ఎన్నికల మ్యానిఫెస్టోల వ్యవస్థ మారాల్సిందే

మ్యానిఫెస్టోలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే విధాన పత్రాలు కావాలి. కానీ నేడు అవి అమలుకాని హామీల కుప్పలుగా మారాయి.

Update: 2025-12-19 12:13 GMT

-పాపని నాగరాజు

భారత ప్రజాస్వామ్యం ఎన్నికల మీద నిలబడిందని మనం చెప్పుకుంటున్నాం. కానీ నేటి ఎన్నికల వాస్తవం చూస్తే, ప్రజాస్వామ్యం ప్రజల చేతుల్లో లేదన్న చేదు నిజం స్పష్టంగా కనిపిస్తుంది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకే కాదు—గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకూ ఎన్నికలు పూర్తిగా ధనం, కులం, అధికార బలాల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ప్రజల సమస్యలు రాజకీయాల కేంద్రంగా ఉండాల్సిన చోట, ఓటు కొనుగోలు ప్రధాన వ్యూహంగా మారింది.

ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు విడుదల చేసే మ్యానిఫెస్టోలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే విధాన పత్రాలు కావాలి. కానీ నేడు అవి అమలుకాని హామీల కుప్పలుగా మారాయి. డబ్బు, మద్యం, బిర్యానీ, బంగారం, భూమి వంటి వాగ్దానాలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈ హామీల ఖర్చు చివరికి పన్నుల రూపంలో ప్రజల మీదే మోపబడుతుందన్న విషయం రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. అయినా, తాత్కాలిక రాజకీయ లాభాల కోసం భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు.

ఈ వికృత రాజకీయ సంస్కృతి గ్రామ స్థాయిలో మరింత ప్రమాదకరంగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకే కాదు, కొన్ని చోట్ల అసెంబ్లీ స్థాయిని మించిపోయే ఖర్చు యుద్ధాలుగా మారాయి. ఒక వార్డు లేదా సర్పంచ్ పదవికే రూ.30–60 లక్షలు, కీలక గ్రామాల్లో రూ.1 కోటి దాటిన ఖర్చులు బహిరంగ రహస్యమే. ఓటుకు రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు, మద్యం, గృహోపకరణాలు, బంగారం, ప్రతి ఓటరు ఒక “ప్యాకేజ్”గా మారిపోయాడు. ఇది ప్రజాస్వామ్యం కాదు; డబ్బుతో కొనబడే అధికారం.

రాజధాని ప్రభావిత జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి వంటి జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య పోరాటంగా కాకుండా పెట్టుబడి యుద్ధంగా మారాయి. సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ వంటి నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి రూ.30–60 కోట్ల వరకు ఖర్చు చేయడం ఇప్పుడు అసాధారణం కాదు. ఈ నియోజకవర్గాల పరిధిలోని కూకట్‌పల్లి మండలం, బాలానగర్ మండలం, అలాగే మూసాపేట్, జగద్గిరిగుట్ట, హఫీజ్‌పేట్ వంటి గ్రామ/డివిజన్లలో ఓటు విలువ బహిరంగ రహస్యంగా మారింది.

మరోవైపు నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి వ్యవసాయ ఆధారిత జిల్లాల్లో దేవరకొండ, హుజూరాబాద్, నారాయణపేట నియోజకవర్గాల స్థాయిలో ఖర్చు కొంత తక్కువగా కనిపించినా, మండలాలు, గ్రామాల్లో కుల సమీకరణలు, ఓటు కొనుగోలు మరింత క్రూరంగా అమలవుతోంది. అంటే, సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో ఒక్కో ఓటుకు సాయంత్రానికి 25వేలు, రాత్రికి 5వేలు, ఓటు వేయడానికి పోయేముందు 10వేలు ఖర్చు చేసారు. మహిళలకు వెండి గ్లాసులు, ఇతర సామాగ్రి కానుకలుగా ఇచ్చేపరిస్థితి రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఒక్కో అభ్యర్థి 15 కోట్లు ఖర్చు చేశారు. ఇలా ఒకటేమిటి, అనేక నియోజకవర్గాల్లో ఒక్కో ఎమ్మెల్యే సగటున రూ.17 కోట్లు, ఓటుకు రూ.55 వేల వరకు ఖర్చవుతుందన్న అంచనాలు వున్నవి. ఈ మొత్తం వ్యవస్థలో ప్రజలను ఓటర్లు కాకుండా, ధర కట్టిన సరుకులుగా మార్చివేశారని స్పష్టం చేస్తున్నాయి.

ఇంతటి భారీ ఖర్చు వెనుక ప్రజాసేవ భావన లేదు. తిరిగి పెట్టుబడి రాబట్టుకునే లెక్కలే ఉన్నాయి. పన్నులు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు, కమిషన్ల మీద ఆధిపత్యం కోసం గ్రామస్థాయిలోనే కార్పొరేట్ రాజకీయాలు నడుస్తున్నాయి. దీని ఫలితంగా పేదలు, స్వతంత్ర అభ్యర్థులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు రాజకీయ పోటీకి అర్హులు కాకుండా తొక్కేయబడుతున్నారు. ఒకప్పుడు గ్రామ స్వపరిపాలనకు పునాది అయిన పంచాయతీ వ్యవస్థ, నేడు ప్రజాస్వామ్యానికి అత్యంత ఖరీదైన, అత్యంత హింసాత్మక రాజకీయ రంగస్థలంగా మారింది.

ఈ పరిస్థితికి రాజకీయ పార్టీలతో పాటు వ్యవస్థాపక వైఫల్యాలు కూడా బాధ్యత వహించాల్సిందే. ఎన్నికల కమిషన్‌లు డబ్బు–దండబలం నియంత్రణలో సమర్థంగా వ్యవహరించడంలేదన్న విమర్శలు బలపడుతున్నాయి. పెద్ద నాయకులపై మాత్రమే నిఘా పెట్టి, గ్రామస్థాయిలో జరుగుతున్న ఆర్థిక విచ్చలవిడితనాన్ని పట్టించుకోకపోవడం ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఎన్నికల నియంత్రణ బలహీనపడితే, ప్రజాస్వామ్యం లోపల నుంచే కూలిపోతుంది.

మ్యానిఫెస్టోల విషయంలో కూడా మౌలిక మార్పు అవసరం. నిజమైన ప్రజాస్వామ్యంలో మ్యానిఫెస్టోలు ఓట్ల కోసం చేసే ప్రకటనలు కావు; అవి ప్రజా విధానాలకు స్పష్టమైన దిశ చూపాలి. భూమిలేనివారికి భూమి, నాణ్యమైన విద్య, ఆరోగ్య హక్కు, ఉపాధి భద్రత, సామాజిక న్యాయం, కుల వివక్ష నిర్మూలన, ఇలాంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు ఉండాలి. కానీ నేడు ఆ స్థానాన్ని కుల, మత భావోద్వేగాలు, సంక్షేమ పథకాల పేరుతో ఓట్ల సమీకరణ ఆక్రమించింది. ఇవి సమస్యల పరిష్కారాలు కావు; రాజకీయ లాభాల సాధన మాత్రమే.

ఈ పరిస్థితిలో అసలు ప్రశ్న—ఈ వ్యవస్థ ఎవరికి ఉపయోగపడుతోంది? సమాధానం స్పష్టం. ధనం, అధికారం, కుల ఆధిపత్యం కలిగిన వర్గాలకు మాత్రమే. ప్రజల సమస్యల మీద ఆధారపడి రాజకీయాలు నడవాల్సిన చోట, లాభాల మీద ఆధారపడి పాలన సాగుతోంది. ఫలితంగా ఎన్నికలు ప్రజల హక్కు కాకుండా పెట్టుబడి వ్యవస్థగా మారుతున్నాయి.

మార్పు కోసం సూచనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఎన్నికల ఖర్చుపై కఠిన నియంత్రణ, మ్యానిఫెస్టోల అమలుపై చట్టబద్ధమైన బాధ్యత, డబ్బు పంపిణీపై కఠిన శిక్షలు, స్వతంత్ర అభ్యర్థులకు రక్షణ, ఇవి లేకుండా ఎన్నికల వ్యవస్థ శుద్ధి సాధ్యం కాదు. అంతకంటే ముఖ్యంగా, ఓటర్లలో రాజకీయ చైతన్యం పెరగాలి. డబ్బుకు ఓటు అమ్మకుండా, విధానాలను, విలువలను ప్రశ్నించే స్థాయికి ప్రజలు ఎదగాలి.

ప్రజాస్వామ్యం అంటే పాలకుల రాజ్యం కాదు; ప్రజల రాజ్యం. ఆ రాజ్యం నిజంగా ప్రజల చేతుల్లో ఉండాలంటే ఎన్నికల మ్యానిఫెస్టోల వ్యవస్థతో పాటు మొత్తం ఎన్నికల సంస్కృతి మారాల్సిందే. ఈ మార్పు రాజకీయ పార్టీల బాధ్యత మాత్రమే కాదు, ప్రజలందరి బాధ్యత.

( పాపని నాగరాజు , సత్యశోధక మహాసభ, హైదరాబాద్)

Tags:    

Similar News