‘ప్రజాపక్షపాతి’గా ఉండడమంటే ఏమిటి ?
రోజురోజుకూ పెరుగుతున్న హిందుత్వ శక్తుల విస్తరణను అడ్డు కోవడంలో అసలు సమస్య ఏంటో తెలుసా..!
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక స్నేహ బృందం సమావేశంలో ఒక మిత్రుడు నా దగ్గరికి వచ్చి “ తెలంగాణ లో బీజేపీ విస్తరిస్తుంది కదా, బలపడుతుంది కదా, మనం ఆపగలమా “ అని అడిగాడు . ఆపలేమని నేనన్నాను.
పక్కనే మా సంభాషణ వింటున్న మరో స్నేహితురాలు “వాళ్ళు చాలా మంది ఉన్నారు , మనం అంత మందిమి లేము కదా “ అన్నది.
“వాళ్ళ కంటే మన సంఖ్య పెద్దది. మనకున్నన్ని సంఘాలు వాళ్ళకు లేవు, మనకున్నంత మంది సామాజిక స్పృహ ఉన్న మనుషులు వాళ్ళకు లేరు. మనకున్నంత మంది మేధావులు వాళ్ళకు లేరు, మనకున్నంత మంది రచయితలు, కవులు వాళ్ళకు లేరు, అయినా మనం ఆపలేము ” అన్నాను.
“మన వాళ్లు రోజూ ప్రజల లోకి వెళ్ళి పని చేయడం లేదు. చేసినా ఎవరికి వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు మాత్రం రోజూ అన్నిచోట్లా, అన్ని రంగాలలో ఒకే లక్ష్యంతో పని చేస్తారు” అన్నది.
అంటే తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న హిందుత్వ శక్తుల విస్తరణను అడ్డు కోవడంలో అసలు సమస్య మనకు బలం లేక పోవడం కాదు, మనకు సంఖ్య లేకపోవడం కాదు, మనం రోజూ పని చేయకపోవడ మన్నమాట. కలసి పని చేయకపోవడం అన్నమాట. ఈ సంభాషణ అదే చెబుతున్నది.
నేను ఆకాడమిక్ గా ఎక్కువ చదువుకోలేదు. తెలుగులో కొన్ని పుస్తకాలు చదివాను. కొన్ని క్లాసులు, ఉపన్యాసాలు విన్నాను. ఏవో కొన్ని ఇంగ్షీషు వ్యాసాలు, నివేదికలు తప్ప , ఇంగ్షీషులో రాజకీయ, సైద్ధాంతిక పుస్తకాలు చదవ లేదు. కాకపోతే, గత 40 ఏళ్లుగా ప్రజలతో కలసి వివిధ రంగాలలో ఒక రాజకీయ కార్యకర్తగా పని చేస్తూ వస్తున్నాను. కేవలం ప్రజా సంఘాల తోనే కాకుండా, కొన్ని స్వచ్చంధ సంస్థలతో కూడా కలసి పని చేస్తున్నాను.
ఈ అనుభవంతో కొన్ని రోజులుగా రాజకీయ, సైద్ధాంతిక అంశాలపై కొన్ని మాటలు రాయాలని ఎప్పటికప్పుడు అనుకుంటాను కానీ, నేను పని చేస్తున్న కొన్ని ప్రజా రంగాలపై నిత్యం రచనలు చేయాల్సిన పరిస్థితి, సమస్యలలో కూరుకు పోతున్న ఆయా ప్రజా సమూహాల సమస్యలను వివిధ వేదికల మీద గొంతు వినిపించాల్సిన ఆనివార్యత వెంటాడుతూ ఈ వైపు అనుకున్న పని వెనక్కు వెళుతున్నది.
ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు, దేశ ఆర్ధిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, పర్యావరణ సమస్యలు, రాజకీయ, సాంస్కృతిక రంగంలో ఫాసిస్టు శక్తుల విజృంభణ, సమాజంలో మనుషుల మధ్య పెరుగుతున్న విద్వేష పూరిత భావ జాలం, విషసంస్కృతి, కూలి పోతున్న ప్రభుత్వ రంగ వ్యవస్థలు, బలహీన పడుతున్న ప్రజాపక్ష రాజకీయ పార్టీలు, సంఘాలు, నిరాశ, నిస్సహాయత నిండిన వాతావరణంలో కూరుకు పోయిన ప్రజా సమూహాలు, వ్యక్తులలో నిస్పృహ కారణంగా పెరుగుతున్న ఆత్మహత్యలు , ప్రజల చైతన్యాన్ని హరిస్తున్న మద్యం, డ్రగ్స్ లాంటి దురలవాట్లు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి పరుగులెత్తడమే సరి పోతున్నది.
కానీ, గత కొన్ని రోజులుగా తెలంగాణలో సోషల్ మీడియా కేంద్రంగా జరుగుతున్న చర్చలను గమనిస్తే, రాజకీయ వ్యాఖ్యలను చూస్తే , అబ్బో , ఇతర ఏ రాష్ట్రంలో అయినా, మన రాష్ట్రంలో జరిగినంత సిద్ధాంత, రాజకీయ చర్చలు నిజంగా జరుగుతాయా అనే అనుమానం కలుగుతుంది. ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, సాయుధ విప్లవాలు, విప్లవకారులు, నిర్బంధం, లొంగుబాట్లు, పోరాట విరమణలు, కొనసాగింపులు, త్యాగాలు, ద్రోహాలు – మరో అంశంపై చర్చకు అవకాశం లేనంత స్థాయిలో కొనసాగుతున్నాయి. వ్యాఖ్యలు, కవిత్వం, వ్యాసాలు, వెటకారాలు, నిందలు, బూతులు, ఆరోపణలు – ఒక్క మాటలో మాటలకు, భాషా విన్యాసాలకు కొదవ లేకుండా పోయింది.
ఇలాగే, ఒక్కోసారి రాష్ట్ర స్థాయిలో కొన్ని ప్రజా సంఘాలు, మేధావుల, రచయితల సంఘాలు నిర్వహించే సమావేశాలకు జిల్లాల నుండీ తరలి వచ్చే సామాజిక కార్యకర్తలను, ఉద్యమ అభి మానులను చూస్తుంటే, మనకు అన్ని చోట్లా అద్భుతమైన మనుషులు ఉన్నారనే భరోసా కలుగుతుంది.
కానీ మన రాష్ట్రంలో ఆచరణకు దిగి ప్రజలతో కలసి పని చేయాలనుకునే సంస్థలు రోజువారీ ఎదుర్కుంటున్న సమస్య ఏమిటి ? ఆయా సంస్థల బాధ్యులు చెబుతున్న మాటలు ఏమిటి ? అవి ఇలా ఉన్నాయి: చాలా జిల్లాలలో ప్రజల సమస్యలపై పని చేయడానికి ప్రజాపక్ష రాజకీయ పార్టీలకు నిర్మాణాలు లేవు. ప్రజా సంఘాలకు కార్యకర్తలు లేరు. ప్రజల పక్షాన ఆలోచించే పార్టీ యేతర పౌర సమాజ బృందాలు లేవు. సమాజంలో ముందుకు వస్తున్న సమస్యలపై ఏదో ఒక నిర్ధిష్ట బాధ్యత తీసుకుని పని చేయడానికి రోజూ కొద్ది సమయం ఇచ్చే వ్యక్తులు లేరు. ఏదైనా కార్యక్రమం చేద్దామంటే ఆర్ధిక వనరుల కొరత కూడా తీవ్రంగా ఉంది.
సోషల్ మీడియా మాటలకు, క్షేత్ర స్థాయిలో చేతలకు పొంతన కుదరని ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? “అధ్యయనం లేని ఆచరణ గుడ్డిది, ఆచరణ లేని అధ్యయనం కుంటిది” అనే సామాజిక అవగాహన కలిగిన వాళ్ళు కూడా కేవలం మాటల పోగులుగా మారిపోయారా ? సమిష్టిని ధ్వంసం చేసి వ్యక్తిని కేంద్రం చేసుకునే పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ సృష్టించే భావజాల రొంపిలో కూరుకు పోయారా ? ఈ విషయాలను ఆలోచించి, చర్చించి, ఒక అంగీకార భావనకు వచ్చి, కలసి పని చేయడానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏమిటి?
అహంభావం, ఆత్మ న్యూనత, అవినీతి, వ్యక్తి వాదం, సమూహాల ప్రత్యేక అస్తిత్వ గుర్తింపు ఆరాటం – ఫ్యూడల్, పెట్టుబడిదారీ అవలక్షణాలు జమిలిగా ఉన్న మన దేశ వర్గ సమాజ సంస్కృతి లో ఒక భాగం. ఇవన్నీ సమిష్టిగా జరగాల్సిన కృషిని విచ్ఛిన్నం చేస్తూ, ఆయా సంస్థలలో చీలికలకు కారణమవుతున్నప్పుడు, వాటి పట్ల మన వైఖరి ఏమిటి ?
ఆయా ప్రత్యేక అస్తిత్వ ఉద్యమాలు ముందుకు తెస్తున్న ప్రజాస్వామిక ఆకాంక్షలను గుర్తిస్తూనే, గౌరవిస్తూనే, ఆ ఆకాంక్షల సాధన కోసం పోరాడుతూనే, ఆయా ప్రత్యేక సమూహాలు సాగించే పోరాటాలకు సంఘీభావం ప్రకటిస్తూనే, వాటిలోని సంకుచితత్వాన్ని, వివక్ష లేని సమానత్వాన్ని సాధించే సుదూర లక్ష్యం వైపు అడుగులు వేయడానికి ఉమ్మడి కార్యాచరణ తీసుకోవడానికి నిరాకరించే ధోరణిని ఎలా అర్థం చేసుకోవాలి? వాటిని ఎలా పోగొట్టాలి ? ఇవన్నీ అందరం ఒకరి నొకరు కించపరుచుకోకుండా, ఓపెన్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలే కదా.
సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల భాగస్వామ్యం గురించి కేవలం భాష్యాలు కాకుండా, రోజువారీ ఆచరణలో, అన్ని ఉద్యమాలలో, ప్రత్యామ్నాయ కృషిలో, మహిళలను సమ భుజంగా పరిగణించి విలువ, ఉనికికి గుర్తింపు ఇవ్వడానికి నిరాకరిస్తూ, ఇప్పటికీ కొన సాగుతున్న పురుషాధిపత్య భావజాలాన్ని వదిలించుకోవడానికి చేస్తున్న ఆయా సంస్థలు, పార్టీలు చేస్తున్న ఆచరణాత్మక ప్రయత్నాలు, ఆయా సంస్థలలో చేసుకున్న నిర్ణయాలు ఏమిటనేది మాట్లాడుకోవాలి కదా ?
మన సమాజంలో ఆయా సమూహాలు జరుపుకునే అన్ని సమావేశాలలో ఇతరులతో కలసి పని చేయాలని చేసుకునే భీకర నిర్ణయాలు ఉంటాయి తప్ప, అందుకు అనుగుణంగా అడుగులు ముందుకు పడనీయకుండా అడ్డుపడుతున్న శక్తులు ఏమిటి ? భావజాలం ఏమిటి?
నిజమే, ప్రకృతి పరిణామ క్రమంలో రూపొందుతూ వచ్చిన మానవ సమాజంలో ప్రతి మనిషికీ ఒక ఉనికి ఉంటుంది. ఒక ఆయా మనుషుల సమూహాలకు కొన్ని నమ్మకాలు, సాంస్కృతిక విలువలు కూడా ఉంటాయి. సరుకుల ఉత్పత్తి క్రమంలో ముందుకు వచ్చే ఒక వర్గం కూడా ఉంటుంది. ఆయా వర్గాలకు ఒక జీవన విధానం, ఒక సైద్ధాంతిక ఆలోచనా దృక్పథం కూడా ఉంతాయి. వీళ్ళు పని చేయడానికి ఒక కార్య క్షేత్రం ఉంటుంది. సాధించాల్సిన ఒక లక్ష్యం ఉంటుంది.
కానీ వీళ్లందరూ, తమ కార్య క్షేత్రంలో, లక్ష్య సాధనలో, నడిచే మార్గంలో నేర్చుకున్న అంశాలు, స్వయం విమర్శలు, మార్చుకోవాల్సిన విషయాల నేమైనా ముందుకు తెస్తున్నారా ? వాటికి అనుగుణంగా వారిలో మార్చుకునే ప్రయత్నం వేగంగా, సీరియస్ గా జరుగుతుందా? ఈ ప్రశ్నలు వేసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదనుకుంటాను.
తమ సైద్ధాంతిక , రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజలు నిర్మించుకున్న సంస్థలు, సంఘాలు, పార్టీలు, ప్రజల సమస్యలపై పని చేయడానికి ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర్య, వృత్తి పర సంఘాలు, కొన్ని ప్రత్యేక అంశాలను ఎజెండాగా పెట్టుకుని పని చేసే స్వచ్చంధ సంస్థలు , వివిధ రకాల వివక్షలకు, అనారోగ్యాలకు గురైన బాధిత సమూహాల పట్ల సానుభూతితో, మానవీయ కోణంలో ఏర్పాటై పని చేస్తున్న సంస్థలు – ఎన్నో ఎన్నెన్నో మన రాష్ట్రంలో ఉన్నాయి.
వీటిలో అన్ని సంస్థలూ రాజకీయ, సిద్ధాంత చర్చలే చేయకపోవచ్చు. వారికి క్షేత్ర స్థాయిలో కొన్ని అంశాలపై ప్రజలతో కలసి పని చేసే అనుభవమే తప్ప, అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులపై అంచనా కూడా లేకపోవచ్చు. వీటిలో కొన్ని సంస్థలు ప్రభుత్వాలతో వివిధ శాఖలతో, ప్రభుత్వ సంస్థలతో ప్రాజెక్టుల ఆధారంగా కలసి పని చేయవచ్చు. కొన్ని సంస్థలు ప్రైవేట్ విరాళాల పై ఆధారపడి తమ కార్యకలాపాలను నడపవచ్చు. అన్ని సంస్థలూ ప్రభుత్వాలు చేసే అన్ని తప్పులనూ ఎత్తి చూపక పోవచ్చు. ఈ తప్పులపై పోరాటాలకు ప్రజలను సమీకరించకపోవచ్చు.
కానీ ఇలా క్షేత్ర స్థాయిలో పని చేసే మెజారిటీ సంస్థలకు ప్రజల పట్ల ఒక నిబద్ధత ఉంటుంది. తాము పని చేసే సమస్య పట్ల జ్ఞానం ఉంటుంది. తాము పని చేసే ప్రాంతాలలో ఒక పలుకుబడి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే ఈ సంస్థలను నిర్వహిస్తున్న బాధ్యులలో ఎక్కువమందికి రాజ్యాంగ పరిధిలో, చట్టాల పరిధిలో పని చేసే లక్షణం ఉంటుంది. అన్ని అంశాలపై రాజకీయ స్పష్టత వీరికి ఉండక పోవచ్చు కానీ, సాధారణంగా, ప్రజల సంక్షేమం పట్ల ఒక అనురక్తి ఉంటుంది. ఎక్కువ మందికి తాము పని చేస్తున్న నిర్ధిష్ట రంగం, ప్రజల సమస్యపై తప్ప, ఇతరులకు సంఘీభావం ప్రకటించే సమయం, వనరులు కూడా ఉండకపోవచ్చు. అతి తక్కువ వనరులతో పని చేసే ఈ సంస్థలు, వ్యక్తులు తెలంగాణ వ్యాపితంగా అన్ని జిల్లాలలో విస్తరించి ఉన్నారు.
వీళ్లలో అత్యధికులు కరడు కట్టిన హిందుత్వ వాదులు కాదు. ప్రజలను పీడించే నిరంకుశ పాలకుల ప్రతినిధులు కాదు. సాధారణంగా వామపక్ష అభిమానులు ఆరోపించినట్లుగా వీళ్ళెవరూ సామ్రాజ్య వాద ఏజెంట్లుగా బడా స్వచ్చంధ సంస్థలు నడుపుతున్న వాళ్ళు కాదు? ఆయా ప్రజా పక్ష రాజకీయ పార్టీలు సమస్యలపై బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మాణం అవుతుంటే, సంతోషించే వాళ్ళే తప్ప అడ్డుపడే వాళ్ళు కూడా కారు.
ఎందుకు ఈ వివరణ ఇవ్వాల్సి వస్తున్నదంటే, నాకు తెలిసిన అనేక మంది ప్రజా పక్ష రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎవరూ, క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఆయా స్వచ్చంధ సంస్థల పనిని ధగ్గరగా చూసిన వాళ్ళు కారు. వాళ్ళతో కూర్చుని మనసు విప్పి మాట్లాడిన వాళ్ళు కారు. కనీసం వాళ్ళు చేస్తున్న పని ఏమిటో తెలుసుకున్న వాళ్ళు కారు.
కానీ ఒక ముందస్తు అభిప్రాయంతో , వాళ్ళను దగ్గరకు కూడా రానీయరు. వాళ్ళను సామాజిక స్పృహ ఉన్న మనుషులుగా కూడా చూడరు. మనతో కలసి వచ్చే మన మిత్రులుగా కూడా అనుకోరు. నేను ఈ విషయం ఇంత గట్టిగా ఇలా చెప్పగలుగు తున్నానంటే, నేను కూడా 22 సంవత్సరాలు విప్లవ పార్టీలో పూర్తి కాలం పని చేసినప్పుడు, ఇలాంటి అభిప్రాయాలతోనే ఉండే వాడిని. మా సహచరులకు కూడా ఇవే అభిప్రాయాలు ఉండేవి. నేను పార్టీ నిర్మాణం నుండీ బయటకు వచ్చాక మాత్రమే, చాలా విషయాలను అర్థం చేసుకున్నాను. చాలా అవహననను పెంచుకున్నాను. చాలా మంది స్నేహితులను సంపాదించుకున్నాను. మానాలు ఉండే ఈ అవలక్షణాలను మనం వదిలించుకోకుండా, ఫాసిజానికి వ్యతిరేకంగా మన సంఖ్య ఎలా పెరుగుతుంది?
మళ్ళీ మొదటికి వస్తాను. మనం తెలంగాణ లో ఫాసిస్టు హిందుత్వ శక్తుల విస్తరణ జరగకుండా, వారు బలపడకుండా ఉండాలంటే,ఇప్పటిలా వేరు వేరుగా ఆందోళన చెందకుండా, ఈ లక్ష్యం కలిగిన మన మిత్రుల సంఖ్యను పెంచుకోవాలి. ఒక గ్రామంలో, ఒక మండలంలో , ఒక జిల్లాలో , ఒక నగర బస్తీలో అలా పని చేసే వ్యక్తులను, సంస్థలను ఒక చోటికి సమీకరించి ప్రజల కోణంలో అంశాలను చర్చకు తేవడానికి పూనుకోవాలి. అందరూ కలసి ఆయా ప్రాంతాలలో ఇప్పటికే ముందుకు వచ్చిన ప్రజా పోరాటాలకు సంఘీభావం ప్రకటిస్తే అది ఉమ్మడి కార్యాచరణకు ఒక ప్రాతిపదిక అవుతుంది. లేదా ఆయా ప్రాంతాల ప్రజా సమస్యలను అవగాహన చేసుకోవడానికి ఒక ఉమ్మడి అధ్యయనానికి దారి దొరుకుతుంది.
కష్టమే అయినా, ఈ వైపు మన ప్రయాణం మొదలైతేనే, మనకు మన బలంపై మనకు విశ్వాసం పెరుగుతుంది. మన కార్యాచరణ సులువవుతుంది. సమస్య ఏదైనా, అది ప్రజా సమూహంలో కొద్ది మందికి చెందినదైనా, మనం కలసి పని చేయగలిగితే మాత్రమే మన గొంతు బలపడుతుంది. నిరంకుశ పాలకులపై, ఫాసిస్టు శక్తులపై మన విజయం సులువవుతుంది. ఈ ప్రక్రియలో మాత్రమే సమిష్టి వైపు ప్రజలు నడుస్తారు. ఒంటరి ఆవేదనల నుండీ బయట పడతారు. గ్రామంలో, అడవిలో, నగరంలో ప్రతి ఛోటా ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవడానికి అప్పుడే మనకు సాధ్యం అవుతుంది.
మాటల పోగులు ఎప్పుడూ ఉంటారు. మనకు ఆచరణశీలురు కావాలి.