ఆదుకొనక పోతే రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి

ప్రకృతి వైపరీత్యాల వలన ఈ సంవత్సరం కూడా తెలంగాణ రైతులు విపరీతంగా నష్టపోయారు.

Update: 2025-11-15 02:30 GMT

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు గ్రామీణ ప్రజలకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. పంటల నష్టపోయి రైతులు అప్పుల పాలయిపోతున్నారు. గత కొద్ది రోజుల్లో పంట నష్టాల కారణంగా కనీసం 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు , ఈ ప్రకృతి వైపరీత్యాల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉన్నా, వీటి వల్ల గ్రామీణ ప్రజలు నష్టపోయిన సమయంలో ఆదుకోవడానికి ప్రభుత్వాలు వేగంగా స్పందించకపోవడం, రాష్ట్రంలో పంటల బీమా పథకం అమల్లులో లేకపోవడం సమస్యను, వ్యవసాయ కుటుంబాల సంక్షోభాన్ని మరింత పెంచుతున్నాయి.

వరసగా వస్తున్న ప్రకృతి వైపరీత్యాల వలన ఈ సంవత్సరం కూడా తెలంగాణ రైతులు విపరీతంగా నష్టపోయారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి ( ఖరీఫ్ వానలు ముగిసే నాటికి ) సాధారణం కంటే 31 శాతం అదనపు వర్షాలు పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో రెండు విడతలుగా అతి భారీ వర్షాలు, వరదలతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు. దానికి తోడుగా మొంథా తూఫాను వచ్చి రాష్ట్ర రైతులను మరింత పెద్ద దెబ్బ తీసింది.

ప్రాథమిక అంచనాల ప్రకారం మొంథా తూఫాను వలన 4.72 లక్షల ఎకరాలలో పంట దెబ్బ తిన్నట్లు, ఆగస్టులో వచ్చిన భారీ వర్షాల వలన 2.36 లక్షల ఎకరాలు దెబ్బ తిన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. సరిగ్గా పంటకి చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు పడటంతో దిగుబడి తగ్గడమే కాకుండా పంటను అమ్ముకోవడంలో కూడా రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించవలసి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ మన రాష్ట్ర ప్రభుత్వం నుండీ తక్షణ చర్యలు లేకపోవడంతో రైతులు మరింత నిరాశ, నిస్పృహ లలో కూరుకు పోయారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో జరిగిన పంట నష్టానికి మాత్రమే కాదు, 2024 రబీ సీజన్ లో 2025 మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన విపత్తు సాయం (ఎకరానికి 10,000 రూపాయల) ప్రకటించిన విధంగా ఇంకా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు.

రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ తన తుది జాబితాలో చేర్చలేదు. భారీ వర్షాల వల్ల, అనేక పంటలకు నష్టం జరిగినా, జిల్లాలో ఏదైనా ఒక పంటను మాత్రమే గుర్తించడం , పూత, కాత రాలిపోవడం లాంటి కొన్ని రకాల నష్టాలను అసలు గుర్తించక పోవడం, రాష్ట్రంలో 36 శాతం గా ఉన్న కౌలు రైతులను నష్టపోయిన వారి జాబితాలో, అసలు నమోదు చేయకపోవడం వంటి సమస్యలు క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ వేసిన ప్రాథమిక అంచనాలలో భారీ వర్షాల కారణంగా లక్షలాది ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం చెబుతున్నా, తుది అంచనాలలో 20 శాతం మాత్రమే తీవ్ర నష్టంగా గుర్తిస్తున్నారు. ఈ ప్రకటించిన కొద్ది విస్తీర్ణయానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను విడుదల చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

గతంలో కూడా ..

2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ హామీ ఇచ్చినట్లు పటిష్టమైన పంట బీమా పథకం ఇప్పటి వరకూ ప్రవేశ పెట్టలేదు. పంటలకు సరైన పంట బీమా ఉండి ఉంటే నష్టపోయిన లక్షల మంది రైతులకు లాభం కలిగేది.

BRS ప్రభుత్వం తన హయాంలో ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన పంట నష్టానికి నష్ట పరిహారం ఇవ్వ లేదు. దీనిపై రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర హైకోర్టులో నాలుగు కేసులు వేసింది. రైతుల నుండి, రైతు సంఘాల నుండి గట్టిగా డిమాండ్ రావడం వలన ప్రభుత్వం తన ప్రభుత్వ కాలం చివరి సంవత్సరం 2023 లో మాత్రమే నష్టపోయిన రైతులకు ఎకరానికి పది వేలు నష్టపరిహారం ప్రకటించింది.

BRS ప్రభుత్వం రాష్ట్రంలో 2020 ఖరీఫ్ నుండి పంటల బీమా పథకం అమలు చేయడం కూడా పూర్తిగా నిలిపేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు తన ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే, పంట నష్టానికి నష్ట పరిహారం (విపత్తు సహాయం) తప్పక ఇస్తామని, పటిష్టమైన పంటల బీమా పథకం కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

గత రెండేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన పంట నష్టం అంచనాలు వేయడం, నష్టపోయిన రైతుల ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోంది, అయితే నష్టపోయిన వారికి విపత్తు సహాయం (ఇన్పుట్ సబ్సిడీ) చెల్లించడంలో మాత్రం జాప్యం, లోపాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ వేసే ప్రాథమిక అంచనాలకు, పరిహారం చెల్లించేందుకు వేసే తుది అంచనాలకు విపరీతమైన తేడా ఉంటున్నది. క్షేత్ర స్థాయిలో అధికారులు తీవ్ర నష్టం (33 శాతం కంటే పైగా) అని గుర్తించడానికి ఎటువంటి ప్రక్రియ చేపడుతున్నారన్నది రైతులకు, రైతు సంఘాలకు అర్థం కావట్లేదు. పారదర్శకత లేదు.

మొంథా తూఫానులో 12 జిల్లాలలో 4.72 లక్షల ఎకరాలు దెబ్బ తిన్నాయని, మరిన్ని జిల్లాలలో మరో 2 లక్షల ఎకరాల వరకు ఉండవచ్చని ప్రభుత్వ ప్రకటనలు తెలిపాయి. అయితే నవంబర్ 11 న తన తుది నివేదికలో 1.17 లక్షల ఎకరాలలో మాత్రమే తీవ్ర నష్టం (33 శాతం కంటే పైగా) జరిగిందని, ఆ రైతులకు ఎకరానికి 10, 000 అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. అదే విధంగా ఆగస్టు నెలలో 2.36 లక్షల ఎకరాల నష్టం అని ప్రాథమిక అంచనాలు తెలుపిన వ్యవసాయ శాఖ తీవ్ర నష్టం 44,000 ఎకరాలలో మాత్రమే అని తుది అంచనా అని అనధికారికంగా తెలిసింది.

గత సంవత్సరం కూడా ఆగస్టు చివరి వారం నుండి పడిన వర్షాలలో 2.36 లక్షల ఎకరాలలో పంట దెబ్బ తిన్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా సెప్టెంబర్ 1 న ప్రకటించారు. అయితే తుది అంచనాలో 79,574 ఎకరాలలో మాత్రమే తీవ్ర నష్టం జరిగినట్లు గుర్తించి 79.57 కోట్లు విడుదల ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విధంగా ప్రతి జిల్లాలో వేలాది రైతులు తమకి విపత్తు సాయం ఎందుకు రాలేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు.

వాస్తవంగా జరుగుతున్న నష్టాన్ని అనేక చోట్ల గుర్తించట్లేదు. పత్తి పంటలో పూర్తిగా నీళ్ళు చేరినప్పుడు మొక్కలు నిలబడినా, దిగుబడి 50 శాతం పైగా తగ్గిపోతున్నా, వేలాది పత్తి రైతులను జాబితాలో చేర్చడం లేదు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వలన మంచిర్యాల లో పంట నష్టపోయిన రైతులను గుర్తించట్లేదు. వరి పంట పూర్తిగా వరిగిపోయి పెద్ద ఎత్తున ధాన్యం నష్టపోయినా, దానిని మళ్ళీ కోలుకున్నట్లుగా పరిగణిస్తున్నారు. పంట కోత తర్వాత ధాన్యం తడిసిపోయి కొట్టుకుపోయినా, దానిని లెక్కించుట లేదు.

ఈ పరిస్థితులకు బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ మీద కూడా ఉంది. రాష్ట్రం తుది జాబితాలో పేర్కొన్న ఎకరాలకు కూడా నష్ట పరిహారాన్ని NDRF/SDRF (విపత్తు సహాయ నిధి) నుండి ఆమోదం ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. గతంలో కూడా 2020 అక్టోబర్ పంట నష్టానికి రైతు స్వరాజ్య వేదిక వేసిన కేసులో వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ. 552 కోట్లు కోరుతూ నివేదిక ఇవ్వగా కేవలం రూ.188 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అంతే కాక, కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న విపత్తు సహాయం చాలా తక్కువగా ఉంటున్నది. ఇటీవల పెంచిన ఇన్ పుట్ సబ్సిడీ వివరాల ప్రకారం తరి పంటలకు ఎకరానికి 5400 నుంచి 6800 కి మాత్రమే పెంచింది, అలాగే వర్షాధార పంటలకు 2700 నుండి 3400 కి పెంచింది. 2012 లోనే నలుగురు ముఖ్యమంత్రుల హూడా కమిటీ ఎకరానికి 10 వేల రూపాయలు ఇవ్వాలని సిఫార్సు చేసినా, కేంద్రం ఇప్పటి వరకూ ఇంత తక్కువ మొత్తాలను ఇవ్వడం రైతుల పట్ల మోడీ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నది.

2020 నుండి ఏ విధమైన పంట బీమా పథకం లేని రాష్ట్రం దేశం మొత్తంలో తెలంగాణ మాత్రమే. రాష్ట్రంలో పటిష్టమైన పంటల బీమా పథకాన్ని తెస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెసు ప్రభుత్వం ఇప్పటివరకు పంట బీమా ఏర్పాటు చేయకపోవడం పూర్తి అన్యాయం. దీని వలన రాష్ట్ర రైతులు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. రైతు అనుకూలమైన పంట బీమా పథకం తెచ్చి, కౌలు రైతులతో సహాయ రైతులందరినీ దానిలో నమోదు చేస్తే ఇప్పుడు వచ్చే విపత్తు సహాయం కంటే కొన్ని రేట్లు ఎక్కువ రైతులకు నష్ట పరిహారం లభిస్తుంది. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ తమ స్వంత పంట బీమా పథకం అమలు చేసినప్పుడు ఒకే సంవత్సరంలో 1700 కోట్లు నష్ట పరిహారంగా రైతులకు అందింది.

పంట కోతకి వచ్చినప్పుడు భారీ వర్షాలు పడటంతో, చేతికి వచ్చిన పంట కూడా తడిసి పోయి పంట అమ్ము కోవడానికి రైతులు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. తేమ శాతం పేరుతో పత్తి, వరి రైతుల నుండి సీసీఐ కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కానీ కొర్రీలు పెట్టడంతో, రైతులు తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవలసి వస్తున్నది.

నష్టపోయిన కౌలు రైతులకు కూడా నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించినా, కౌలు రైతులను నమోదు చేసు కోవడం తక్కువగానే జరుగుతోంది. క్రాప్ బుకింగ్ సమయంలో కౌలు రైతులను నమోదు చేయకపోవడం, 2011 చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం వల్ల వారు నష్టపరిహారానికి, కనీస మద్ధతు ధరలకు పంట అమ్ముకోవడానికి కి కూడా నోచుకోవట్లేదు. ఫలితంగా కౌలు రైతులలో ఆత్మహత్యలు ఎక్కువవవుతున్నాయి.

పంట నష్టాన్ని అంచనా వేసి ఎన్యూమరేషన్ చేసే పద్ధతి ని పారదర్శకంగా అమలు చేయాలి. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ స్థాయిలో ప్రకటించి, వారికి ఫిర్యాదు చేసి సరి చేసుకునే అవకాశం కల్పించాలి. నవంబర్ 12 న రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి బృందం , రాష్ట్ర సెక్రటేరియట్ లో వ్యవసాయ మంత్రి గారిని కలసినప్పుడు , ఈ మేరకు హామీ ఇచ్చారు. కేంద్రానికి తుది జాబితా పంపే ముందు , నష్టపోయిన రైతులందరి వివరాలనూ తప్పకుండా సేకరిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకోవలసిన అవసరముంది.

ఇప్పటి వరకు జరిగిన పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీని, గత బకాయిలతో సహా, వెంటనే రైతుల అకౌంటులలో వేయాలి. ఈ ఖరీఫ్ సీజన్లో జరిగిన పంట నష్టానికి తుది జాబితాలు తయారు చేయడంలో జరిగిన లోపాలను సరి చేసి, అర్హులైన రైతులందరినీ దానిలో చేర్చి వాళ్ళకి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. దీని కోసం పారదర్శకమైన ప్రక్రియను ఏర్పాటు చేయాలి.

పటిష్టమైన, రైతు అనుకూలమైన పంటల బీమా పథకాన్ని వెంటనే అమలులో తేవాలి (ఈ రబీ సీజన్ నుండే). ప్రభుత్వమే కౌలు రైతులతో సహా రైతులందరినీ నమోదు చేసి వారి ప్రీమియం కట్టే విధంగా అమలు చేయాలి. కేంద్రం వెంటనే విపత్తు సహాయ నిధి నుండి నిధులను పూర్తి స్థాయిలో మంజూరు చేయాలి. విపత్తు సహాయాన్ని తరి పంటలకి, వర్షాధార పంటలకి కూడా ఎకరానికి 15,000 చేయాలి.

Tags:    

Similar News