స్త్రీ పారంపర్యంలో మేనమామ పాత్ర ఎలాంటిది?

రామాయణంలో నిరుత్తరకాండ-20 పురాణాలలో మేనమామలకు అంత ప్రాముఖ్యం ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచొచ్చింది?

Update: 2024-08-22 12:59 GMT

ఇంటిపేరైనా, కుటుంబవారసత్వమైనా, ఆస్తైనా, అధికారమైనా తండ్రినుంచి కొడుక్కి సంక్రమించడం అనేది అనాదిగా జరుగుతున్న అతిసహజ ప్రక్రియగా మనకీరోజు అనిపిస్తుంది. అది అలా తప్ప ఇంకోలా జరగడాన్ని మనం ఊహించుకోలేం. కాలం మన ఊహకు చేసే కట్టడి అది. ఆ కట్టడి వెనుక సహజంగానే ఎంతో కసరత్తు, పెనుగులాట జరిగి ఉంటాయి. వారసత్వసంక్రమణ తల్లి పరంపరనుంచి తండ్రి పరంపరకు మారే క్రమంలో జరిగిన ఆ కసరత్తుకూ, పెనుగులాటకూ చెందిన సాక్ష్యాలు మనం ఇప్పటికీ పాటిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, ఆనవాయితీల్లోనూ, ఆయా సంస్కారాల తాలూకు క్రియాకాండలోనూ; ప్రాచీన అలిఖిత, లిఖితవాఙ్మయంలోనూ కనిపిస్తూనే ఉంటాయి.

హిట్టైట్ల చారిత్రకపత్రాలలో లభిస్తున్న ఒక ఆధారాన్ని చూద్దాం:

మార్క్ డబ్ల్యు. చవాలస్(Mark W. Chavalas) ‘ది ఏన్షియెంట్ నియర్ ఈస్ట్’ అనే తన పుస్తకంలో పొందుపరచిన, తొలి హిట్టైట్ రాజుల నాటి ఒక పత్రం ప్రకారం, హత్తూసిల్-1 అనే రాజుకు హుజ్జీయ అనే కొడుకు, (పేరు తెలియని) ఒక కూతురు ఉన్నారు. కానీ హత్తూసిల్-1 తన కొడుకును కాకుండా, మేనల్లుడైన ‘లబర్న’ను సింహాసనానికి వారసుణ్ణి చేశాడు. అతను హత్తూసిల్-1కు మేనల్లుడే కాక, దత్తపుత్రుడు కూడా. ఇది హత్తూసిల్-1 సొంత కొడుకైన హుజ్జీయకు కడుపుమంట అయింది...

సొంత కొడుకు ఉండగా, మేనల్లుడు ఎలా వారసుడయ్యాడనే ప్రశ్న, ఆ పత్రం వెల్లడైన దరిమిలా పరిశోధకుల్లో తలెత్తి, హిట్టైట్ తొలి రాజుల కాలంలో వారసత్వనియమాలు ఎలా ఉండేవన్న చర్చకు పెద్ద ఎత్తున దారితీసింది. 1998లో సురెన్ హేగన్(Surenhegan) అనే పండితుడు దీని గురించి రాస్తూ, హిట్టైట్ పాలన తొలి రోజుల్లో సింహాసనవారసత్వం మేనల్లుడికి సంక్రమించే పద్ధతి ఉండేదని తేల్చాడు. దీనిని అవాంక్యులేట్(avunculate)సూత్రం కింద వర్గీకరించాడు. ఇక్కడ ఆసక్తిగొలిపే చిన్న వివరం ఏమిటంటే, హిట్టైట్ రాజులు అధిష్ఠించే అధికారాసనాన్ని కూడా సింహాసనమనే అనేవారు. అక్కడే కాక, ప్రాచీన ట్రాయ్, మైసీనియా మొదలైనచోట్ల కూడా సింహం రాజచిహ్నాలలో ఒకటిగా ఉండేది. మనకూ, బయటివారికీ మధ్య ఇలాంటి సామ్యాలు ఇంకా అనేకం కనిపిస్తాయి. విషయాంతరం అవుతుంది కనుక ఇప్పుడు అందులోకి వెళ్ళడం లేదు.




 ‘అవాంక్యులేట్(avunculate)’ అనే మాట లాటిన్ పదమైన ‘avunculas’ నుంచి వచ్చింది. ఒకింత విషయాంతరమే కానీ, దీని వ్యుత్పత్తి చరిత్రను తెలుసుకోవడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. వ్యుత్పత్తి నిఘంటువు ప్రకారం ఈ మాటే ఓల్డ్ ఫ్రెంచ్ లో ‘oncle’ గానూ, దానినుంచి జర్మన్, డేనిష్, స్వీడిష్ భాషల్లో onkel గానూ మారి; ఇప్పుడు ఇంగ్లీష్ లో ‘అంకుల్(uncle)’గా వ్యవహారంలో ఉంది. దీనికి ‘తల్లి సోదరుడ’ని మాత్రమే తొలి అర్థం. తండ్రి సోదరుని తెలిపే లాటిన్ మాట, patruus అనేది. Avunculas, లేదా uncle అనే మాటను ‘చిన్న తాత’ అనే అర్థంలో కూడా వాడతారు. దీని హ్రస్వరూపం, ‘avus’. దీనికి ‘తాత’ అని అర్థం. ప్రోటో-ఇండో-యూరోపియన్(పీ ఐ ఈ) లోని *awo- అనేది దీనికి మూలం. ఇది తాతకే కాకుండా; తండ్రి మినహా, వయసులో పెద్ద అయిన ఇతర పురుషబంధువులకూ వర్తిస్తుంది. ‘తాత’ అనే అర్థం కలిగిన ఆర్మీనియాలోని ‘hav’ కు, హిట్టైట్ లోని ‘huhhas’ కు; మేనమామ అనే అర్థం కలిగిన లిథుయేనియాలోని avynas కు, ఓల్డ్ చర్చ్ స్లావోనిక్ లోని ‘ugi’ కి పైన పేర్కొన్న *awo- అనే పీ ఐ ఈ శబ్దమే మూలం. ఈ మూలపదం తల్లి పారంపర్యానికి చెందిన కుటుంబసభ్యులనే సూచిస్తుందన్న అభిప్రాయం కూడా భాషాశాస్త్రజ్ఞులలో వ్యక్తమైంది. ఓల్డ్ ఇంగ్లీష్ కు వస్తే, ‘eam’ అనే మాట ప్రత్యేకించి తల్లి సోదరుని, అంటే మేనమామను సూచించేది కాగా; తండ్రి సోదరుని ‘faedra’ అనేవారు.

ఈ ‘అవాంక్యులేట్’ వ్యవస్థలో రాజుగా ఉన్న వ్యక్తి సోదరికి, అతని సొంత కొడుకుకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆ సోదరి కొడుకు- అంటే రాజు మేనల్లుడు సింహాసనానికి హక్కుదారు అవుతాడు. రాజుకు సొంత కొడుకు మీద ఉండే అధికారం కన్నా ఎక్కువ అధికారం మేనల్లుడి మీద ఉంటుంది. మేనల్లుని పెంపకంలో కూడా అతనికి కీలకపాత్ర ఉంటుంది. ఆవిధంగా మేనమామకు, అంటే ప్రస్తుతసందర్భంలో రాజుకు- మేనల్లుడు దత్తపుత్రుడు కూడా అవుతాడు. హిట్టైట్ రాజు హత్తూసిల్-1 కు ఈ ఆనవాయితీ ప్రకారం మేనల్లుడైన లబర్న న్యాయబద్ధమైన వారసుడయ్యాడు. తనే లబర్నకు చదువుసంధ్యలు చెప్పించి ప్రయోజకుణ్ణి చేశానని హత్తూసిల్-1 స్వయంగా చెప్పుకోవడం చారిత్రకపత్రాలలో కనిపిస్తుంది.

ఈ ‘అవాంక్యులేట్’ వ్యవస్థలో భాగంగా కజిన్స్ మధ్య వివాహం అనే ఒక ప్రత్యేకరూపం అమలులోకి వచ్చిందని- హిట్టైట్ల సందర్భంలో సురెన్ హేగన్ అంటాడు. అన్నదమ్ముల పిల్లలూ, సోదరీ, సోదరుల పిల్లలు ఒకరికొకరు కజిన్స్ అవుతారన్నది తెలిసినదే. ఆ క్రమంలో సింహాసనానికి హక్కుదారైన రాజు మేనల్లుడి సోదరి, అంటే రాజు మేనగోడలు- రాజు కొడుకును, అంటే తన మేనబావను పెళ్లాడుతుంది. వారికి కలిగే కొడుకు సింహాసనానికి హక్కుదారు అవుతాడు. అంటే ఏమిటన్నమాట...రాజు సొంత కొడుకు ఎప్పటికీ సింహాసనానికి హక్కుదారు కాలేడు; రాజు మనవడు అవుతాడు. ఆవిధంగా, భవిష్యత్తులో రాజు కాబోయే వ్యక్తి సోదరికి ఈ ఏర్పాటులో కీలకపాత్ర ఉంటుంది; ఎందుకంటే, రాజ్యానికి వారసుణ్ణి అందించవలసినది ఆమె మాత్రమే. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ వ్యవస్థలో ఇటు స్త్రీ పారంపర్యానికీ, అటు పురుషపారంపర్యానికీ మధ్య అధికారం పంపకం జరుగుతూ ఉంటుంది. అంటే, రెండు పారంపర్యాల మిశ్రమదశను ఇది సూచిస్తుందన్నమాట.

ఈ ‘అవాంక్యులేట్’ వ్యవస్థను వ్యతిరేకిస్తూ హత్తూసిల్-1 సొంత కొడుకైన హుజ్జీయ, అతని అనుయాయులు అంతఃపుర కుట్రలకు, హత్యలకు పాల్పడినట్టు, హుజ్జీయ రాజైనట్టు పై చారిత్రకపత్రం చెబుతోంది. అలాంటి హత్యాప్రయత్నం నుంచి తప్పించుకున్న తెలిపిను(Telipinu) అనే రాచకుటుంబ సభ్యుడు, హుజ్జీయను తొలగించి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. వారసత్వం గురించిన వివాదం ముదిరి ఇలా కుట్రలకు, హత్యలకు దారితీస్తున్న దృష్ట్యా, ఈ వ్యవస్థను సంస్కరించడానికి అతను పూనుకున్నాడు. హిట్టైట్ రాచకుటుంబంలో అలా పుట్టినదే- పితృస్వామికవారసత్వవ్యవస్థ. ఇక అప్పటినుంచి స్త్రీ పారంపర్యాన్ని పూర్తిగా పక్కనపెట్టి రాజు సొంతకొడుకే సింహాసనానికి వారసుడయ్యే వ్యవస్థ అమలులోకి వచ్చింది...

వాస్తవానికి హిట్టైట్లది పితృస్వామిక సామాజికవ్యవస్థ అయినప్పటికీ మొదట్లో ‘అవాంక్యులేట్’ వ్యవస్థను అనుసరించడం ఎలా సాధ్యమైందన్న ఆశ్చర్యమూ చరిత్రకారులలో వ్యక్తమైంది. ఎంత పితృస్వామికమైనా ముందునుంచీ అన్ని సామాజికరంగాలలోనూ బలంగా వేళ్లూనుకుని ఉన్న మాతృస్వామిక ఆచారాలనూ, ఆనవాయితీలను ఉన్నపళంగా తొలగించి కొత్త వ్యవస్థను పుట్టించడం అంత తేలిక కాదన్నదే దీనికి చెప్పుకోగలిగిన సమాధానం.

విశేషమేమిటంటే, మూడువేల అయిదువందల సంవత్సరాల వెనకటి కాలానికి చెందిన హిట్టైట్లలోని అన్నదమ్ముల పిల్లలు, ఆక్కచెల్లెళ్ల పిల్లలమధ్య వివాహసంబంధాలు; అంతకంటె ముఖ్యంగా మగపిల్లవాడికి, ఆడపిల్లకు చెందిన ఆయా తంతులలో మేనమామకు గల పాత్ర; పెళ్లై అత్తింటికి వెళ్ళినప్పటికీ కూతురు, లేదా సోదరి పోషణబాధ్యత పుట్టింటివారిపైనే ఉండడం, ఇప్పటికీ ఆ ఆనవాయితీ రకరకాల పెట్టుపోతల రూపంలో కొనసాగుతూనే ఉండడం మన దగ్గర కనిపిస్తుంది. కూతుళ్లే తప్ప కొడుకులు లేనప్పుడు కూతురి కొడుకుని, అంటే దౌహిత్రుని కొడుకుగా స్వీకరించడం, ఆస్తితోపాటు తనకు, తన భార్యకు అంత్యక్రియలు జరిపే అధికారాన్ని కూడా అతనికి కట్టబెట్టడం ధర్మశాస్త్రబద్ధమైన ఏర్పాటుగా ఇప్పటికీ మన దగ్గర కొనసాగుతూనే ఉంది. ఇది హిట్టైట్ రాచకుటుంబానికి సంబంధించి పైన చెప్పుకున్న వారసత్వవ్యవస్థకు ఎంత దగ్గరగా ఉందో గమనించవచ్చు.

తిరిగి మేనమామ ప్రాధాన్యానికి వస్తే, నిజానికది మన దగ్గరే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాచీనసమాజాల్లో కనిపిస్తుంది. ఆధునికకాలంలో ఎంతోమంది పురామానవ శాస్త్రజ్ఞులు అలాంటి సారూప్యాలను ఎత్తిచూపారు. మోర్గన్ సందర్భంలో చెప్పుకున్నట్టు గణసమాజవ్యవస్థా, స్త్రీపారంపర్యం, అది పురుషపారంపర్యంలోకి మారడం; అందుకు వేట-ఆహారసేకరణ దశనుంచి పశుపోషణ, వ్యవసాయం తదితర దశలకు జరిగిన పరిణామం దోహదం కావడం అనేవి ఏ ఒక్క చోటనో కాకుండా, ప్రపంచమంతటా జరిగాయి.

పురాణ, ఇతిహాసకథలలో ఈ మార్పు ప్రతిఫలనం కొన్నిచోట్ల స్పష్టంగానూ, కొన్ని చోట్ల ఛాయామాత్రంగానూ కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు, భాగవతంలో మేనమామ అయిన కంసునికీ, మేనల్లుడైన కృష్ణుడికీ మధ్య గల వైరంలో, కృష్ణుడు పుట్టకముందే అతన్ని హతమార్చడానికి కంసుడు ప్రయత్నించడంలో, తండ్రి ఉగ్రసేనుని చెరలో పెట్టి తను రాజు కావడంలో, చివరికి కృష్ణుడి చేతిలోనే అతడు చనిపోవడంలో హిట్టైట్ల సందర్భంలో చెప్పుకున్న ‘అవాంక్యులేట్’ వ్యవస్థాలక్షణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, ఇంతకుముందు చెప్పుకున్న బాబిలోనియాకు చెందిన గిల్గమేశ ఇతిహాసంలో కూడా గిల్గమేశ్ కు, అతని మేనమామకు సంబంధించిన వైరాన్ని తెలిపే ఇలాంటి కథే ఉంది...

మహాభారతంలో గాంధారి సోదరుడూ, కౌరవుల మేనమామా అయిన శకుని ఏకంగా కౌరవుల రాచనగరులోనే తిష్ఠవేసి, మేనల్లుళ్ళ ప్రయోజనాల పరిరక్షణకు కంకణం కట్టుకుని పాండవులకు వ్యతిరేకంగా జరిపే కుట్రలు, కుహకాలలో ప్రధానభూమిక పోషించడం తెలిసినదే. పాండవుల తల్లి అయిన కుంతివైపు బంధువుగా కృష్ణుడు కూడా తన మేనబావలైన పాండవుల ప్రయోజనాలను పరిరక్షించడంలో కూడా దీని ఛాయలు కనిపిస్తాయి. పాండవులలో మాద్రి కొడుకులైన నకులసహదేవుల మేనమామ శల్యుని కథ దీనికి కొంచెం అడ్డం తిరిగి కనిపిస్తుంది. అతను పాండపక్షంలో యుద్ధంలో పాల్గొనడానికి బయలుదేరుతాడు కానీ, మార్గమధ్యంలో దుర్యోధనుడు అతనికి చక్కటి వసతి సదుపాయాలను ఏర్పాటు చేసి మెప్పించి తనవైపు తిప్పుకుంటాడు. కానీ అంతిమంగా కర్ణుని రథసారథిగా అతడు కర్ణుని రకరకాలుగా అవమానిస్తూ అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ పాండవుల విజయానికే పరోక్షంగా కృషి చేస్తాడు.

ఇవన్నీ అలా ఉంచితే, ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న రామాయణసందర్భంలోనే ‘అవాంక్యులేట్’ వ్యవస్థకు సంబంధించిన ప్రబలమైన సాక్ష్యం భరతుని రూపంలో కనిపిస్తుంది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళేవరకూ భరతుడు శత్రుఘ్నునితో కలసి ఎక్కువగా కేకయరాజ్యంలో మేనమామ దగ్గరే గడపడాన్ని రామాయణం చెబుతుంది. ముందుముందు దాని గురించి విశేషంగా చెప్పుకోబోతున్నాం.

కౌసల్య అధీనంలో వెయ్యి గ్రామాలు ఉండడాన్ని ఎలా అన్వయించుకోవాలో జార్జి థామ్సన్ వెలుగులో తర్వాత చెప్పుకుందాం.


Tags:    

Similar News