తిరుపతిలో త్రిపురనేని అనే టీచర్ సృష్టించిన కలకలం: భూమన్ జ్ఞాపకాలు

మధుసూదనరావు తిరుపతికి రాకపోయి వుంటే ఈ ప్రాంతం పచ్చి సాంప్రదాయవాదుల పాండిత్యంతో అల్లాడి పోయి ఉండేదంటున్న ప్రముఖ రచయిత భూమన్

Update: 2024-10-08 13:06 GMT
తిరుపతిలో జరిగిన ఒక సాహిత్య సభలో ప్రసంగిస్తున్న త్రిపురనేని. ఫోటోలో ఎడమ నుంచి రెండో వ్యక్తి భూమన్


కమ్యూనిస్టు పార్టీ రెండు పార్టీలుగా చీలుతున్న సమయంలో మధు సూదన రావు ఉద్యోగ రీత్యా తిరుపతి వచ్చి స్థిరపడినాడు. అప్పటికి చిత్తూరు జిల్లాలో కమ్యూనిస్టు ప్రాబల్యం బాగా ఉండేది. వసంత మేఘ గర్జనతో మధుసూదనరావు పులకరించి పోయినాడు. ఆగర్జనలు విద్యార్థిలోకానికి వినిపించేలా పధ నిర్దేశకుడయినాడు. కాలేజీలో ఒక గొప్ప అధ్యాపకుడిగా అప్పటికే మంచి గుర్తింపు. దేవస్థానం కాలేజీలో అటు సాంప్రదాయ వాదుల, ఆధునిక వాదుల గౌరవాన్నిసమానంగా పొందినాడు. కాలేజీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటు విద్యార్థుల అభిమానాన్ని పొందినాడు. అప్పటికే మధుసూదనరావుకు ప్రాచీన సాహిత్య లోతుపాతులు బాగా తెలుసుననే అభిప్రాయం పండిత లోకంలో ఉండేది.

1969 నాటికి దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా సాంఘికంగా పెను మార్పులు జరుగుతున్నాయి: కాంగ్రెసు చీలిక, నక్సల్సరీ పోరాట ఉదృతి, ఇందిరాగాంధీ సంస్కరణలు, సి.పి.ఐ (యం.ఎల్) పార్టీ పుట్టుక, తరిమెల నాగిరెడ్డి అసెంబ్లీ సభ్యత్వ రాజీనామా, మన రాష్ట్రంలో తెలంగాణా ఉద్యమం. శ్రీకాకుళ గిరజన రైతాంగ సాయుధ పోరాటం.

పశ్చిమ బెంగాల్ రైతంగా పోరాట వార్తలు సహజంగానే మధుసూదన రావును ప్రభావితం చేసినాయి. ఈ దేశ విముక్తి కోసం సాయుధ పోరాటం తప్పమరొక మార్గం లేదనే ప్రగాఢ నమ్మకం ఆయనలో బలపడింది. సరిగ్గా ఆ సందర్భంలో నాకు ఆయనతో పరిచయం. నా సహవిద్యార్థి సుబ్రహ్మణ్యం రెడ్డి నన్ను వారి ఇంటికి పిలుచుకు పోయి పరిచయంచేసినాడు. నేను అప్పటికి చలం ప్రభావంలో పూర్తిగా మునిగి ఉన్నాను. అప్పటికే రెండుమార్లు తిరువణ్ణామళై కూడా పోయి వచ్చానాను.

తొలిపరిచయంలోనే మేం ముందుగానే పరిచయస్తులం మాదిరిగా మాట్లాడుకుంటున్నామని ఇప్పటికీ నాస్నేహితుడు గుర్తుచేస్తూ ఉంటాడు. పరిచయం అయిన రోజునుండి మేం కలవని రోజులేదు. ఆయన ఒక కొత్త ప్రపంచాన్ని చూపుతున్నాడు. ప్రపంచ మేధావులను తత్త్వవేత్తలను పరిచయం చేస్తున్నాడు. సాహిత్యం అంటే చలమే కాదని ఎందరెందరినో ఆవిష్కరిస్తున్నాడు. Haveleck Ellis (2 February 1859 – 8 July 1939) రచనలు The Psychology of Sex సంపుటాలు తొలిగా నేను అతని దగ్గర తీసుకుపోయి పిచ్చిగా చదివినా. తరువాత ఫ్రాయిడ్, యాంగ్ (Carl Jung), రచనలు. అప్పట్లో నాకేవైనా కొత్త సంగతులు, కొత్త పుస్తకాలు, మరో ప్రపంచపు దారులు తెలుస్తు న్వీ అంటే మధు సూదనరావు గారి వల్లనే. క్రమక్రమంగా గత తార్కిక భౌతిక వాదం చారిత్రక భౌతికవాదం. మార్క్సిజం, మావోయిజంలోకి ప్రవేశం. ప్రతిరోజు వాటి గురించి చర్చ. మహాకవి శ్రీశ్రీ అంటే అతనికి పిచ్చి. మహాప్రస్థానం అతనికి సర్వస్వం. ఆలోచనలను మార్పించే అద్భుత శక్తి చలంకు ఉందని నేను, కాదు, ఆశక్తి శ్రీశ్రీది అని అతను- కొన్నాళ్లు వాదులాడు కొన్నాం కూడ. శ్రీశ్రీ మహా ప్రస్థానంతోనే ఇటు వైపు ప్రయాణంచేసినట్టుగా అనేక మార్లు అనేవాడు.

రోజూ సాయంకాలం ఇద్దరం కలసి అటు అలిపిరి వైపో, రూయా ఆసుపత్రి వైపో గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్లం. చర్చించుకునేవాళ్లం అతని సంభాషణ అపురూపంగా ఉండేది. గొప్ప జ్ఞానోదయంగా ఉండేది. మాట మనిషిని కదలించేదిగా వాదం అభిప్రాయాలను అట్టా తొలిచి వేసిదిగా ఉండేది.

మాతోపాటు అత్తలూరి నరసింహరావు, కోటయ్య, జయరాం, బాలకృష్ణ లాంటి మిత్రులు. విప్లవ సాహితిని ఏర్పాటు చేసుకుని తొలిప్రయత్నంగా ‘లే” అనే కవితా సంకలనాన్ని ప్రచురించినాము. అలవోకగా చేసిన ప్రయత్నం అది. మధుసూదన రావు దగ్గరికి వచ్చే మిత్రుల్లో మెరికల్లాంటి వారి చేతరాయంచిన అతని సంకల్పం అద్వితీయం.

అప్పటకే తిరుపతికి దిగంబర కవులను పిలిపించి నాలుగైదు ఉపన్యాసాలు ఇప్పించినాడు. వాళ్లను పిలిపించి మాట్లాడించడమే తిరుపతిలో ఒక గొప్ప విప్లవ కార్యక్రమంగా ప్రచారమయింది. మహాకవి శ్రీశ్రీ.కొడవటిగంటి కుటుంబరావు రాకతో విద్యార్థుల్లో 'కేక' మొదలైంది.

తెలుగు సాహిత్యంలో జరుగుతున్న పెను మార్పుల్ని ఎప్పటి కప్పుడు తెలుసుకుంటున్నాడు. నాకు తెలిసి మధుసూదనరావు వల్లనే ఆధునిక తెలుగు సాహిత్యం తిరుపతికి పరిచయం అయింది.

మధుసుదనరావు తిరుపతికి రాకపోయి వుంటే ఈ ప్రాంతం పచ్చి సాంప్రదాయవాదుల పాండిత్యంతో అల్లాడి పోయి ఉండేది. ఆయన వల్లనే ఇక్కడ హేతువాద బీజాలు వాస్తవ భావాలు విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చినాయి.


ఒక సాహిత్య సభ. వేదిక మీద కూర్చున్నవారు కెవిఆర్, త్రిపురనేని, శ్రీశ్రీ, భూమన్, జ్వాలాముఖి


 విరసం (విప్లవరచయితల సంఘం : Revolutionary Writers Association) పుట్టుక తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మైలురాయి. విరసం ఏర్పడే నాటికి మాకెవరికీ దానితో సంబంధం లేదు. మొదట ఖమ్మం సభలకు మే వెళ్లలేదు. మధుసూదనరావుకు అప్పటి కింకా సంస్థాగత పరిచయాలు ఏర్పడలేదు. మేం విడిగా ఒక గ్రూపుగా అప్పటికే విప్లవ సాహిత్య రచనల్లో ఉన్నాము. తిరుపతి నుండి "రాయలసీమ" అనే పక్ష పత్రిక వచ్చేది. దాన్ని విప్లవ సాహిత్య వేదికగా మార్చినాము. ఆ పత్రిక ఎడిటర్ సుభాష్. అతనే మాపుస్తకాలకు ఎడిటర్ గా ఏర్పాటు చేసుకున్నాము. మా పుస్తకాలు ప్రచురించింది ఒక మంచి సంప్రదాయవాది, బాలాజీ పబ్లిషర్స్ అనే పుస్తకాల యజమాని తిరుమలరావుగారు. మధుసూదనరావుగారంటే ఇష్టం ఆ ఇష్టంతోనే “లే”, “విప్లవం వర్ధిలాలి” కవితాసంకలనము కెవిఆర్ ‘ఎర్రపిడికిలి' కవితాసంకలనం మధుసూదనరావుతొలి వ్యాసాలు ‘కవిత్వం చైతన్యం' ప్రచురించినాము. ప్రచురణ కర్త నేను. ఎడిటర్ సుభాష్. పెట్టుబడి తిరుమలరావుగారిది. దీన్నంత ప్లాన్ చేసేది మధుసూదనరావుగారు. 'లే' కవితా సంకలనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది, మూడు నెలల్లో కాపీలు అయిపోయాయి. ఆ ఉత్సాహంతోనే తిరుమలరావు గారు మిగిలిన పుస్తకాల ప్రచురణకు ముందు కొచ్చినారు. పుస్తక పఠనం కోసం శ్రీశ్రీ దగ్గరకి నేనే వెళ్లి క్రాంతి పబ్లికేషన్స్ ధనికొండ హనుమంత రావు గారిని కలిసి రావడం నాకింకా గుర్తు. ఆ హనుమంత రావు గారి గురించి మధుసూదన రావు గారు చెప్పినారు. ‘అభిసారిక' పత్రిక నడిపేవాడని నవలలు కథలు రాసేవాడని.

రెండవ విరసం మహాసభలకు ముందే మధుసూదన రావు విరసంలో చేరటమే గాకుండా నన్నూ చేర్పించినారు. ఆనాలుగు సంవత్సరాలు మేం విడివిడిగా చేసిన పనంటు ఉంటే అవి మధుసూదనరావు గారి రచనలు మాత్రమే. విరసం కార్య వర్గం సమావేశం బెజవాడలో జరిగింది. అదే మాకు విరసం వారితో తొలిపరిచయం. కృష్ణాబాయి, చలసాని ప్రసాద్ మధుసూదన రావుకు ముందే తెలుసు. చాన్నాళ్ల తర్వాత అక్కడే కెవిఆర్ (కెవి రమణారెడ్డి) నూ కలవడం అక్కడే.

విరసంలో చేరిన తర్వాత కార్యక్రమాలు ఉధృతమైనాయి. అప్పటికే మధుసూదనరావు వ్యాసాలు సంచలనం కలిగిస్తున్నాయి. రచనలో ఆయన చాల బద్ధకస్తుడు. చదవటం మాటాడటంలో ఉన్న సుఖం రచనలో లేదనే వారు. మేం ఆయన చేత రాయించడానికి బాగా వత్తిడి తీసుకురావటం నాకు ఇంకా గుర్తు. కవిత్వం-చైతన్యం వ్యాసాలు వచ్చేనాటికి నేను ఆయన్ని ‘క్రిటిక్ ఆఫ్ టైమ్స్' అని పిలవటం చాలా మందికి రుచించలేదు. మాకు తెలిసిన వాళ్లు బయటికి ఏమీ అనలేదుగాని ఏటుకూరి బలరామ మూర్తి గారు 'విశాలాంధ్ర' (Visalandra)లో చాలా ఘాటుగా విమర్శించినారు.

నాకు అప్పటికి పార్టీవాళ్లతో సంబంధం ఉండేది. నాకు ఉందని మధుసూదన రావుకు, మధుసూదనరావుకు ఉందని నాకు తెలిసేదికాదు. ఓరియంటల్ కళాశాల (Oriental College) లో మధుసూదనరావు పనిచేసిన రోజులు విప్లవ కార్యకలాపాలకు గోల్డెన్ డేస్ (Golden Days). నాగరాజు, హమీద్ చంద్రశేఖర్ రెడ్డి అక్కడి, విద్యార్థులు ఓరియంటల్ విద్యార్థులే పార్టీతో ఎక్కువ సంబంధం కలిగినవారు. మహదేవన్ విప్లవ నాయకుడు మావో ఛైర్మన్ మా ఛైర్మన్, వర్గ శత్రు నిర్మూలన - ఇవన్నీ తెలిసింది ఆయన ద్వారానే మధుకు మావో అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. భావాలు ఎక్కడనుంచి వస్తాయి? 'వైరుద్యాలు' - ఇవంటే మధుకు చచ్చేటంత ఇష్టం. నాగరాజును మహదేవను ఆ తర్వాత పోలీసులు కాల్చిచంపినారు.

అప్పట్లో తిరుపతికి రాని సాహిత్యకారులు గాని, విప్లవకారులు (Revolutionaries) కానీ లేరు. మధు ఒక్కడే ఒక ఆర్మీగా ఇక్కడి కార్యకలాపాలు నడిపేవాడు. కొల్లావెంకయ్య రెగ్యులర్గా మాకు టచ్ అయ్యేవాడు. చారుమజుందార్ ని కలవడానికే మధు తిరుమల కొండ ఎక్కడం. ఆయన్నే మేం కలిసింది అని 1972 జూలై 28నాటికి గాని మాకు తెలియదు. మధు సి యం (చారుమజుందారిని సియం అని పిలిచేవారు) మరణాన్ని కొన్నాళ్లు జీర్ణించుకోలేక పోయారు. రవూఫ్ చార్మినార్ సిగ రెట్టును సియం గా పిలవటం ఆ పేరు చారు మజుందార్ది కావటం. ఇవన్నీ మాకు గొప్ప గా వుండేటివి.

1970 నుండి 1974 వరకు మధుసూదన రావుగారు ఉపన్యాసం చెయ్యని రోజు లేదంటే ఈ రోజు ఆశ్చర్యంగా ఉండొచ్చు గాని - అదొక చారిత్రక సత్యం. తిరుపతిలో పిలవని స్కూలు, కాలేజీ, సంస్థలు ఉండేటివి కావు. మధుసూదనరావును పిలవటం ఒక గౌరవంగా భావించేవారు. అతని ఉపన్యాసం వినటం ఒక rare opportunity అనుకునేవారు. విద్యార్థులయితే అతని ఉపన్యాసానికి ఊగిపోయేవారు. విద్యార్థులకు మధుసూదనరావు ఉపన్యాసంతో అప్పటి వరకు ఉన్న తమ అభిప్రాయలను మార్చుకోక తప్పేదికాదు . అతని ఉపన్యాసాలతోనే తిరుపతిలో వేలాదిగా విద్యార్థులు కదలి వచ్చేవారు. ఎప్పడు సభ నిర్వహించినా జనానికి కొదవే లేదు. తిరుపతి కోనేటికట్ట (Koneti Katta) అప్పటి మా బహిరంగసభలకు ప్రసిద్ధి. నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే నన్ను ఉపన్యాసాలవైపు మళ్లించింది మధుసూదనరావే. ఉపన్యాసం ఒక కళగా భోదించింది. లేకపోయినా మేము కలిసి తిరగటం వల్ల ఆ ఉపన్యాసకళ నాకు అబ్బిందని అనుకుంటా.

కెవిఆర్ లాటి వాళ్లు నన్ను ఒక వక్తగా ఆ నాటికే గుర్తించడానికి మధుసూదన రావే మూల కారకుడు. అతని ఒకనాటి ఉపన్యాసాలు ఎంత శక్తివంత మయినటువంటి వంటే చంద్రగిరి స్కూలుకి అతణ్ణి గెస్టుగా పిలిచారు. అక్కడి హెడ్ మాస్టర్ YKVN ఆచార్య అని ఒక పచ్చి అస్తికవాది. శంకరంబాడి సుందరాచార్యుల స్నేహితుడు. శంకరంబాడి మధుసూదనరావును కలిసేవాడు. అదితెలిసి ఆచార్య మధును పిలిచాడు. మధు ఉపన్యాసం ముగియగానే ‘ఇంకో గంట వింటే నేను తప్పక ‘నాస్తికుణ్ణి' అవుతా’నని మనస్ఫూర్తిగా అనటం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది.

-

కాలేజీలో క్లాసురూంను ఒక Lively Room గా ఉంచడం అతడికే తెలుసు ఏ ఒక్క విద్యార్థి అతణ్ణి తప్పుపట్టటం నేను వినలేదు. కాలేజీలో అన్ని విద్యార్థి కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. నాటకము రాసేవాడు వేయించేవాడు. అంత పెద్ద కదలిక తీసుకొస్తున్న ఎవరూ వ్యతిరేకించేవారు కాదు. నిజానికి అప్పటి అధ్యాపకుల ఔన్నత్యం అలాంటిది. కాలేజీకి మహాకవి శ్రీశ్రీని, దిగంబర కవులను, వరవరరావును జ్వాలా ముఖిని పంపించినా ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించేవారు. కళాశాలలో మధు వ్యక్తిత్వం అలాంటిది. నేను మధు గోవిందరాజస్వామి కాలేజీలో (Govindaraja Swamy College) మూడేళ్లు కలిసి పనిచేసినాము. అప్పుడు చూసానుగదా ప్రాచీనులు కూడ అతనంటే ఇష్టపడేవారు. చరిత్ర అధ్యాపకులు ఆర్ధికశాస్త్రం చెప్పేవాళ్లు తరచు ఆయనదగ్గరకి వచ్చి సంభాషించేవారు. అతను చాలా ప్రజాతంత్రంగా వ్యవహరించేవాడు ఒక మారు మా కాలేజీకి ఎక్కిరాజు ఉపన్యాసం చేయటానికి వచ్చినారు. మేం ఇద్దరం వినటానికి పోతున్నాము. ఇంతలోనే ప్రిన్సిపాల్ నాగయ్య గారు ఎదురొచ్చి ‘మధూ, మీరు రావొద్దయ్య, నువ్వేసే ప్రశ్నలకి అతడు తట్టుకుంటాడో లేదో,’ ననటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘లేదు మాష్టారూ, వచ్చి ఊరకనే వింటాం,’ అని మధు అంటే – ‘అయ్యా ఊరకనే వినటం నీకు సాధ్యమా అతడు ఏదో ఒక దాన్లో ఏమిటి మొత్తం ఉపన్యాసంలో నీకు చిక్కిపోతాడు. బాబ్బాబు, నామాట విను నాకోసం రావద్దయ్య,’ అనటం అనుకుంటే ఆరోజులో రోజులు కదా అనిపిస్తుంది.

మధు నిరంతర అధ్యయన శీలి. అతడు చదవని రోజంటు లేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేవాడు తెలియని దాన్ని తెలిసినవాళ్లతో అడిగి మరీ తెలుసుకోనేవాడు. ఆ రోజుల్లో కాలేజీలో ఒక ఘటన సంచాలనాత్మకమైన ఘటన జరిగింది. నేను రాజకీయశాస్త్రాన్ని చెబుతాను. నాతోపాటు చరిత్ర చెప్పే అధ్యాపకుడు ఆర్.యస్.యస్. నేపథ్యం వుండేవాడు. గాంధీని పోగిడాడు అయినా మంచి అధ్యాపకునిగా మాకు ఇద్దరికీ గౌరవం. ఒక రోజు ‘భూమన్ తన పాఠమే గాకుండా చరిత్ర సాహిత్యం కూడా క్లాసులలో చెబుతున్నారని విద్యార్థులను రాడికలిజం వైపు ప్రోత్సహిస్తున్నా’రని Complaint చేశారు ప్రిన్సిపాల్ కు. పక్కనే ఉన్న మధు ‘భూమన్ అంత గొప్ప పనిచేస్తున్నందుకు appreciate చేయాలి కదా, మేష్టారు!@ అన్నారు. దాంతో ఆ పెద్దాయన మధు బయటికి వెళ్లిపోగానే ప్రిస్సిపాల్ మీద విరుచుకు పడటం మాట మాట పెరిగి ఒకరిమీద ఒకరి చెయ్యిచేసుకోవడం జరిగినట్టుగా తెలిసింది. ఆ అధ్యాపకుడు తనకు అన్యాయం జరిగిందని గోలచేస్తే స్టాఫ్ మీటింగ్ అందులో మధుసూదనరావు కార్య కారణ సంబంధం గురించి మాట్లడ్డంతో వచ్చిన వారందరూ ఆ అధ్యాపకుడే కొట్టించుకునే ప్రయత్నం చేసివుంటాడని గట్టిగా నమ్మి వెనక్కివెళ్లిపోయినారు. అతని వాదనా పటిమ, హేతువాద వైఖరి ప్రతివిషయాన్ని శాస్త్రీయంగా వివరించేది.

ఆర్ ఎస్ యు నామకరణం

అప్పట్లో విద్యార్థి సంఘం అవసరం చాలా ఎక్కువగా ఉండేది. మేంతరచుగా కలుసుకునే డీలక్స్ హోటెల్ ( Deluxe Hotel) లో ఈ ప్రస్తావన వచ్చింది. సరే నువ్వు రాసుకొని రావయ్యా అన్నాడు. నేను నాకు తెలిసిన లక్ష్యాలు రాసుకొని ఇద్దరం రూయా ఆసుపత్రి ఆవరణలో కూర్చుని చర్చించుకున్నాం. రెవల్యూషనరీ స్టూండెంట్స్ యూనియన్ (Revolutionary Students Union) అని నామకరణం చేసుకున్నాం. దాన్ని తీసుకొని ఎస్వీ గెస్ట్ హౌస్ వద్ద శివారెడ్డి, సాకం నాగరాజు, సురేంద్రరెడ్డి ఉన్నట్టు గుర్తు. వారితో మాట్లాడితే పేరు మార్పు గురించి సూచించారు. తటుక్కున నేను రాడికల్ స్టూండెట్స్ యూనియన్ (Radical Students Union: RSU) అన్నాను. మధు బావుందన్నాడు. రాడికల్ అనే పదం ఎం ఎన్ రాయ్ (MN Roy)ది అన్న సంగతికూడ తెల్చుకునే సమయం కాదది. ఆపేరే తర్వాత ఎంత ప్రముఖమైందో అనుకుంటే కూడ మాకు చాలాచాలా సంతోషంగా అనిపించేది.

మా స్నేహం అపురూపంగా ఉండేది ఆ రోజుల్లో మధు అనురాగం ఆపేక్ష ఎట్లాంటిదో నేను అనుభవించినాను. చాలా మంది అనుకున్నట్టుగా అతడొక గొట్టు మనిషి అనే మాట పచ్చి అబద్దం, తెలిసిన వాళ్లకి అతనొక ఆత్మీయుడు. నా పెళ్లి మహాకవి శ్రీశ్రీ, మధుసూదనరావే నిర్వహించవలసింది. మా పెళ్లికి కొద్ది రోజుల ముందుగా మధు కూతురు ప్రమాదంలో లోచనిపోయింది. ఆ రోజు అతను దుఃఖించటం చూసాను. అతనొకవైపు నేనొకవై పు దుఃఖించటం ఇప్పటికీ అర్ధంగానే ఉంది. మా పెళ్లి గురించి కూడా చాలా చర్చ జరిగింది. కెవిఆర్, సాంబశివరావు, మధు, నేను కలిసి చిత్తూరుజిల్లా అంతా విరసం మీటింగులతో తిరుగుతున్నాం. మదనపల్లె మీటింగు సందర్భంగా పెళ్లిప్రస్తావన వస్తే సాంబశివరావు పెళ్లి ‘ఝంఝాటం' వద్దయ్య అనటం మధు ఆ అమ్మయి కామ్రేడ్ కూతురయ్యా ఫరవాలేదని అందరితో భరోసా ఇవ్వటం అందరూ అనుకున్నట్టుగా అతడొక విచ్ఛిన్న కారుడనే అభాండాన్ని పూర్వపక్షంచేస్తున్నది.

అతడొక హాస్యప్రియుడు. సరదా మనిషి, ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకునే మనస్తత్వం చావు గురించి ఎంత తేలిగ్గా మాట్లడేవాడంటే చనిపోయిన తర్వాత శరీరం ఏ ప్రాణికైనా ఆహారమయితే తప్పేమిటనే వాడు. కొందరికి ఇట్లాంటి మాటలు భరించే శక్యంగా కుండా ఉండేవి. మీ మిద్దరం నోరార నవ్వుకుంటు మాట్టాడుకోవటం కొందరు మా మిత్రులకే సహించరానిదిగా ఉండేది. ఆ నవ్వటమే మిటయ్య అని కోటయ్య లాంటి మిత్రులు అభ్యంతర పెడుతుంటే మధు ఎంతో హాయిగా జవాబు చెప్పే వారో!!

అతడు సామాజిక, రాజకీయ తాత్విక సాహిత్య విషయాలు తప్పిస్తే మరొకటి ఎవరితోనూ మాట్లడ్డం నాకుతెలియదు అవిగాక ఇంకేమున్నాయయ్యా మాట్లాడ్డానికి అనేవాడు. అసలు ఇంట్లోవాళ్ళతో నయినా రోజు వారి వ్యవహారాలు మాట్లాడే వాడేనా - అని నాకిప్పటికీ సందేహమే. అతన్ని కలవటమూ అంటే అదొక భోధనాలయం కావాల్సిందే కాలేజీలోగాని, ఇంట్లోగాని, భోజనం చేసేటపుడుగాని, ఎక్కడైన ఎప్పుడైన అవిగాక మరొకటి మాట్లాడం తెలియని అపూరూప వ్యక్తి త్రిపురనేని మధుసూదనరావు. కమ్యూనిస్టు తత్వాన్ని జీర్ణించుకోవడమే గాకుండా తన ఎరుకలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అలా కావాలని తాపత్రయ పడే సామాజికుడు. ఈ దేశానికి సాయుధ పోరాటం తప్పమరొక మార్గం లేదని చివరి వరకు విశ్వసించిన వాడు. తన జీవితంలో ఎన్నడేగాని ఓటువేయని వాడు. పార్లమెంటరీ వ్యవస్థను అసహ్యించుకున్నవాడు. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఆచరించాలనే వాడు. అట్లాంటి వ్యక్తిని మరొకరిని వెదుక్కోవడం సాధ్యం కాదు.

అతని మాట ఒక శక్తి, అతని సంభాషణ ఒక ప్రేరణ అతని ఉపన్యాసం ఒక స్ఫూర్తి అతనే ఒక విద్యాలయం. అతడి కలయిక ఒక నూతన ప్రపంచం. అతడితో స్నేహం ఒక అపురూపం.



ఇది కూడా చదవండి

పురాణ, ఇతిహాసకథల్లో దాక్కుని వున్న ఒక నాటి గణసమాజలక్షణాలను గుర్తించడానికి కుమారస్వామి కథ ఎలా అవకాశమిస్తుందో చెబుతున్నారు ప్రముఖ పరిశోధకుడు కల్లూరి భాస్కరం. 






Tags:    

Similar News