తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ వ్యాఖ్యల ఆంతర్యం?
గెలిస్తే మోదీ ప్రతిభ, ఓడితే రాష్ట్రాల్లోని నేతల వైఫల్యం...ప్రధాని మోదీ చేశారని చెప్తున్న వ్యాఖ్యల తాత్పర్యమూ, లక్ష్యమూ ఇవే.
-ఎం. ఉదయభాను
ఈ డిసెంబరు తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 12735 గ్రామాల్లో వెయ్యిదాకా గెలుస్తామని బీజేపీ ఆశించినా, ఆ పార్టీకి సుమారు 700 సీట్లలోపే లభించాయి. అయినా అంతకుముందుకన్నా ఎక్కువేనని, ‘గ్రామాల్లో’ ఈగెలుపు అపూర్వమని రాష్ట్రపార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. గత నవంబర్లో జూబిలీహిల్స్ ఉపఎన్నికలో 17వేల (8.7%) ఓట్లతో బీజేపీది మూడోస్థానమే. అప్పుడు కేంద్రమంత్రులూ, ఎంపీలూ దిగి ప్రచారం చేసినా, 10వేలమందితో బైక్ ర్యాలీ జరిపినట్టు వారుచెప్పినా, అలాతిరిగినవారి కుటుంబాలు కూడా పూర్తిగా ఓట్లు వేయలేదని తేలిపోయింది. ఆ ఓటమి తర్వాత- కొద్దిరోజుల ముందే - తెలంగాణలోని బిజెపి నేతలు శ్రద్ధగా పనిచేయటం లేదని, అందుకే ఎన్నికల్లో సరైన ఫలితాలు రావడంలేదని ప్రధాని మోదీ బిజెపి ఎంపీలను గట్టిగా మందలించారట అనే వార్తకి అన్ని పేపర్లలో టీవీల్లో సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రాచుర్యం వచ్చింది. ఈ సందర్భంగా అంతగా చర్చకురాని, లేదా దాటవేస్తున్న, ఎత్తిచూపాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
కీలకమైన ఉత్తరప్రదేశ్ లో 2019లో 49.6 % ఓట్లువచ్చిన బీజేపీకి 2024లో 41.4% మాత్రమే వచ్చాయి; అక్కడ మొత్తం లోక్ సభ సీట్లు 75 కాగా, 72 సీట్లలో- మొత్తం 65 లక్షల- ఓట్లు తగ్గిపోయాయి. ఆదిత్యనాథ్ డబుల్ఇంజనూ, అధికారదుర్వినియోగం, హిందుత్వ, ముస్లింద్వేషం అన్నీ ఉన్నా అలా ప్రభావం తగ్గింది. దేశవ్యాప్తంగా చూసినా బీజేపీ ఓట్లు, సీట్లూ తగ్గినాయి; చంద్రబాబుపై, నితీష్ పార్టీపై ఆధారపడి మోదీ ప్రభుత్వం నడుస్తున్నది. ఎన్డీఏ కూటమి ఓట్లుకూడా 2019లోని 45నుంచి 42.5%కి (ఇందులో బీజేపీ ఓట్లు 36.57శాతమే, అదీపోలైన ఓట్లలో) తగ్గినాయి; అంటే సగంఓట్లు కూడా రాలేదు. మొత్తంఓట్లలో అది 25శాతమే. దాన్నే ప్రజల మ్యాండేటుగా చెప్పుకు తిరుగుతున్నారు. 2024 ఎన్నికల్లో వివిధపార్టీలు 1.4లక్షల కోట్ల రూ. ఖర్చుపెట్టాయనీ, అందులో అత్యధికభాగం బీజేపీదేననీ అంచనాలు వెలువడినాయి. తెలుగు రాష్ట్రాలది ఇందులో అగ్రస్థానం; ఒక్క అసెంబ్లీ ఉపఎన్నికకు 500 కోట్లపైన ఖర్చుపెట్టిన ఘనత తెలంగాణది. ఇటీవల జూబిలీహిల్స్ లో వందకోట్లు ఖర్చయిందని అంచనా. ఎలక్షను కమిషన్ నియమాలన్నీ కాగితంపైనే అన్నది విదితమే. అంత ఖర్చుపెట్టినా బీజేపీకి అనేకచోట్ల డిపాజిట్లు దక్కలేదు. బీజేపీ బలహీన పడటం దేశవ్యాప్త అంశమే కానీ, కేవలం తెలంగాణకు పరిమితంకాదు. ఇది ఇక్కడి నేతలకు తెలియదనుకోలేం. గెలిస్తే మోదీప్రతిభ, ఓడితే ఇతరుల వైఫల్యమూ అనేది చెల్లదు. కానీ మోదీ వ్యాఖ్యల లక్ష్యం అదే. రానున్న తమిళనాడు, బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఈ అసత్యాన్ని ప్రచారంలో పెడుతున్నారు.
మోదీ మాటకి మూలం (సోర్స్) ఏమిటో, ఎవరి ద్వారా బయటికివచ్చిందో ఆయా రిపోర్టుల్లో లేదు. మోదీ అన్నమాటలు అలా లీకుకావటం ఏమిటి? కాంగ్రెస్ లో అయితే అది సాధ్యమే కానీ మోదీ విషయంలో అదెలా జరిగింది? ఎవరు లీకు చేశారు అని బిజెపి పార్టీ సీరియస్ గా దర్యాప్తు జరిపినట్టు లేదు. ఎవరూ బైటచెప్పవద్దని మోదీ స్వయంగా ఆదేశించినా, ‘ఎవరో మెంటలోళ్ళు’ లేనిదాన్ని కల్పించి లీకు చేసారని కిషన్ రెడ్డి 16 న డిల్లీలో అన్నారు. లీకుచేసింది ఎవరో చెపితే చర్యలు తీసుకొంటాం అన్నారు (వెలుగు తేది 17). బిజెపి ‘హై కమాండే’ ఈ వార్తని లీక్ చేసినట్టు కనపడుతున్నది. మోదీ-అమిత్ షాల ద్వయం స్థిర పడ్డాక, ‘హై కమాండ్’ శబ్దం బిజెపిలో కూడా మామూలైపోయింది.
తెలంగాణ ప్రజల్లో బిజెపికి సానుకూలత చాలా ఉన్నా, దాన్నిఎన్నికల్లో సొమ్ము చేసుకో లేకపోతున్నట్టుగా వుందని మోదీ అన్నారని కూడా ఆవార్తలో ఉన్నది. ఏ రాష్ట్రంలో, చివరికి ఏ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి గెలిచినా మోదీవల్లనే అని కీర్తించటం తెలిసిందే. తమ పార్టీ సభ్యత్వ విశిష్టతను చెప్తూ, తెలంగాణలో పార్టీ సభ్యత్వాన్ని 18 లక్షలకు పెంచుతున్నట్టుగా 2019 జూలైలో అమిత్ షా అట్టహాసంగా ప్రకటించారు. ఇలాటివి దృష్టిలో పెట్టుకొనే బీజేపీకి ప్రజల్లో బలంఉన్నట్టుగా మోదీ చెప్పారు. ఈ మధ్య (2024 చివర) 40 లక్షల టార్గెట్ గురించీ చెప్పారు. 2018 ఎన్నికల్లో 117 సీట్లలో పోటీచేయగా, మొత్తం 14.43 లక్షల ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. సభ్యులుకూడా ఓటు వేయటం లేదన్న మాట! పంచాయితీ ఎన్నికల్లో ఓటుకి వెయ్యినుంచి మూడువేలదాకా (కొన్నిచోట్ల 15వేలు) ఖర్చుపెట్టినట్టూ, ఖర్చులో బీజేపీ మరీ వెనుకపడిపోలేదనీ ప్రజలు చెప్తున్నారు. ఎంత సానుకూలతఉన్నా, దాన్ని ఓట్లుగా మలచుకోవాలంటే ఇది తప్పటంలేదని నేతలు అంగీకరిస్తున్నారు.
అలాంటిది ప్రజల్లో సానుకూలత ఉన్నా, నేతలంతా మోదీభజన చేసినా, డబల్ ఇంజన్ అవసరం గురించి ఎంతగా చెప్పినా, తెలంగాణలో ఈ ఓటములు ఏమిటి అన్నప్రశ్న సహజంగానే రావాలి. మోదీమంత్రం అనేకచోట్ల పార లేదని – ఉదా.కి బెంగాల్లో, తమిళ నాడులో, కేరళలో గత దశాబ్దానికి పైగా- ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ధర్మమా అని ఆంధ్రలో బిజెపికి కాస్త చోటు లభించింది. అంతేకానీ మోదీమంత్రం, అమిత్ షా మంత్రాంగం రెండూఉన్నా, అంతకుముందు ఆరాష్ట్రంలో ఒక్కశాతం ఓటుకూడా దక్కలేదు అన్నది గుర్తుచేయాల్సిన చేదువాస్తవం. ఎన్నికల కమిషను, ఐపీయస్ ఐఏయస్ లతో సహా కేంద్ర అధికార యంత్రాంగం పాత్ర, షర్మిల పాత్ర పేరిట శకుని కపటం లేకపోతే ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి గెలిచేది కాదని వాస్తవాలు చూపెడుతున్నాయి. పోలింగు ముగిసాక ఓట్లసంఖ్య ఎలా పెరిగిపోయిందో నేటికీ తేలలేదు. అన్ని అక్రమాలు సాగినా జగన్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయంటే బిజేపి కూటమి పరిస్థితి ఏమిటో బోధపడుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2018 లో బిజెపికి ఒక్క సీటు, ఏడు శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. అలాంటిది 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో బిజెపికి నాల్గు సీట్లు, 19.5% ఓట్లు లభించాయి. 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి 8 సీట్లు, 35 శాతం ఓట్లు లభించాయి. అలాంటి పార్టీకి ఏడాది తర్వాత పంచాయితీల్లో ఈ స్థితి ఏమిటి? గ్రామాల్లోకన్నా పట్టణాల్లో- ముఖ్యంగా హైదరాబాదు నగరంలో- బిజెపికి కొంత హెచ్చు బలం ఉన్న మాట నిజమే అయినా, తాజాగా జూబిలిహిల్స్ ఫలితం ఏం చెప్పింది? అగ్ర నాయకులు కేంద్రమంత్రులు ఎంపీలు అందరూ తిరిగినా పదివేల మందితో బైక్ ర్యాలీ జరిపినట్టు కిషన్ రెడ్డి చెప్పినా ఓట్లు రాలేదే! అసెంబ్లీలో కేసీఆర్ పార్టీకి మద్దతిచ్చి, పార్లమెంటులో వారి మద్దతు పొందాలన్న లాలూచీ ఒప్పంద ఫలితమే ఇదని విశ్లేషకులు చెప్పిన మాట నిజమేననిపిస్తున్నది. నిజానికి కెసిఆర్ పార్టీని బిజెపిలో విలీనం చేసే విషయం చర్చించుకున్నట్టు, తాను వ్యతిరేకించినట్టు కేసీఆర్ బిడ్డ కవిత బయటపెట్టారు. రాష్ట్ర నేతల వైఫల్యం అన్నది మోదీ చెప్పిన కట్టుకథ.
హిందుత్వ భావజాలంతో ద్వేషరాజకీయాలతో గెలవటానికి ప్రయత్నించే మోదీ పార్టీ ‘సబ్ కే సాథ’ నే నినాదం మాటలకే పరిమితం. హిందుత్వ రాజకీయాలు తెలంగాణాలో అంతగా పారటం లేదని గ్రహించే బహిరంగ హిందుత్వ ఉన్మాది అయిన బండి సంజయ్ ని తెలంగాణ నేతగా తప్పించారు. తమ భావజాలంతో ఏమాత్రం సంబంధంలేని ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ వంటి వారిని తమ పార్టీలో చేర్చుకున్నారు. వారు కూడా అధికార లాలసతోనే చేరారన్నది గమనార్హం. ఇంకా చేర్చుకోవాలని చూసినా, ఇతరుల రాక తగ్గి పోయింది. అలాచేర్చుకొన్నా బిజెపి ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
వారసత్వ- కుటుంబ పార్టీల పేరిట కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకునే బిజెపి వారు ఆంధ్రలో ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరిని రాష్ట్రనేతగా ఎంపిక చేసుకున్నారు. కుటుంబ రాజకీయాలకి గత 40 ఏళ్లుగా ప్రతినిధిగా ఉన్న చంద్రబాబుతో అంట కాగుతున్నారు. అలాంటిదే మరో కుటుంబపార్టీ ఐన జనసేనను నిచ్చెనగా వాడుకోవాలని, పవన్ కళ్యాణ్ ని దక్షణాది యాత్రలో తిప్పుతున్నారు. దానికోసం ఆయన చేగువేరా టోపీ తీసేసి, కాషాయ వేషం వేసారు. తెలంగాణలో ఫ్యూడల్ రంగారెడ్డి- చెన్నారెడ్డి కుటుంబానికి చెందిన మర్రి శశిధరరెడ్డిని, విశ్వేశ్వరరెడ్డిని చేరదీశారు. కర్ణాటకలో కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరైన దేవేగౌడ పార్టీని, బళ్ళారి గనుల కుబేరుడైన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని తమ మిత్రులుగా చేసుకున్నారు. కరుణాకర్ రెడ్డి, యడియూరప్పలని అవినీతి కేసులో దొరికిపోవటంతో పార్టీనుంచి లోగడ బహిష్కరించారు. ఆ ఇద్దరూ ప్రాంతీయ పోటీపార్టీలను పెట్టి, బిజెపిని కొన్ని సీట్లలో ఓడించారు కూడా. అయినా మళ్ళీ చేరదీసి, వాళ్ళ వారసులనీ ముందుకు తెస్తున్నారు. హిందుత్వ విద్వేష రాజకీయాలతో పాటు ఈ పనులన్నీ చేసినా కర్ణాటకలో కాంగ్రెస్ బిజెపిని ఓడించింది. మోదీ సమ్మోహనాస్త్రాలు, అమిత్ షా కుటిల యంత్రాంగం పనిచేయలేదు. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి తెలంగాణ తమిళనాడు కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బిజెపి పథకాలు రచిస్తున్నది.
హైదరాబాదులో కార్పోరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలనీ, ‘మారుతున్నకాలానికీ, రాజకీయ పరిస్థితులకూ అనుగుణంగా’ నడచుకోవాలనీ రామచంద్రరావు అన్నారు. నిజానికి ఇప్పటికే అలా మారిపోయిందికూడా. అనేక రాష్ట్రాల్లో (కర్ణాటక, గోవా) ఎమ్మెల్యేలను టోకున కొని, బేజేపే ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో వారు చేసిన ప్రయత్నాలని కేసిఆర్ ప్రభుత్వం రికార్డుచేసి, తర్వాత రాజీపడిపోయింది. గ్రూపుతగాదాలూ, కుమ్ములాటలూ వద్దనీ, వాటికి పాల్పడితే కఠినచర్యలు తీసుకొంటామనీ హెచ్చరించారు. వాటిగురించి లోగడ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగానే అనేకసార్లు మాట్లాడారు. అధికారం మరిగిన బీజేపీ కాంగ్రెసులాగే తయారైందని పాతతరం నేతలు భావిస్తున్నారు. మోదీ వ్యాఖ్యలు ఈ స్థితిని కప్పిపుచ్చి, నేతలపై నిందమోపడానికి ఉద్దేశించబడినాయి.
ఇవన్నీ ఇలా ఉండగా ‘బిజెపి నేతలకన్నా ఓవైసీ పార్టీ, వారి సోషల్ మీడియా’ చురుకుగా పనిచేస్తున్నాయని మోదీ అన్నట్టుగా కథనంలో ఉన్నది. ఇదో కట్టుకథ. బీజేపీ అబద్ధాల ప్రచారసైన్యంతో ఎవ్వరూ పోటీపడలేరు. ఐతే తోటికోడలుముందు దెప్పినట్టున్న ఈ వ్యాఖ్య లక్ష్యం ఏమిటి? ఇప్పటికే క్యాన్సరులా వ్యాపించిన ముస్లిం వ్యతిరేక ద్వేషరాజకీయాలని ఇంకా పెంచాలని రెచ్చగొట్టటానికే ఇది. ప్రజాతంత్ర వాదులైన వ్యక్తులపై, మీడియా పై, ప్రత్యర్థి రాజకీయ శక్తులపై నిర్బంధకాండని, బెదిరింపులను ప్రయోగిస్తున్న మోదీ ప్రభుత్వ నేతలు విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. వాటిని ఇంకా పెంచాలని సూచిస్తున్నారు మోదీ. గెలిస్తే మోదీ ప్రతిభ, ఓడితే రాష్ట్రాల్లోని నేతల వైఫల్యం...ఆయన చేశారని చెప్తున్న వ్యాఖ్యల తాత్పర్యమూ, లక్ష్యమూఇవే.