తెలంగాణకు వస్తున్న పెట్టుబడులతో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయా?
పరిశ్రమలకు రైతుల భూములు తీసుకున్నాక స్థానికులకు ఉద్యోగాలువచ్చాయా, బయట వాళ్లకయినా వచ్చాయా? ప్రభుత్వం దగ్గిర లెక్కలున్నాయా?;
పారిశ్రామిక, సేవా రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రానికి చాలా కాలంగా అనేక పరిశ్రమలు, సంస్థలు వస్తున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఈ ట్రెండ్ కొనసాగుతున్నది. పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఆయా ప్రభుత్వాలు విధానాలను రూపొందించడమే ఇందుకు కారణం.
ఉచితంగా లేదా తక్కువ ధరలకు భూమి కేటాయింపు, రాయితీపై విద్యుత్ సరఫరా, ఆయా పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పన్నులలో రాయితీ, కార్మిక చట్టాల అమలు నుంచి మినహాయింపు లాంటి అనేక చర్యలను ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఆయా పారిశ్రామిక ప్రాంతాలలో కొన్ని పరిశ్రమలు,సంస్థలు వచ్చినా, వాటిలో స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించాయా అన్నది ఒక ప్రశ్న యితే, స్థానికంగా భూమీ , నీరు లాంటి సహజ వనరులను ఉపయోగించుకుంటున్న ఆ పరిశ్రమలు, సంస్థలు విష కాలుష్యాన్ని రాష్ట్రంలో ఎంత వెదజల్లాయన్నది మరో ప్రశ్న.
పారిశ్రామికీకరణ పేరుతో రైతుల నుండి వేలాది ఎకరాలను సేకరించి, పరిశ్రమలకు కేటాయించిన ప్రభుత్వాలు, భూసేకరణ కారణంగా గ్రామీణ ప్రాంతాల మధ్య ఏర్పడిన ఆయా పారిశ్రామిక వాడల చుట్టూ వ్యవసాయం మాయమవడం గురించి, పరిశ్రమల కారణంగా గాలిలో ఉద్గార వాయువులు పెరిగి, వాతావరణం వేడెక్కడం గురించి, వ్యవసాయంపై, పశువుల పోషణ పై ఆధారపడిన వేలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోవడం గురించి ఎప్పుడూ చర్చించవు. అధ్యయనం చెయ్యవు. నిజంగా స్థానిక ప్రజలు కోల్పోయిన ఉపాధికు అనుగుణంగా స్థానికులకు, లేదా బయట వాళ్లకయినా ఎంత మందికి ఉద్యోగ,అవకాశాలు లభించాయన్నది ప్రభుత్వం దగ్గర గణాంకాలు లేవు. ఏ కంపనీలో ఎవరు పని చేస్తున్నారు, ఎంత మంది పని చేస్తున్నారు, అందులో స్థానికులు ఎంత మంది అనే వివరాలు కూడా పరిశ్రమల శాఖ దగ్గర, లేదా కార్మిక శాఖ దగ్గర లేవు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారమే, 2014-2015 నుండీ 2024-2025 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 27,095 పరిశ్రమలు, సంస్థలు నెలకొల్పారు. వీటిలోకి 2,98,686,83,00,000 రూపాయలు పెట్టుబడి గా వచ్చింది. వీటిలో 18,77,875 మందికి ఉద్యోగాలు లభించాయి. సగటున ఒక్కో సంస్థ 69 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు అనిపిస్తుంది. కానీ, రాష్ట్రం లోకి వస్తున్న ప్రతి కోటి రూపాయల పెట్టుబడికీ ఎంత మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయో పరిశీలించాలి.
2023 డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కొనసాగుతున్న రాష్ట్ర అభివృద్ధి నమూనా గురించి, అందులో ఉన్న సమస్యల గురించి ఎటువంటి చర్చలు, చేయకుండానే, పాత BRS ప్రభుత్వ ఒరవడి లోనే 2024, 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలలో వివిధ కంపనీలతో ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది.
2024 WEF సమావేశాలు దావోస్ లో జనవరి 2024 లో జరిగాయి. ఈ సమావేశాలలో తెలంగాణ ప్రభుత్వం సుమారు ₹40,232 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పెట్టు బడులు గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఏరోస్పేస్, ఫార్మా స్యూటికల్స్ రంగాలలోకి వస్తున్నాయి.
ఈ ఒప్పందాల ప్రకారం అదానీ గ్రూప్ (Adani Group) రాష్ట్రంలో ₹12,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది(వివరాలు: గ్రీన్ ఎనర్జీ (1,350 MW పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లు - ₹5,000 కోట్లు), డేటా సెంటర్లు (100 MW కెపాసిటీ - ₹5,000 కోట్లు), సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ (₹1,400 కోట్లు), ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ (కౌంటర్-డ్రోన్ సిస్టమ్స్, మిసైల్ డెవలప్‌మెంట్ - ₹1,000 కోట్లు). ఈ సంస్థలలో సుమారు 2,000+ ఉద్యోగాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. JSW నియో ఎనర్జీ (JSW Neo Energy) రాష్ట్రంలో ₹9,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.(వివరాలు: పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్) సుమారు 1,500+ ఉద్యోగాలు ఇవ్వనుంది. మరో కంపెనీ వెబ్ వర్క్స్ (Web Werks). ₹5,200 కోట్లు పెట్టుబడి పెట్టింది.(వివరాలు: 10 MW నెట్‌వర్కింగ్-హెవీ డేటా సెంటర్, హైదరాబాద్) 500 కు పైగా ఉద్యోగాలు కల్పించనుంది.
గోద్రెజ్ ఇండస్ట్రీస్ (Godrej Industries) ₹1,270 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. (వివరాలు: ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ( ₹270 కోట్లు) మరియు కెమికల్ ప్లాంట్ (₹1,000 కోట్లు). ఈ కంపనీలలో సుమారు 1000కి పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. అరగాన్ లైఫ్ సైన్సెస్ (Aragen Life Sciences) ₹2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది(వివరాలు: ఫార్మా స్యూటికల్ రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్). ఈ సంస్థలో 500 కు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. GODI ఇండియా (GODI India Pvt Ltd) ₹8,000 కోట్ల పెట్టుబడి పెట్ట నుంది. (వివరాలు: ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్.)1000 కి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంటే 2024 ఒప్పందాల ప్రకారం రాష్ట్రంలో పెట్టుబడి మొత్తం ₹40,232 కోట్లతో 7,500 కు పైగా (ప్రత్యక్షంగా) ఉద్యోగాలు వస్తాయన్న మాట.
2025 సంవత్సర WEF సమావేశాలు దావోస్ లో జనవరి 20-24 తేదీల్లో జరిగాయి. ఈ సమావేశాలలో కూడా తెలంగాణ ప్రభుత్వం "తెలంగాణ రైజింగ్" నినాదంతో ₹1,78,550 కోట్ల విలువైన పెట్టుబడులతో 20 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులు పూర్తిగా డేటా సెంటర్లు, పంప్ స్టోరేజ్, మరియు ఇతర రంగాలలోకి వస్తున్నాయి. ఈ పెట్టుబడి ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో కొత్తగా 49,550 ఉద్యోగాలు వస్తాయని అంచనా.
2025 సంవత్సర ఒప్పందాలలో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సంస్థ ₹60,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. (వివరాలు: డేటా సెంటర్ల ఏర్పాటు), 15,000 కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సన్ పెట్రోకెమికల్స్ (Sun Petrochemicals) సంస్థ ₹45,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ( వివరాలు: ఎనర్జీ ప్రాజెక్ట్‌లు (వివరాలు ఇంకా స్పష్టంగా తెలియదు). ఈ సంస్థలలో 10,000 కు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా.
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) కూడా ₹15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది(వివరాలు: పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (2160 MW - ₹11,000 కోట్లు ),బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS, 1,000 MWh - ₹3,000 కోట్లు),లగ్జరీ వెల్‌నెస్ రిసార్ట్ (అనంతగిరి వద్ద - ₹1,000 కోట్లు) ఈ సంస్థలలో 7,250 కు పైగా ఉద్యోగాలు కల్పిస్తారు (ప్రత్యక్షంగా 4,250, పరోక్షంగా 3,000)
అదానీ గ్రూప్ (Adani Group), ₹11,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది(ఇది పూర్తిగా కొత్త ఒప్పందం) (వివరాలు: అదనపు పంప్డ్ స్టోరేజ్ మరియు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు). ఈ సంస్థలలో 2,500 కు పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. .
ఇతర కంపెనీలు (సామూహికంగా) ₹47,050 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి (వివరాలు : డేటా సెంటర్లు, హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో 16 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో కొన్ని కంపెనీలు: టాటా టెక్నాలజీస్, గోద్రేజ్, బీఎల్ ఆగ్రో, సర్జికల్ హోల్డింగ్స్, ఇన్నోవెరా ఫార్మా, ఒ9 సొల్యూషన్స్ మొదలైనవి). ఈ సంస్థలలో 14,800 కు పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంటే, 2025 లో చేసుకునే ఒప్పందాల ద్వారా మొత్తం ₹1,78,550 కోట్ల పెట్టుబడితో 49,550 ఉద్యోగాలు(ప్రత్యక్షంగా)వస్తాయని అంచనా. అంచనా.
2024లో ₹40,232 కోట్ల పెట్టుబడులతో సుమారు 7,500+ ఉద్యోగాలు, 2025 లో ₹1,78,550 కోట్ల పెట్టుబడులతో 49,550 ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు జరిగాయన్న మాట. ఒప్పందాలు జరిగినట్లుగా నిజంగా 2,18,782 కోట్ల పెట్టుబడులు వస్తే మొత్తం ఆయా సంస్థలు కల్పించే ఉద్యోగాలు 57,050 ఉద్యోగాలు మాత్రమే.
రాష్ట్రంలోకి ఈ పెట్టుబడులు నిజంగా వస్తాయా? ప్రభుత్వం ఆశించినట్లుగా ఆయా కంపెనీలను, సంస్థలను నెలకొల్పుతారా? ఒక వేళ వాటిని నెలకొల్పిన స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయా? ఎలాంటి ఉద్యోగాలు అవి? తాత్కాలికంగానా? పర్మినెంటు స్వభావం కలిగిన ఉద్యోగాలా? ఈ సంస్థలలో పని చేసే కార్మికులకు, ఉద్యోగులకు కార్మిక చట్టాలు అమలవుతాయా ? ఈ సంస్థలపై, కంపనీలపై కార్మిక శాఖకు తనిఖీ అధికారం ఉంటుందా ? ఇవన్నీ ప్రశ్నలే. అందుకే కేవలం పత్రికా విలేకరుల సమావేశంలో అట్టహాసపు ప్రకటనలు చేయడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపనీలతో, సంస్థలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను (MOUs) ప్రజల ముందు ఉంచాలి. ఈ ఒప్పంద పత్రాలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి కూడా తీసుకు రావాలి.
హైదరాబాద్ పక్కన ఫ్యూచర్ సిటీ నిర్మాణమవుతోంది. ఈ సిటీ లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI – కృత్రిమ మేధ ) సిటీ 200 ఎకరాలలో నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కృత్రిమ మేధలో పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలే లక్ష్యంగా ఏఐ సిటీ రూపుదిద్దుకుంది. కృత్రిమ మేధ మీద ఆసక్తి ఉండటం తప్పు కాదు కానీ, రాష్ట్రంలో పరిశోధించి, అమలు చేసే కృత్రిమ మేధ లక్ష్యం ఏమిటి ?
ప్రపంచ వ్యాపితంగా కృత్రిమ మేధ ను పరిశోధిస్తున్న సంస్థలు, ఆ ఆవిష్కరణలను ఉపయోగించుకున్న వాణిజ్య సంస్థలు, కంపనీల లక్ష్యం వేరు. అవి ప్రధానంగా తమ సంస్థల నుంచి ఉద్యోగులను, కార్మికులను పని నుండి తొలగించడానికి ఆధునిక యంత్రాలు, రోబోటిక్స్,, కృత్రిమ మేధను ఉపయోగించుకుంటున్నాయి. కృత్రిమ మేధ ఆధారిత ప్రత్యేక సిటీ నిర్మాణం చేయాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, రానున్న రోజుల్లో ఈ కృత్రిమ మేధ సృష్టించబోయే దుష్పరిణామాల గురించి ఆలోచిస్తున్నదా లేదా అన్న అనుమానం కలుగుతున్నది.
2022-2025 ల మధ్య కాలంలో అమెరికాలో కొన్ని ప్రముఖ కంపనీలలో ఉద్యోగుల తొలగింపు భారీగా సాగింది. దీనికి ఆర్ధిక మాంద్యం ఒక కారణమైతే, కృత్రిమ మేధ, రోబోటిక్స్ కూడా ప్రధాన కారణాలుగా పని చేస్తున్నాయి.
అమెజాన్ (Amazon) సంస్థ 2022లో 10,000 మందిని, 2023లో 18,000 మందిని (జనవరి లో 8,000, మార్చి లో 9,000, మరియు నవంబర్ లో కొన్ని వందల మందిని ) తొలగించింది. 2024-2025 లో కోవా ఉద్యోగులను తగ్గించింది. (ఉదా., Buy with Prime, Audible విభాగాల్లో 30-100 మందిని). ఈ కోతలు ప్రధానంగా కార్పొరేట్, AWS, మరియు ఫిజికల్ స్టోర్ విభాగాల్లో జరిగాయి. కారణం: ఖర్చుల తగ్గింపు, పెరిగిన ఆటోమేషన్.
మెటా (Meta) సంస్థ 2022లో 11,000 మందిని (13 శాతం వర్క్‌ఫోర్స్), 2023 లో 10,000 మందిని (జనవరి లో 4,000, మే లో 6,000) తొలగించింది. 2025 లో 3,600 మందిని (5శాతం వర్క్‌ఫోర్స్) తొలగించారు. కారణం: "సామర్థ్య సంవత్సరం" పేరుతో ఖర్చు తగ్గింపు మరియు AI పెట్టుబడులపై దృష్టి.
మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ 2023 లో 10,000 మందిని (5 శాతం వర్క్‌ఫోర్స్ ), జులై లో 1,000 మందిని(సేల్స్, కస్టమర్ సర్వీస్), 2024లో 1,500 మందిని (Azure విభాగం)తొలగించింది. , 2025లో కూడా మరో 2,200 మందిని ( 1 శాతంవర్క్‌ఫోర్స్) తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కారణం: ఆర్థిక ఒత్తిడి మరియు AI ఆధారిత రీస్ట్రక్చరింగ్.
గూగుల్ (Google/Alphabet) సంస్థ కూడా 2023లో 12,000 మందిని (6 శాతం వర్క్‌ఫోర్స్), 2024 లో వందల సంఖ్యలో (సేల్స్, ఇంజనీరింగ్, Google Assistant టీమ్స్ ) సిబ్బందిని తొలగించింది. ఇందుకు కారణం: AI పెట్టుబడులు మరియు సంస్థాగత సామర్థ్యం కోసం "లేయర్ తొలగింపు".
సేల్స్‌ఫోర్స్ (Salesforce) సంస్థ 2023లో 7,900 మందిని ( 10 శాతం వర్క్‌ఫోర్స్ ), 2024 లో సుమారు 700-1,000 మందిని ( సుమారు 1 శాతం) తొలగించింది.
ఇంటెల్ (Intel) సంస్థ 2024 లో 15,000 మందిని (వర్క్‌ఫోర్స్‌లో పెద్ద భాగం) తొలగించింది. 2022 లో కూడా వర్క్ ఫోర్స్ లో 20 శాతం (సుమారు22,000) మందిని తొలగించినట్లు X పోస్ట్‌లలో ఉండగా, అధికారిక నివేదికలు మాత్రం 15,000 మందిని తొలగించినట్లు ధృవీకరిస్తున్నాయి. ఇందుకు కారణం : AI చిప్ మార్కెట్‌లో పోటీ మరియు ఆర్థిక ఒత్తిడి.
టెస్లా (Tesla) సంస్థ 2024లో 14,000 మందిని (10 శాతం వర్క్‌ఫోర్స్ ) తొలగించింది. ఇందుకు కారణం ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ తగ్గుదల, ఖర్చు తగ్గింపు.
సిస్కో (Cisco) సంస్థ 2024లో 10,000 మందిని (నెట్‌వర్కింగ్ విభాగం) తొలగించింది. ఇందుకు కారణం మార్కెట్ డిమాండ్‌లో మార్పులు మరియు కాస్ట్-కట్టింగ్.
వాల్‌మార్ట్ (Walmart) 1,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. 2023 లో 1,042 మంది (స్టోర్ మూసివేతలు), 2024-2025లో కొన్ని వందల మందిని తొలగించారు. దీనికి కారణం రిటైల్ స్టోర్స్ మూసివేతలు, ఈ-కామర్స్‌పై దృష్టి.
ఫోర్డ్ (Ford) లో 4,100 కు పైగా ఉద్యోగులను తొలగించారు. 2022 లో 3,000 మందిని, 2023 లో UAW స్ట్రైక్ సమయంలో 1,100 మందిని తొలగించారు. కారణం: ఎలక్ట్రిక్ వాహనాలకు మార్పు
ఈ ప్రముఖ కంపెనీలు అన్నీ కలిపి 2022-2025 మధ్య సుమారు 1,00,000 కంటే ఎక్కువ మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. టెక్ రంగంలోనే 2023లో 2,60, 000 మంది, 2024 లో 95,000 మంది, 2025లో (మార్చి వరకు) 24,000 మంది తొలగించబడ్డారని Layoffs. fyi వంటి ట్రాకర్‌లు సూచిస్తున్నాయి.
ఈ సంఖ్యలు అంచనాలు, బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఖచ్చితమైన డేటాను వెల్లడించకపోవచ్చు,
తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ సంస్థ 60,000 కోట్ల పెట్టుబడులు పెడతాను అని ప్రకటించినందుకు చంకలు గుద్దుకుంటున్న ప్రభుత్వం, అమెజాన్ తన వ్యాపార విస్తరణ లో భాగంగా ఏమి చేస్తుందో కూడా ప్రజలకు చెప్పాలి.
అమెజాన్ తన వేర్‌హౌస్‌లు, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో ఆటోమేషన్ టెక్నాలజీని భారీగా అమలు చేస్తోంది. అమెజాన్ 2012లో Kiva Systems ని కొనుగోలు చేసిన తర్వాత, దాని రోబోట్లను వేర్ హౌస్‌లలో వస్తువులను తరలించడానికి, ఆర్డర్ పికింగ్‌ను వేగవంతం చేయడానికి ఉపయోగిస్తోంది. 2023 నాటికి, అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 7,50,000 కంటే ఎక్కువ రోబోట్లను ఉపయోగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.ఈ రెండేళ్లలో మరిన్ని పెరిగి ఉంటాయి.
ఇన్వెంటరీ నిర్వహణ, డిమాండ్ అంచనా, మరియు లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ కోసం అమెజాన్ AI మరియు మెషిన్ లెర్నింగ్ ని విస్తృతంగా వాడుతోంది.
అమెజాన్ ఇండియాలో తన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. 2021లో చెన్నైలో Fire TV స్టిక్‌ల తయారీ కోసం ఒక మాన్యుఫాక్చరింగ్ లైన్‌ను ప్రారంభించింది, ఇది Foxconn తో భాగస్వామ్యంతో నడుస్తోంది.
ఇండియాలో అమెజాన్ తన "క్విక్ కామర్స్" సేవలను విస్తరించడానికి "డార్క్ స్టోర్స్" (Dark Stores) అనే చిన్న ఆటోమేటెడ్ వేర్ హౌస్‌లను స్థాపిస్తోంది. 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో "Tez" అనే క్విక్ కామర్స్ సర్వీస్‌ను ప్రారంభించాలని అమెజాన్ ప్లాన్ చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. Blinkit, Zepto వంటి సంస్థలతో పోటీ పడేందుకు అమెజాన్ ప్రయత్నిస్తోంది.
ఈ డార్క్ స్టోర్స్ ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం రోబోటిక్స్ మరియు AIని ఉపయోగిస్తాయి, కానీ ఇవి ఉత్పత్తి కంటే డెలివరీ పై దృష్టి పెడతాయి.
అయితే, డార్క్ స్టోరీస్ మరియు డార్క్ ఫ్యాక్టరీలు భిన్నమైనవి. డార్క్ స్టోర్స్ ఆర్డర్‌లను నిల్వ చేసి, పంపిణీ చేసేందుకు ఉపయోగపడితే, డార్క్ ఫ్యాక్టరీలు వస్తువులను తయారు చేస్తాయి. అమెజాన్ ప్రస్తుతం ఇండియాలో డార్క్ స్టోర్స్‌పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది, కానీ డార్క్ ఫ్యాక్టరీల గురించి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు.
అమెజాన్ రోబోటిక్స్ మరియు AI లో పెడుతున్న పెట్టుబడులు(ఉదా., Amazon Robotics, AWS) భవిష్యత్తులో డార్క్ ఫ్యాక్టరీల వంటి సాంకేతికతలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని సూచిస్తాయి. అమెజాన్ ఇప్పటికే తన కొన్ని ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో "లైట్స్-స్పార్స్" వాతావరణాన్ని అమలు చేస్తోంది, ఇక్కడ కొన్ని భాగాలు పూర్తిగా ఆటోమేటెడ్‌గా నడుస్తాయి.
అమెజాన్ ఇప్పటికైతే ఒక ఈ-కామర్స్ మరియు టెక్ కంపెనీగా ఉంది. సాంప్రదాయ తయారీ సంస్థ కాదు. దాని దృష్టి ఉత్పత్తి కంటే డిస్ట్రిబ్యూషన్, సర్వీస్ లపై ఉంది దాని ఆటోమేషన్ సామర్థ్యాలు మరియు ఇండియాలో పెరుగుతున్న పెట్టుబడులను బట్టి, భవిష్యత్తులో డార్క్ ఫ్యాక్టరీ లాంటి సాంకేతికతల వైపు అడుగులు వేయడం అసాధ్యం కాదు. ఒకవేళ అమెజాన్ ఇండియాలో తయారీని విస్తరించాలనుకుంటే,"Make in India" పథకం కింద ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఇవేమీ పట్టించుకోకుండా , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో, కృత్రిమ మేధ పేరుతో గుడ్డిగా ముందుకు వెళ్లడం అత్యంత ప్రమాదకరం. ప్రస్తుత అభివృద్ధి నమూనాలో కంపెనీలకు లాభాలు తప్ప, మనుషులు/ కార్మికులు, వారి సంక్షేమం ఎంత మాత్రమూ లేదని కంపనీలు స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. ఆచరణలో అలా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల నుండి వ్యవసాయ భూములను లాక్కుని , కంపెనీలకు కట్టబెట్టి నంత మాత్రాన యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావించడం అత్యాశే అవుతుంది.