‘విషవలయం’లో దోమడుగు విల్లేజ్ విలవిల...
నల్ల చెరువు.. గులాబీ రంగుకు మారిందేంటీ?
By : The Federal
Update: 2025-10-26 06:52 GMT
పాపని నాగరాజు (సత్యశోధక మహాసభ)
పర్యావరణం మన జీవనాధారం. కానీ, లాభాల పేరుతో పారిశ్రామిక కంపెనీలు దాన్ని ధ్వంసం చేస్తుంటే, అధికారులు మౌనంగా చూస్తుంటే, మనుషులు, పశువులు, ప్రకృతి అంతా బలవుతున్నాయి.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలం, దోమడుగు గ్రామంలోని నల్ల చెరువు, ఉమ్మనిగుంటలు ఈ కాలుష్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. హెటెరో డ్రగ్స్ కో. లిమిటెడ్ నుండి వెలువడుతున్న విషపూరిత వ్యర్థాలు ఈ చెరువులను గులాబీ రంగు విష సముద్రాలుగా మార్చేశాయి.
ఇటీవలి వర్షాల్లో ఈ కాలుష్యం మరింత తీవ్రమైంది, రైతులు నిరసనలు చేపట్టారు. ఈ సమస్య పర్యావరణ పరిరక్షణకు ఒక గట్టి విమర్శ, ప్రజలు తప్పకుండా పోరాడాలి. లేకపోతే మనుగడే ప్రమాదంలో పడుతుంది.
కాలుష్యం భయానక రూపం :
ఎయిర్‌ఫోర్స్ దుండిగల్ కాంపౌండ్ వాల్ కింది నుండి పెద్ద పైపుల ద్వారా హెటెరో డ్రగ్స్ యూనిట్-1 నుండి వ్యర్థాలు నల్ల చెరువులోకి ప్రవహిస్తున్నాయి. చెరువు నీరు పూర్తిగా గులాబీ రంగులో మారి, రసాయన పొర దట్టంగా కప్పబడి ఉంది.
కంపు ముక్కు పుట్టించే వాసన వల్ల ఒడ్డున ఎక్కువసేపు నిలబడటం కష్టం. చేపలు, కప్పలు, పాములు వంటి జీవులు ఏవీ లేవు - చెరువు నిర్జీవంగా మారింది. ఈ నీటిని తాగిన పశువులు పదుల సంఖ్యలో చనిపోయాయి. చనిపోయిన దూడల చర్మపు బొమ్మలు చెట్లకు వేలాడుతూ ఉండటం హృదయవిదారకం.
రైతులు చర్మ దద్దుర్లు, అలర్జీలు, కీళ్ల నొప్పులు, తల వెంట్రుకలు ఊడిపోవడం, గర్భ విచ్ఛిన్నం, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. భూగర్భ జలాలు కలుషితమై, ఆయకట్టు పొలాల్లో పంటలు పండటం లేదు.
పశువుల మేతగా వాడితే పాలు తగ్గిపోతున్నాయి. గొలుసుకట్టు చెరువులైన ఉమ్మనిగుంట, రాజనాల చెరువు, రాయిని చెరువులలోకి కూడా కాలుష్యం వ్యాపిస్తోంది, వందలాది ఎకరాల పంటలు నష్టపోతున్నాయి. గాలి కాలుష్యం కూడా ఇబ్బందులు కలిగిస్తోంది.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్లక్ష్యం, అవినీతి :
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (టీఎస్‌పీసీబీ) ఈ సమస్యపై పూర్తి నిర్లక్ష్యం చూపిస్తోంది. రైతులు ఎన్నో వినతులు ఇచ్చినా, ఒక్కసారి పిర్యాదు వచ్చినా చర్యలు లేవు, పరిశీలన కూడా చేయడం లేదు. అధికారుల డబ్బుకు కక్కుర్తి ఇందుకు ప్రధాన కారణం. ఫార్మా కంపెనీలు రాజకీయ పార్టీలకు డొనేషన్లు ఇస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి, ఇది అవినీతికి సంకేతం.
హెటెరో డ్రగ్స్ వంటి కంపెనీలు సస్టైనబిలిటీ రిపోర్టుల్లో పర్యావరణ రక్షణ చర్యలు చేపట్టామని చెబుతున్నా, వాస్తవంలో వ్యర్థాలను అనియంత్రితంగా విడుదల చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు మానవ ఆరోగ్యం కంటే లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఉద్యమకారులను పోలీసులతో అడ్డుకుంటున్నారు. సెప్టెంబర్ 2025లో కాంగ్రెస్ ఎమ్మెల్యే యూనిట్ తగలబెట్టేస్తానని హెచ్చరించిన తర్వాతే కొంత కదలిక వచ్చింది, కానీ అది ఆలస్యమైన చర్య మాత్రమే.
పర్యావరణ పరిరక్షణ:
ప్రజల పోరాటం అవసరం : పర్యావరణం కోసం, ప్రాణ రక్షణ కోసం ప్రజలు తప్పకుండా తపించాలి. లేకపోతే మనిషి మనుగడే ప్రమాదంలో పడుతుంది. ఈ కాలుష్యం నుండి బయటపడటం పెద్ద సవాలు, కానీ అసాధ్యం కాదు.
హెటెరో డ్రగ్స్ యూనిట్-1ను మూసివేయాలి, చెరువులను శుద్ధి చేయాలి, రైతులకు పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం, టీఎస్‌పీసీబీ స్పందించకపోతే ఉద్యమాలు బలపడాలి. రైతులు ‘‘అప్పటిదాకా ఉద్యమం కొనసాగిస్తాము’’ అని దృఢంగా చెబుతున్నారు.
పర్యావరణ పరిరక్షణ స్లోగన్ కాదు, అది మన భవిష్యత్తు. లాభాల కోసం ప్రకృతిని బలి ఇవ్వకూడదు. కంపెనీలు బాధ్యతలు నిర్వహించాలి, ప్రభుత్వం చట్టాలు అమలు చేయాలి. అప్పుడే దోమడుగు వంటి గ్రామాలు పచ్చదనంతో నిండుతాయి.
(వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు అన్ని రచయిత వ్యక్తిగతమైనవి. ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను గౌరవిస్తుంది. మేము భిన్నాభిప్రాయ వక్తీకరణకు వేదిక అని గుర్తించండి)