“మార్వాడీ గో బ్యాక్” నినాదాన్ని ఎలా చూడాలి
’మార్వాడీ‘ చర్చలో మరవ కూడని అంశాలు -1;
తెలంగాణా లో ఇప్పుడు “మార్వాడీ గో బ్యాక్” పేరుతో ఒక కొత్త నినాదం ముందుకు వచ్చింది. దీనిపై సోషల్ మీడియా లో చర్చ మాత్రమే కాకుండా, కొన్ని వర్గాల వారు, ముఖ్యంగా వ్యాపార వర్గాలు , కొన్ని చేతి వృత్తుల సమూహాలు రోడ్లపై ర్యాలీలు కూడా తీస్తున్నారు. కొందరు రచయితలు , కవులు, కళాకారులు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తున్నారు.
మార్వాడీ వ్యతిరేక పోరాటం బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా సాగిన పోరాటం లాంటిదని అని ఒక రచ్జయిత, కళాకారుడు ప్రకటిస్తే, ఇది దేశీయ సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటమని మరో కవి ప్రకటించారు. మార్వాడీల షాపులకు వెళ్ళకుండా ఆర్య వైశ్య దుకాణాలలో సరుకులు కొనుక్కోవాలని కొందరు పిలుపు ఇస్తున్నారు.
రాజకీయ పార్టీల రిత్యా కాంగ్రెస్ , బీజేపీ ఈ నినాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి. BRSపార్టీ తన వైఖరి బహిరంగంగా ఇప్పటికీ చెప్పకుండా మౌనంగా ఉంది. లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా పరిస్థితిని గమనిస్తున్నాయి.
మార్వాడీల పేరుతో అందరినీ వ్యతిరేకించడం సరి కాదని, వారిలో దోపిడీకి పాల్పడే, ఆధిపత్య దాడులు చేసే వారిని మాత్రమే వ్యతిరేకించాలని ఒక వాదన ఉంది. గ్రామాలకు, మండలాలకు మార్వాడీలు విస్తరించకుండా కట్టడి చేయాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ నేపధ్యంలో తక్షణ ఆవేశాలకు గురి కాకుండా, తెలంగాణా లో మార్వాడీల సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి? వారి పట్ల ప్రభుత్వాలతో పాటు, సమాజ వైఖరి కూడా ఎలా ఉండాలి ? అనేది లోతైన చర్చ జరగాలి. తెలంగాణా ప్రజలను కించపరిచేలా మాట్లాడే మార్వాడీ వ్యాపారుల భావ జాలాన్ని వ్యతిరేకిస్తూనే, వాళ్ళు తెలంగాణా స్థానికులపై, అమాయక కార్మికులపై చేసే దౌర్జ్యన్య ఘటనలను వ్యతిరేకిస్తూనే, నిజమైన తెలంగాణా ప్రజల సమస్యలు పక్కదారి పట్టకుండా, అసలైన సమస్యలు, పరిష్కారాలు ముందుకు రావాల్సి ఉంది.
బయట రాష్ట్రాల నుండీ వచ్చిన మార్వాడీ వ్యాపారులకు, తెలంగాణా సమాజంలో ఇప్పటికే భాగమైన స్థానిక వ్యాపారులకు మధ్య జరిగే వ్యాపార ఉనికి, లాభాల పోరాటంగా ఇది మారిపోకుండా ఉండడం చాలా ముఖ్యం.
సాధారణ ప్రజల కోణంలో, స్థానిక జీవనోపాధుల కోణంలో, స్థానిక వనరులకు రక్షణ కోణం లో, తెలంగాణా సంస్కృతి ( ఇది కూడా అందరిదీ ఒకటి కాదు ) కోణంలో, సమాజంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే హిందుత్వ ఫాసిస్టు భావజాలం పెరుగుదల ప్రమాదం కోణంలో చర్చ సాగాలి. తెలంగాణా లో ప్రజాస్వామిక, లౌకిక వాతావరణం ఉండేలా, ప్రభుత్వాలు, తెలంగాణా సమగ్ర అభివృద్ధి నమూనా రూపకల్పనలో పట్టించుకోవాల్సిన అంశాలను - ముఖ్యంగా స్థానిక ప్రజలు, వనరులు, ఉపాధులు, పర్యావరణం - ముందుకు తెచ్చేలా ఈ చర్చ సాగాలి.
తెలంగాణా ప్రాంతంలో దశాబ్దాలుగా, తెలంగాణా రాష్రంలో గత 11 ఏళ్లుగా పరిష్కారం కాని ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్ధిక, పారిశ్రామిక, వ్యవసాయ విధానాలు ఈ సమస్యలకు ప్రధాన కారణంగా ఉన్నా, పాలకుల అనాలోచిత, అపసవ్య, స్వార్ధ విధానాల వల్ల సామాజికంగా, సాంస్కృతికంగా, పర్యావరణ పరంగా వచ్చిన సమస్యలు కూడా తక్కువేమీ కాదు.
ఈ సమస్యల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయే వారిలో ప్రధానంగా నిరుపేదలు, శ్రామికులు, క్రింది మధ్యతరగతి ప్రజలు ఉంటున్నారు. వీరిలో కూడా సహజ వనరులపై, ఆర్ధిక వనరులపై, ఏ మాత్రం హక్కులు లేని ఆదివాసీలు, దళితులు, అత్యంత వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు ఉంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వాళ్ళ లబ్ది పొందే వారిలో అత్యంత ధనికులు, పారిశ్రామిక వేత్తలు, భూమి లాంటి సహజ వనరులను పెద్ద ఎత్తున అదుపులో పెట్టుకున్న కొత్త, పాత భూస్వాములు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పరిపాలనా, సేవా రంగాలలో కొందరు ఉన్నత స్థానాలకు ఎగబాకిన వ్యక్తులు ఉన్నారు.
ప్రభుత్వాల విధానాల కారణంగా మొదటి దశలో ధనిక వర్గంతో పాటు, ఒక మేరకు ప్రయోజనం పొందిన మధ్యతరగతి సమూహం, మధ్య తరహా వ్యాపారులు, చిన్న పరిశ్రమ యజమానులు - 1991 నుండీ నూతన ఆర్ధిక, పారిశ్రామిక విధానాలు అమలై , సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నినాదాలు ముందుకు వచ్చాయి. బడా వ్యాపారులు , చిన్న వ్యాపారులను మింగేశారు. బడా కాంట్రా క్తర్ లు చిన్న కాంట్రా క్తర్ లను మింగేశారు. విదేశీ బహుళ జాతి కంపనీలు ల, దేశీయ చిన్న పరిశ్రమలను మింగేశాయి. విద్యా, వైద్యం సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరమయ్యాయి. “ప్రభుత్వ రంగం పనికి రాదు, ప్రైవేట్ రంగమే బెస్ట్” అనే భావన సాధారణ ప్రజలలో కూడా కలిగించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే నీతి నియమాలు, విలువలు లేని కొత్త తరం ఒకటి, రాజకీయాలలోకి ప్రవేశించి, అన్ని రాజకీయ పార్టీలను ఆక్రమించి, ధన బలంతో అధికారం చేజిక్కించుకోవడం ప్రారంభమైంది.
పేదల జీవితాలు కొన్ని సంక్షేమ పథకాలపై ఆధార పడేలా చేసి, బడ్జెట్ లో కొంత భాగాన్ని ఈ పథకాలకు కేటాయించి, మిగిలిన ఆర్ధిక , సహజ వనరులను , అధికారంలో ఉన్న వర్గాలు , అధికారంలో ఉన్న వారి ప్రాపకంతో మిగిలిన ధనిక వర్గాలు కొల్ల గొట్టడం ప్రారంభించాయి. అధికారమూ, ధనిక వర్గ స్వామ్యమూ జమిలిగా కలిసి నడుస్తున్న కాలాన్ని మనం చూస్తున్నాం.
రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా “ఏ రంగంలో అయినా గుత్తాధిపత్యం తప్పేమీ కాదనే ” అభిప్రాయం సమాజంలో కలిగేలా నిరంతర ప్రచారం సాగింది. శక్తి ఉన్న వాళ్ళే పోటీలో నిలబడతారనే వాదన కూడా బలంగా వినిపించారు. ఇలాంటి విధానం అమలులో నైతిక తప్పేమీ లేదని కూడా ఈ వర్గాల భావన.
అన్ని రంగాలలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. రైతుల నుండీ తక్కువ పరిహారం చెల్లించి, భూములు బలవంతంగా లాక్కుని దేశ, విదేశీ బడా కంపనీలకు తక్కువ ధరలకు కట్టబెడుతున్నారు. సాగు నీటిని మళ్ళించి, పరిశ్రమలకు ఇస్తున్నారు. పారిశ్రామిక జోన్ ల పేరుతో కాలుష్య కారక పరిశ్రమలకు కూడా అనుమతులు ఇచ్చేస్తున్నారు.
వ్యాపార రంగంలో,ముఖ్యంగా రిటైల్ వ్యాపార రంగంలో కూడా బడా కార్పోరేట్ కంపనీల ఏర్పాటుకు అను మతులు ఇచ్చారు. అమెరికా, యూరప్ లకు చెందిన అమెజాన్, మెట్రో, వాల్ మార్ట్ లాంటి సంస్థలు ఇప్పటికే తెలంగాణా రిటైల్ రంగంలోకి విస్తరించాయి. మోర్, జియో, స్పెన్సర్స్, రిలయెన్స్, డి.మార్ట్ లాంటి దేశీయ బడా సంస్థలు కూడా తెలంగాణా మార్కెట్ ను ఆక్రమిస్తున్నాయి.
భారత దేశంలో రిటైల్ రంగంలో అనుమతులు ఇవ్వడానికి తొలి దశలో పెట్టిన నిబంధనలు కూడా తొలగించి, చిన్న, పెద్ద పట్టణాలకు కూడా వాళ్ళు విస్తరించేలా ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ బహుళ జాతి రిటైల్ సంస్థలు, స్థానిక రైతుల నుండీ, ఉత్పత్తిదారుల నుండీ ఉత్పత్తులు కొనాలనే నిబంధన, హోల్ సెల్ వ్యాపారం తప్ప రిటైల్ షాప్ లను ఆ సంస్థలు నడపకూడదనే నిబంధన ఆచరణలో అమలు కాలేదు.
“ఒకే దేశం – ఒకే మార్కెట్ పేరుతో “ రాష్ట్రాల మధ్య సరిహద్దులు చెరిపేసి , చెక్ పోస్టులను తొలగించేలా రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నారు. 2024 లో తెచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ ల విధానం, 2025 లో తెచ్చిన జాతీయ సహకార విధానం ఈ క్రమంలో వచ్చినవే. 2020 లో మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు ఈ కోవకు చెందినవే. రైతుల, ప్రజల సమిష్టి ఉద్యమం కారణంగా ఈ మూడు చట్టాలు వెనక్కు పోయినా, వాటి సారాంశం మాత్రం అమలులో ఉంది.
గత మూడు దశాబ్దాలలో మన దేశంలో ఈ అన్ని పరిణామాలూ జరగడానికి అంతర్జాతీయంగా కూడా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ లాంటివి కీలక పాత్ర పోషించాయి.
ఈ సంస్థల ప్రధాన ఉద్దేశ్యం భారత దేశాన్ని అభివృద్ధి చేయడం కాదు. స్థానిక వనరుల ఆధారంగా మన స్థానిక ప్రజల జీవితాలను బాగు చేయడం కాదు. దేశంలో ప్రభుత్వ రంగ పాత్రను కుదించి, చిన్న పరిశ్రమలను మూతపడేలా చేసి, బడా వాణిజ్య, పారిశ్రామిక సంస్థల మార్కెట్ విస్తరణకు మార్గం సుగమం చేయడం.
మన దేశ ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాలు విధించడం, మన దేశానికి సరఫరా అయ్యే, విదేశీ సరుకుల దిగుమతులపై దిగుమతి సుంకాలు తగ్గించాలని ఒత్తిడి చేయడం ఈ సంస్థల పనిలో ఒక ముఖ్యమైన భాగం. ఇటీవల భారత ప్రభుత్వాలు చేసుకుంటున్న ఏ ఒక్క స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని పరిశీలించినా ఇదే మనకు కనిపించే విషయం.
నిజానికి ఈ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల బలమైన ఉద్యమాలు నిర్మించి వాటిని తిప్పి కొట్టాల్సి ఉంటుంది. కానీ ప్రపంచీకరణ వాళ్ళ కలిగిన ఆర్ధిక, సాంస్కృతిక ప్రభావాలు ఈ ఉద్యమాల నుండీ మధ్య తరగతిని దూరం చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ బలమైన కార్మిక , ఉద్యోగ సంఘాలను బలహీన పరిచింది. విపరీతంగా విస్తరించిన అసంఘటితరంగంలో కార్మికులు నిస్సహాయంగా దోపిడీకి గురవుతున్నారు.
ఈ మధ్య కాలంలోనే వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు కొన్ని ప్రజాస్వామిక డిమాండ్లను ముందుకు తెచ్చినప్పటికీ, అంతిమంగా ఈ అస్తిత్వ ఉద్యమాల కారణంగా సమాజంలో ఆయా పేద సామాజిక వర్గాలు చీలికలు, పీలికలకు గురయ్యాయి. కష్ట జీవుల గొంతుగా బలంగా పని చేసిన కమ్యునిస్టు ఉద్యమం కోడా చీలిపోయింది. బలహీన పడింది. ఫలితంగా బలమైన ఉద్యమం కాదు కదా, పేదల పక్షాన బలమైన గొంతు కూడా వినిపించగలిగే స్థితి లేకుండా పోయింది.
ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పడిన ప్రతి సందర్భంలో రెండు రకాల వ్యక్తీకరణలను మనం చూస్తున్నాం, ఈ విధానాలను మనం ఆపలేమనే నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడడం ఒక ధోరణి కాగా, ఈ సమస్యలకు కారణం ఒక సామాజిక వర్గమనో, కొన్ని సమూహాల ప్రజలనో భావించడం మరొక ధోరణి .
ముస్లిములకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మిగిలిన సమాజంలో పెరిగిన హిందుత్వ భావజాలం, తమకు ఉపాధి అవకాశాలు తగ్గిపోవడానికి సామాజికంగా అట్టడుగు వర్గాల సమూహాలకు ప్రభుత్వాలు అందించే రిజర్వేషన్ లు ప్రధాన కారణమని భావించే ఆధిపత్య కులాల భావజాలం లాంటివి ఈ కోవకు చెందుతాయి.
ఈ భావజాలాన్ని పెంచి పోషించడంలో ప్రజాస్వామిక విలువలకు, సెక్యులర్ విలువలకు వ్యతిరేకమైన సంఘ్ పరివార్ లాంటి సంస్థలు మన సమాజంలో ముఖ్యమైన పాత్ర పోస్తున్నాయి. ఈ శక్తులు ఒక వైపు దేశంలో కార్పోరేట్ అనుకూల ఆర్ధిక విధానాలను ముందుకు నెడుతుంటాయి. మరో వైపు మతం పేరుతో, అత్యంత అనాగరిక, రాజ్యాంగ వ్యతిరేక, ఫ్యూడల్, మనువాద సంస్కృతిని, అలాంటి శక్తులను ప్రోత్సహిస్తుంటాయి.
వ్యాపారంలో విస్తరణ వాద, గుత్తాధిపత్య ధోరణులను, సాంస్కృతికంగా హిందుత్వ ఫాసిస్టు ధోరణులను తమలో మిళితం చేసుకున్న గుజరాతీ, రాజస్థానీ, తదితర ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారస్తులకు సమర్ధనగా బీజేపీ అగ్ర నాయకులు ముందుకు రావడం ఇందులో భాగమే.