యాసంగిలో బోర్ల కింద వరి సాగేమిటి ?

యాసంగిలో కూడా సన్న ధాన్యం సాగు చేస్తే బోనస్ చెల్లిస్తామన్నారు. రైతులు మూకుమ్మడిగా వరి సాగు వైపు వెళ్లారు. ఇపుడు నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి.;

Update: 2025-03-15 02:00 GMT

వాతావరణంలో వస్తున్న మార్పులు, ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఎండలు, ఇతర ప్రకృతి వైపరిత్యాల గురించి అసలు పట్టింపు లేని ప్రభుత్వాలను ఏమనాలి? యాసంగిలో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేయడం రిస్క్ తో కూడుకున్నదని, రైతులు కూడా తమ స్వీయ అనుభవంతో గుర్తించకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?

2014 నుండీ ఇప్పటివరకూ ఈ ప్రశ్నను మేము ప్రభుత్వాలను, రైతులను పదే పదే ఆడగవలసి వస్తున్నది. మరీ ముఖ్యంగా 2018 తరువాత ప్రతి సంవత్సరం ఒకే అనుభవం ఎదురావుతున్నది. వానాకాలం సీజన్ లో భారీ వర్షాలు పడడం, ఈ నీళ్లను చూసి యాసంగిలో కూడా రైతులు వరి సాగు చేయడం, ప్రభుత్వాలు కూడా వరి సాగును ప్రోత్సహించడం, మార్చ్, ఏప్రిల్ నెలలు వచ్చేసరికి రాష్ట్రంలో చాలా జిల్లాలలో బోరు బావులలో భూగర్భ జలాలు అడుగంటడం, వరి పొలాలు ఎండిపోయి రైతులు బాధ పడడం, వరి పొలాలలోకి పశువులను తోలడం , డబ్బులు ఖర్చు పెట్టి, ట్యాంకర్ లలో నీళ్ళు తెచ్చి పొలాలకు పారించడం, యాసంగిలో వ్యవసాయ రంగంలోనూ, బయటా కూడా విద్యుత్ వినియోగం పెరిగిపోయి డిస్కం లు అప్పులలో కూరుకు పోవడం – ఇవీ సాధారణంగా కనిపించే దృశ్యాలు.

ఈ పరిస్థితులలో పర్యావరణ స్పృహ ఉన్న ఏ ప్రభుత్వమయినా ఏం చేయాలి ? యాసంగి లో బోర్ల కింద వరి సాగు వద్దని రైతులకు స్పష్టంగా చెప్పాలి. సాగు నీరు తక్కువ అవసరమయ్యే ఇతర పంటలు వేస్తే ప్రభుత్వం కనీస మద్ధతు ధరలతో కొనుగోలు చేస్తుందని హామీ ఇవ్వాలి. యాసంగి లో బోర్లా కింద సన్న ధాన్యం సాగు చేసినా, క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇవ్వబోమని కూడా ప్రకటించాలి. కానీ ఏం జరిగింది ? దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. యాసంగిలో కూడా సన్న ధాన్యం సాగు చేస్తే బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. రైతులు మూకుమ్మడిగా వరి సాగు వైపు వెళ్లారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులలో, బోర్లు అడుగంటి పంటలు ఎండిపోయి అదే రైతులు గగ్గోలు పెడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ 12-03-2025 నాటి వీక్లీ రిపోర్ట్ ప్రకారం యాసంగి లో వరి సాధారణ విస్తీర్ణం 47,27,000 ఎకరాలు కాగా, 2023-2024 యాసంగి సీజన్ లో 50,47,785 ఎకరాలలో వరి సాగు చేశారు. 2024-2025 యాసంగి నాటికి ఈ విస్తీర్ణం 56,13,747 ఎకరాలకు పెరిగింది. మొక్క జొన్న సాధారణ విస్తీర్ణం 5,89,098 ఎకరాలు కాగా, గత సంవత్సరం 6,45,600 ఎకరాలలో సాగు చేశారు. ఈ సంవత్సరం ఈ విస్తీర్ణం 8,09,784 ఎకరాలకు పెరిగి పోయింది. మరో వైపు శనగ విస్తీర్ణం 2,55,187 ఎకరాల నుండీ 2,20,240 ఎకరాలకు, పెసర విస్తీర్ణం 16,384 ఎకరాల నుండీ 11,634 ఎకరాలకు పడిపోయింది. ఉలవలు,అలసందల విస్తీర్ణం కూడా తగ్గిపోయింది.

ఈ యాసంగి సీజన్ లో వేరు శనగ విస్తీర్ణం కొద్దిగా పెరిగినప్పటికీ, నువ్వుల విస్తీర్ణం 25,164 ఎకరాల నుండీ 23,463 ఎకరాలకు, పొద్దు తిరుగుడు విస్తీర్ణం 21,868 ఎకరాల నుండీ 19,019 ఎకరాలకు,కుసుమ విస్తీర్ణం 10,337 ఎకరాల నుండీ 7006 ఎకరాలకు, ఇతర నూనె గింజల విస్తీర్ణం 5378 ఎకరాల నుండీ 3,475 ఎకరాలకు పడిపోయాయి.

ఇవాల్టి కాలంలో వరి, జొన్న,మొక్క జొన్న పూర్తిగా ఆహార ధాన్యాలుగా కాకుండా, ఆహారేతర పరిశ్రమల అవసరాలకు ముడి సరుకులుగా వెళుతున్నాయి. ముఖ్యంగా లిక్కర్ తయారీకీ, ఇథనాల్ ఉత్పత్తి కోసం ఈ పంటలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో నూనెగింజలు, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోవడంతో, వాటి కోసం మనం ఇతర రాష్ట్రాల మీదా, ఇతర దేశాల మీదా ఆధార పడవలసి వస్తున్నది. నిజానికి ఈ పప్పుధాన్యాలు, నూనె గింజలు , చిరు ధాన్యాల పంటల సాగుకు చాలా తక్కువ నీళ్ళు అవసరం. మరో వైపు వరి, మొక్కజొన్న సాగుకు నీళ్ళు ఎక్కువ అవసరం. భూగర్భ జలాలు అడుగంటి పోతున్న సమయంలో ప్రభుత్వం, చాలా ఎక్కువ సాగు నీళ్ళు అవసరమైన ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహిస్తూ ఉండడం కూడా మరో విచక్షణ లేని పని. కానీ ఈ మాటలను ఎవరు వింటారు ? ఎప్పుడు మార్చుకుంటారు ?

మొత్తంగా 2024 జూన్ 1 నుండీ 2025 మార్చ్ 12 వరకూ గత 9 నెలలలో కురిసిన మొత్తం వర్షపాతాన్ని పరిశీలిస్తే, సాధారణ వర్షపాతం 869 మిల్లీ మీటర్లు కాగా, ఈ కాలంలో మొత్తం 1049.50 మిల్లీ మీటర్లు కురిసింది. అంటే సాధారణం కంటే 20.65 శాతం ఎక్కువ వర్షం కురిసిందన్నమాట. మరి ఇత్య భారీ వర్షాలు కురిసినప్పుడు , ఈ వర్షం అంతా భూగర్భ జలాలుగా మారాలి కదా ? ఇప్పుడు యాసంగి లో పంటల సాగుకు ఉపయోగపడాలి కదా ? కానీ భూగర్భజలాలు తగ్గి పోయాయనీ, బోర్లు ఎండి పోయాయనీ వార్తలెందుకు వస్తున్నాయి?

రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చ్ 12 వారాంతపు నివేదిక ప్రకారం 2024 జూన్ లో సాధారణ వర్షపాతం 129.4 మిల్లీ మీటర్లు కాగా, 159 మిల్లీ మీటర్ల ( 23 శాతం ఎక్కువ) వర్షం కురిసింది. జులై లో సాధారణ వర్షపాతం 229.1 మి. మీ కాగా 294.8 మి. మీ ( 29 శాతం ఎక్కువ) కురిసింది. ఆగస్ట్ లో సాధారణ వర్షపాతం 217.4 మి. మీ కాగా 209.9 మి. మీ ( 3 శాతం తక్కువ ) కురిసింది. సెప్టెంబర్ లో సాధారణ వర్షపాతం 162.7 మి. మీ కాగా 298.9 మి. మీ ( 84 శాతం ఎక్కువ) కురిసింది.

అక్టోబర్ లో సాధారణ వర్షపాతం 89.2 మి. మీ కాగా 64.9 మి. మీ మాత్రమే( 27 శాతం తక్కువ) కురిసింది. నవంబర్ లో సాధారణ వర్షపాతం 19.90 మి. మీ కాగా 5.90 మి. మీ ( 70 శాతం తక్కువ) కురిసింది. డిసెంబర్ లో 4.10 మి. మీ సాధారణ వర్షపాతం కాగా 15.80 మి. మీ ( 285 శాతం ఎక్కువ) కురిసింది. జనవరి లో సాధారణ వర్షపాతం 7.10 మి. మీ కాగా అసలు వర్షం పడలేదు. ఫిబ్రవరిలో సాధారణ వర్షపాతం 4.80 మి. మీ కాగా కేవలం 0.30 మి. మీ ( 93.75 శాతం తక్కువ) వర్షం కురిసింది. మార్చ్ నెలలో 12 వ తేదీ వరకూ సాధారణ వర్షపాతం 6.20 మి. మీ కాగా అసలు వానలు పడలేదు.

ఈ గణాంకాలను పరిశీలిస్తే విషయం ఒక మేరకు అర్థమవుతుంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు పడుతున్నాయి కానీ, అవి ఒకే విధంగా ఉండడం లేదు. భారీ వర్షాలు పడడం , లేదా అతి తక్కువ వర్షాలు పడడం, లేదా వర్షాలు అసలు లేకపోవడం మనం గమనించవచ్చు. దీనివల్ల, భారీ వర్షాలు పడినప్పుడు నీరు పూర్తిగా భూమిలోకి ఇంకకుండా , వాగులు , వంకల లోకీ , నదుల లోకీ పారివెళ్లి పోతున్నాయి. అసలు వర్షాలు పడనప్పుడు కూడా , బోరుబావుల నుండీ నీరు మోటార్లు పెట్టి ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, పత్తి, ఆయిల్ పామ్, మొక్కజొన్న,అరటి, చెరకు లాంటి పంటల సాగు కోసం తోడి పోయడం వల్ల, భూ గర్భ జలాలు త్వరగా అడుగంటి పోతున్నాయి. బోర్లు ఫెయిల్ అవుతున్నాయి. కొత్త బోర్లు వేసినా నీళ్ళు పడక, రైతులు లక్షల రూపాయలు నష్ట పోతున్నారు.

భారీ వర్షాలు పడినప్పుడు కూడా నీరు ఎందుకు భూమి లోకి ఇంకడం లేదు ? మనం వరి సాగు చేయడానికి వీలుగా, వరి సాగులో నిలవ గట్టిన నీరు ఇంకి పోకూడదనే లక్ష్యంతో అన్ని భూములను, దమ్ము నాగలితో పిండి పిండి చేస్తున్నాం. ఫలితంగా భారీ వర్షాలు పడినప్పటికీ, ఎక్కువ నీరు భూమిలోకి ఇంకదు. రసాయన ఎరువులు చాలా ఎక్కువ మోతాదులో వాడడం వల్ల కూడా, భూములన్నీ గట్టిపడి పోయాయి. మన భూముల్లో, నేలను గుల్ల చేసే సూక్ష్మ జీవులు లేకుండా పోయాయి.సేంద్రీయ ఎరువులు వాడే భూమిలో సూక్ష్మజీవులు, వానపాముల కారణంగా భూమి గుల్లబారి ఉంటుంది. ఫలితంగా వర్షపు నీరు కూడా ఎక్కువ ఇంకుతుంది. నీటిని పట్టి ఉంచే శక్తి కూడా, రసాయన ఎరువులు వాడిన భూముల కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రోజులు తేమ భూమిలో ఉంటుంది.

రసాయన ఎరువులు వాడే భూముల్లో నీళ్ళు కట్టినా, త్వరగా ఆరిపోతాయి. భూములకు మళ్ళీ మళ్ళీ నీళ్ళను అందించవలసి ఉంటుంది,అందుకోసం బోర్లు ఎక్కువ సేపు నడవ వలసి ఉంటుంది. నీటిని బయటకు తీయడానికి ఎక్కువ విద్యుత్ ఖర్చు చేయవలసి ఉంటుంది. ఎక్కువ సేపు బోర్లు నడవడం వల్ల, త్వరగా భూగర్భ జలాలు ఇంకిపోయే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో వర్షాలు కూడా పడుతుంటాయి కనుక, బోర్లు ఎక్కువ సేపు నడప వలసిన అవసరం ఉండదు. ఈ విషయాలను గమనించకుండా, యాసంగిలో రైతులు వరి సాగు చేసినా, ప్రభుత్వాలు వరి సాగును ప్రోత్సహించినా తప్పే అవుతుంది.

వరి సాగు చేసే ప్రాంతాలలో మిథేన్ అనే ఉద్గార వాయువు ఎక్కువ ఉంటుంది. వరి సాగులో నీళ్ళు ఎక్కువ రోజుల పాటు నిలవ గట్టడం ఇందుకు ప్రధాన కారణం. ఈ మిథేన్ మనుషులకు అనారోగ్య కారకమని( క్యాన్సర్ కారకమని) ఎంత మందికి తెలుసు ? రెండు సీజన్ లలోనూ వరి సాగు చేయడమంటే,మిథేన్ ను గాలిలో మరింత పెంచడమే. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి, రైతులకు, ప్రజలకు అసలు అవగాహన కల్పించడం లేదు.

వరి సాగులో, ఇతర పంటలలో కూడా రసాయన ఎరువులు ముఖ్యంగా యూరియా ఎక్కువ వినియోగించడం వల్ల కూడా తీవ్ర సమస్యలు ఉన్నాయి. డి. ఏ. పి , కాంప్లెక్స్ ఎరువుల ధరలు బాగా పెరిగాక రైతులు ఎక్కువగా యూరియాను వినియోగిస్తున్నారు. వరిలో వినియోగిస్తున్న యూరియాలో 30 శాతం కు మించి మొక్క తీసుకోవడం లేదనీ, మిగిలిన నత్రజని అంతా వృధా అవుతుందని, ఆ నత్రజని నీళ్ళలో కలిసి, నైట్రేట్ గా మారుతుందనీ, దీనివల్ల మన రాష్ట్ర భూగర్భ జలాలలో ఎక్కువ నైట్రేట్ కనపడుతుందనీ, అనేక నివేదికలు ఘోషిస్తున్నాయి. ఈ నైట్రేట్ కూడా అనారోగ్య కారకమని ( క్యాన్సర్ కారకమని ) ఎంత మందికి తెలుసు ? తెలంగాణ 33 జిల్లాలలో 32 జిల్లాల భూ గర్భ జలాలలో నైట్రేట్ మోతాదుకు మించి వుందని గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన నివేదికలో ఉంది. దేశ వ్యాపితంగా నైట్రేట్ అధికంగా ఉన్న 15 జిల్లాల లిస్టు చేస్తే అందులో మూడు ( రంగారెడ్డి, ఆదిలాబాద్, సిద్దిపేట) మన రాష్ట్రం లోనే ఉన్నాయి.

రాష్ట్ర అవసరాలకు మించి అధిక వరి సాగు ఉత్పత్తి బడ్జెట్ పై కూడా భారమే. వరి సాగుకు ఇచ్చే రసాయన ఎరువుల సబ్సిడీ, ఉచిత విద్యుత్ సబ్సిడీ, రైతు భరోసా, క్వింటాలు ధాన్యం పై బోనస్, ఇవన్నీ ఖర్చు ఖాతాలో వేస్తే ( రైతులు పెట్టే మిగిలిన ఉత్పత్తి ఖర్చులకు అదనంగా) వరి ధాన్యం సాగు నిజంగా లాభదాయకమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది . అతి ఎక్కువ స్థాయిలో వారి సాగు చేస్తే పర్యావరణానికి జరిగే నష్టం గురించి కూడా లెక్క వేస్తే, అప్పుడు ఈ నష్టం విలువ మరింత పెరుగుతుంది. కేవలం వరి విస్తీర్ణం పెరిగి, ఇతర పంటలు మాయమవడం వల్ల, ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగి, వినియోగదారులపై పడే ధరల భారాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే, ఈ నష్టం విలువ మరింత పెరుగుతుంది. ఉదాహరణకు కంది పండే మన రాష్ట్రంలో వినియోగరాదులు, కిలో 180 రూపాయలతో కిలో కందిపప్పు కొనుగోలు చేయవలసి వస్తుందంటే, లేదా నగరాలలో కూరగాయలు కిలో 80 - 100 రూపాయలకు కొనుగోలు చేయవలసి వస్తుందంటే సరైన పంటల ప్రణాళిక చేసుకోకుండా మోనో క్రాపింగ్ వైపు వెళ్లడమే కారణమని ఎంతమందికి తెలుసు ? ఇ ప్రభుత్వం ఈ విషయాలన్నీ ఆలోచించి, సరైన ప్రణాళికా రైతుల మూఁడు పెడితే రైతులు తప్పకుండా ఆలోచిస్తారు. అలా కాకుండా, వరి సాగు చేస్తాం, బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం అని ఎవరైనా మాట్లాడితే అది మూర్ఖత్వమే అవుతుంది.

యాసంగిలో వరి సాగు చేసేలా రైతులను ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వం, నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. వారికి నష్టపరిహారం చెల్లించాలి. రైతులు కూడా తమ జీవితానుభవాలను దృష్టిలో ఉంచుకుని యాసంగిలో వరి సాగు చేయకుండా ఇతర పంటలను సాగు చేయాలి. ఆయా పంటలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కనీస మద్ధతు ధరలతో కొనుగోలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలి. పోరాడాలి. 

Tags:    

Similar News