ఒక వేళ సుదర్శన్ రెడ్డి ఓడిపోయినా గెలిచినట్టే...

జస్టిస్ సుదర్శన రెడ్డి తీర్పులు అర్థమయితే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవుతారు...;

Update: 2025-08-24 10:49 GMT

ఈ మధ్య ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి రాజీనామా చేసారు. అదొక మిస్టరీ. వెంటనే ఎన్నికలు జరగాల్సిందే. మరి మనది ప్రజాతంత్రం కనుక, మనందరికీ స్వాతంత్య్రం ఉంది కనుక! మనకు రిపబ్లిక్ ఉంది కనుక, తప్పనిసరిగా ఉప రాష్ట్రపతి ఉండాల్సింది. ప్రహసనం వంటి ఎన్నిక మొదలైంది. పోటీ ప్రారంభమయింది.

మన తాజా మాజీ ఉపరాష్ట్రపతి ని ఎంతగా దిగజార్చారంటే ఆయన కన్నా తీసేసిన తాసీల్దార్ కు (మాయాబజార్ తరువాత కొత్త పదాలు సృష్టించిన వారిలో తీతా అనే అద్భుత పదాన్నిపుట్టించిన వారు బాపు రమణ) ఎక్కువ విలువ ఉంటుందేమో. తుమ్మితే ఊసే పోయే గవర్నర్, లేదా ఉపరాష్ట్రపతి పదవి అయినా సరే, వారికి రాజ్యాంగ హోదా ఉంటుంది. అయినా కొత్త అభ్యర్థులకోసం  బిజెపి, కాంగ్రెస్ తదితర మిత్రులు ఒకరినొకరు నిందలు వేసుకోవడం మొదలైనాయి.

అర్బన్ నక్సలైట్

జస్టిస్ (రిటైర్డ్) బి సుదర్శన్ రెడ్డి నక్సలిజం కు సహాయం చేసినవాడు అని సాక్షాత్తూ హోం మంత్రి గారు సెలవించారు. పూర్తిగా అర్బన్ నక్సలైట్ అనలేదు కాని, దాదాపు అంతపని చేసారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పిందేమంటే, ‘‘సాల్వా జుడుం తీర్పును నేను ఇవ్వలేదు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాత్రమే’’ అని స్పష్టం చేసారు.

సుప్రీంకోర్టు తీర్పును ఒకానొక జడ్జిగారు ఇచ్చారనడం  ఏమాత్రం సరికాదు. బిజెపి వ్యతిరేకులు నిందించడానికి, బిజెపి అభిమానులు, తీర్పులు చదవని మేధావులు, చదివినా అర్థం చేసుకోలేని విద్యావంతులు, కేవలం నాలుగేళ్లపాటు డిగ్రీ చదవగానే నెలనెలా పాకేజ్ జీవితం సాధించిన అనేక మంది అదృష్టవంతులు ఇపుడు సుదర్శన్ రెడ్డిని ‘అర్బన్ నక్సలైట్’ అని తిడుతూ ఉన్నారు. దీన్ని విమర్శ అనడానికి వీల్లేదు. ఇవి తిట్లు. సమాజం గురించి తెలియని వాళ్లు, క్రికెట్ ఆడకుండా, టీవీలో క్రికెట్ ముందు కూచుని, సాఫ్ట్ వేర్ సెలవు తీసుకుని, ఆదివారం అయితే చాలు మిరపకాయి బజ్జీలు, బర్గర్లు, పిజ్జాలు నములుతూ క్రికెట్ ను ఆడినంత ఆవేశంగా ఎంజాయ్ చేసే బాధ్యతారహితులకు ఈ విమర్శల గురించి తెలియదు. వారు పత్రికలు చదవరు. ఎడిట్ పేజి ఎందుకు దండగ అన్నట్టు సినిమా తప్పా ఏదీ చూడరు. ఏవీ వినరు.

‘ఓట్ చోరీ’ (Vote Theft) తెలియని వీరులు

ఇక మన ఓటు దుస్థితి. అన్నింటి కన్నా దారుణమేమంటే వయోజనులు కనీసం ఓట్లు వేయరు. ఓటు ఉందో లేదో కూడా మిడిల్ క్లాస్ పెద్దలు వెతుక్కోరు. ఇలాంటి వాళ్లు పోలింగ్ స్టేషన్ దాకా వెళ్లి అక్కడ క్యూలో నిలబడి బాధ్యతగా ఓటేస్తారని ఏలా ఆశించగలం. 14‌0 కోట్ల మంది జనాభా భారత్ ఛాతీ చరుచుకుని మొగాళ్లోలో చాలా మంది ఓట్లు వేయరు. కాబట్టి ‘వోట్ చోరీ' అంటే ఏమిటో తెలియదు. ఇలాంటి వాళ్లకు గ్రామాల్లో జనం మీద పడి దోపిడీ చేసే వారిని వ్యతిరేకించి పోరాడే దమ్ము ఎవ్వడికీ ఉంటుందా? రేపిస్టులనుంచి రక్షించే ఈవీర హీరోలు కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తారు. ఎక్కడోధర్నాలో కొద్ద సేపు నిలబడి పోటో తీయించుకున్న వెంటన వెళ్లిపోయి, ఆపైన పోరాడినట్టు నటించే వారు ఎమ్మెల్యే , ఎంపీలు అయిపోతూన్నారు. మరొక వైపు   అభిమానుల హీరోల సినిమాలను   పదివేల రూపాయలైనా సరే తగలేసి థియేటర్లో చిప్స్ తింటూ తనివితీరా ఆనందించే వాళ్లు ఎక్కవువున్నారు. ఇక   ఎలెక్షన్ కమిషన్ (Election commission) అనే ఈ.సి లో సాగుతున్న వింతవిడ్డూరాల గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది వీళ్లకి.

శకుని చాణక్యం ముందు ఎవరు గెలుస్తారు?

ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నేషనల్ డెమోక్రటిక్ ఎలయన్స్  (NDA) అభ్యర్థి అయిన  సి పి రాధాకృష్ణన్ గారితో ఢీ కొడుతున్నారు. చాణక్యంలో నిపుణులైన శకుని సహా దుష్టచతుష్టయం వల్ల 100 మంది కౌరవులే గెలుస్తారు, గ్యారంటీ. వైస్ ప్రెసిడెంట్ పోటీలో వోట్ చోరీ కూడా జరుగుతుందో లేదో గాని క్రాస్ ఓటింగ్ జరగవచ్చు. ఫిరాయింపులు కేసులు రావచ్చు. హటాత్తుగా పార్టీ మార్చిన మహానుభావులు కూడా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వైపుకు మారిన 10 మంది బి ఆర్ ఎస్ ఫిరాయింపు వీరులు ఇటు ఓట్లు వేస్తారు. సిగ్గు విషయం పక్కనుంచితే, వేసినా వేయకపోయినా కేసులు పెడతారు. ఓడిపోయినా, గెలిచినా ఫరవాలేదు. అనవసరం లేదు.

ఆ 11 తో కుమ్మక్కైన ముగ్గురు

 11 మంది ఆటగాళ్ల క్రికెట్ లో ఇద్దరు అంపైర్ లు (మూడో కెమెరాతో)  ఉన్నట్లు ముఖ్యంగా ముగ్గురు ఎన్నికల కమిషన్ల వంటి మహానుభావులు అధికార పార్టీతో సఖ్యంగా ఉంటూ ఏమి మిరకిల్స్ చేస్తారో చెప్పలేం. ఎన్నికల కమిషన్ (ఇసి) పెద్దలు ప్రతిదానికి అఫిడవిట్ అడుగుతున్నారు. వీరు ఎంపీగారా లేదా అని ఆధార్ కార్డు ఉందా అనీ అడగవచ్చు. అసలు నువ్వు వోటర్ వేనా కాదా లేదా అంటూ ఈసిగారే బి సుదర్శన్ రెడ్డి గారిని అడగవచ్చు. ఇవ్వాళటి పరిస్థితి ఇది.

రిగ్గింగా ఓటింగా,   నెగ్గడమే ముఖ్యమే

అసలు ఓట్లు పడతాయా? వోట్ చోరీని ఆప గలరా? ఇదివరకు రిగ్గింగ్ అని అనే వాళ్లం. కాని మన హై టెక్ (టెక్నాలజీ) దొంగతనాలు సులువైపోయినాయి. నిపుణుల్లో ఎవరికీ ఆలోచన రాదు. వాళ్లేవీ చదవరు. తెలుసుకునే ప్రయత్నం చేయరు.

రిజల్ట్ మాకు తెలుసు

కనుక ఎన్ డి ఎ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతిగా గెలుస్తారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రపతి గా నైనా గెలుస్తారు. మనమంతా ఎవడి పనులో వాళ్లుంటారు. అందరంగా బిజీగా ఉంటాం. ముందు గణపతి నవరాత్రులు, ఆ పదిరోజుల పాటు కాలం గడిచిపోతూ ఉంటుంది. తరువాత అమ్మవారి పూజల పదిరోజులు జరుగుతాయి. ఇక ఈ పనుల్నీ అయిపోతే కొత్త ఉపరాష్ట్రపతికి సన్మానాలు చేస్తూ ఉంటారు.

కనీసం ఒక్కడు కూడా ఇంతకుముందున్న ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగ్దీప్ ధంకడ్ ఎందుకు రాజీనామా చేసాడని పాత ఉపరాష్ట్రపతిగారో కొత్త రాష్ట్రపతిగారో కూడా అడగరు.  రాబోయే ఎన్నికయిన ఉపరాష్ట్రపతి కూడా అడగరు. ఆలోచన చేయరు. అది ఆయనకు అనవసరం. పొరబాటున గెలిస్తే జస్టిస్ (మాజీ) బి సుదర్శన్ రెడ్డి గారు మాత్రం ఈవిషయంలో నిలదీసే అవకాశం ఉంది. అదో గొడవ. చిత్రమేమిమంటే ఈ ఎన్నికల్లో ఓటేయ బోతున్న ఓటర్లు, వాళ్లంతా ఎంపీలు, వాళ్లలో  ఒక్కరంటే ఒక్కరికి ఈ ప్రశ్న రాదు, జవాబు వెదికే ప్రయత్నం చేయరు.

ప్రైవేట్ సైన్యం

మావోయిస్టులతో వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ సైన్యం పుట్టించి దానికి కోయా కమాండ్స్ అంటూ  సాల్వాజుడుం చేసిన బీభత్సాలు చూశాక ఇది  రాజ్యాంగ వ్యతిరేకం అని జడ్జి బి సుదర్శన్ రెడ్డి. ఎస్ ఎస్ నిజ్జార్ (ఇద్దరు సభ్యులతో)లు ఉన్నసుప్రీంకోర్టు ధర్మాసనం అని 2011లో తీర్పు చెప్పింది. ధర్మాసనం అనీ, 2011 సంవత్సరం అనేవి అంశాలు. ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలున్నారు. కనుక ఇది రెడ్డిగారి సొంత తీర్పు కాదు.  ఒకే జడ్జి నిర్ణయం అనుకున్నా ఇది ఆ జడ్జిగారి సొంత వ్యవహారం కాదు. సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటించిన తీర్పు. అది కోర్టు తీర్పు. దానిని జడ్జికి అపాదించడం ఎంత నేరమో చెప్పాల్సిన పనిలేదు.  2011లో ఉన్నది బిజెపి ప్రభుత్వం కాదు కనుక కాంగ్రెస్ వారుదానిని సమర్ధించారనడానికి వీల్లేదు. ఇలా నక్సల్ అనుకూల తీర్పు ఇచ్చిన న్యాయవాది  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఆంధ్రపదేశ్ హైకోర్టుకు జడ్జి గా నియమితులయ్యారు. మరి దీన్ని కూడా చెప్పాలిగా. ఇలా అనదలచుకుంటే చాలా సమస్యలు ఉంటాయి. అందుకే ఆవిషయం జోలికి వెళ్లరు.

ఫిరాయింపులు లేకపోతే రాజ్యాంగమే ఉండదు

ఫిరాయింపులు లేకపోతే రాజ్యాంగమే ఉండదు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి వంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎన్నో సార్లు పార్టీ మారారు. స్వయంగా చంద్రబాబు పార్టీ ఫిరాయించి ఎన్ డి ఎకు వచ్చి, మళ్లీ మాట మార్చారు.  పార్టీ మార్చారు. దీన్ని ఏ లెక్కలో వేసుకుంటారు? ఈనాటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రాలు అటూ ఇటూ మారి మారన వారే.   చంద్రబాబు అటూ ఎన్డీయేని అభ్యర్థిని  సమర్థించారు. ఒక జగన్ రెడ్డి కూడా ఎన్ డి ఎ ను సమర్థించినా ఆశ్చర్యం లేదు.  కాంగ్రెస్ ను బిజెపిని వ్యతిరేకించి బి ఆర్ ఎస్ నేత కె చంద్రశేఖర రెడ్డి కూడా ఇటువైపే ఓటు వేయకపోవచ్చు. ఈ మధ్యలో సాల్వాజుడుం తీర్పు గురించి ఏ లెక్కలో వేసుకుంటారు?

మురికి డబ్బు

ఒకటీ రెండు లక్షల కోట్లు కాదు. భారతదేశాన్ని కొల్లగోట్టిన 462 బిలియన్ అమెరికన్ డాలర్ల నల్ల డబ్బు కేసు సంగతేమిటి. మనం మతం మత్తులో ఎన్నికల వాగ్దానాలు ఎప్పుడో మరిచిపోయాం. ఇది బిజెపి ఖాతాలో వేస్తారా లేక కాంగ్రెస్ కా?  నల్లడబ్బు ని ప్రపంచం నుంచి పట్టి బంధించి, భారతదేశానికి తెచ్చుకోగలిగితే వరసగా గెలవడం బిజెపి సాధ్యమే కదా. జస్టిస్ సుదర్శన్ నల్లడబ్బు కేసులను ప్రభుత్వం నీరు గారుస్తున్న విషయాన్ని తప్పుపట్టారు. నిజానికి ఆయన నల్లడబ్బు  నిర్మూలన గురించి ఇచ్చిన తీర్పులకు   అద్భుతమైన సుప్రీంకోర్టు జడ్జి అని ప్రశంసిస్తూ  పద్మవిభూషణ్ ఇవ్వాలి. ఆ లెక్కన సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్రపతి కావాలి కదా.  జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పు గనుక అర్థమయితే, కనీసం ఉపరాష్ట్రపతి పోటీలోఎన్ డి ఎ  ఆయనని ఏకాభిప్రాయంగా గెలిపించి తీరాలి. సరే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తావన అవసరం. సుదర్శన్ రెడ్డి పేరున ఈ దేశాన్ని గెలిపించిన సుప్రీంకోర్టు తీర్పు నిజంగా అమలు చేయదలచుకుంటే బిజెపి ఎన్నడూ ఓడిపోవడానికి వీల్లేదు?

అది సరే, చివరకు అయోధ్యలో అతిభవ్యమైన రామమందిరం అద్భుతంగా నిర్మించడం కోసం, ఒక మాజీ ఛీఫ్ జస్టిస్ కు ఎంపీ పదవి ఇవ్వడం కోసం తహతహలాడి, దిగజారే అవసరం వచ్చే ఉండదే కాదా.

ఎవరిని ఏమని ఏం లాభం? ఆ సిద్ధాంతాలు, సూత్రాలు ఇప్పుడెక్కడున్నాయి.

కనుక, గెలుపు ఓటమి గురించి తెలియని మిస్టరీ ఏమీ లేదు. జస్టిస్ (రిటైర్డ్) బి సుదర్శన్ రెడ్డి ఓడిపోవడం పక్కా. కాని నిజంగా గెలిచేది సుదర్శన్ రెడ్డి గారే.

Tags:    

Similar News