కుల గణన న్యాయం కోసమా ? వోట్ల కోసమా ?
"గణన డేటాను సామాజిక సమతుల్యత కోసం కాకుండా రాజకీయ వోటు బ్యాంకుల కోసం వాడితే – అది ప్రజాస్వామ్యానికి హాని";
By : డాక్టర్ బి కేశవులు
Update: 2025-05-04 07:52 GMT
భారత రాజ్యాంగం “సామాజిక న్యాయం” (Social Justice) ను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రూపుదిద్దుకుంది. కానీ అది యథార్థంగా జరిగిందా? అన్న ప్రశ్న ఇప్పటికీ ప్రజాస్వామ్య దిక్సూచి ముందు నిలుస్తోంది. సమానావకాశాలు అందరికి ఉంటే, కుల (Caste) ఆధారంగా వెనుకబాటు, ఉపేక్ష, తక్కువ వనరులు ఎందుకు? దీనికి సమాధానం ఇవ్వాలంటే ముందుగా తెలుసుకోవలసింది — దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారు, వారి సామాజిక, ఆర్థిక స్థితి ఏంటన్నది. అంటే, కుల గణన అవసరం.అయితే, ఈ అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రజల సంక్షేమం కోసం కుల గణన చేపడుతున్నారా? లేక రాజకీయ పార్టీలు తమ వోటు బ్యాంక్‌ను బలపరిచేందుకు కొత్త వ్యూహంగా వాడుకుంటున్నారా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం.
కుల గణన (Caste Census) అనగా – దేశ పౌరుల్ని వారి కులాల ప్రకారం లెక్కించడం. దీని ద్వారా ఏ కులం ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎంత మందికి విద్య, ఉద్యోగం, పింఛన్ లాంటి సామాజిక ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయి? అనే వివరాలు బయటపడతాయి. కుల గణన వల్ల నేరుగా ప్రయోజనం పొందేవారు ప్రజలే కావాలి. ఎందుకంటే,వాస్తవిక డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలు మెరుగవుతాయి.ఇతర వెనుకబడిన వర్గాలు (OBC) లోని సూక్ష్మకులాల స్థితిని చక్కగా అర్థం చేసుకోవచ్చు.పునర్విభజన ద్వారా వారికి మరింత రిజర్వేషన్లు లభించే అవకాశం ఉంటుంది.1931లో బ్రిటిష్ పాలనలో చివరిసారి కులాలపై స్పష్టమైన గణన జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకూ జనాభా లెక్కల్లో కుల వివరాలు తీసుకోవడం నిలిపివేశారు. అయితే 2011లో “సామాజిక ఆర్థిక కుల గణన (SECC)” చేపట్టారు గానీ, ఆ డేటాను ఎప్పటికీ విడుదల చేయలేదు.
తెలంగాణ లో వాట ఎక్కడ ?
కుల గణనకు మొట్టమొదటిగా డిమాండ్ చేసిన పార్టీ కాంగ్రెస్‌నే అయినా… నిజంగా దాన్ని అమలు చేయాలన్న నిశ్చయమే గతంలో తక్కువగా కనిపించింది. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక సర్వే (Social, Educational, Employment, Economic Caste Survey:SEEEPC) చేపట్టింది. కానీ అందులో సేకరించిన కుల డేటా నాణ్యత లేనిదిగా పేర్కొంటూ దాన్ని బయట పెట్టలేదు. మోదీ ప్రభుత్వం ఇక కాంగ్రెస్‌ను మరింత ఇరుకున పెట్టేలా వ్యూహం వేసినట్లు కనిపిస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన జనాభా లెక్కల్లో కాంగ్రెస్ ఎప్పుడూ కులాల డేటాను లెక్కించలేదని బీజేపీ విమర్శిస్తోంది. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కేవలం “కుల గణనపై కేబినెట్‌లో చర్చిస్తాం” అన్నారు తప్ప, కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవని బీజేపీ ఆరోపిస్తోంది. పైగా అప్పట్లో “సామాజిక-ఆర్థిక గణన (SECC)” నిర్వహించడమే సరిపెట్టారని, అసలు కుల గణన చేపట్టేందుకు కాంగ్రెస్‌కు స్పష్టత లేదని బీజేపీ వాదిస్తోంది.
అయితే తెలంగాణ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన కొంతవరకు దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది, విచిత్రమేమిటంటే, కులగనన సర్వేలపై సాక్షాత్తు తెలంగాణ లోని బీసీ జనాభా సంతృప్తికరంగా లేదు, బీసీల గురించి మాట్లాడుతూనే చాలా పదవులు అగ్రవర్ణాలకు ఇవ్వడాన్ని, రాజకీయ జెండాలు మార్చిన బీసీ సంఘం నేతలతో అంటగాకడాన్ని కూడా ప్రజలు సహించలేకపోతున్నారు, ఫలితంగా కులగణన తో పెద్దగా బీసీ జనాభా నుంచి ఏ మాత్రం లాభం రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడే అసలు మోదీ మ్యాస్టర్ ప్లాన్ కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా “కుల గణన” అనేది కాంగ్రెస్ హస్తంలో ఉన్న ఒక బలమైన నినాదం. కానీ ఇప్పుడు అదే అంశాన్ని మోదీ ముందుగా ప్రకటించడంతో, మళ్లీ రాజకీయ నాటకం దిశ మలుపు తిరిగింది.
వ్యూహం కాదు – వ్యూహా గణితమది
కుల గణన అంటే కేవలం గణాంకాలు కాదు. అది సామాజిక న్యాయం, హక్కుల హక్కుదారులకు చేరే పోరాటం, దేశంలోని అనేక వర్గాల హక్కుల గుర్తింపు కోసం జరిపే రాజకీయ యుద్ధం కూడా. ఈ నేపథ్యంలో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు తీసుకున్న వైఖరులను పరిశీలిస్తే, నిజాయితీగా, స్పష్టంగా ఎవరు వ్యవహరిస్తున్నారు అన్నది మైనాపై చుక్కలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ – ముఖ్యంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు – బహిరంగంగా, పదే పదే ఒకే మాట చెబుతున్నారు, దేశం మొత్తంగా కుల గణన జరగాలి. ఇది సామాజిక న్యాయం కోసం అవసరం. మేము అధికారంలోకి వస్తే తొలి చర్యగా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తాము. కుల గణనను నినాదంగా మార్చిన రాహుల్ గాంధీ, ఇటీవల ప్రచార సభల్లో ఓ మాటను పదేపదే పునరావృతం చేస్తున్నారు – “జనాభా మేరకు హక్కు”. అంటే, వారికి అదే మేరకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన పట్టుదలగా చెబుతున్నారు.
ఈ మాటలు ప్రజల్లో ఆకర్షణీయంగా ఉన్నా, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న ప్రయోగాలుగా మోదీ వర్గం చిత్రీకరిస్తోంది. కానీ నిజానికి, ఇది ఓ పెద్ద సామాజిక అంశానికి దారితీసే నినాదం కావచ్చు.కుల గణన డిమాండ్‌ను ప్రతిపక్షాల నుంచి లాక్కొని, దాన్ని తమదేంటూ ప్రకటించడం మోదీ పక్కా వ్యూహం. బిహార్ ఎన్నికలకు ముందు కుల గణన ప్రకటన చేయడం ద్వారా ఆయన రెండు ప్రయోజనాలు సాధించారు, రాహుల్ గాంధీ గళాన్ని మందకొల్చారు.బిహార్‌లో కులరాజకీయాల చిచ్చు రాజేసేలా వ్యూహాత్మకంగా అడుగు వేశారు.ఇది వ్యూహం కాదు, వ్యూహా గణితం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓటర్ల మ్యాప్ కావొద్దు !
కుల గణన ద్వారా రాజకీయ పార్టీలు పట్టుకునే ముఖ్య అంశం – వోటర్ల కుల మ్యాప్. ఈ డేటాను ఉపయోగించి వారు,నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహాలు సిద్ధం చేస్తారు.వర్గాల మధ్య విడదీయడం ద్వారా వోటు బ్యాంకులు ఏర్పాటు చేస్తారు.ఓ కులాన్ని ఓ కులానికి వ్యతిరేకంగా నిలబెట్టి, ఓటు లాభం పొందాలనుకుంటారు. ఇది ఆచరణలో అసమానతలు తేవచ్చు.రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక డేటా ఆధారంగా మారుతుంది.నూతన కుల రాజకీయాలు పుట్టుకొచ్చే ప్రమాదం కూడా ఉంది.అంతేకాదు.సమస్య కుల గణనలో లేదు — దానిని ఎలా ఉపయోగిస్తారనే విషయంలో ఉంది.
గణన డేటాను సామాజిక సమతుల్యత కోసం వాడితే ప్రజలకు భారీ ప్రయోజనం కానీ రాజకీయ వోటు బ్యాంకుల కోసం వాడితే – అది ప్రజాస్వామ్యానికి హాని. మెజార్టీ జనాభా గల కులాలు జనాభా ఎక్కువ ఉందని అన్ని పదవులు వాళ్లే అనుభవించకుండా, రాజకీయ అధికారం కనీసం రుచి చూడని చిన్న కులాలకి సహృదయతో సహాయం తప్పకుండా చేయాలి, ముఖ్యంగా ప్రజల పక్షాన నిలబడే నాయకులు గణన ఫలితాలను పారదర్శకంగా, నిజాయితీగా ఉపయోగిస్తే దేశానికి ఇది ఉపయోగమే. కానీ, రాజకీయ లబ్ధికోసం వాడితే… ఈ గణనే చిన్న కులాలను మరోసారి ఇబ్బందుల పాలు చేసే అవకాశం లేకపోలేదు.