అవినీతి ఎక్కడ మొదలవుతుంది?

దేవుడికి కానుకలిచ్చి పూజలు చేసి కోరుకునే మత విధానంలోనే అవినీతి ఉందా?

Update: 2025-10-06 08:44 GMT

 అవినీతి మూలాలను మతాలు పట్టించుకున్నాయా? తత్వవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు పట్టించుకున్నారా? అని అప్పుడప్పుడు సందేహం రాక మానదు. ఎదుటి వారి గురించి ఎంతైనా మాట్లాడుతారు. తన అవినీతి గురించి అద్దం ముందు నిలబడి తనను తాను ప్రశ్నించుకోరు. సాహితీ వేత్తలు, కళాకారులు, అధికారంలో ఉండేవారు ఈ అవినీతిని యథాతథంగా ఆమోదిస్తూ పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా అది అవినీతి, దోపిడి, అణిచివేత ఎలా అవుతుంది? అని అమాయకంగా ప్రశ్నిస్తారు. వారికి అంత తొందరగా అర్థం కాదు.

ప్రతిఫలం ఇస్తే సరిపోతుందా?

కలెక్టరుకు, వర్ణ ఆధిక్య వాదులకు, భూస్వాములకు, పారిశ్రామిక వేత్తలకు, మంత్రులకు మాకిచ్చినంత కూలి ఇస్తాము. మా బట్టలు ఉతకండి. మా ఇల్లు ఊడ్వండి, మాకు వంట చేసి పెట్టండి. మా వాష్ రూములు , డ్రయినేజీలు బాగు చేయండి అంటే చేస్తారా?, మేం కూలీ చెల్లిస్తున్నాము, ప్రతిఫలం ఇస్తున్నాము అపారంగా ప్రేమిస్తున్నాము గౌరవిస్తున్నాము అంటారు. అనుకుంటారు. ఇవి చేస్తేనే సమానంగా గౌరవించినట్టు. సమాన ప్రతిఫలం ఇచ్చినట్టు!

కోసుకొని తినడానికి ప్రేమించడం నిజమైన ప్రేమా?

తన అవసరాల కోసం ప్రేమించడం నిజమైన ప్రేమ అవుతుందా? మనిషి పశువులను, మేకలు, గొర్రెలు, కోళ్లు, పందులు, గుర్రాలు, ఏనుగులు, కుక్కలను ప్రేమిస్తుంటారు. పశువులతో పని చేయించుకోవడానికే కదా ప్రేమించడం? మేకలను, గొర్రెలను, కోళ్లను కోసుకొని తినడానికే కదా ప్రేమించేది! రైతులు పొలాన్ని, పంటలను ప్రేమిస్తారు. పంట కోసుకొని తినడానికే కదా ప్రేమిస్తున్నది. కొందరు ప్రకృతిని ప్రేమిస్తున్నానంటారు. వారు ప్రకృతిని దాని అందాల ద్వారా కలిగే ఆనందం కోసం ప్రేమిస్తుంటారు. ఇలా ప్రేమ అని చెప్తున్నది.. తనను తాను, తన కొరకు తాను, తన అవసరాలను అనుసరించి ప్రేమించడమే తప్ప ఇందులో నిజమైన ప్రేమ ఉందా? పరోపకారం చేయడంలో నిజమైన ప్రేమ ఉంది. కానీ చాలా మంది పరోపకారం ద్వారా సేవ ద్వారా ఆధిపత్యాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అలాంటి పరోపకారం, సేవ.. నిజమైన ప్రేమా, నిజమైన పరోపకారం కాదు. ఏదో ఆశించి చేసేది నిజమైన ప్రేమ నిజమైన పరోపకారం కాదు.

మనిషి స్వతహాగా స్వార్థ పరుడేనా?

మనిషి స్వతహాగా స్వార్థ పరుడా?. మనిషిని పుట్టుకతోనే అనేక బంధనాలు చుట్టు ముడుతుంటాయి. అమ్మ భాష, అమ్మా నాన్నల కులం, సమాజంలో వారి స్థానం, మేనమామలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, నానమ్మలు, తాతలు మొదలైనవన్నీ చుట్టూ ఏర్పడి వుంటాయి. ఇరుగు పొరుగు ప్రాంతం భాష పరిధిలో మనిషి సంఘ జీవిగా జీవిస్తుంటాడు.

సంఘ జీవితంలో ప్రతీది నిబంధిత అభ్యాసమే. ఏదీ ఊరికే రాదు. చూసి నేర్చుకుంటారు. నేర్పుతుంటారు.. అమ్మభాష నేర్ప బడుతుంది. వావి వరుసలు నేర్పబడుతాయి. కులం, కుల సంస్కృతి నేర్పబడుతుంది. నేను ఆడపిల్లను అని నేర్పబడుతుంది. అలాగే దేవుళ్లు, మతాలు, సంస్కృతి, సంస్కారం నేర్పబడుతాయి. బడిలో, కాలేజీలో, ఆట పాటల్లో సాహిత్యం కళలతో నేర్చుకుంటారు. నేర్పబడుతాయి. ఇలా నిబంధిత ( కండిషనింగ్ లర్నింగ్) అభ్యాసం ద్వారా అలవాటుగా సంస్కృతిగా వ్యక్తిత్వంగా మారుతుంటాయి.

ఇండియాలో అవినీతి మూలాలు

భారత దేశంలో అన్ని రంగాల్లో విపరీతమైన అవినీతి ఉందని కొందరు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ అవినీతి తీగ కదిలిస్తే డొంకంతా కదులుతుంది. భారత దేశంలో ఇంతగా అవినీతి ఉండడానికి కారణం దేవుడికి లంచాలిచ్చి పూజలు చేసి కోరుకునే మత విధానంలోనే అవినీతి ఉందని ఒక పరిశోధన తెలిపింది. మరి కోరికలు తీర్చక పోతే, ఆపదలో ఆదుకోక పోతే దేవుళ్లెందుకు అని వెంటనే అడుగుతారు. అనగా వారు దేవుళ్లను తమ కోసం, తమ అవసరాలకోసం, తమ మనస్సు ప్రశాంతత కోసం ప్రార్థిస్తున్నామని వారికి తెలుసు. దీన్ని కొందరు అవినీతి అంటున్నారు. దేవునితో బేరం చేయడం అంటున్నారు. కొబ్బరి కాయ నీకు కోరినయన్ని నాకు అనేది ఒక బేరం, ఒక అవినీతి అని, అవినీతి మతం నుండి, కోరికల నుండి మొదలవుతున్నదని వారంటారు. మతం వదిలేయడం, దేవుళ్లను కోరికలు కోరకుండా ఉండడం అంత సులభం కాదు.

సంస్కృతి సభ్యత పౌర సమాజం

కనుక సంస్కృతిని సంస్కరించుకోవడం ద్వారా ప్రారంభించాలి. భారత దేశంలో అవినీతిని తగ్గించాలంటే అది ఇంటి నుండి, కుటుంబం నుండి ప్రారంభమవుతున్న అవినీతిని నిర్మూలించాలి. ఈ విషయాలు చెప్తే చాలా మందికి అర్థం కావు. అవినీతి జీవిత విధానంగా మార్చుకున్న వారికి అది " మామూలు" విషయంగా కనపడుతుంది. ఉదాహరణకు....

ఆడవాళ్లు వంట చేస్తే మగవాళ్లు ఆరగించడంతో అవినీతి ఆరంభమవుతున్నది. ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం, బట్టలుతకడం మొదలైన పనులు మహిళలు మాత్రమే చేయాలనే దృష్టిలోనే అవినీతి ఆరంభమవుతున్నది. కనుక కుటుంబ వ్యవస్థ నిలబడాలన్నా, స్త్రీలు.. పొలంలో, పరిశ్రమలో, ఆఫీసులో , భవన నిర్మాణంలో, పని స్థలాల్లో ఉపాధి ఉద్యోగాల్లో సమానంగా పని చేయాలన్నా ఇంటి పనిలో వంట పనిలో , ఇల్లుఊడ్వడం తుడవడం అలుకు చల్లడం , వంట , వడ్డన , అతిథి సత్కారాలు మొదలైనవన్ని మగవాళ్లు కూడ చేయడం అవసరం. స్త్రీలకు కాస్త వెసులుబాటు, స్వేచ్చ లభించాలన్నా , మనుషుల్లో అవినీతి వ్యకిత్వం , అవినీతి మనస్తతత్వం తగ్గాలన్నా అది మగవారి చేతిలోనే వుంది. వంట, పిల్లల పెంపకం, ఇల్లు ఊడ్వడం, బట్టలుతకడం మగవాళ్లు తమ కర్తవ్యంగా మనస్తత్వం వ్యక్తిత్వం మారినపుడు అవినీతి తగ్గుతుంది. కుటుంబ వ్యవస్థ నిలుస్తుంది. .

కుటుంబ వ్యవస్థకు మూలం వంట గది యా?

ఇంటిలో వంట మాయమైతే కుటుంబ వ్యవస్థ మాయమవుతుందట! అమెరికా యూరపు ఆస్ట్రేలియా దేశాల అధ్యయనాలు చెపుతున్నాయట! కనక హోటల్లు మూసేస్తే, లేదా హోటళ్లను నిషేధిస్తే కుటుంబ వ్యవస్థ నిలదొక్కుంటుందట! కనక దయచేసి మహానుభావులారా! మగవాళ్లు ఇంటి వంట గదిలో వంట చేస్తూ పిల్లల పెంపకం చేస్తూ స్త్రీలను వంట గది నుండి విముక్తం చేస్తేనే నేడు కుటుంబ వ్యవస్థ బలపడి కొనసాగుతుంది. గమవనించండి. కుటుంబ వ్యవస్థ కొనసాగాలంటే మగవాళ్లే వంటగదిలో వంట చేయాలి. పిల్లల పెంపకం చూసుకోవాలి. అందువల్ల కుటుంబ వ్యవస్థ కొనసాగాలో లేదో అనేది మగవాళ్ల చేతల్లోనే ఉంది.

బహుజనులు సాంస్కృతిక వికాసంలో ముందుండాలి.

బహుజనులు మతాన్ని విమర్శిస్తుంటారు. మతం సంస్కృతి రూపంలో , మనస్తత్వంలో వ్యక్తిత్వం రూపంలో కొనసాగుతుంది. కనక సంస్కృతిని, మనస్తత్వాన్ని, మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని మార్చే కృషి చేయాలి. ఆచరణలో గల పురుషాధిపత్య బ్రాహ్మణీయ స్వభావాలను తొలగించుకుంటూ రావాలి. అది సాంస్కృతిక వికాసం ద్వారా జరుగుతుంది. నిన్ను మార్చుకోకుండా ఇతరులను మార్చాలనుకోవడం ఒక నీతి బాహ్య అవినీతి చర్య. పితృస్వామిక పురుషాధిపత్య సంస్కృతి స్త్రీ పురుషుల మధ్య ఆమోదించిన పని విభజనను ఆమోదించి ఆచరించినంత కాలం మతం , సగం జనాభా ఐన మహిళల, బాలల అణిచివేత కొనసాగుతూ వుంటుంది. కనక మహిళలను వంట నుండి, ఇంటి పని, పిల్లల పెంపకంమ, బట్టలుతకడం, ఇల్లు ఊడ్వడం నుండి విముక్తం చేయాలి.

వంటరాని వారు జంతువులతో సమానమా?

జంతువులకు పశువులకు వంట చేయడం రాదు. వంట చేయడం రాని వాల్లు , వంట చేయని వాల్లు జంతువులతో పశువులతో సమానం. ఈ విషయంలో వాళ్లు జంతు దశలో పెంపుడు జంతువుల దశలో జీవిస్తున్నారు. ఇల్లు ఊడ్వని వారు, పిల్లల పెంపకం చూడని వాల్లు బట్టలుతకని , వంట చేయని వాల్లు ఆధునిక పౌర సమాజంలో సంస్కృతి నాగరికత ల్లో జంతువు దశలో , ఆహార సేకరణ దశలో జీవిస్తున్నారు. అందువల్ల వారిలో జంతు సహతాలు, క్రూరత్వం, అణిచివేత, బలహీనులను చీల్చుకొని తినడం తన మాట వినని వారిని కాల్చుకొని తినడం వంటి ఆధిపత్య స్వభావాలు నిబంధిత అభ్యసనం ద్వారా సహజాతంగా మార్చుకొని కొనసాగుతుంటారు. సాధువులు, సన్యాసులు, గురువులు , రాజులు, మొదలైన వంట చేయని వాల్లలో జంతు స్వభావాలు ప్రకోపిస్తుంటాయి. శాపాలు పెడుతుంటారు. శిక్షలు విధిస్తుంటారు. అణిచి వేస్తుంటారు. వంట నేర్చిన వారికి , నిత్యం వంట చేస్తున్న వారికి పౌర సమాజంలో , నాగరికతలో వుండే సభ్యత సంస్కారం అలవడుతుంది. కూర్చున్న కాడికి టీ కాఫీ టిఫిన్ భోజనం వస్తే ఆరగించేవారు నీతి బాహ్య అవినతి పరులు. వీటన్నిటిని మార్చుకన్నపుడు సంస్కృతి మారుతుంది. మనస్తత్వం మారుతుంది. వ్యక్తిత్వం మారుతుంది. పౌర సమాజంగా ఎదుగుతారు. ఇలా అవనీతి మూలం వంట వద్ద, పితృస్వామిక పని విభజన వద్ద ప్రారంభమవుతున్నది. ఇలా వంట చేయని వారు , ఇతరులు వండి పెడితే ఆరగించేవారు పరాన్న భుక్కులు, అవినీతి , అవినీతి మూల పురుషులు జంతు సమానం అని తేలుతున్నది

Similar News