కాస్సేపు అందరం సిగ్గు పడదాం, రండి
కౌలు రైతుకు ఇచ్చిన ఎకరాకు 15 వేల హామిని రేవంత్ సర్కార్ మళ్ళీ ఎగ్గొట్టినా ఇంత మౌనమా?;
అభయ హస్తం మానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ “ కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా సహాయం అందిస్తామని” ఇచ్చిన హామీని 2024-2025 రబీతో పాటు, 2025 ఖరీఫ్ సీజన్ లో కూడా మరోసారి తప్పింది. ఈ సీజన్ లో ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున తొమ్మిది రోజుల్లో సుమారు 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో “రైతు భరోసా” పెట్టుబడి సహాయం జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని అమలు చేయనందుకు ఏ మాత్రం సిగ్గు పడకుండా సంబరాలు జరుపుకుని నిద్రపోయింది. స్వయంగా వ్యవసాయం చేయక పోయినా, తమ ఖాతాలలో పడిన వేల, లక్షల రూపాయలను చూసుకుని, మురిసిపోయి, నిర్లజ్జగా కొందరు భూ యజమానులు నిశ్చింతగా నిద్రపోయారు. హమ్మయ్య, భూ యాజమనులను కాదని, కౌలు రైతుల పక్షాన మాట్లాడుతున్నారనే చెడ్డపేరు తమకు రానందుకు మురిసిపోయి, చాలా మంది రాజకీయ నాయకులు, కొంత మంది రైతు నాయకులు మరింత హాయిగా నిద్రపోయారు. వ్యవసాయంలో కష్టపడి నష్టపోతున్నా, తమకు ఏ సహాయమూ ప్రభుత్వం నుండీ అందలేదనే దిగులుతో మరి కొంత మంది కౌలు రైతులు ఆత్మహత్యల వైపు నడుస్తున్నారు.
మరో వైపు, కౌలు రైతులను సంఘటితం చేయకుండా, కౌలు రైతులకు ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలపై చట్ట బద్ధంగా పోరాడకుండా, 2011 అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు లభించకుండా, వారికి న్యాయం జరగదనే స్పృహతో రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థలు పట్టుదలగా ముందుకు సాగుతున్నాయి. రైతు భరోసా పథకం సాగు చేసే రైతులకు ఉపయోగపడే పథకమే అయినా, నిజమైన రైతులను గుర్తించి ఇవ్వనప్పుడు, పైగా ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోయిన దశలో, అందులో కొంత భాగాన్ని మాత్రమే రైతు భరోసా ద్వారా కవర్ చేస్తూ, మొత్తం ఈ పథకమే రైతు కుటుంబాల పూర్తి సంక్షోభాన్ని పరిష్కరిస్తుందని ప్రభుత్వాలు ప్రకటించడం కూడా సరైంది కాదని గుర్తించాలి. సాగు చేసే రైతుల నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి, గ్రామీణ ప్రాంతాలలో, ఇతర రూపాలలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. వ్యవసాయం చేయని వారికి కూడా రైతు భరోసా చెల్లిస్తూ నిధులను దుర్వినియోగం చేయకుండా పొదుపుగా ఉపయోగించుకోవలసి ఉంటుంది
1940 దశకంలో నిజాం నిరంకుశ పాలనకు, పటేల్, పట్వారీలు, దొరలు, దేశముఖులతో కూడిన కరడుగట్టిన భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గురించి ప్రస్తావించని రాజకీయ పార్టీ తెలంగాణ లో ఉండదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అంకురార్పణ చేసిన కడివెండి ముద్దు బిడ్డ దొడ్డి కొమురయ్య జులై 4 న చేసిన త్యాగానికి జోహార్లు అర్పించి, ఆయన విగ్రహానికి పూలమాల వేయని నాయకుడు ఉండడు.
కానీ విచిత్రమేమంటే, ఆ ఉద్యమ స్పూర్తిని మాత్రం అందరూ మర్చిపోయారు. దున్నేవారి చేతుల్లో భూమి ఉండాలనే ఆ ఉద్యమ లక్ష్యాలను కూడా చాలా మంది మర్చిపోయారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగా 1950 లో ఉనికిలోకి వచ్చి, అమలైన హైదరాబాద్ కౌల్డారీ చట్టంలో ఉన్న ప్రగతిశీలతను గుర్తుంచుకోవలసిన అవసరాన్ని కూడా అందరూ మర్చి పోయారు.
స్వయంగా దున్నేవారి చేతుల్లో భూములు ఉండాలని, బడా భూస్వాముల భూముల్లో అప్పటి వరకూ కౌలు దారులుగా ఉన్న వారే ఆ భూములకు హక్కు దారులుగా మారాలని, వ్యవసాయేతరులు వ్యవసాయ భూములు కొనకుండా నిషేధం విధించాలని, అసలు తమ భూములను ఎవరికి వారు స్వయంగా సాగు చేసుకోవాలి తప్ప, కౌలుకు ఇవ్వడానికి లేదని ఆ చట్టం నిర్దేశిస్తోంది. సాగు చేయని భూముల విషయంలో ప్రభుత్వం ఏమి చేయాలో కూడా ఆ చట్టం స్పష్టంగా మాట్లాడింది.
ఇటువంటి అద్భుతమైన చట్టాన్ని అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం అమలులో పూర్తిగా విఫలమయ్యాయి. అందుకు ప్రధాన కారణం, ఇప్పటి వరకూ ప్రభుత్వాలలో భూస్వాముల ప్రతినిధులే ఎక్కువగా ప్రాతినిధ్యం వహించడం.
ఆనాడు కౌలు రైతులు, భూమి లేని నిరుపేదల పక్షాన ఉద్యమాన్ని నిర్మించిన కమ్యూనిస్టు పార్టీ, ఇవాళ అనేక చీలికలు, పీలికలకు గురైంది. భూ సంస్కరణల అమలు , పేదలకు భూమి పంపిణీ, 1973 భూ గరిష్ట పరిమితి చట్టం అమలు , కౌలు రైతులకు గుర్తింపు , వారికి న్యాయం , దళితుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములకు రక్షణ - లాంటి అంశాలేవీ సిపిఐ, సిపిఐ(ఎం) వంటి కమ్యూనిస్టు పార్టీలకు నిత్య కార్యాచరణ ఎజెండాగా లేకపోవడం, ఎం- ఎల్ పార్టీలు సూత్ర ప్రాయంగా ఆ అంశాలను తమ డాక్యుమెంట్లలో ఇప్పటికీ గుర్తిస్తున్నా, ఆచరణలో అటు వైపు ఏ మాత్రం కార్యాచరణ చేపట్టక పోవడం ప్రస్తుతం తెలంగాణలో నెల కొన్న అతి పెద్ద విషాదం.
కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు మేధావులు, కొన్ని ప్రజా సంఘాలు, ఆయా సందర్భాలను బట్టి, మాట వరసకు ఈ అంశాలను మాట్లాడుతున్నాఆచరణలో ఏ మాత్రం నిజాయితీగా అటు వైపు కృషి చేయడం లేదు. ప్రభుత్వాలపై ఈ అంశాల అమలు గురించి ఒత్తిడి చేయడం లేదు. కౌలు రైతులు అత్యధికంగా ఉన్న సామాజిక వర్గాల నుండీ ఎదిగి వచ్చిన దళిత, బీసీ, ఆదివాసీ సంఘాలు, నాయకులు కూడా, రిజర్వేషన్ లు, దళితులపై పెరుగుతున్న దాడులు, బీసీ కులాలకు రాజకీయ పార్టీలలో, ప్రభుత్వ పాలనా చట్రంలో పెరగాల్సిన భాగస్వామ్యం తదితర విషయాలపై సీరియస్ గా మాట్లాడుతున్నా అత్యధిక మంది పేదలకు ఉపయోగపడే, భూమి హక్కులు, కౌలు రైతులకు గుర్తింపు, వ్యవసాయ కూలీలు సహా ఈ సామాజిక వర్గాల కుటుంబాలకు కూడా సాంఘిక బధ్రతా పథకాల అమలు, అసంఘటిత కార్మికులకు న్యాయమైన వేతనాలు, ఇతర హక్కుల అమలు, తదితర విషయాలపై మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నాయి. ఈ కారణం చేతనే, గత KCR ప్రభుత్వం కానీ, ఇప్పటి రేవంత్ ప్రభుత్వం కానీ , కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికులకు అన్యాయమే చేస్తున్నాయి.
రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగించాల్సిన ప్రభుత్వాలు, చట్టాలను అమలు చేయనందుకు సిగ్గు పడడం లేదు. చట్టాల అమలు గురించి పోరాడాల్సిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు,సామాజిక సంస్థలు కూడా దశాబ్ధాలు గడుస్తున్నా , తాము ఇలాంటి కీలక విషయాలపై ఇంకా దృష్టి సారించలేక పోయినందుకు సిగ్గు పడడం లేదు. ప్రభుత్వాలు అమలు చేసే పేదల సంక్షేమ పథకాలను, కొన్ని ఉచిత పథకాలను రోజూ విమర్శించే మధ్యతరగతి సమాజం, మధ్య తరగతి బుద్ది జీవులు, రచయితలు,కవులు తెలంగాణ లో కౌలు రైతుల సమస్య తీవ్రతను ఇంకా గుర్తించడం లేదు. వీరిలో కొందరు, తాము వ్యవసాయం స్వయంగా చేయకపోయినా, తమ పట్టా భూముల ఆధారంగా తమ ఖాతాలలో వచ్చిపడుతున్న రైతు భరోసా సహాయ నిధులను నిస్సిగ్గుగా ఆమోదించి, స్వీకరించి తీసుకుంటున్నారు (తమ భూములను సాగు చేసే కౌలు రైతులకు ఈ నిధులను బదిలీ చేసే వారు చాలా అరుదు)
రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో భూ కమతాల విస్తీర్ణాన్ని బట్టి, రైతుల సంఖ్య , వారి చేతుల్లో ఉన్న భూమి ఈ క్రింది విధంగా ఉంది.
రాష్ట్రంలో ఒక ఎకరం లోపు సాగు భూమి కలిగిన రైతులు 24,22,000 మంది ఉన్నారు. వీరి చేతుల్లో 13,54,000 ఎకరాల భూమి మాత్రమే ఉంది. వీరికి అందిన రైతు భరోసా పెట్టుబడి సహాయం 812 కోట్ల 63 లక్షలు. సంఖ్య రిత్యా భారీగా కనపడినా, ఎక్కువ మందికి, ఒక్క ఎకరం సాగు భూమి కూడా లేదని అర్థమవుతుంది. నిజానికి భూ గణాంకాల నిర్వచనంలో వీరిని భూమి లేని పేదలు గానే గుర్తిస్తారు. ఎకరం లోపు భూమి లేని కలిగిన వారిలో కూడా నిజంగా పంటలు సాగు చేస్తున్న రైతులు ఎంతమంది అన్నది మనకు తెలియదు. రెవెన్యూ రికార్డులలో ఇప్పటికీ వ్యవసాయ భూములుగా ఉండి, ఆచరణలో రియల్ ఎస్టేట్ ప్లాట్లు గా మారిన వాటిని ( 2 సెంట్ల నుండీ అర ఎకరం వరకూ ) కొనుగోలు చేసి రైతులుగా పట్టా పాస్ బుక్ లు పొందిన నగర జీవులు ఎంతమంది అనేది స్పష్టంగా బయటపడితే, ఎకరం లోపు రైతులలో అప్పుడు నిజంగా పంటలు సాగు చేసే రైతులు ఎందరో తెలుస్తుంది.
ఒక ఎకరం పైనా, రెండెకరాల లోపు సాగు భూమి కలిగిన రైతులు 17 లక్షల రెండు వేల మంది. వీరి చేతుల్లో 25 లక్షల 62 వేల ఎకరాల భూమి ఉంది. వీరికి అందిన పెట్టుబడి సహాయం 1,537 కోట్ల 20 లక్షల రూపాయలు. రెండు ఎకరాలకు పైనా , మూడు ఎకరాలకు లోపు సాగు భూమి కలిగిన రైతులు 10 లక్షల 45 వేల మంది. వీరి చేతుల్లో ఉన్న సాగు భూమి 25 లక్షల 86 వేల ఎకరాలు. వీరికి అందిన పెట్టుబడి సహాయం 1,551 కోట్ల 89 లక్షల రూపాయాలు. రెండున్నర ఎకరాల లోపు ఉన్న రైతులందరూ సన్నకారు రైతుల క్యాటగిరీ లోకి వస్తారు.
మూడు ఎకరాలకు పైనా, నాలుగు ఎకరాలకు లోపూ ఉన్న రైతులు రాష్ట్రంలో 6 లక్షల 33 వేల మంది ఉంటే వారి చేతుల్లో ఉన్న సాగు భూమి 21 లక్షల 89 వేల ఎకరాలు. వారికి అందిన పెట్టుబడి సహాయం 1,313 కోట్ల 54 లక్షల రూపాయలు. నాలుగు ఎకరాలకు పైనా, ఐదు ఎకరాల లోపూ సాగు భూమి ఉన్న రైతులు 4 లక్షల 43 వేల మంది కాగా, వారి చేతుల్లో ఉన్న భూమి 19 లక్షల 82 వేల ఎకరాలు. వీరికి అందిన సహాయం, 1,189 కోట్ల 43 లక్షల రూపాయలు. వీరందరినీ చిన్నకారు రైతులు అంటారు.
రాష్ట్రంలో రైతు భరోసా సహాయం పొందే మొత్తం 67 లక్షల మంది రైతులలో, ఐదెకరాల లోపు ఉన్న సన్న, చిన్న కారు రైతుల సంఖ్య 62,45,000 మంది, అంటే మొత్తం రైతులలో సుమారు 90 శాతం. కాగా, వీరి చేతుల్లో ఉన్న సాగు భూమి విస్తీర్ణం1,06,73,000 ఎకరాలు మాత్రమే . మొత్తం రైతు భరోసా సహాయం అందిన భూమి విస్తీర్ణం 1,45,73,000 ఎకరాలు అని ప్రభుత్వం చెబుతున్నది.
ఐదు ఎకరాలకు పైనా, 6 ఎకరాల లోపూ సాగు భూమి ఉన్న రైతులు 1 లక్షా 71 వేల మంది కాగా వారి చేతుల్లో ఉన్న భూమి 9 లక్షల 16 వేల ఎకరాలు. వారికి అందిన సహాయం 549 కోట్ల 80 లక్షల రూపాయలు. 6 ఎకరాలకు పైనా, 7 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న రైతుల సంఖ్య 93 వేల మంది కాగా, వారి చేతుల్లో ఉన్న భూమి 5 లక్షల 93 వేల ఎకరాలు. వారికి అందిన పెట్టుబడి సహాయం 356 కోట్ల 9 లక్షల రూపాయలు. ఏడు ఎకరాలకు పైనా 8 ఎకరాల లోపు ఉన్న రైతులు 67 వేలు కాగా, వారి చేతుల్లో ఉన్న సాగు భూమి 4 లక్షల 43 వేల ఎకరాలు. 8 ఎకరాలకు పైనా, 9 ఎకరాల లోపు ఉన్న రైతులు 39 వేలు కాగా వారి చేతుల్లో ఉన్న భూమి 3 లక్షల 23 వేల ఎకరాలు. 9 ఎకరాల పైనా, 10 ఎకరాల లోపూ ఉన్న రైతులు 32 వేలమంది కాగా వారి చేతుల్లో ఉన్న భూమి 2 లక్షల 96 వేల ఎకరాలు.
10 ఎకరాల పైనా, 11 ఎకరాల లోపు ఉన్న రైతులు 16 వేల మంది కాగా వారి చేతులలో ఉన్న భూమి 1 లక్షా 67 వేల ఎకరాలు. 11 ఎకరాల పైనా 12 ఎకరాల లోపు ఉన్న రైతులు 11 వేలు కాగా వారి చేతుల్లో 1 లక్షా 26 వేల ఎకరాల భూమి ఉంది. 12 ఎకరాల పైనా ,13 ఎకరాల లోపూ ఉన్న రైతులు 8 వేలు కాగా వారి చేతుల్లో ఉన్న భూమి 1 లక్షా 5 వేల ఎకరాలు. 13 ఎకరాల పైనా 14 ఎకరాల లోపూ ఉన్న రైతులు 6 వేలు కాగా, వారి చేతుల్లో ఉన్న భూమి 85 వేల ఎకరాలు.
14 ఎకరాలపైనా 15 ఎకరాల లోపూ ఉన్న రైతులు 5 వేలు కాగా వారి చేతుల్లో ఉన్న భూమి 74 వేల ఎకరాలు.
15 ఎకరాల పైన ఉన్న రైతులు 38 వేలమంది కాగా, వారి చేతుల్లో భూమి 7 లక్షల 65 వేల ఎకరాలు. 15 ఎకరాల పైన ఉన్న రైతుల వివరాలు గుండు గుత్తగా ఇచ్చేశారు. నిజానికి 15 ఎకరాల పైన ఉండే భూములకు కూడా ఎకరాల వారీగా ఇచ్చి ఉంటే, నిజంగా ఎవరి చేతుల్లో ఎంత సాగు భూములు ఉన్నాయో అర్థమై ఉండేది.
రైతు భరోసా సహాయం పథకం పై మంత్రుల బృందం జిల్లాలలో ప్రజాభిప్రాయం చేపట్టినప్పుడు ఎక్కువ మంది రైతు భరోసా సహాయాన్ని 10 ఎకరాల లోపు రైతులకు మాత్రమే అమలు చేయాలని కోరారు. కానీ ప్రభుత్వం ఎలాంటి పరిమితులు లేకుండా, సాగు యోగ్యమైన మొత్తం భూములకు ( పంటలు ఉన్నా, లేకపోయినా) ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. పెద్ద భూస్వాములకు కూడా వందల కోట్ల నిధులను దోచి పెట్టడమే ఇది.
10 ఎకరాల పైన ఉన్న వారు మొత్తం 84 వేల మంది కాగా, వారి చేతుల్లో ఉన్న భూమి 13 లక్షల 22 వేల ఎకరాలు , వారికి అందిన పెట్టుబడి సహాయం సుమారు 793 కోట్లు. కానీ, రాష్ట్రంలో ఒక ఎకరం లోపు సాగు భూమి కలిగిన రైతులు 24,22,000 మంది కాగా, వీరి చేతుల్లో ఉన్న భూమి కూడా 13,54,000 ఎకరాలు మాత్రమేననీ, వీరికి అందిన రైతు భరోసా పెట్టుబడి సహాయం కేవలం 812 కోట్ల 63 లక్షలు మాత్రమేననీ గుర్తుంచుకుంటే, ఎంత పెద్ద మొత్తంలో రైతు భరోసా నిధులు ప్రభుత్వ సహాయం అవసరం లేని, బడా రైతులకు వెళుతున్నాయో అర్థమైపోతుంది.
రైతు భరోసా సహాయం పొందుతున్న వారిలో, ఎంతమంది నిజంగా సాగు చేస్తున్నారో, ఎంతమంది తమ భూమిని కౌలుకు ఇచ్చారో, ఎంత మంది తమ భూమిని పడావు పెట్టారో ప్రభుత్వం ధగ్గర నిజమైన గణాంకాలు లేవు. అవి ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధులలో ఎంత మేరకు సద్వినియోగం అవుతున్నాయో మణకు తెలుస్తుంది. నిజమైన సాగు దారులను ప్రభుత్వం గుర్తించడానికి సిద్దపడనంత కాలం , తాను వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టే నిధులలో వేలాది కోట్లు వ్యవసాయం చేయని భూములకు, రైతులకు పంచుతూ, ఆ నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లే అనుకోవాలి. కౌలు రైతులను గుర్తించి, సహాయం అందించడానికి పూనుకోకపోతే, ఆ మేరకు రైతు కుటుంబాలలో సంక్షోభానికి, ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కౌలు రైతులను గుర్తించకుండా ప్రభుత్వాలు అన్యాయం చేస్తుంటే, ఆ అన్యాయాన్ని ప్రశ్నించని ప్రతి రాజకీయ పార్టీ, ప్రజా సంఘమూ , సామాజిక సంస్థా ఈ సంక్షోభం కొనసాగింపుకు తామూ కారణమేనని గుర్తించాలి.