తెలంగాణలో ప్రజా సంఘాల కదలికలపై ఆంక్షలు
రేవంత్ పాలనలో సభలపై నిషేధాలు దేనికి సూచిక ?;
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల నిరసనలను ఆపడానికి, అప్పటి KCR ప్రభుత్వం, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను రద్దు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తొలి దశాబ్ద కాలం రాష్ట్ర ప్రజలు, ప్రజా సంఘాలు నిత్య నిర్బంధం లోనే జీవించవలసి వచ్చింది. పదేళ్ళ పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా ప్రజా సంఘాల కార్యకర్తలపై దాడులు చేస్తూ, వందల మందిపై UAPA కేసులు సహా , అనేక అక్రమ కేసులు బనాయించాయి. సభలపై ఆంక్షలు, ప్రజా సంఘాలపై నిషేధాలు, జిల్లాలలో ప్రజా సంఘాల కార్యకర్తల, నాయకుల ముందస్తు అరెస్టులు నిత్య కృత్యంగా మారాయి.
ఆనాడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను రద్దు చేసిన KCR ప్రభుత్వ నిర్బంధ విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్రంగా పోరాడారు. కోర్టుకు కూడా వెళ్ళారు. ప్రజల పోరాటాల ఫలితంగా, చివరికి కోర్టు తీర్పు ఫలితంగా ప్రజలు హైదరాబాద్ లో తమ నిరసన కేంద్రాన్ని కాపాడుకున్నారు. ప్రజలు BRS ప్రభుత్వాన్ని అధికారం నుండీ దించి, కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించడంలో ఈ అప్రజాస్వామిక పాలన ప్రధాన కారణంగా పని చేసింది.
ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నుండీ పెద్దగా నేర్చుకున్నదేమీ లేదు. అభయహస్తం మానిఫెస్టో లో ప్రజాస్వామిక పాలనా 7 వ గ్యారంటీగా ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం తొలి రోజుల లోనే దానిని ఉల్లంఘించి, కాలం గడుస్తున్న కొద్దీ మొత్తంగా KCR బాటలోనే నడుస్తున్నది. ఈ ప్రభుత్వ పాలనలో కూడాముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు , అక్కడి ప్రజా సంఘాల నాయకుల ముందస్తు అరెస్టులు నిత్య కృత్యంగా మారాయి.
ఇందిరాపార్క్ దగ్గర మాత్రమే కొన్ని ఆంక్షలతో నిరసనలకు అనుమతి ఇస్తూ, రాష్ట్రంలో ఇంకెక్కడా ప్రజలు సమావేశాలు జరుపుకోకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయకుండా నిషేధం విధిస్తున్నది.ఇటీవల ఉస్మానియా యునివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించి, సమావ్శం పెట్టిన రోజు కూడా క్యాంపస్ ను పోలీస్ బలగాలతో నింపేశారు. అడుగడుగునా బ్యారికేడ్లు పెట్టారు. ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం డిసెంబర్ లో మళ్ళీ ఉస్మానియా క్యాంపస్ కు వస్తానని, ఆ రోజు నిరసనలకు కూడా అనుమతిస్తానని ప్రకటించారు.
అంతకు కొద్ది రోజుల ముందే వరంగల్ లో ఆదివాసీ సంఘాల సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన సదస్సును పోలీసులు భగ్నం చేశారు. అక్కడికి వస్తున్న వాళ్ళను ముందస్తుగా అరెస్టులు చేశారు. నిజానికి అనేక మంది మేధావులతో పాటు, స్థానిక కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు కూడా ఆ సభలో ప్రసంగించవలసి ఉండింది.
ఆగస్ట్ 31 న జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద ధన్వాడ లో స్థానిక ఇథనాల్ కంపనీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవాలని అనుకున్న గ్రామాల అవగాహనా సమావేశాలను పోలీసులు భగ్నం చేశారు.
ఆ సమావేశానికి వెళుతున్న తెలంగాణా పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ( TPJAC) రాష్ట్ర కో కన్వీనర్ కన్నెగంటి రవి, కుల అసమానతల నిర్మూలనా వేదిక రాష్ట్ర కన్వీనర్ బండారి లక్ష్మయ్య, ఇంటలెక్చువల్స్ ఫోరం ఫర్ డెమాక్రసి (IFD) నాయకులు ప్రొఫెసర్ స్వామిదాస్, TPJAC నాయకులు, సామాజిక శాస్త్ర పరిశోధకులు రాజగోపాల్ సమావేశ స్థలానికి 20 కిలో మీటర్ల దూరంలోనే శాంతి నగర్ లో పోలీసులు అటకాయించి ప్రివెన్షన్ క్రింద అరెస్టు చేసి, గ్రామాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకుండా హైదరాబాద్ తిప్పి పంపారు.
గతంలో కూడా ఈ గ్రామాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన పౌర హక్కుల సంఘం నాయకులను, సిపిఎం పార్టీ నాయకులను అటకాయించిన విషయం చూశాం. స్థానికంగా పెద ధన్వాడ లో జరిగిన ఒక ఘటనను సాకుగా తీసుకుని, కంపనీ యాజమాన్యాన్ని కాపాడడానికి స్థానిక గ్రామాలకు చెందిన 40 మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఆ ఘటన జరిగిన రోజు స్థానికంగా లేని ప్రభుత్వ ఉద్యోగులను, జర్నలిస్టులను,టీచర్ లను కూడా కేసులో ఇరికించారు.
ప్రజల ఆందోళనల కారణంగా తాత్కాలికంగా ఆ గ్రామంలో కంపనీ నిర్మాణ పనులు ఆగాయి కానీ, భవిష్యత్తులో తిరిగి పనులు మొదలవుతాయని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు ఏకపక్షంగా ప్రకటించిన విషయం చూశాం. తాజాగా ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసిన శాంతి నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా, ప్రజలు ఎంత ఆందోళనలు చేసినా, ప్రజా సంఘాలు ఎంతగా అడ్డుపడ్డా, కంపనీ నిర్మాణం పూర్తి అవుతుందని, ఎవ్వరూ ఆపలేరని ఘంటా పథంగా చెబుతున్నాడంటే, ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టమవుతుంది.
అభయహస్తం మానిఫెస్టో లో ఫార్మా సిటీ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం , గత ఏడాది కాలంగా ఇచ్చిన హామీని మర్చిపోయి, స్థానిక ప్రజలపై కేసులు పెడుతూ , గ్రామాలలో ప్రజలు సమావేశాలు పెట్టుకోనీయకుండా అడ్డుపడుతూ, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ అక్కడి ప్రజల హక్కులను ఎలా కాలరాస్తుందో చూస్తూనే ఉన్నాం.
భూసేకరణ పేరుతో వికారాబాద్ జిల్లా లగచర్లలో స్థానిక గ్రామస్తుఅలపు సాగించిన పోలీసు దౌర్జన్యాన్ని కూడా చూశాం. ఆ ప్రజలను పరామర్శించడానికి వెళుతున్న మహిళా, ట్రాన్స్ జండర్ సంఘాల నాయకులను అడ్డుకున్న తీరును కూడా చూశాం. తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగపడని ప్రపంచ అందాల పోటీల నిర్వహణ సందర్భంగా , అడ్డు పడిన మహిళా సంఘాల నాయకులపై సాగించిన నిర్బంధాన్ని, మహిళా సంఘం నాయకురాలు వి.సంధ్యపై గృహ నిర్బంధం విధించడాన్ని కూడా చూశాం.
ఇటీవల ఉస్మానియా యునివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ, KCR ప్రభుత్వ హయంలో ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులు పగల గొట్టిన విషయాన్ని ప్రస్తావించి, “సార్ పెద్ద మనిషిగా చూస్తూ ఊరుకున్నాడు కానీ, నేనైతే వాళ్ళ చెంపలు పగలగొట్టేవాడిని“ అని ప్రకటించాడు. ఇదే సూత్రం నిజమని ప్రజలు భావిస్తే, గత ఏడాదిన్నరగా ప్రజల ప్రజాస్వామిక హక్కులను పోలీసులను ఉపయోగించి కాల రాస్తున్న రేవంత్ ప్రభుత్వ చెంపలను ప్రజలు ఎన్నిసార్లు పగల కొట్టాలి ?
అంతెందుకు, ప్రొఫెసర్స్ హరగోపాల్ , పద్మజా షా, ఖాసిం లతో పాటు, ఇతర ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన UAPA కేసులను సమీక్షిస్తామని పౌర సమాజ సభ్యులతో మొదటి సమావేశంలోనే హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇంతవరకూ ఆ పని చేయలేక పోయినందుకు ఎవరి చంపలు పగలగొట్టాలి? తెలంగాణా పౌర సమాజ పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ ప్రజల దీక్షలను బలపరచడానికి మల్లారం గ్రామానికి వెళుతుండగా మార్గ మధ్యం లోనే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టినందుకు ఎవరి చెంపలు పగల గొట్టాలి ? జిల్లాలలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడానికి ఉపయోగించుకునే సెక్షన్ ౩౦, 14 4 లను ఇప్పటికీ తొలగించకుండా కొనసాగిస్తున్నందుకు ఎవరి చెంపలు పగలగొట్టాలి?
KCR ప్రభుత్వ తరహాలో, ప్రజల హక్కుల విషయంలో, ప్రజా సంఘాల ఇలా నిర్బంధ పూరితంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం, సంఘ్ పరివార్ మూకలు వరంగల్ లో రచయితలపై దాడి చేసి నప్పుడు కేసులు ఎందుకు పెట్టలేదు? ఆదిలాబాద్ జిల్లాలో సంఘ్ మూకలు రెచ్చగొడితే, ముస్లిం ప్రజల దుకాణాలను తగలబెట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు? బక్రీద్ పండగ సందర్భంగా ముస్లిం వాహన యజమానులపై హిందుత్వ మూకలు దాడి చేసి కొడితే ఎందుకు కేసులు పెట్టలేదు ? రాష్ట్ర వ్యాపితంగా హిందుత్వ శక్తులు చర్చీలపై దాడులు చేసి బెదిరిస్తుంటే , వారిపై కేసులు ఎందుకు పెట్టడంలేదు? కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపై, కొన్ని కుల దురహంకార శక్తులు దాడులు చేసి హత్యలు చేస్తుంటే, వారి విషయంలో ఈ ప్రభుత్వం కటినంగా ఎందుకు ఉండడం లేదు?
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, పారిశ్రామికీకరణ, కొత్త నగరాల అభివృద్ధి, రింగు రోడ్లు పేరుతో, ప్రజల నుండీ భూములు లాక్కుంటూ, కాలుష్య కారక పరిశ్రమలు మాకొద్దు అంటే, ప్రజలపై నిర్బంధాలు ప్రయోగిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఎల్లా కాలం సాగదు. బీజేపీ ని వ్యతిరేకిస్తున్న పౌర సమాజ సంస్థలు అనివార్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తాయనుకుంటే కుదరదు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన అభివృద్ధి నమూనాను సవరించుకోవాలి. దానిపై పౌర సమాజంతో చర్చలు జరపాలి. ప్రజల ప్రజాస్వామిక హక్కులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. రాష్ట్రంలో పెరుగుతున్న హిందుత్వ ఫాసిస్టు శక్తులను అడ్డుకోవడానికి ప్రజా సంఘాలతో, పౌర సమాజంతో కలసి పని చేయాలి. ఇందుకు భిన్నంగా పోతే దానిని రాహుల్ గాంధీ ఆలోచనలతో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనరు. మోదీ మార్గదర్శకత్వంలో నడుస్తున్న రేవంత్ ప్రభుత్వం అంటారు.
వెనక్కు తిరిగి చూసుకోండి ఒకసారి..