తెలంగాణ: గిరిజన భాషల హరివిల్లు

నేడు ప్రజాకవి కాళోజీ జన్మదినం, తెలంగాణ భాషా దినోత్సవం;

Update: 2025-09-09 07:38 GMT

రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న గిరిజనులు సుమారు 10 భాషలు మాట్లాడుతున్నారు


తెలంగాణ రాష్ట్ర గిరిజన జనాభా మొత్తం రాష్ట్ర జనాభాలో దాదాపు 10 శాతం ఉంటుంది. ఈ 10 శాతం గిరిజన జనాభానే భాషా వైవిధ్యాన్ని వెల్లడిస్తుంది. ఏ జాతి నిలకడగా కొనసాగాలన్నా భిన్నత్వం చాలా అవసరం.

భిన్నత్వాన్ని ప్రకటించే ఒక ప్రధాన అంశం భాష. రాష్ట్ర జనాభాలో 10 శాతంగా ఉన్న గిరిజనులు సుమారు 10 భాషలు మాట్లాడుతున్నారు. మిగతా 90 శాతం ప్రజలు కేవలం ఐదు భాషలే మాట్లాడుతున్నారు. గిరిజన భాషలు ఇవి: గోండి, కోయ, కొలామి, నాయక్డి, చెంచు, కైకాడి (ఎరుకల), లంబాడి, నక్కల, కొండ కమ్మర, మరాఠీ.

గోండి దేశంలో అత్యధికంగా మాట్లాడబడే గిరిజన భాష. ఎందుకంటే గోండ్లు అనేక మధ్య భారత రాష్ట్రాలలో విస్తరించారు. గోండి అత్యంత పురాతన గిరిజన భాషల్లో ఒకటి. పండితుల అభిప్రాయం ప్రకారం భారత ఉపఖండంలోని మొదటి గిరిజనులు గోండులేనని చెబుతారు. అందువల్ల భారత ఉపఖండాన్ని గోండ్వానా అని కూడా పిలిచారు. వారు స్వేచ్ఛా ప్రియులు, స్వతంత్రులు. తమ స్వంత ప్రాంతాల్లో స్వయం పాలన చేసుకున్నారు. వారిపై బయటి శక్తుల నుండి ముప్పు వచ్చినప్పుడు వ్యతిరేకించారు. రాంజీ గోండు, కుమ్రమ్ భీమ్ వంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు గోండులలోనే పుట్టారు. ఈ చారిత్రక సంగతులను గోండులపై ఆధారపడే తోటి అనే గిరిజనులు ‘కీక్రి’ అనే సంగీత వాద్యంతో పాడుతుంటారు. అలాగే మరో ఆశ్రిత సమాజమైన పర్ధాన్ లు కూడా వీరి చరిత్రను వర్ణిస్తారు.

పర్ధాన్లు రాష్ట్రంలో బాగా చదువుకున్న గిరిజన సమాజం. కానీ వీరి మాతృభాష మరాఠీ. అలాగే ఆంధులు కూడా మరాఠీ మాట్లాడతారు. అంధ్ అనే పదం సంస్కృతంలో ఆంధ్ర అవుతుంది. ఆంధ్ర సాతవాహన వంశం 2000 ఏళ్ల క్రితం జాతీయ స్థాయిలో మొదటి సామ్రాజ్యాన్ని కోటిలింగాల (జగిత్యాల జిల్లా) వద్ద స్థాపించింది. వారి శాసనాలు మహారాష్ట్ర ప్రాకృతంలో లభించాయి. నేటికీ తెలంగాణలో (పూర్వ ఆదిలాబాద్ జిల్లా) నివసిస్తున్న ఆంధులు మరాఠీ మాట్లాడుతున్నారు. కాబట్టి మరాఠీ భాషకు తెలంగాణలో కూడా మూలాలు ఉన్నాయని చెప్పవచ్చు.

కొలామి భాష ఆసక్తికరమైనది. ఎందుకంటే ఇది సింధు లోయ నాగరికత లిపితో సంబంధముందని పండితులు భావిస్తున్నారు. పదివేల ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. కొలామి పదాలు తెలుగు భాష పదాలకు చాలా దగ్గరగా ఉంటాయి. పి.ఎస్. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ పండితుడు నాయక్డి, మహారాష్ట్రలోని చందా జిల్లాలోని నాయకి వంటి గిరిజన భాషలు కొలామి యొక్క ఉపభాషలేనని అభిప్రాయపడ్డారు. అయితే ఇవన్నీ నశించే ప్రమాదంలో ఉన్నాయి.

కోయలలో బాష కోయలు అనే చిన్న వర్గం మాత్రమే కోయ భాష మాట్లాడతారు. పెద్ద మొత్తంలో ఉన్న కోయలు (90–95%) తమ భాషను మరచిపోయి, తెలుగు మాతృభాషగా మాట్లాడుతున్నారు.

చెంచులు కూడా తమ భాషను మరచిపోయారు. ప్రొఫెసర్ హైమెండార్ఫ్ చెబుతున్నట్లుగా వారు ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నారు.

ఎరుకల (కైకాడి), నక్కల, కొండ కమ్మరలు ఎక్కువగా దక్షిణ, ఉత్తర ప్రాంతాల నుండి వలస వచ్చి తమ తమ భాషలు మాట్లాడుతున్నారు. వీరి భాషలలో ద్రావిడ మూల పదాలు కనిపిస్తాయి. లంబాడీలు కొన్ని శతాబ్దాల క్రితం వలస వచ్చారు కానీ తమ భాషను నిలబెట్టుకున్నారు.

తెలంగాణలోని గిరిజనులు తమ చరిత్రను, వంశగాథలను పాటల ద్వారా తరతరాలకు అందిస్తున్నారు. ఈ విధంగా గిరిజనుల భాషా వైవిధ్యం కాపాడితే భవిష్యత్ తరాలకు అందుతుంది.

ప్రొఫెసర్ హైమెండార్ఫ్ 1940లలో గోండి సంస్కృతిని నిలబెట్టేందుకు గోండి వాచకాలను రూపొందించారు. ఇటీవల కాలంలో రాష్ట్ర గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ కూడా ప్రధాన గిరిజన భాషలన్నింటిలో పాఠ్యపుస్తకాలను రూపొందించి భాషల పరిరక్షణకు కృషి చేస్తున్నది.



Tags:    

Similar News