ఆన్ లైన్ బెట్టింగ్...సరదా గేమ్ కాదు ఓ భారీ వ్యసనం!

ఒక సారి బెట్టింగ్ ఊబిలో పడితే బయటకు రావడం కష్టం;

Update: 2025-03-31 05:19 GMT

 -డాక్టర్ కేశవులు నేత

బెట్టింగ్ లేదా జూదం ప్రపంచవ్యాప్తంగా వినోదం మరియు లాభం కోసం ఆచరిస్తారు. కొంతమంది దీనిని నేరుగా సరదాగా ఎంటర్టెన్మెంట్ కోసం తీసుకుంటారు, కానీ మరికొందరు దీన్ని బలమైన అలవాటుగా అభివృద్ధి చేసుకొని వ్యక్తిగత మరియు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు.అయితే, యాదృచ్ఛికంగా బెట్టింగ్ కడితే అది మానసిక వ్యాధి కాదు, కానీ అది అడ్డు అదుపు లేకుండా అలవాటుగా మారినప్పుడు మాత్రమే దీన్ని గాంబ్లింగ్ డిజార్డర్ (Gambling Disorder) అనే మానసిక రుగ్మతగా మానసిక వైద్య నిపుణులు గుర్తించారు.ఇటీవల సంవత్సరాల్లో పందెం (Betting) మరియు జూదం (Gambling) యువతలో విపరీతంగా పెరుగుతున్నాయి. "పందెం ఒక చిన్న అలవాటు మాత్రమే" అని మొదట్లో భావించినా, అది పూర్తిగా జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన మార్గం కావొచ్చు. స్పోర్ట్స్ బెట్టింగ్, ఆన్‌లైన్ క్యాసినోలు, గేమింగ్ బేట్స్ లాంటి పందెపు రూపాలు యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

అలవాటు అయ్యే విధానం :

ప్రయోగాత్మక దశ : మొదటగా, వ్యక్తులు సహచరుల ఒత్తిడితో లేదా ఆసక్తితో బెట్టింగ్ లేదా జూదం ఆడటం/ కట్టడం ప్రారంభిస్తారు.

వినోదాత్మక దశ : వివాహాలు, ఫంక్షన్లు, కాలేజ్ డే పార్టీలు, సమావేశాలు, సెలవు దినాల్లో త‌ర‌చుగా బెట్టింగ్ ఆడటం క్రమంగా క్రమంగా పెరుగుతుంది.

కంపల్షన్ దశ : కొన్ని సందర్భాల్లో, అప్పుడప్పుడూ బెట్టింగ్ లేదా జూదం ఆడే వ్యక్తులు రోజూ లేదా ఎక్కువ టైమ్ ఇందులోనే గడుపుతారు. ఈ దశలో ఆడటం లేదా పాల్గొనకపోతే ప్రశాంతంగా ఉండలేక పోతారు, ఫలితంగా పదేపదే అదే మాయలో చిక్కుకుంటారు. ఇందులోంచి బయటకు రావడానికి ప్రయత్నించినను విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువ.

బెట్టింగ్ బాధితుల లక్షణాలు..

1. నియంత్రణ కోల్పోవడం – పందెం ఆపాలని ప్రయత్నించినప్పటికీ ఆపలేక మళ్ళీ మళ్ళీ బెట్టింగ్ లో పాల్గొనడం.

2. పందెంపై మక్కువ – ఎప్పుడూ పందెం గురించే ఆలోచించడం, గత విజయాలను లేదా పరాజయాలను గుర్తు చేసుకోవడం.

3. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు – ఎక్కువ మొత్తంలో డబ్బును పెట్టి మరింత మోజు పెంచుకోవడం.

4. నష్టాలను తిరిగి సంపాదించాలని ప్రయత్నించడం – పోయిన డబ్బును తిరిగి సంపాదించాలని మరింత ఎక్కువగా పందెం వేయడం.

5. కుటుంబానికి అబద్ధాలు చెప్పడం – పందెం గురించి కుటుంబ సభ్యులకు చెప్పకపోవడం లేదా అబద్ధాలు చెప్పడం.

6. రుణాలు తీసుకోవడం లేదా దొంగతనానికి పాల్పడడం – పందెం కోసం అప్పులు చేయడం లేదా అనైతిక మార్గాలను ఎంచుకోవడం.

7. వ్యక్తిగత జీవితం పై ప్రతికూల ప్రభావం – కుటుంబ, ఉద్యోగ, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనడం.

అప్పుల నుంచి ఆత్మహత్యలు ...

1. ఆర్థిక నష్టం, అప్పుల భారం : యువత ఎక్కువగా స్పోర్ట్స్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో బెట్టింగ్ లో పాల్గొంటున్నారు.మొదట్లో గెలిచిన సంతోషంతో మరింత ఎక్కువ డబ్బు పెట్టడం ప్రారంభిస్తారు.ఓడిపోతే, ఆ నష్టాన్ని తిరిగి సంపాదించేందుకు మరింత ఎక్కువగా బెట్టింగ్ చేస్తారు (Chasing Losses).చివరికి అప్పుల బాధ తట్టుకోలేక, కొందరు ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్తున్నారు.

2. మానసిక ఒత్తిడి మరియు డిప్రెషన్ : పందెంలో ఎప్పుడూ గెలిచే అవకాశం ఉండదు. ఓడిపోవడం వల్ల అతిగా నిరాశ, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం జరుగుతుంది. ఇది డిప్రెషన్ (Depression), ఆంగ్జైటీ (Anxiety), మెదడు పని తీరులో మార్పులు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. కుటుంబ, సమాజ ఒత్తిళ్లను తట్టుకోలేక మరణాన్ని ఎంచుకుంటున్నారు.

3. కుటుంబ సంబంధాలపై ప్రభావం : పందెం వల్ల తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవలు పెరుగుతాయి.డబ్బు కోసం తల్లిదండ్రులను మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం మొదలవుతుంది. కుటుంబ సభ్యులు గట్టిగా మందలిస్తే, కొందరు నిరాశతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు

4. అక్రమ రుణదాతల వేధింపులు: కొంతమంది యువత బ్యాంక్ లోన్లు కాకుండా ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఎక్కువ మొత్తంలో అప్పులు చేస్తారు. తిరిగి చెల్లించలేకపోతే రుణదాతల నుండి మానసిక, శారీరక వేధింపులు ఎదుర్కొంటారు. ఈ భయంతో ఆత్మహత్య చేసుకునే ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

5. మాదకద్రవ్యాలకు అలవాటు (Drug Abuse & Suicide): కొంతమంది యువత పందెంలో ఓడిన బాధను మరిచిపోవడానికి మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు. దీని ఫలితంగా ఆరోగ్య సమస్యలు, మరణాలు, ఆత్మహత్యలు సంభవించే ప్రమాదం ఉంటుంది.

6. క్రిమినల్ యాక్టివిటీస్ (Illegal Activities) వైపు మళ్లే ప్రమాదం: డబ్బును తిరిగి సంపాదించేందుకు అనైతిక మార్గాలను ఎంచుకునే ప్రమాదం ఉంది. కొంతమంది తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించాలని, చట్ట విరుద్ధమైన పనులు చేయాలని భావించవచ్చు. ఇది భవిష్యత్తులో వారి జీవితాన్ని నాశనం చేయొచ్చు.

పరిష్కార మార్గాలు :

1. ప్రభుత్వ నియంత్రణలు: "ప్రస్తుతం రాష్ట్రాలకు జూదం మరియు బెట్టింగ్‌లను నియంత్రించే అధికారం ఉంది. కానీ చాలా కంపెనీలు రాష్ట్రాల, దేశం సరిహద్దు వెలుపల ఉన్నాయి, కాబట్టి ఒక రాష్ట్రం ఎంత వరకు నియంత్రించగలుగుతుందనేది ప్రశ్న. అందుకోసం దేశం మొత్తంగా ఆదర్శంగా వాటిని కేంద్ర స్థాయిలోనే నియంత్రించడం లేదా నిర్మూలించడం చేయాలి.

2. మానసిక ఆరోగ్య అవగాహన: పందెం వ్యసనం ప్రమాదకరం అనే విషయంపై విద్యాసంస్థలు, మానసిక నిపుణులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యువత ఒత్తిడిని జయించేందుకు మానసిక సలహాలు అందించాలి.

3. కుటుంబం మరియు సమాజ మద్దతు: తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పందెం అలవాటు ఉందని గమనించిన వెంటనే సహాయం అందించాలి.ఒక వ్యక్తి దీని కోరికను ఆపలేడని భావిస్తే కౌన్సెలింగ్ కూడా అందించాలి.

4. ఆర్థిక విజ్ఞానం పెంపొందించాలి : డబ్బును ఆదా చేసుకోవడం, సంపాదనపై వివేకంగా ఉండటం ఎలా అనే విషయాలను యువతకు నేర్పించాలి.అక్రమ రుణదాతల పై కఠిన చర్యలు తీసుకోవాలి.

5. యువతకు ప్రత్యామ్నాయ మార్గాలు :; అందించడం, స్పోర్ట్స్, హాబీలు, విద్య, ఇతరత్ర ఇష్టపడే ఆటలు లేదా ఉపాధి అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలి.

పందెం సరదా ఆటగా మొదలై, జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకర వ్యసనంగా మారుతోంది. యువత ఆర్థిక ఒత్తిడి, మానసిక ఆందోళన తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విషాదకరం. ఈ బెట్టింగ్ మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం, కుటుంబ సభ్యులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానసిక వైద్య రంగ నిపుణులు కలిసి బారి ఎత్తున అవగాహన కల్పించాలి, పందెం ఓ ఆట కాదు – అది జీవితాన్ని నాశనం చేసే విష పాము. బాధ్యతగా ఆలోచిద్దాం, మన యువతను మనం కాపాడుకుందాము.

Tags:    

Similar News