తెచ్చిన భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నది. దళితుల చేతుల్లోని అసైన్డ్ భూములను గుంజుకోవడంలో ఈ ప్రభుత్వానికి అడ్డూ ,అదుపూ లేకుండా పోయింది.
మైనారిటీ డిక్లరేషన్ :
1. మైనారిటీ డిక్లరేషన్ లో ఐదు హెడ్డింగుల క్రింద 14 హామీలు ఉన్నాయి.
2. ఈ హామీల అమలు తీరు మీద కూడా మరింత లోతైన పరిశీలన,ప్రత్యేక నివేదిక అవసరం.
3. మైనారిటీ ల బడ్జెట్ 4,000 కోట్లకు పెంచుతామని , బడ్జెట్ నిధుల వినియోగాన్ని నిర్ధారించడానికి ప్రత్యేకంగా మైనారిటీ ల సబ్ ప్లాన్ తీసుకు వస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు. బడ్జెట్ లో కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయలేదు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ :
1. కుల గణన , బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలోనే బీసీల రిజర్వేషన్ ల పెంపు హామీ రెండేళ్లయినా ఒక కొలిక్కి రాలేదు. కాలగణన పూర్తయినా నివేదికను ప్రజల ముందు బహిరంగంగా ఉంచలేదు. రాజకీయ పార్టీల నాటకాలు, హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు, పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు చొరవ చేయని కారణంగా రిజర్వేషన్ ల పెంపు అంశం అమలు లోకి రాకుండా పోయింది.
2. చట్టబద్ధత రాకపోయినా, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ లను కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కూడా సర్పంచ్ ఎన్నికలలో అమలులోకి రాలేదు.
3. వెనుకబడిన వర్గాలకు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతీరావు ఫూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు.
4. ఎం. బీ. సీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక MBC సంక్షేమ మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, ఆచరణలో అమలు కాలేదు.
చాప్టర్ 4 : వ్యవసాయం- భూసేకరణ -పారిశ్రామికీకరణ – కార్మికులు
1. పాల ఉత్పత్తి దారులకు లీటర్ కు 5 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తామనే హామీని కూడా అమలు చేయడం లేదు. విజయ డైరీ ని దేశంలోనే అగ్రగామి పాల బ్రాండ్ గా అభివృద్ధి చేస్తాం. అని ఇచ్చిన హామీని అమలు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. పైగా ఫ్యూచర్ సిటీ ఏరియాలో కొత్త ప్రైవేట్ డైరీ కంపనీలకు స్థలాలు కేటాయించి ఒప్పందాలు చేసుకుంటున్నారు.
2. నానాటికీ అంతరించిపోతున్న సాంప్రదాయ పంటలను ( చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు ) ప్రోత్సహించడానికి మద్ధతు ధరతో పాటు, మార్క్ ఫెడ్ వ్యవస్తను పటిష్టం చేస్తాం అనే హామీని కూడా అమలు చేయలేదు.
3. హైదరాబాద్ మరియు ఇతర ప్రధాన నగరాల శివార్లలో కూరగాయల ఉత్పత్తి , పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం అనే హామీని అమలు చేయకపోగా, హైదరాబాద్ చుట్టూ, ఇతర నగరాల చుట్టూ భూములను పరిశ్రమలకు, రియల్ ఎస్టేట్ వెంచర్ లకు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెడుతోంది.
4. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ విధానాన్ని తిరిగి ప్రారంభిస్తాం అనే హామీని కూడా అమలు చేయలేదు.
5. ప్రతి మండలానికి ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ప్రతి మండల స్థాయిలో ఏర్పాటు చేస్తాం అనే హామీలను కూడా అమలు చేయలేదు.
6. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన రైతులను ఆర్ధికంగా ఆదుకుంటామని ఇచ్చిన హామీని అమలు చేయలేదు.
7. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీ లను రద్ధు చేస్తాం అనే హామీని కూడా అమలు చేయలేదు.
8. కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన అటు వైపు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
9. భూ కమతాల సర్వే చేసి ప్రతి రైతుకు భూధార్ కార్డు అందచేస్తామని ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదు.
10. UPA ప్రభుత్వం తెచ్చిన 2013 భూ సేకరణ చట్టాన్ని యధావిధిగా అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయడం లేదు .
11. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి , ప్రభుత్వ భూములను పరిరక్షించి , పౌరుల భూ హక్కులను కాపాడేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తాం అని ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదు. పైగా ప్రభుత్వ భూములను వనల కోట్ల రూపాయలకు బడా బాబులకు అమ్ముకోవడం ప్రారంభించింది. ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతాల పేరుతో రైతుల నుండీ సేకరించిన భూములను కూడా ఇతర అవసరాలకు మళ్లించి అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది.
12. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తొలగిస్తాం అని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు.
ఫార్మా సిటీ బాధిత రైతులకు కూడా ఈ హామీని ఇచ్చినా , దానిని అమలు చేయడానికి నిరాకరిస్తున్నారు.
13. MNREGS పని దినాలను 150 రోజులకు పెంచుతూ కనీస వేతనాన్ని 350 రూపాయలకు పెంచుతాం అనే హామీ కూడా అమలుకు నోచుకోలేదు.
కార్మికుల సమస్యలపై :
14. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి , రెండు PRC బకాయిల బకాయిలు వెంటనే చెల్లిస్తాం, వచ్చే PRC పరిధిలోకి TGRTC కార్మికులను కూడా చేరుస్తాం అనే హామీ కూడా అమలు కాలేదు. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం అనే హామీ కూడా అమలు చేయలేదు.
15. ఆటో డ్రైవర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక బద్రత కల్పిస్తాం అనే హామీని కూడా నిలబెట్టుకోలేదు.
16. హమాలీలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం అనే హామీని కూడా అమలు చేయలేదు.
17. అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం అనే హామీని కూడా అమలు చేయలేదు.
మద్య పాన విధానం :
18. బెల్టు షాపులను పూర్తిగా రద్ధు చేస్తాం అనే హామీని కూడా నిలబెట్టుకోలేదు. పైగా మద్యం అమ్మకాలు మరింత పెరిగేలా, ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చేలా ఎక్సైజ్ పాలసీని ఈ ప్రభుత్వం సవరించింది. 2023 డిసెంబర్ నుండి 2025 నవంబర్ వరకూ గత రెండు సంవత్సరాలలో 71, 550 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయంటే , పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు ( అంటే సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు). కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నిజమవుతాయో లేదో తెలియదు కానీ, ఈ మద్యం కారణంగా మహిళలపై హింస, వితంతు మహిళల సంఖ్యా మాత్రం పెరుగుతున్నాయి.