హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక దేశ ద్రోహులకు, దేశ భక్తులకు మధ్య పోటీయా

బండి సంజయ్ వ్యాఖ్యలతో ఆసక్తికరంగా మారిన హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు....;

Update: 2025-04-07 02:30 GMT
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈనెల 25 న పోలింగ్ జరగనుండగా ఎంఐఎం కు పోటీగా బీజేపీ రంగంలో దిగింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతమ్రావును అధిష్ఠానం ప్రకటించింది. బీజేపీ తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు.ఎంఐఎం తరపున రెండోసారి మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ వేశారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్ వేసినా బలం లేదని తెలిసీ బీజేపీ ఆ స్థానానికి పోటీ చేయటం వెనుక ఆంతర్యం ఎవరికీ అంతుబట్టడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయకుండా దూరంగా వున్నాయి. ఎంఐఎం మిత్ర పక్షం కాబట్టి దానికి కాంగ్రెస్ మద్దతిస్తోంది. ఎలాగు బలం లేదు కదాఅని బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఎంఐఎం ఏకగ్రీవంగా గెలవాల్సిన ఆ స్థానంలో పోటీకి దిగి చూస్తూ వుండండి మేమే గెలుస్తాం అంటూ బీజేపీ నేతలు చెప్పడమే ఈ ఎన్నికల వైపు అందరూ దృష్టి సారించేలా చేస్తోంది. జరిగేది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు , అంటే ఇందులో హైదరాబాద్ పరిధిలో వున్న కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటు హక్కు వుంటుంది. అంటే ఎంత చూసినా ఓటర్లు అటూ ఇటుగా నూట పదిహేను మంది కన్నా ఎక్కువ గా వుండరు. అలాంటి ఎన్నిక గురించి అందరూ చర్చిస్తున్నారంటే కమలం ఏ ఉద్దేశ్యంతో పోటీ చేసింది..? ఎలా గెలవాలను కుంటోంది ? ఆసక్తిగా మారింది. దేశ ద్రోహులు, దేశ భక్తుల మధ్య జరుగుతున్న పోరుగా ఈ ఎన్నికలను అభివర్ణించిన కేంద్ర మంత్రి బండిసంజయ్ , కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆ రెండు ఎంఐఎం గెలవాలని కోరుకుంటున్నాయని రెచ్చగొట్టారు.పార్టీలు విప్ జారీ చేయడం వంటిది ఉండదు కాబట్టి,రహస్య ఓటింగ్ కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కార్పొరేటర్లలో మెజారిటీ సంఖ్యలో ముస్లిమేతర కార్పరేటర్లు తమ అభ్యర్థి కి ఓటు వేస్తారన్నది బీజేపీ ఆశ. బీజేపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోపాయకారి చర్చలు జరుపుతోంది. ఎంఐఎం ఎట్టిపరిస్థితుల్లోనూ ఏకపక్షంగా గెలవకూడదన్నది కమలనాధుల ప్రధాన ఉద్ధేశ్యం. ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ లోనూ బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించడంతో, ఈ ఎన్నిక లోనూ గెలుపు తమదే అంటోంది.

హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ స్థానంలో ఓటర్లు ఎవరు?

హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు ఓటర్లుగా వుంటారు. వారికి తోడు ఎక్స్ అఫీషివో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వుంటారు. జీహెచ్ ఎంసీ పరిధిలో 150 కార్పొరేటర్లు వున్నా , అందులో 81 కార్పొరేటర్ల డివిజన్లు మాత్రమే హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ పరిధిలోకి వస్తాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా బీజేపీ నుంచి ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి , రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ఎంపిక చేసుకునే గడువు ముగిసింది. తాజాగా ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు విజయశాంతి, అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఇంకా పదవీప్రమాణం చేయలేదు కాబట్టి, వారికీ ఓటు వేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఓటర్ల పరంగా చూస్తే ఎంఐఎం కు ఎక్కువ బలం వుంది. ఆ పార్టీకి 49 మంది బలం వుంది . 40 మంది కార్పొరేటర్లు, 7గురు ఎమ్మెల్యే లు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ వున్నారు .ఆ తరువాత వరుసగా బీజేపీ కి 19 మంది కార్పొరేటర్లు,ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, 4గురు ఎంపీలు కలిపి 25 మంది బలం వుంది. వున్నాయి. ఇక బీఆర్ఎస్ కు 15 మంది కార్పొరేటర్లు, 5 గురు ఎమ్మెల్యేలు,3ఎంపీలు,ఒక ఎమ్మెల్సీ తో కలుపుకుని 24 మంది ఓటర్లు వున్నారు.కాంగ్రెస్ కు 7గురు కార్పొరేటర్లు,ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీ లు ,ఒక ఎంపీతో కలిపి 13మంది ఉన్నారు. వీరుకాక టీజేఎస్ తరపున ఒక ఎమ్మెల్సీ వున్నారు. అంటే మొత్తంగా 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, 7గురు ఎమ్మెల్సీ లు ,9 మంది ఎంపీలతో కలిపి 112 మంది ఓటర్లు పార్టీల పరంగా వున్నారు.

బీజేపీ వ్యూహం ఏమిటి? గెలుపు ధీమా వెనుక...

హైదరాబాద్ పరిధిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవంగా ఎంఐఎం కు వదిలేస్తే ఎలా..? ఈ ఆలోచనే బీజేపీ కి మింగుడు పడదు. అందుకే ఏకగ్రీవంగా జరగాల్సిన ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికను చివరి నిమిషంలో ఎన్నికలు జరిగేలా చేసింది. ఎంఐఎం కు పోటీగా బీజేపీ తన అభ్యర్థి ని రంగంలో దింపింది. కాంగ్రెస్ ఎలాగూ ఎంఐఎం కు మద్దతు నిస్తోంది. మరి బీఆర్ఎస్ కూడా ఎంఐఎం కు మద్దతిస్తే , ఆ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించే ఛాన్స్ బీజేపీకి వస్తుంది. అంతేకాకుండా మజ్లిస్ ను వ్యతిరేకించే కార్పొరేటర్లు అందరూ బీజేపీ అభ్యర్థికే ఓటు వేస్తారని భావిస్తోంది. ఆ దిశగా లోపాయికారి మంతనాలు కూడా జరుపుతున్నామని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నామని భావిస్తున్న బీజేపీ ప్రజలలోనూ అదే టెంపో మొయింటిన్ అయ్యేలా చూస్తోంది. ఎంఐఎం ను ధీటుగా బీజేపీ ఎదుర్కొంటోందన్న భావన ప్రజలలో వుంది .అదీ హైదరాబాద్ లో మరీ ఎక్కువ. అందుకే త్వరలోనే జరగబోయే జీహెచ్ ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బీజేపీ హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగింది. చాకచక్యంగా వ్యవహరించి బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతు పొందగలిగితే పోటీ కీలకంగా మారుతుంది. కాంగ్రెస్ ఇప్పటికే ఎంఐఎం కు మద్దతు ఇస్తోంది కాబట్టి బీఆర్ఎస్ తనకు తాను ఎంఐఎం కు బహిరంగంగా సపోర్ట్ చేయదు. ఈ వీక్ పాయింట్ నే తమకు అనుకూలంగా బీజేపీ మార్చుకోవాలని చూస్తోంది. అదే ఎన్నికలనే బహిష్కరిస్తే, పరోక్షంగా ఎంఐఎం కు మద్దతిచ్చినట్లే... అప్పుడు కూడా బీఆర్ఎస్ ను టార్గెట్ ను చేయవచ్చు. అదీకాకుండా 2020 లో బీఆర్ఎస్ తరుపున గెలిచి తరువాత కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లలో వున్న అసంతృప్తి ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇలా ఏ అవకాశాన్ని వదల కుండా ఎంఐఎం ను ఇరుకున పెడటానికే బీజేపీ సిద్దమయింది. ఏదైనా మజ్లీస్ ను ఎదిరించే హిందుత్వ పార్టీగా ప్రజలలో ప్రచారంలో వుంటే సరిపోతుంది. అప్పుడు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయినా, ఎంఐఎం కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది , ఏకపక్షంగా గెలిచే అవకాశాన్ని నిలువరించిందన్న పేరు ప్రజలలో కొట్టేయొచ్చు. ఇలాంటి రకరకాల ప్లాన్ లతో హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగిన బీజేపీ, గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూనే, తాను అనుకున్నది సాధిస్తోంది. అటుఇటూ జరిగి విజయం వరిస్తే ఇక తెలంగాణ లో బీజేపీకి తిరుగే లేదన్న ప్రచారానికి అది పనికి వస్తుంది.

బీజేపీ లో లుకలుకలు

బీజేపీ హైదరాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతమ్ రావును ప్రకటించడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశారు. పార్టీ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ పరోక్ష విమర్శలు చేశారు. మీ పార్లమెంట్ నియోజకవర్గానికే అన్ని పదవులూ ఇస్తారా? మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. మీకు గులాంగిరి చేసేవారికే పదవులు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. మిగతావారు మీ గులాంగిరి చేయరు కదా అందుకే వారిని పక్కన పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర బీజేపీలో ఉన్న పెద్ద నాయకుడు మేకప్ మెన్, ఆఫీస్ టేబుల్ తుడిచే వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు, టికెట్లు ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య కొంతకాలంగా వున్న విభేదాలు ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా బైటపడ్డాయి. ఈ విభేదాలు ఏకంగా రాజాసింగ్ పై వేటు పడే అవకాశం దాకా వచ్చింది. ఏదో ఈ ఎన్నికల్లో తిమ్మినిబమ్మి చేద్దామనుకుంటున్న బీజేపీ పెద్దలకు రాజాసింగ్ వ్యవహారం తలనొప్పి గా తయారైంది.

Tags:    

Similar News