‘విష్ణువు’ లోని ‘విశ్’ చెప్పే చరిత్ర ఏమిటి?!

కల్లూరి భాస్కరం 'రామాయణంలో నిరుత్తరకాండ-42' : ‘విశ్’ మూలశబ్దం నుంచి విష్ణువనే మాట పుట్టింది. విశ్వమంతా ఆవరించిన 'విశ్' శబ్దం చరిత్ర వివరిస్తున్నారు రచయిత;

Update: 2025-01-26 06:36 GMT
Lord Vishnu (source: X)

పుట్టుక, పరిణామం, ప్రసిద్ధి, ప్రాధాన్యం వగైరాలలో దేవతలకు కూడా వారిదైన చరిత్ర ఉంది; వారి మధ్య తారతమ్యాలు ఉండడమే కాక, కాలక్రమంలో అవి తారుమారు కావడమూ ఉంది. ఋగ్వేదంతో మొదలుపెట్టి ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణకాలాల మీదుగా ఆధునికకాలం వరకూ అది కనిపిస్తుంది. ఉదాహరణకు, ఋగ్వేదంలో ఇంద్రుడు, అగ్ని, సోముడు, అశ్వినీదేవతలు, ఉషస్సు, మరుత్తులు, మిత్రుడు, వరుణుడు తదితరులే ప్రధానదేవతలు; విష్ణువు, రుద్రుడు తదితరులది వారి తర్వాతి స్థానమే.

ఇతిహాస, పురాణకాలాలకు వచ్చేసరికి ఇది తలకిందులైంది; ఇంద్రాది దేవతల ప్రాధాన్యం అడుగంటి విష్ణువూ; శివుడనే పేరుతో రుద్రుడూ, మరి కొందరూ ప్రధాన దేవతలయ్యారు; ఆపైన కొత్తగా మరికొందరు దేవుళ్ళు అవతరించారు. ఈ కొత్త దేవుళ్ళకూ, పాతదేవుళ్ళకూ మధ్య పోటీ కొనసాగి; కొందరు పాత దేవుళ్ళు తెర వెనక్కి తప్పుకోవడం అన్ని కాలాల్లోనూ జరుగుతూనే ఉంది. పురాణాలు పేర్కొనని, లేదా పురాణప్రసిద్ధులు కాని కొత్త దేవుళ్ళు పురాణదేవతలతో సమానంగా, ఒక్కోసారి వారిని మించీ ఇటీవలి కాలంలో ప్రఖ్యాతులవడం మనకు తెలిసినదే.

ఇలా దేవతలకు కూడా తమదైన పరిణామ చరిత్ర ఉంటుందని సూచించడానికే ఈ ఉపోద్ఘాతం తప్ప, అందులోకి మరీ లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు. ఇప్పుడీ కాస్త అవగాహన వెలుగులో, ఇంతకుముందు ప్రస్తావించుకున్న విష్ణువు, నారాయణుల గురించిన వివరాలలోకి వెడదాం:

‘విశ్’ అనే ధాతువు (మూలశబ్దం)నుంచి విష్ణువనే మాట పుట్టింది; సర్వత్రా, లేదా జగత్తు అంతటా వ్యాపించడాన్నిచెప్పే శబ్దమిది. ‘విశ్వ’, ‘విశాల’, ‘విస్తర’, ‘విస్తృతి’, ‘విషయం’, ‘విశేషజ్ఞ’ మొదలైన అనేక మాటలు ‘విశ్’నుంచి పుట్టినవే; ఇవి కూడా వ్యాప్తినే చెబుతాయి.

సందర్భం నుంచి కాస్త పక్కకు జరిగైనా ‘విశ్’ ధాతువు గురించి చెప్పుకోదగిన విశేషాలు చాలా ఉన్నాయి. ఋగ్వేదం సహా వివిధ వాఙ్మయాల నుంచి మోనియర్-విలియమ్స్ సంస్కృతాంగ్ల నిఘంటువు ఉదహరించిన ప్రకారం, ఒక జనావాసం(settlement), ఇల్లు(home), లేదా దొడ్డితో కూడిన ఇల్లు(homestead), నివాసం, సమూహం(community), కులం(clan), గణం(tribe), జాతి(race), ప్రజలు(subjects), సైన్యం(troops), ఆస్తి(property), సంపద(wealth), ప్రవేశం(entrance) మొదలైన అర్థాలతో ఈ ‘విశ్’ ధాతువు ముడిపడి ఉంది.

నాలుగు వర్ణాల వ్యవస్థలో మూడవదైన ‘వైశ్యు’లనే మాట ‘విశ్’నుంచే పుట్టింది. ఋగ్వేదం గృహయజమానిని ‘విశ్పతి’ అనీ, గృహయజమానురాలిని ‘విశ్పత్ని’ అనీ అంటుంది. ‘విశ్పతి’- ఋగ్వేదదేవతలైన అగ్నికి, ఇంద్రుడికీ కూడా వర్తింపజేసిన మాట కూడా. ఇక ‘విశాంపతి’ అనే మాట నాథుని, లేదా యజమానిని, ఒక జనావాసానికి, తెగకూ చెందిన నాయకుని, రాజును, చక్రవర్తిని, చివరికి ఈశ్వరుని చెబుతుంది.

ఈవిధంగా మొదట్లో ఇల్లు, జనావాసం, జనం, జననాయకుడు, కులనాయకుడు, గణనాయకుడు, రాజు, చక్రవర్తి, విస్తృతి, వ్యాప్తి మొదలైన లౌకిక, లేదా సామాన్యార్థాలతో ముడిపడిన ‘విశ్’; క్రమంగా అలౌకికార్థం వైపు సాగి ఈశ్వరుని సూచించేదిగా, విష్ణువు అనే దేవుడిపేరులో భాగంగా మారిన క్రమాన్ని పై వివరాలు చెబుతాయి. త్రిమూర్తులలో ఒకడుగా మనకు బాగా తెలిసిన ‘విష్ణువు’ అనే మాటలోనూ, ఆయన కేంద్రంగా పుట్టిన ‘వైష్ణవం’ అనే ఒక మతపంథా పేరులోనూ ఉన్న ‘విశ్’ అనే ధాతువుకు లౌకికంతో ముడిపడిన, మనకు తెలియని పరిణామచరిత్ర ఇంత ఉందన్నమాట!

ఇంకా ఆసక్తికరం ఏమిటంటే, ‘విశ్’ అనే ధాతువు ప్రతిరూపాలు సంస్కృతానికి బయట, ఇతర ఇండో-యూరోపియన్ భాషల్లోనూ ఉండడం!

ఎలాగంటే, Etymology Dictionary ప్రకారం, ఇండో-యూరోపియన్ మాతృకాభాష(ప్రోటో- ఇండో -యూరోపియన్)లో *Weik- అనే మూలపదం ఉంది; దీనికి మూడు రకాల అర్థాలున్నాయి. మొదటి అర్థం ప్రకారం, ఇది తెగ(clan)ను, ఇంటికన్నా పెద్దదైన నివాసప్రాంతాన్ని చెబుతుంది. దీనినుంచే సమీపప్రాంతాన్ని, లేదా పొరుగును తెలిపే vicinage, vicinity వంటి మాటలు; Viking(స్కాండెనేవియాకు చెందిన నౌకాయానజనం); villa(తోట ఇల్లు); village(గ్రామం); villain(ఈ మాట ప్రతినాయకుడనే అర్థంలో స్థిరపడినా మొదట్లో ఒక ప్రాంతానికి చెందిన వర్గాన్ని సూచించేది); wick(పశువుల కొట్టం) మొదలైన మాటలూ వచ్చాయి.

సంస్కృతానికి వస్తే; గృహాన్ని, లేదా నివాసాన్ని, జనావాసాన్ని తెలిపే విశ్-విట్ అనే మూలపదాలు కూడా ప్రోటో-ఇండో-యూరోపియన్ నుంచే వచ్చాయని పై వ్యుత్పత్తి నిఘంటువు చెబుతుంది. ప్రాచీన ఇరాన్ కు చెందిన అవెస్తాలో కూడా ’vis’(విశ్) అనే మూలపదం గృహం, గ్రామం, తెగ అనే అర్థాలలో ఉంది.

పై ప్రోటో-ఇండో-యూరోపియన్ మూలపదమే పాత పర్షియన్ లో గృహం, రాజగృహం అనే అర్థాలలో vitham గా; గ్రీక్ లో గృహమనే అర్థంలో oikos గా; లాటిన్ లో తోట ఇల్లు అనే అర్థంలో villa గ, గ్రామం, గృహసముదాయం అనే అర్థంలో vicus గా; లిథుయేనియాలో గృహయజమానిని చెప్పే viespats గా; పాత స్లవోనిక్ చర్చిలో గ్రామాన్ని తెలిపే visi గా; గోతిక్ లో గ్రామాన్ని తెలిపే weihs గా ; పాత ఇంగ్లీష్ లో నివాసప్రాంతాన్ని, లేదా పట్టణాన్ని తెలిపే wick గా; ఓల్డ్ హై జర్మన్ లో గ్రామమనే అర్థంలో wih గా; జర్మన్ లో మునిసిపల్ ప్రాంతమనే అర్థంలో weichbild గా మారింది.

కాలక్రమంలో మాతృకాభాషలోని మూలపదం వివిధపుత్రికాభాషల్లో ధ్వనిపరంగా, అర్థపరంగా మార్పులకు లోనవడం సహజమే; ఆ మార్పును భాషాశాస్త్రవేత్తలు మాత్రమే వివరించగలరు. అదలా ఉంచితే, సంస్కృతంలోని ‘విశ్’ కు vicinage, vicinity అనే మాటలే కాక; అవెస్తాలోని vis(విశ్), లాటిన్ vicus, పాత స్లవోనిక్ చర్చిలోని visi, గోతిక్ లోని weihs అనే మాటలూ ధ్వనిలోనూ, అర్థంలోనూ ఎంత దగ్గరగా ఉన్నాయో గమనించవచ్చు; అలాగే, సంస్కృతంలోని ‘విశ్పతి’ అనే మాటకు లిథుయేనియాలోని viespats అనే మాట కూడా.

ఇంకా ఆసక్తికరం ఏమిటంటే, గ్రీక్ లో గృహాన్ని తెలిపేదిగా పైన చెప్పుకున్న oikos అనే మాట, అదే అర్థంలో ‘ఓకః-ఓకము-ఓకసము’ అనే రూపంలో సంస్కృతంలో ఉంది. ఉదాహరణకు, ఋగ్వేదం, ప్రథమమండలం, తొమ్మిదవ సూక్తంలోని 10వ ఋక్కులో ఆ ప్రయోగం ఇలా కనిపిస్తుంది:

సుతే సుతే న్యోకసే బృహద్బృహత ఏదరిః ఇంద్రాయ శూషమర్చతి

యజమానులందరూ నియతస్థానంలో బలవంతుడై ఉన్న ఇంద్రునికోసం అభిషవించిన ప్రతి సోమంలోనూ ఉన్న గొప్ప బలాన్ని స్తుతిస్తారని- దీనికి బంకుపల్లె మల్లయ్యశాస్త్రిగారి అనువాదం. హెచ్. హెచ్. విల్సన్ తన ఋగ్వేద ఆంగ్లానువాదంలో పై ఋక్కులో ఉన్న ‘న్యోకస్’ అనే మాటలోని ‘ని’కి నియత అనీ, స్థిరపరచినదనీ(fixed), శాశ్వతమైనదనీ(permanent); ‘ఓకస్’కు నివాస(dwelling)మనీ అర్థం చెప్పారు.

ప్రముఖచరిత్రకారిణి రొమిలా థాపర్, ‘ఫ్రమ్ లినియేజ్ టు స్టేట్- సోషల్ ఫార్మేషన్స్ ఇన్ ది మిడ్-ఫస్ట్ మిలీనియం బి.సి ఇన్ ది గంగావ్యాలీ’ (FROM LINEAGE TO STATE- Social Formations in the Mid-First Millennium B.C. in the Ganga Valley) అనే తన పుస్తకంలో ‘విశ్’ గురించి ఇచ్చిన చారిత్రకమైన వివరణా ఇంతే ఆసక్తికరంగా ఉండడమే కాక; నాలుగు వర్ణాల విభజన ఎలా వచ్చిందో, ఎలా స్థిరపడిందో చెబుతుంది.

ఋగ్వేదం, బ్రాహ్మణాలూ వగైరాల ఆధారంగా ఆమె చెప్పిన ప్రకారం, ఆర్యగణాలు పశుపాలకదశలో ఉన్నప్పుడు సంపదను గోవుల రూపంలోనే లెక్కించేవారు; ఇతరుల గోవులను జయించి తెచ్చేవాడిగా రాజును ‘గోజిత్’ అనీ, గోసంపదను కాపాడేవాడుగా ‘గోప’ అనీ, ‘గోపతి’ అనీ పిలిచేవారు. క్రమంగా వ్యవసాయప్రాధాన్యం పెరిగి, వ్యవసాయభూములనూ, వ్యవసాయవిస్తరణ కోసం ఏర్పరచిన జనావాసాలనూ రక్షించే బాధ్యత రాజు మీద పడిన తర్వాత అతణ్ణి ‘భూపతి’గా, ‘నృపతి’గా చెప్పడం మొదలైంది.

అన్ని రకాల జనాలనూ కలిపేసి ప్రజలుగా కాకుండా వేర్వేరు గణాలుగానో, తెగలుగానో మాత్రమే గుర్తిస్తూవచ్చిన దశలోనూ; సంపదా, అధికారాల పరంగా ఎక్కువ, తక్కువలు ఏర్పడని దశలోనూ గణ/తెగ/కుల నాయకులను, అందులోని ఇతరులనూ కూడా ‘విశ్’ గానే గుర్తించేవారు. గోసంపదైనా, భూసంపదైనా గణానికి, లేదా తెగకు చెందిన ఉమ్మడి సంపదగానే ఉండేది. రాజు కూడా అందరిలో ఒకడే తప్ప సర్వస్వతంత్రుడు కాదు. ‘దాస’, ‘శూద్ర’ వంటి అనార్యజనాలను కూడా విడిగా ‘విశ్’ గానే గుర్తించేవారు. వేదకాలపు జనంలో అనేక ‘విశ్’ లు భాగంగా ఉండేవి.

ఋగ్వేదకాలంనాటికి రాజులు, లేదా రాజన్యులు ‘విశ్’ లోనే ఒక ప్రత్యేకవర్గంగా మారి ‘విశ్’లోని ఇతరులనుంచి వేరుపడడం ప్రారంభించారు. ఆవిధంగా ‘విశ్’ లో వంశపరమైన పెద్ద, చిన్న తేడాలు ఏర్పడ్డాయి. రాజన్యులు పెద్ద వంశంగా మారగా, ‘విశ్’లోని ఇతరులు చిన్న వంశంగా ఉండిపోయారు. అప్పటికీ భూమిపై యాజమాన్యం ఉమ్మడిగానే ఉండేది; భూమిని సాగు చేయడం ‘విశ్’ బాధ్యతగా ఉండేది. ‘విశ్’ నే కృషికులుగా పిలిచేవారు. వ్యవసాయాన్ని, ‘విశ్’ నుంచే పుట్టిన వైశ్యుల వృత్తిగానే ధర్మశాస్త్రాలు చెప్పాయి.

రాజన్యులకు, ‘విశ్’ కు మొదట్లో ఎంత అన్యోన్యత ఉండేదంటే, ఉభయులూ ఒకే కంచంలో తినేవారని ‘శతపథబ్రాహ్మణం’ చెబుతుంది. ‘విశ్’నుంచే క్షత్రియులను సృష్టించారని అంటుంది. హెచ్చు, తగ్గుల తేడాలు ముదిరి రాజు శక్తిమంతుడు, రక్షకుడు అనే అర్థంలో క్షత్రియుడన్న పేరు తెచ్చుకుంటే, ‘విశ్’ అతని చెప్పుచేతల్లో ఉండే ‘వైశ్య’వర్ణంగా మారాడు; క్షత్రియుడు ‘విశమత్త’, అంటే ‘విశ్’ను అణచి ఉంచేవాడయ్యాడు. లేడి గడ్డిపరకలను తిన్నట్టుగా క్షత్రియుడు ‘విశ్’ను తింటాడని ‘ఐతరేయబ్రాహ్మణం’ అంటుంది. అతిప్రసిద్ధులైన రాజులందరూ ధర్మరాజుకు వైశ్యులలా లొంగిపోయి గొప్ప గొప్ప ధనరాశులు తెచ్చి ఇచ్చారని మహాభారతంలో రాజసూయయాగ సందర్భంలో దుర్యోధనుడు శకునితో అంటాడు.

రాజుకూ, ‘విశ్’ కూ మధ్య దూరం పెరిగిన క్రమాన్నీ; దాని వెనక గల ఆర్థికకారణాలను రొమీలా థాపర్ వివరిస్తారు. ‘విశ్’లు ప్రత్యేకసందర్భాలలో రాజుకు కానుకలు, లేదా బలులు సమర్పించేవారు. ‘విశ్’ తను సృష్టించిన సంపదలో క్షత్రియునికి ‘భాగం’ పెడతాడు కనుక పన్నును ‘భాగ’ అన్నారు. రాజు క్షత్రియుడిగా ముదిరి జనావాసాలపైనా, జనంపైనా ఆధిపత్యం స్థాపించుకున్నకొద్దీ, అతనికి పురోహితుడి అవసరం పెరిగింది. క్షత్రియుడి అధికారానికి పవిత్రతను ఆపాదించి తద్వారా జనామోదాన్ని కూడగట్టగలిగింది పురోహితుడే. కనుక, ‘విశ్’ సమర్పించిన బలి, లేదా భాగంలో కొంత భాగాన్ని దాన, దక్షిణల రూపంలో రాజు పురోహితులకూ; తననూ, తన వంశాన్నీ కీర్తించే సూతులకూ పంచేవాడు. ఆవిధంగా బ్రాహ్మణ, క్షత్రియులు ఒకరికొకరు సహకరించుకునేవారు కనుక వారిని ‘శతపథబ్రాహ్మణం’ ఋగ్వేదదేవతలైన మిత్రావరుణులతో పోల్చింది.

అలా బ్రాహ్మణ, క్షత్రియ అన్యోన్యత బలపడుతున్న దామాషాలోనే ‘విశ్’పై పీడనా, భారమూ పెరిగాయి; ‘విశ్’ల సామాజికస్థాయీ తగ్గింది. ఎలాగంటే, మొదట్లో సామాజికంగానూ, మతపరమైన కర్మకాండల్లోనూ ‘విశ్’ను దూరం పెట్టేవారు కాదు; యజ్ఞశాలలోకి రాకూడదనీ, యజ్ఞశేషం తినకూడదనే నిషేధం శూద్రులపై మాత్రమే ఉండేది. అలాంటిది, యజ్ఞశేషం తినకూడదన్న నిషేధం ‘విశ్’ లకూ వర్తించడం మొదలైంది. ఈ క్రమంలో ‘విశ్’ లలో సంపన్నులు రాజన్యులకు, పురోహితులకు దగ్గర కాగలిగితే; పేదలు శూద్రులవుతూవచ్చారు.

క్రతువులు, దాన, దక్షిణల కోసం రాజుకు సంపద అవసరం పెరిగినకొద్దీ, ‘విశ్’లపై ఉత్పత్తి భారమూ పెరిగింది; దాంతో ‘విశ్’ కు తెగ బయటి వ్యక్తుల సేవలు అవసరమయ్యాయి; ఆవిధంగా శూద్రులు, దాసులు కూలీలుగా వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టారు. అది క్రమంగా ఆర్థికకార్యకలాపాలకు గృహాన్నే కేంద్రంగా చేసి గృహ ఆర్థికవ్యవస్థ(House Holding Economy)ను తీసుకొచ్చింది. కాకపోతే అప్పటికింకా ‘రాజ్యం’ అనేది ఏర్పడలేదు; జనం -అంటే తెగ అడుగుపెట్టిన ప్రాంతాన్ని ‘జనపదం’ అనేవారు. రాజుకు వ్యవసాయభూములపైనా, జనపదం మీదే తప్ప, వాటిని ఆనుకుని ఉన్న అరణ్యాలపై ఆధిపత్యం ఉండేది కాదు. దాసులు, శూద్రుల వంటి తెగ వెలుపలి జనాన్ని వ్యవసాయ అవసరాల కోసం కలుపుకోవడం ప్రారంభించాక జనం, గణం, లేదా తెగ స్థానంలో ‘ప్రజలు’ అనే మాట వ్యవహారంలోకి రావడం మొదలైంది.

గృహ ఆర్థికత అడుగుపెట్టి, తెగ బయటినుంచి ఒక శ్రామికవర్గాన్ని తెచ్చుకోగానే సమష్టియాజమాన్యం స్థానంలో వ్యక్తియాజమాన్యమూ, వర్తకమూ ప్రవేశించాయి. ‘విస్పతి’, ‘విశాంపతి’ లానే గృహయజమాని ‘గృహపతి’ అయ్యాడు. మొదట్లో గృహపతిగా రాజు కానీ, ‘విశ్’ కు చెందిన మరొకరు కానీ ఉండేవారు. ఋగ్వేదానంతరవాఙ్మయంలో వైశ్యగృహపతి ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది. వైశ్యగృహపతిని ‘గ్రామణి’ అనేవారు. ఇలా వైశ్యుడనే మూడో వర్ణం రూపుదిద్దుకునే క్రమంలోనే తెగ లక్షణం పలచబడి వ్యక్తిగతమైన ఉనికి ప్రస్ఫుటమవడం మొదలైంది. దాంతోపాటే వైశ్యులు, శూద్రుల మధ్య తేడా కూడా స్థిరపడింది; వైశ్యులను అణచి ఉంచాలనీ, శూద్రులను మాత్రం దండించాలనీ, వారిని చంపినా చంపవచ్చుననీ ‘ఐతరేయబ్రాహ్మణం’ అంటుంది.

గృహ ఆర్థికతవచ్చి, వ్యవసాయోత్పత్తికి ఎప్పుడైతే కొలమానమైందో; అప్పటినుంచి గ్రామణి, లేదా గృహపతి వ్యవసాయభూమిపై వ్యక్తిగతమైన హక్కును కోరుకోవడం ప్రారంభించాడు. అందువల్ల వ్యవసాయభూమిపైనా, జనావాసంపైనా అంతవరకూ తెగకు ఉన్న సమష్టి యాజమాన్యం క్షీణించినప్పటికీ; తనకు నికరమైన రాబడి ఉంటుంది కనుక వ్యవసాయభూమిపై వ్యక్తిగత హక్కు రాజుకూ ఆమోదయోగ్యంగానే కనిపించింది. ఆవిధంగా బలి, భాగం స్థానంలో- నిర్ణీతకాలంలో శిస్తు, లేదా పన్ను చెల్లించే వ్యవస్థ వచ్చింది. క్రమంగా గృహ ఆర్థికవిధానం కూడా అంతరించి , రైత్వారీ విధానం వచ్చి, శూద్రులు ప్రధానరైతువర్గంగా మారారు.

మొదట్లో హెచ్చు, తగ్గులు లేని ‘విశ్’లో రాజులు తమను ఉన్నతవర్గంగా వేరుపరచుకుని రెండవ వర్ణంగా ఎలా అవతరించారో; ఆ తర్వాత వైశ్యులు తమను ఉన్నతవర్గంగా వేరుపరచుకుని మూడవ వర్ణంగా ఎలా అవతరించారో; ఆ క్రమంలో అంతవరకూ బయట ఉన్న శూద్రులు, దాసులు వ్యవసాయకూలీలుగా వర్ణవ్యవస్థలోకి అడుగుపెట్టి నాలుగవ వర్ణంగా ఎలా మారారో పై వివరణ చెబుతుంది. బ్రాహ్మణులు తొలి వర్ణంగా అవతరించిన క్రమం మాత్రమే ఇందులో లేదు. అంతకన్నా ముందే ఒకే కుదురుకు చెందిన బ్రాహ్మణ-క్షత్రియుల్లో క్రమంగా వృత్తిపరమైన చీలిక వచ్చి రెండు వర్ణాలుగా వేరుపడ్డారు; అది వేరే కథ!

ఋగ్వేదంలో విష్ణువు గురించి ఉన్న ప్రస్తావనలతోపాటు నారాయణుడి గురించిన విశేషాలు వచ్చేసారి...



Tags:    

Similar News