తెలంగాణ పత్తి రైతులను గడ్డు రోజులు

ముంచుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు , ప్రకృతి వైపరీత్యాలు

Update: 2025-10-30 02:30 GMT

అక్టోబర్ చివరికి వస్తున్నా ఈ సంవత్సరంలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు పెసర, మినుము రైతులను దెబ్బ తెస్తే, ఇతర పంటలు కోతకు వస్తున్న ప్రస్తుత సమయంలో తాజా తుఫాన్ కారణంగా కురుస్తున్న ముసురు వానలు పత్తి,మొక్క జొన్న, సోయాబీన్ పంటలకు తీవ్ర నష్టాలను కలిగిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల కోతలకు వస్తున్న వరి ధాన్యం కూడా కల్లాల లోనే తడుస్తున్నది. సీజన్ మొత్తంగా ఆగకుండా కురుస్తున్న వర్షాలతో కూర గాయలు, పండ్ల తోటలు కూడా బాగా దెబ్బ తింటున్నాయి. మార్కెట్ లో కూరగాయల ధరలు పెరిగిపోవడానికి ఇదొక ముఖ్య కారణంగా ఉంది.

ప్రపంచ వ్యాపితంగా కొనసాగుతున్న అభివృద్ధి నమూనా వల్ల రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, వాతావరణంలో వచ్చిన మార్పులు పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలకు( భారీ వర్షాలు, వరదలు, వడగండ్లు , పిడుగులు, క్లౌడ్ బరస్ట్ ఘటనలు ) ప్రధాన కారణమని మనం అనుకున్నా, ఆయా ప్రకృతి వైపరీత్యాల నుండీ రైతులను, గ్రామీణ ప్రజలను, ఇతర పట్టణ ప్రాంతాల పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది.

అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఒక మేరకు ఉపయోగించుకుని వాతావరణ శాఖ ఇచ్చే ముందస్తు హెచ్చరికలతో మానవ ప్రాణాల నష్టాలను నివారిస్తున్నా( ఇటీవల మూసీ వరద ఘటనలో అది కూడా జరగలేదు) ప్రజలకు ఎదురవుతున్న ఇతర నష్టాలను మాత్రం ప్రభుత్వాలు నివారించలేకపోతున్నాయి. నష్టపోయిన వారిని ఆదుకోలేక పోతున్నాయి.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పంట నష్టాలను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదు. ఈ కారణం చేతనే ప్రస్తుతం తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరీ ముఖ్యంగా పత్తి రైతుల వేదన, బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

రాష్ట్రంలో తగ్గిపోతున్న పత్తి సాగు విస్తీర్ణం :

రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం తెలంగాణ లో సాధారణ పత్తి విస్తీర్ణం 48,93,016 ఎకరాలు కాగా, గత సంవత్సరం లో 44,75,252 ఎకరాలలో రైతులు పత్తి వేశారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు 45,94,685 ఎకరాలలో పత్తి సాగు చేశారు.

2020 ఖరీఫ్ లో పత్తి సాగు విస్తీర్ణం 60,53,890 ఎకరాలతో పోల్చినప్పుడు, రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయిందని అర్థమవుతుంది. గత ఐదేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవి చూడడం, పంటల బీమా పథకం లేకపోవడం, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా కనీస మద్ధతు ధరలలో పెరుగుదల లేకపోవడం, కనీస మద్ధతు ధరల కంటే తక్కువకు పత్తి ధరలు పడిపోయినప్పుడు, ఒక మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ, రాష్ట్రంలో పత్తి సగటు దిగుబడులు బాగా పడిపోవడం వల్ల సాగు చేస్తున్న పత్తి రైతులు నష్టాలే చవి చూస్తున్నారు.

మరీ ముఖ్యంగా దేశంలో జన్యుమార్పిడి బీటీ పత్తి తీసుకురావడానికి కారణంగా చెప్పిన గులాబీ రంగు పురుగు , బీటీ కి నిరోధక శక్తిని పెంచుకుని మళ్ళీ తీవ్రంగా పత్తి పంటకు నష్టం చేస్తున్నది. ఫలితంగా పత్తిలో పురుగు విషాల వినియోగం మళ్ళీ పెరుగుతున్నది. సగటు దిగుబడులు ఎక్కువ ఉండేలా, నాన్ బీటీని రైతులలో ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ , కేంద్ర పరిశోధనా సంస్థలు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నాలు ఇప్పటి వరకూ చేయలేదు. తెలంగాణ గద్వాల ప్రాంతంలో బీటీ పత్తి విత్తనాలను పండించే రైతులు కూడా విత్తన కంపనీల మోసాల వల్ల, క్వాలిటీ పేరుతో, తక్కువ ధరలు చెల్లిస్తూ చేస్తున్న దోపిడీ వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కుంటున్నారు.

ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలకు పంటల బీమా పథకం లేదు

ఈ ఖరీఫ్ సీజన్ పొడవునా కురిసిన భారీ వర్షాల వల్ల, పత్తి పంట బాగా దెబ్బ తిన్నది. మొక్కలు ఆరోగ్యంగా పెరగలేదు. కొన్ని ప్రాంతాలలో పత్తి కాయల సంఖ్య కూడా తగినంతగా లేదు. పత్తి కాయలు నల్లబడి పోవడం, రాలి పోవడం కూడా ఎక్కువ గానే ఉండింది. కొన్ని సందర్భాలలో దూది బయటకు తీయడం కూడా కష్టంగా ఉంటున్నది. తీసిన దూది లో కూడా తేమ అధికంగానే ఉంటున్నది. వరసగా కొన్ని రోజుల పాటు ఎండలు లేకపోవడం వల్ల పత్తి వేగంగా ఆరడం లేదు.

ఇలాంటి సందర్భాలలో జులై నుండీ డిసెంబర్ వరకూ వర్షపాతం లో వ్యత్యాసాల వల్ల ( 15 రోజుల పాటు వరసగా వర్షం లేకపోవడం, ఒక నిర్ధిష్ట నెలలో సగటు వర్షపాతం కంటే బాగా పెరిగిన వర్షపాతం, వరసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవడం , డిసెంబర్ లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం) పత్తి రైతులు నష్ట పోయినప్పుడు రైతులను ఆదుకోవడానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన లో భాగంగా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ఉండేది. ఈ పథకం వల్ల 2016-2019 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులకు ప్రధానంగా , ఇతర జిల్లాల పత్తి రైతులకు కూడా బీమా పరిహారం అందింది. కానీ 2020 నుండీ ఇప్పటి వరకూ ఈ పంటల బీమా పథకం తెలంగాణ లో అమలు కావడం లేదు.

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ , రాష్ట్రంలో అన్ని పంటలు కవర్ అయ్యేలా 2024 ఖరీఫ్ నుండీ సమగ్ర పంటల బీమా పథకం అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, మూడు సీజన్ లు గడిచినా ఇప్పటి వరకూ పథకాన్ని ప్రారంభించలేదు. ప్రతి సీజన్ లో రైతులు నష్టపోతున్నా రైతులకు బీమా పరిహారం అందడం లేదు. గతంలో పంటలు నష్ట పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులు రెండు సార్లు రాష్ట్ర హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రిట్ పిటిషన్ లు వేసి పరిహారం సాధించి ప్రయోజనం పొందారు.

జాతీయ వైపరీత్యాల యాజమాన్య నిధి (NDRF) క్రింద రాష్ట్రంలో గత మూడు సీజన్ లలో ఇప్పటికి మూడు విడతలుగా కొందరు పత్తి రైతులకు ఎకరానికి 10,000 రూపాయల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం అందించింది . ఇందులో సమస్య ఏమిటంటే, ప్రకృతి వైపరిత్యాల కారణంగా నష్టం వాటిల్లిన వెంటనే , రాష్ట్ర ప్రభుత్వం నష్ట పోయిన రైతుల వివరాలు సేకరించేలా ఆదేశాలు జారీ చేయడం లేదు. ఈ చట్టం ప్రకారం బాధ్యత కలిగిన జిల్లా కలెక్టర్ లు ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారి ఆఎసహాల కోసం చూడడం తప్ప, ప్రత్యేక చొరవతో, నష్టపోయిన రైతుల వివరాలు పూర్తిగా సేకరించడం లేదు. పైగా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు నష్టపోయినా, మొత్తం విస్తీర్ణాన్ని నమోదు చేయడం లేదు.

పైగా నష్టపోయిన రైతుల నమోదులో భూమి యాజమానుల పేర్లు రాస్తున్నారు తప్ప, ఆ భూమిలో నిజంగా సాగు చేసిన కౌలు రైతుల పేర్లను అసలు చేర్చడం లేదు. ఫలితంగా నష్టపోయిన కౌలు రైతులకు అసలు పరిహారం అందడం లేదు, అలాగే ఇప్పటికీ అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు రాక, పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులకు కూడా పరిహారం అందడం లేదు. తెలంగాణ లో పత్తి రైతులు, ప్రకృతి వైపరీత్యాల నుండీ మొదటి దెబ్బ తింటుంటే, దాని నుండీ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకోవలసిన బాధ్యత తీసుకోవడం లేదు.

పత్తి దిగుమతులపై సుంకం తగ్గింపు :

భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద పత్తి ఉత్పత్తి దారుగా ఉన్నప్పటికీ, గత దశాబ్దంలో పత్తి సగటు దిగుబడి తగ్గడం, దేశీయ వినియోగం పెరగడంవల్ల దిగుమతులు పెరిగాయి. దేశంలో పత్తి ఉత్పత్తి తగ్గిపోయింది. పొడవు పింజ పత్తి తో పాటు అధికనాణ్యత గల పత్తి కావాలని వస్త్ర పరిశ్రమ డిమాండ్ చేస్తున్నది. భారతీయ టెక్స్‌టైల్ మిల్లులకు (ముఖ్యంగా ఎగుమతి-ఆధారిత మిల్లులకు) చాలా పొడవైన పింజ ఉన్న (30 mm కంటే ఎక్కువ) అధిక నాణ్యత గల పత్తి అవసరం.

దేశీయంగా ఉత్పత్తి అయ్యే పత్తిలో అధిక భాగం మధ్యస్థ పింజ (Medium Staple) లేదా కొద్దిగా పొడవైన పింజ (Long Staple) ఉంటుంది. అందువల్ల, టెక్స్‌టైల్ మిల్లులు అధిక నాణ్యత, పొడుగు పింజ గల పత్తి కోసం యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాయి.

2013-14 (పీక్) - 2024-25 మధ్య కాలంలో దేశంలో పత్తి దిగుబడి తగ్గుతూ వచ్చింది. 2013-14లో సుమారు 398 లక్షల బేల్స్ ఉన్న దిగుబడి, 2024-25 నాటికి సుమారు 294 లక్షల బేల్స్కి పడిపోయింది. ఇది 15 ఏళ్లలో అత్యల్పం. వాతావరణ మార్పులు, తెగుళ్ల దాడి (ముఖ్యంగా గులాబీ రంగు కాయ తొలుచు పురుగు), దేశంలో సాగు విస్తీర్ణం తగ్గడం, అధిక దిగుబడినిచ్చే విత్తనాల (Bt పత్తి) ప్రభావం తగ్గడం ఇందుకు ముఖ్య కారణాలుగా ఉన్నాయి.

2014-15 , 2024-25 మధ్య కాలంలో ఎగుమతులు కూడా గణనీయంగా తగ్గాయి. 2014-15 లో సుమారు 70 లక్షల బేల్స్ ఎగుమతి చేయగా, 2024-25 నాటికి అది 18 - 40 లక్షల బేల్స్ (అంచనా) స్థాయికి పడిపోయింది

పత్తిపై దిగుమతి సుంకాలలో వచ్చిన మార్పులు

గత దశాబ్దంలో పత్తి పై దిగుమతి సుంకం విధానంలో చాలా ముఖ్యమైన మార్పు వచ్చింది. 2021 వరకు ముడి పత్తి దిగుమతులపై ఎటువంటి సుంకం ఉండేది కాదు. 2021-2022 బడ్జెట్ సందర్భంగా 11 శాతం దిగుమతి సుంకం విధించారు. 5 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD), మరో 5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (AIDC) కలిపి మొత్తం సుమారు 11 శాతం దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం విధించింది. 2025 సంవత్సరంలో వస్త్ర పరిశ్రమ డిమాండ్ కారణంగా, ప్రభుత్వం 11 శాతం దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఇది మొదట సెప్టెంబర్ 30, 2025 వరకు ప్రకటించి, తర్వాత దానిని డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించారు. దేశంలో పత్తి రైతుల చేతికి పంట వచ్చే సమయానికి ఇలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేయడం రైతుల గొంతు కోయదానికే దారి తీసింది.

పైగా ఈ పత్తి దిగుమతి సుంకాల విషయం కూడా అమెరికా, భారత్ మధ్య జరుగుతున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చర్చలలో కీలక భాగంగా ఉంది. అమెరికా వానుజయ సంస్థల ఆర్దిక ప్రయోజనాల కోసం అక్కడి ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడికి లొంగి, స్వేచ్చా వాణిజ్య ఒప్పందం పూర్తిగా బయటకు రాకుండానే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే ,దేశ రైతుల ప్రయోజనాలను ఈ ప్రభుత్వం కార్పొరేట్ కంపనీల కోసం ఎంతగా తాకట్టు పెడుతున్నదో అర్థం చేసుకోవచ్చు.

గత రెండు సంవత్సరాల కాలంలో భారతదేశం లోకి పత్తి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. దిగుమతులపై 11 శాతం సుంకం ఉన్నప్పటికీ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో పత్తి దిగుమతులు బాగా పెరిగాయి. 2023-2024 లో పత్తి దిగుమతుల విలువ (దాదాపు) 579.2 మిలియన్ డాలర్లు. దిగుమతుల పరిమాణం (లక్ష బేల్స్ - 170 కిలోలు) సుమారు 15.2 లక్షల బేల్స్. 2024-2025 లో పత్తి దిగుమతుల విలువ 1.20 బిలియన్ డాలర్లు కాగా దిగుమతుల పరిమాణం (లక్ష బేల్స్ - 170 కిలోలు) సుమారు 39 - 40 లక్షల బేల్స్. తగిన గణాంకాలు ఇంకా పూర్తిగా అందుబాటు లో లేనప్పటికీ, 2025 లో దిగుమతి సుంకం మినహాయింపు ప్రకటించిన కారణంగా పత్తి దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది.

దిగుమతి సుంకం ఎత్తివేత కారణంగా భారతదేశం పత్తి ఎగుమతిదారు నుండి క్రమంగా పత్తి దిగుమతిదారుగా మారుతోంది. ఇది దేశంలోని పత్తి రైతులకు మాత్రం మరణ శాసనమే.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు - తేమ సమస్య:

ఇటీవలి వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం (Moisture Content) ఎక్కువగా ఉంటోంది. ప్రైవేట్ వ్యాపారులు ఈ తేమ శాతాన్ని సాకుగా చూపి, నాణ్యతా లోపం పేరుతో రైతులకు తక్కువ ధరలు చెల్లిస్తున్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) చాలా ముందుగానే కొనుగోళ్లు ప్రారంభించాలి. కానీ దిగుమతి సునకాల మినహాయింపు కారణంగా, ఆ సంస్థ పెద్ద ఎత్తున పత్తిని దేశ రైతుల నుండీ సేకరించే ఆలోచన నుండీ ఉపసంహరించుకున్నట్లు కనపడుతున్నది.

తెలంగాణ లో CCI కొనుగోళ్లు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అది కూడా తప్పుడు నిబంధనల వల్ల రైతులకు ఉపయోగపడకుండా పోయింది. CCI నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు కేవలం 8 నుండీ 12 శాతం తేమ ఉన్న పత్తికే వర్తిస్తాయి. 8 శాతం నుంచి 12 శాతం వరకు తేమ ఉంటే, నిష్పత్తి ప్రకారం ధర MSP లో ధర తగ్గింపు ( ప్రతి ఒక్క శాతానికీ కనీసం 80 రూపాయలు ) ఉంటుంది . అంతకు మించి అధిక తేమ ఉన్న పత్తిని CCI అసలు కొనుగోలు చేయడం లేదు. అధిక తేమ ఉన్న పత్తిని కూడా MSP తో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం CCI ని, కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నా, ప్రస్తుతానికి నిబంధనలలో ఎలాంటి అధికారిక సడలింపు రాలేదు. : ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షాల కారణంగా, తేమ శాతం పరిమితిని 12 శాతం నుంచి కనీసం 14 శాతం వరకు (లేదా 20 శాతం వరకు) పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి (కేంద్ర జౌళి శాఖ మంత్రికి) మరియు CCI చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధనల కఠినత్వం వల్ల, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అధిక తేమ ఉన్న పత్తిని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో అక్టోబర్ 21 నుండి CCI కొనుగోలు కేంద్రాలు (మొత్తం 122 కేంద్రాలు) ప్రారంభమయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల కొనుగోళ్లే ప్రారంభం కాలేదు. జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు కానీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని CCI సంస్థ , రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను వింటుందన్న గ్యారంటీ లేదు.

రైతులకు పరీక్షగా మారిన 'కపాస్ కిసాన్' ( Kapas Kisan) యాప్

తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) 'కపాస్ కిసాన్' ( Kapas Kisan) యాప్ వినియోగం తప్పని సరి చేసింది. నిరక్షరాశ్యులు ఎక్కువమంది ఉన్న మన రాష్ట్రంలో ఈ యాప్ అనేక సమస్యలను సృష్టిస్తున్నది.

పత్తి కొనుగోళ్లలో పారదర్శకత, మధ్యవర్తులను తొలగించడం, మార్కెట్లలో రద్దీని తగ్గించడం కారణం గా చెబుతూ CCI ఈ యాప్ ను తెచ్చామని చెప్పినప్పటికీ, దాని ప్రధాన ఉద్దేశ్యం రైతులను వివిధ పేర్లతో వేధించి, రైతులు CCI కేంద్రాలకు రాకుండా తరిమేయడమే. ఫలితంగా CCI సేకరించాల్సిన పత్తి పరిమాణం తగ్గిపోతుంది. పత్తి పై దిగుమతి సుంకాల తగ్గింపు వల్ల వస్త్ర పరిశ్రమ ఇతర దేశాల నుండీ పత్తిని దిగుమతి చేసుకుంటుంది.

చాలా మంది వృద్ధ రైతులకు, మహిళా రైతులకు, ఆదివాసీ రైతులకు, చిన్న రైతులకు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేవు. వాటిని ఉపయోగించడంపై అవగాహన కూడా లేదు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఓటీపీ నమోదు చేయడం, భూమి వివరాలు, పట్టాదారు పాస్ పుస్తకం వంటి వివరాలను సరిగ్గా నమోదు చేయడం, స్లాట్ బుకింగ్ ప్రక్రియను నిర్వహించడం చాలా మంది చదువురాని రైతులకు కష్టమైన పని.

స్వయంగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో, స్లాట్ బుకింగ్ కోసం రైతులు ఇతరులపై (మీ-సేవా కేంద్రాలు, ఏఈఓలు లేదా ప్రైవేట్ వ్యక్తులు ) ఆధారపడాల్సి వస్తుంది. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పనిలో జాప్యం కూడా జరుగుతుంది.

గ్రామీణ, మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ కవరేజ్ సరిగా లేకపోవడం వల్ల యాప్‌ను వినియోగించడం కష్టం. ముఖ్యంగా స్లాట్‌ను బుక్ చేసుకోవడం లేదా అప్‌ డేట్‌లను పొందడం కష్టమవుతోంది.

యాప్‌లో ఫోన్ నంబర్ తప్పుగా నమోదవడం లేదా ఆధార్ వివరాలు సరిపోలకపోవడం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తితే, వాటిని వ్యవసాయ విస్తరణాధికారుల (AEO) వద్ద సరి చేయించుకోవడం ఆలస్యం అవుతోంది.

సాధారణ రైతులతో పోలిస్తే, కౌలురైతులు ఈ యాప్ ద్వారా మరింత సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కౌలు రైతులు భూమికి యజమానులు కారు. CCI యాప్‌లో తప్పనిసరిగా పట్టాదారు పాస్‌బుక్ వివరాలు, భూమి యజమాని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అది కౌలు రైతులకు కష్టం. స్లాట్ బుకింగ్ చేసి, పత్తిని అమ్మినా, చెల్లింపులు (MSP) భూమి యజమాని పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతాకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇది కౌలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.

కౌలు రైతులకు ప్రభుత్వం నుండి LEC లేదా ఇతర గుర్తింపు పత్రాలు లేవు. పత్తి కొనుగోలును భూ యాజమాన్యంతో ముడిపెట్టడం వల్ల, కౌలు రైతులు MSP కి అమ్ముకునే అవకాశం కోల్పోయి, ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది.

రైతులకు కనీస మద్ధతు ధరలు అందడం లేదు -

పత్తి రైతులకు ప్రధాన ఆదాయ వనరు , పంటకు ప్రకటించే కనీస మద్ధతు ధరలు. కానీ తెలంగాణలోని ప్రధాన మార్కెట్లలో ప్రస్తుతం పత్తి రైతులకు ప్రైవేట్ వ్యాపారులు కనీస మద్దతు ధర (MSP) కంటే అతి తక్కువ ధరలు చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది (2025-26 మార్కెటింగ్ సీజన్‌కు) పత్తికి (క్వింటాల్‌కు) నిర్ణయించిన కనీస మద్దతు ధరలు (MSP) ఇలా ఉన్నాయి:

• పొడుగు పింజ పత్తి (Long Staple Cotton): క్వింటాలుకు ₹8,110

• మధ్య పింజ పత్తి (Medium Staple Cotton): క్వింటాలుకు ₹7,710

ఈ ధరలు 8 శాతం కంటే తక్కువ తేమ శాతం (Moisture Content), నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలు ఉన్న పత్తికి మాత్రమే వర్తిస్తాయి.

అక్టోబర్ 28 న ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ లో పత్తి రైతులకు ప్రైవేట్ వ్యాపారులకు చెల్లించిన మోడల్ ధర క్వింటాలు కు 7500 రూపాయలు మాత్రమే. ఇదే రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మార్కెట్ లో పత్తి రైతులకు ప్రైవేట్ వ్యాపారులు చెల్లించిన మోడల్ ధర 6810 రూపాయలు మాత్రమే. కరీం నగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ లో అదే రోజు రైతులకు చెల్లించిన ధర 7000 రూపాయలుగా ఉంది.

తెలంగాణలోని ప్రధాన మార్కెట్లలో ముఖ్యంగా వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రాంతాలలో ప్రైవేట్ వ్యాపారులు రైతులకు చెల్లిస్తున్న ధరలు MSP కంటే చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో సగటున పత్తి రైతులకు అందుతున్న ధర 6874 రూపాయలు మాత్రమే. అంటే కనీసం 1200 రూపాయలు ప్రతి క్వింటాలుపై రైతులు నష్టపోతున్నారు. కొన్ని మార్కెట్ లలో ధరలు కేవలం 5200 రూపాయలుగా ఉన్నాయి. ఇంకా పడిపోయే ప్రమాదం వెంటాడుతున్నది.

పత్తి రైతుకు ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల విధానాలు చాలా ప్రతికూలంగా ఉన్నాయి . ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారు. అప్పుల ఊబిలో కూరుకుపోయివతారు. ఈ కారణంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు మరిన్ని పెరుగుతాయి.

ఈ పరిస్థితిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై తీవ్ర ఒత్తిడి తేవడం ద్వారా , రాష్ట్ర పత్తి రైతులను ఆదుకోవాలి. ముఖ్యంగా తేమ శాతంతో సంబంధం లేకుండా , మొత్తం పత్తిని CCI కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలి. రైతులకు కనీస మద్ధతు ధరలు తప్పకుండా అందేలా చూడాలి. పత్తి రైతుల నమోదుకు కేవలం యాప్ ను మాత్రమే కాకుండా, వ్యవసాయ అధికారుల ద్వారా పేర్లు నమోదు చేసి మార్కెటింగ్ కు సహకరించాలి. కౌలు రైతుల, మహిళా రైతుల, పోడు రైతుల పేర్లు కూడా తప్పకుండా నమోదు చేయాలి. మార్కెట్ యార్డులలో కూడా పత్తి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతు సహకార సంఘాలను, రైతు ఉత్పత్తిదారులను కూడా రంగంలోకి తీసుకు వచ్చి, CCI కోసం గ్రామాల లోనే పత్తిని వేగంగా సేకరించాలి. ఆదిలాబాద్ లో ఈ ప్రయత్నం గతంలో జరిగింది కూడా..

కేంద్ర ప్రభుత్వం పత్తిపై దిగుమతి సుంకాలను మళ్ళీ పునరుద్ధరించాలి. దేశ పత్తి అవసరాల కోసం దేశ రైతుల నుండీ పూర్తిగా పత్తిని సేకరించాలి. అధిక దిగుబడి ఇచ్చే నాన్ బీటీ వెరైటీలలో పొడవు పింజ పత్తి విత్తన రకాలను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలి. ఇలాంటి ప్రయత్నం గతంలో గుంటూర్ జిల్లాలో కొందరు సామాజిక బాధ్యతతో ఆలోచించే రైతులు, శాస్త్ర వేత్తలు కలసి చేశారు. వారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండీ తగిన సహకారం అందలేదు.

తెలంగాణలో ఈ రబీ సీజన్ నుండీ అయినా పంటల బీమా పథకం ప్రవేశ పెట్టాలి. భారీ వర్షాలతో నష్టపోయిన కౌలు రైతులు సహా, రైతులందరికీ ప్రత్యేకించి ఈ సీజన్లో ఎకరానికి 20,000 రూపాయల నష్ట పరిహారం అందించాలి.

Tags:    

Similar News