తెలంగాణ కాంగ్రెస్ లో ముదురుతున్న అసహనం...
టీపీసీసీ కమిటీ ఏర్పాటులో జాప్యం దేనికి సంకేతం. క్షేత్ర స్థాయిలోనూ అసంతృప్తి;
పదేళ్ల తరువాత అధికారం అయినా అందని ద్రాక్షలా పదవులు. ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ఇన్నేళ్లుగా అందరూ ఆవురావురు అంటూ వున్నారేమో అన్ని పదవులకు ఫుల్ కాంపిటీషన్ ..ఎవరికి ఏపదవి ఇవ్వాలో ,ఎలా సర్దాలో తెలియడం లేదేమో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పదవుల పందారాన్ని వాయిదా వేస్తూనే వస్తోంది. పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయి 9 నెలలు కావొస్తున్నా పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ అధిష్టానం మాత్రం కసరత్తు చేస్తూనే వుంది. ఇవాళ రేపు అంటూ ఊరిస్తూనే వుంది.ప్రస్తుతం మళ్లీ ఐదేమాట వినిపిస్తోంది.టీపీసీసీ అధ్యక్షుడికి తాజాగా ఢిల్లీ నుంచి పిలుపు రావడంతోనే టీకాంగ్రెస్ వ్యవహరాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం పెద్దలను కలిసి చర్చించి, తమ జాబితా కూడా అందించారు .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోనూ హైకమాండ్ చర్చిస్తోంది. అయితే ఇదేమీ మొదటిసారి కాదు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా జాబితా మారుతూనే వుంది. ఇది పీసీసీ కార్యవర్గం పరిస్థితే కాదు, మంత్రివర్గ విస్తరణ,నామినేటెడ్ పదవులు ఇలా అన్నింటిదీ ఇదేవరుస.
టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధం..జంబో కార్యవర్గమేనా?
కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం ఈసారి వీలైనంత ఎక్కువ మంది నేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఆశావహులు ఎక్కువ సంఖ్యలో వుండటం, అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆశయం, కొత్తగా పార్టీలో చేరిన వారికీ అవకాశం కల్పించాల్సిన అవసరం, కారణం ఏదైనా జంబో కార్యవర్గం మాత్రం గ్యారెంటీ.అందులో భాగంగా 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన టీపీసీసీ జంబో కార్యవర్గాన్ని వారం రోజుల లోపే ఏర్పాటు చేస్తారన్న మాట మాత్రం వినిపిస్తోంది. మరి ఈ జంబో కార్యవర్గం కూడా గాంధీ భవన్ చూట్టూ తిరిగి పైరవీ చేయింకునే వారితో, హైకమాండ్ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వారితోనే నిండిపోతుందా..., క్షేత్ర స్థాయిలో పదేళ్లపాటు పార్టీకోసం పనిచేసిన వారిని కూడా గుర్తిస్తారా? ఇప్పుడా చర్చ పార్టీలో సాగుతోంది.
మరింత ఆలస్యం పార్టీకే నష్టం
మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవుల పంపకం ఎంత ఆలస్యమైతే అంతగా పార్టీకే నష్టం. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానం గుర్తించడం లేదో , తెలంగాణ కాంగ్రెస్ నేతలలో వున్న గందరగోళం తో కుదరడం లేదోగాని, పార్టీలో క్షేత్ర స్థాయి నేతలలోనూ తీవ్ర నిరాశ కనిపిస్తోంది. పార్టీ అధికారంలో వున్నదన్న తృప్తేగాని పదవుల మాటేమిటి? ..
అఖిల భారత కాంగ్రెస్ దళిత విభాగం తెలంగాణ కన్వీనర్ హెచ్. ఆర్ . మోహన్ టీపీసీసీ కార్యవర్గం, ఇతర పదవుల భర్తీ ఆలస్యం కావడంపై ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు కష్టపడి పార్టీ ని అధికారంలోకి తెచ్చిన క్షేత్ర స్థాయి కార్యకర్తలు ,నాయకులు, పార్టీనే నమ్ముకొని వున్న నేతలకు న్యాయం జరగాలన్నారు. రాష్ట్ర స్థాయి నుండి క్రింద స్థాయి వరకు పార్టీ పదవులను ఇప్పటి వరకూ భర్తీ చేయక పోవడం పార్టీ భవిష్యత్తు కు ప్రమాదమన్నారు. అన్ని సామాజిక వర్గాలకు వారి ప్రాతినిధ్యం ఆధారంగా న్యాయం చేయాలని, గాంధీ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే వారికే పదవులు ఇస్తే పార్టీనే నష్ట పోతుందన్నారు. 119 నియోజక వర్గాలను దృష్టిలో వుంచుకొని పనిచేసే వారికే పార్టీ పదవులు ఇవ్వాలని మోహన్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
మహిళా కాంగ్రెస్ నేతల అసంతృప్తి, తీవ్ర నిరసన
పార్టీ పదవులు రాకపోవడం , కొందరికే ప్రాధాన్యత లభిస్తోందన్న అసంతృప్తి కాంగ్రెస్ నేతలలో పెరిగి పోతున్నాయి. కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే, కాంగ్రెస్ పవర్ లోవున్నా తామంతా పవర్ లేని నేతలుగా మిగులుతున్నామన్న ఆక్రోశం కనిపిస్తోంది. గాంధీభవన్ లోనే మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా చేయడం కూడా పార్టీలో అసంతృప్తి ని బైటపెడుతోంది.
టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌పైనే ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని సునీత రావు ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాదు పీసీసీ ప్రెసిడెంట్, సీఎం, కొందరు మంత్రులు తమ వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ ఆమె బహిరంగంగా టార్గెట్ చేయడంతో అధికారంలో ఉన్న హస్తం పార్టీ పరువు గాంధీభవన్ గేట్ దాటింది .
వచ్చే పార్టీ కార్యవర్గంలో కూడా పార్టీకి పనిచేసిన వారికి కాకుండా..పదవుల్లో ఉన్న కొందరు తమ వారికి పదవులు పంచుతున్నారని ఆమె చేసిన ఆరోపణలు పార్టీకి తలనొప్పి గా మారాయి. బహిరంగంగా కొందరు పరోక్షంగా మరికొందరు పార్టీ పదవులు కూడా దక్కడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..
కాంగ్రెస్ ఇంఛార్జ్ కూడా చేతులెత్తేశారా..?
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ బాధ్యత తీసుకున్న తరువాత పార్టీ ఇక ఉరుకులు పరుగుల మీద వుంటుందన్న సంకేతాలు ఇచ్చారు. పార్టీలో పనిచేసేవారికే పదవులు దక్కుతాయని తేల్చి చెప్పారు. పార్టీ గీత దాటితే క్రమశిక్షణా చర్యలుంటాయని హెచ్చరించారు. పదవులకు పైరవీలు పనిచేయవని , పార్టీ కోసం కష్ట పడాలని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కొన్నాళ్లు ఆ భయం నేతలలో కనిపించినా, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులలో జాప్యం ఒక్కరొక్కరూ బజారుకెక్కేలా చేస్తోంది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడం ఎలా, అప్పుల ఊబి నుంచి బయటపడి ప్రభుత్వాన్ని సాఫీగా నడిపించడం ఎలా అన్న బిజీలో పడిపోయారు. పార్టీ హైకమాండ్ కులాలు, సామాజిక సమీకరణలు అంటూ సాగదీస్తోంది. అర్థబలం, బలగం వున్న నేతలు ఢీల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అన్ని జాబితాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆమోదముద్ర కూడా త్వరగా పడటం లేదు. ఇలా తయారైన జాబితాల మార్పులు చేర్పులతోనే పుణ్యకాలం గడిచి పోతోంది. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు.
సీనియర్ల తో సలహా కమిటీ?
మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటు వీటిలో ముందడుగు వేయలేని కాంగ్రెస్ హైకమాండ్ ,పీసీసీ కి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చేందుకు సీనియర్ల సలహా కమిటీ ఏర్పాటు కు సిద్ధమైంది. పార్టీనే నమ్ముకున్న సీనియర్లు కొందరికి ఈ రకంగా పదవులు లభిస్తాయేమోగాని, ముందు గా భర్తీ చేయాల్సిన పదవుల మాటేమిటని పార్టీ నేతలే నిలదీస్తున్నారు. పీసీసీ కమిటీలలో స్థానం పొందే వారికి నామినేటెడ్ పదవులు దూరమవుతాయి. పీసీసీ లిస్టులో వున్నవారెవరైనా నామినేటెడ్ పోస్టులలో వుంటే రాజీనామా చేసి, పార్టీ పదవి తీసుకోవాలన్న నిబంధనను తెస్తున్నారు. ఈ మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టంచేసినట్టు తెలిసింది.పదవుల కంటే ఆశావహులు ఎక్కువగా వుండటమే జాప్యానికి కారణమని, త్వరలోనే అన్నింటికీ శుభం కార్డు పడుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏదైనా పదవుల కోసం కాంగ్రెస్ లో జరుగుతున్న కుర్చీలాట మరింత సాగితే మాత్రం నష్టం తప్పదు.