తెరమీదికి అదానీ-ఎల్.ఐ.సీ వివాదం మరోసారి
కొత్త పరిస్థితుల్లో పాత పోరాటాలు ఏం పనికొస్తాయి?
అదానీ గ్రూప్-ఎల్.ఐ.సీ (LIC) ల వివాదానికి సంబంధించిన ఒక వార్తను నిన్న(26, అక్టోబర్) మీలో చాలామంది చూసే ఉంటారు. నేను చూసిన మేరకు, ‘ది హిందూ’, ‘సండే టైమ్స్’ -రెండూ ఈ వార్తను పతాక శీర్షికతో ప్రచురించాయి.
ఆ వార్తలోకి వెళ్లబోయే ముందు ఒక వివరణ ఇవ్వడం అవసరం. ఇది కేవలం ‘అదానీ గ్రూప్-ఎల్.ఐ.సీల వివాదానికి సంబంధించి మాత్రమే’ రాస్తున్నది కాదు; దానిని ఒక ఉదాహరణగా తీసుకుని అంతకన్నా లోతైన కొన్ని అంశాలను చర్చలోకి తీసుకువచ్చే ఉద్దేశంతో రాస్తున్నది.
సంగ్రహంగా వివాదం ఇదీ:
1. ఎల్.ఐ.సీ తన నిధులనుంచి 33వేల కోట్ల రూపాయలను అదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టింది.
2. కాకపోతే, ‘వాషింగ్ టన్ పోస్ట్’ ప్రచురించిన ఒక వార్త ప్రకారం, ముడుపులకు సంబంధించిన ఒక కేసులో ఒక యూ.ఎస్. న్యాయస్థానం అదానీ గ్రూపును అభిశంసించిన దరిమిలా ఎల్.ఐ.సీ ఆ గ్రూపులో పెట్టుబడి పెట్టింది.
ఆవిధంగా ఇన్వెస్టర్లలో అదానీ గ్రూపుపట్ల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం తలెత్తింది కనుక, ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించడంకోసమే అందులో ఎల్.ఐ.సీతో పెట్టుబడి పెట్టించారనీ, ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌లు ఎల్.ఐ. సీపై ఒత్తిడి తెచ్చాయనీ కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలన్న తన వెనకటి డిమాండ్ ను మరోసారి ముందుకు తెచ్చింది. దీనిపై ఎల్.ఐ.సీ స్పందిస్తూ, అదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టడం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమనీ, దాని వెనుక ఎవరి ఒత్తిడీ లేదనీ; కొన్ని ఇతర గ్రూపుల్లో ఇంతకన్నా ఎక్కువ పెట్టుబడే పెట్టడం జరిగిందనీ వివరణ ఇచ్చింది.
కేంద్రప్రభుత్వం అదానీ గ్రూపు పట్ల మితిమీరిన ఆదరణ చూపుతోందన్న విమర్శ గత పదేళ్లుగా ఉంటూనే ఉంది, అందులో వాస్తవం కూడా ఉండవచ్చు. అయితే, కచ్చితమైన ఆధారాలు చూపినప్పుడు మాత్రమే ఆ విమర్శలకు విలువ ఉంటుంది, అప్పుడే ఆ విమర్శ చేసేవారిపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది. ఆధారాలు మినహా ఎంతటి విమర్శలు చేసినా అవి చేసేవారిపై విశ్వాసాన్ని పెంచవు సరికదా, మరింత అవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆవిధంగా అనుకూల ఫలితాలకు బదులు, పూర్తిగా వ్యతిరేకఫలితాలనిస్తాయి. అదే దామాషాలో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగినా పెరగవచ్చు.
రాజకీయ, ప్రజాజీవనరంగంలో అపారమైన అనుభవం ఉన్న కాంగ్రెస్ కానీ, ఇతర ప్రతిపక్షాలు కానీ ఈ సామాన్యసూత్రాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. తను ప్రతిపక్షంగా ఉన్నచోట బీజేపీ కూడా ఇలాగే వ్యవహరిస్తూ ఉంటుంది. దీనిని ఈ పార్టీలన్నీ ‘రాజకీయపోరాటం’ అనే పేరుతో పిలుస్తూ ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు గత ఎనభై ఏళ్లుగా మన పార్టీలన్నీ ఈ తరహా ‘రాజకీయపోరాటా’ లకు అలవాటు పడ్డాయి. వాటినవి చాలా యాంత్రికంగా జరుపుతూ ఉంటాయి. ప్రజల విజ్ఞత, వివేకాల పట్ల బొత్తిగా నమ్మకం లేకపోవడం, తాము ఏం చెప్పినా వాళ్ళు నమ్మేస్తారన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం అందుకు కారణం కావచ్చు. ఫలితం తమకు ప్రతికూలించినా అవి తెలుసుకోలేకపోవడాన్ని గమనిస్తే, నిజంగా విజ్ఞతా, వివేకాలు లోపించినది రాజకీయపక్షాలలోనే అనిపిస్తుంది.
ఇంకోసారి వివాదాన్ని గమనించండి. ఓ ముడుపుల కేసులో యూ.ఎస్ న్యాయస్థానం అదానీ గ్రూపును అభిశంసించిన దరిమిలా ఎల్.ఐ.సీ ఆ గ్రూపులో పెట్టుబడి పెట్టిందని ‘వాషింగ్ టన్ పోస్ట్’ అంది. దాంతో అదానీ గ్రూప్ పై విశ్వాసాన్ని పునరుద్ధరించడం కోసమే ఎల్.ఐ.సీతో పెట్టుబడి పెట్టించారనీ, దీని వెనుక కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్ ల పాత్ర ఉందనీ కాంగ్రెస్ ఆరోపించింది. లేదు, మేము స్వతంత్రంగానే నిర్ణయం తీసుకున్నామనీ, ఇతర గ్రూపులకు ఇంతకన్నా ఎక్కువే పెట్టుబడి పెట్టామనీ ఎల్.ఐ.సీ అంది. అదానీ గ్రూపుపై కేంద్రం ప్రత్యేక ఆదరణ చూపుతోందన్న విమర్శలో నిజం ఉందనీ, లేదా ఉండవచ్చనీ అనుకున్నట్టే; ఎల్.ఐ.సీ చర్య వెనుక ఆర్థిక మంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్ ల పాత్ర కూడా ఉండవచ్చు. కాకపోతే, ఏ ఆరోపణనైనా ఆధారసహితంగా స్థాపించడం ముఖ్యం. అప్పుడే ఆ ఆరోపణకు విలువ ఉంటుంది. లేనప్పుడు ఆ ఆరోపణ ఎంతకాలమైనా గాల్లో తేలుతూ ఉంటుందే తప్ప ఎప్పటికీ ఒక కొలిక్కి రాదు. అందువల్ల ఆరోపణ చేసినవారికి ఎటువంటి రాజకీయ ప్రయోజనం సిద్ధించకపోగా, నష్టం కలిగించడమే కాక, మరింత లాభాన్ని అధికారపక్షం ఖాతాలోనే వేస్తుంది.
కాంగ్రెస్ ఆరోపణకు విలువ ఎప్పుడు సిద్ధిస్తుందంటే, ఎల్.ఐ.సీ చర్య వెనుక ఆర్థికమంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్ ల పాత్రను ససాక్ష్యంగా చూపినప్పుడు! ఇలాంటి ‘రాజకీయపోరాటా’ల ద్వారా తాము ప్రజల మద్దతును కూడగట్టుకోగలుగుతామని రాజకీయపక్షాలు భావిస్తూ ఉండవచ్చు. కానీ, జనంలో ఆయా పార్టీల మద్దతుదారులు మూడు రకాలుగా ఉంటారన్న సంగతిని ఇక్కడ దృష్టిలో పెట్టుకోవడం అవసరం. అనుకూలురు ఒక రకం, వ్యతిరేకులు ఇంకొక రకం, తటస్థులు మూడవరకం. ఒక పార్టీ పట్ల మొదటి రెండు రకాల జనాల అనుకూల, ప్రతికూలతలను తారుమారు చేయడం అంత తేలిక కాదు.
తటస్థులను మాత్రమే ప్రభావితం చేయగల అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ పార్టీ అయినా వారినే తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ తరహా ‘రాజకీయపోరాటం’ అందుకు ఏ విధంగానూ తోడ్పడదు సరికదా, ముందే చెప్పుకున్నట్టు వ్యతిరేకఫలితాలనిస్తుంది. గత పదేళ్ళుగా దేశవ్యాప్తంగా ఒక సరికొత్త రాజకీయవాతావరణం నెలకొని బలపడుతూవచ్చింది. దీనిని ఎదుర్కోడానికి పాత పోరాటపద్ధతులు, వ్యూహాలు పనికి రావు. శతాబ్దకాలానికి పైగా సుదీర్ఘచరిత్ర ఉన్న కాంగ్రెస్ లో కూడా ఈ గ్రహింపు లోపించడమే విచిత్రమూ, విషాదకరమూ.