'గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్’

అవునా, అదే నిజమా?!;

Update: 2025-04-12 11:50 GMT


నేను ఎప్పటికీ ఇష్టపడని విషయాలు రెండున్నాయి,

మొదటిది, ప్రబోధం, లేదా నీతిబోధ; రెండోది, నేటి కాలం కన్నా, రేపటి కాలం కన్నా, గడిచిపోయిన కాలం గొప్పదని నమ్మడం.

కాలమహిమ అంటారో, మరేమంటారో కానీ; ఇప్పుడా రెండు అయిష్టాలూ నా ఇష్టానికి విరుద్ధంగా, నాకు తెలియకుండానే నా బుర్రలో తిష్ఠ వేసుకుంటూ నా ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్నాయనిపిస్తోంది.

ఈ మధ్య ‘మన తెలంగాణ’ పత్రికవారు దిగజారిపోతున్న పత్రికాప్రమాణాలపై వ్యాసం అడిగినప్పుడు రాయడానికి ఉపక్రమించాను. తీరా పూర్తిచేసుకుని చూసుకునేసరికి ఆశ్చర్యం ముంచెత్తింది, ఇది నేను రాసిందేనా అనిపించింది; అది అంత ‘ప్రబోధాత్మకం’గా ఉందన్నమాట. దాని శీర్షిక, ‘వృత్తిని రక్షిస్తే వృత్తి రక్షిస్తుంది’ అని! ‘ధర్మో రక్షతి రక్షితః’ అనడంలా అన్నమాట.

పరోపదేశపాండిత్యప్రదర్శనకు మొదటినుంచీ బద్ధవిరోధినైన నేను ఎందుకిలా మారిపోతున్నాను? నాకు వయసు రావడంవల్లనా, లేక దేశపరిస్థితులు మరీ అంతగా దిగజారిపోతూ ఉండడంవల్లనా, లేక ఆ రెండు కారణాల వల్లనా కూడానా?

ఇక రెండోదానికి వస్తే, మహాభారతంలో, విచిత్రవీర్యుని భార్యలు ఇద్దరికీ, వారి దాసికీ వ్యాసుడివల్ల ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించిన తర్వాత రాబోయేవి అన్నివిధాలా గడ్డురోజులన్న సంగతిని దివ్యదృష్టితో గమనించిన వ్యాసుడు, ఇక నువ్వు వానప్రస్థానికి వెళ్ళడం మంచిదని ఆ ధృతరాష్ట్రాదుల నాయనమ్మ సత్యవతికి సలహా ఇస్తాడు. ఆ సందర్భంలో, ‘గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్’ అంటాడు.

ఇప్పటికీ అలా నమ్మేవారు మనలో చాలామందే ఉన్నారు; అసలు వాళ్ళదే పూర్తి మెజారిటీ కూడా. కానీ నా జీవితం పొడవునా అది తప్పని వాదిస్తూనే వచ్చాను. గతం-వర్తమానం-భవిష్యత్తు అనే తేడా లేకుండా ప్రతికాలంలోనూ మంచి-చెడుల నిష్పత్తి ఒకేలా ఉండేదనీ, ఉందనీ, ఉంటుందనీ సోదాహరణంగా అంటూవచ్చాను.

అలాంటిది ఇప్పుడు, అప్పుడప్పుడైనా వ్యాసుడు చెప్పిన మాటను నమ్మక తప్పదా అనిపిస్తోంది.

అసలు విషయానికి వస్తే-

గత నాలుగురోజులుగా, పొద్దుట లేవగానే, నేను ఒకే ఒక వార్త కోసం పత్రికలను గాలిస్తున్నాను, గూగుల్ శోధిస్తున్నాను, కానీ కనిపించడం లేదు.

అది, తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో, నేరుగా గవర్నర్ కు వ్యతిరేకంగానూ, పరోక్షంగా ఆయనకు పైనున్నవారికి వ్యతిరేకంగానూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై- ఆ పైవారినుంచి ఇంతవరకు ప్రతిస్పందన లేకపోవడం! నిజానికి వాళ్ళ ప్రతిస్పందన ఉండవలసింది కూడా మాటల్లో కాదు, అంతకన్నా కీలకంగా చేతల్లో! గవర్నర్ల నియామకం, నియంత్రణ, బదిలీ, చివరికి తొలగింపుతో సహా సర్వాధికారాలు వాళ్ళవే కనుక.

అయినాసరే, నాలుగు రోజులు గడిచినా అటువైపునుంచి అసలెలాంటి స్పందనా లేదు, నాలుగురొజులంటే 96 గంటలు. నేటి సమాచారవిప్లవయుగంలో 96 గంటలంటే సామాన్యమైన సమయం కాదు. దేశంలోనే కాదు సరికదా, ప్రపంచంలో ఏ మూలైనా చెప్పుకోదగిన ఏ సంఘటనైనా జరిగితే అది క్షణాలలో అందరికీ తెలిసిపోయి, మామూలు జనం కూడా నిమిషాలలో దాని మీద స్పందించి, కొన్ని గంటల్లో దానిని పెద్ద చర్చ స్థాయికి తీసుకువెళ్లగలిగే ఈ రోజుల్లో 96 గంటలంటే, వేల పేజీల పుస్తకాలూ, వేల కొద్దీ ఆడియోలూ, వీడియోలూ సృష్టించగలిగినంత సమయం.

అలాంటిది, తమిళనాడు గవర్నర్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వాస్తవంగా స్పందించాల్సినవారి నుంచి 96 గంటలు దాటినా చిన్నపాటి ఉలుకు కానీ, పలుకుకానీ, ఆకు కదిలినంత చలనం కానీ లేకపోవడాన్ని ఏమనుకోవాలి!?

ఆ సేతుహిమాచలపర్యంతం వ్యాపించిన ఇంత పెద్ద దేశంలో ఈ క్షణాన సర్వాధికారస్థానంలో ఉన్నవాళ్ళు సమాచారవిప్లవాన్నీ, ఆ క్రమంలో చివరికి కాలాన్నే జయించి నాలుగురోజులపాటు నీరవనిశ్శబ్దంలోకి అవలీలగా జారిపోయి సమాధిగతులై ఉండగలుగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?! యావత్ జగత్తునే మాయగా తోసిపుచ్చిన తాత్వికుల వరవడిలో కేంద్రస్థాయి పాలకులు ఈవిధంగా కాలాన్ని మిథ్యగా నిరూపించగలుగుతున్నప్పుడు ఈ ప్రజాస్వామికదేశభవిష్యత్తును ఎలా ఊహించుకోవాలి?! ఈ దేశంలో, ఈ దేశప్రజల జీవనంలో, అసలేం జరుగుతోందో రవ్వంత సమాచారం కూడా లేకుండా, ఏ క్షణంలోనైనా, ఏదైనా జరగడం సంభవమనిపించి నిలువునా భయం కమ్మివేయదా?!

‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే వ్యాసోక్తి నా ఇష్టానికి విరుద్ధంగా పదే పదే నా బుర్రను తొలుస్తున్నది ఇందుకే.

గతంలో పాలకులు అన్నివిధాలా ఇంతకన్నా గొప్పగా వెలగబెట్టినవాళ్లేమీ కాదు; గవర్నర్ల వ్యవస్థను అరచేతి బొమ్మగా అమర్చుకుని స్వప్రయోజనాల తైతక్కలాడించి రాజ్యాంగస్ఫూర్తిని అపహాస్యం చేయడంలో మొనగాళ్లుగా వాళ్ళూ ముద్రపడినవాళ్లే. కానీ ఇప్పటి వారితో పోల్చితే ఒక విషయంలో మాత్రం వాళ్ళు ఒకింత భిన్నంగా ఉండేవారేమోనని ఇప్పుడనిపిస్తోంది. వాళ్ళందరూ -జనంలో ఎవడో ఒకానొకడు సీతమ్మవారి శీలం గురించి చెడ్డమాట అని, ఇంకా ఆమెను దగ్గరుంచుకున్నందుకు తనను తప్పుపట్టాడు కనుక ఆమెను అడవిలో విడిచిపెట్టి రమ్మన్న శ్రీరామచంద్రుడి భక్తులుగా తమను చెప్పుకోకపోయినా(రాముడు చేసిన పని తప్పా, ఒప్పా అన్నది వేరే చర్చ), జై శ్రీరామ్ అనకపోయినా, రాముడి కోసం ఓ బ్రహ్మాండమైన గుడి కట్టాలనే ఆలోచన చేసినవారు కాకపోయినా, ఇలాంటి తీర్పుల సందర్భంలో న్యాయస్థానాలు వేసే అక్షింతలకు, మీడియా విమర్శలకు, ప్రతికూలజనవాక్యాలకు ఒకింత భయానికీ, సిగ్గుకూ లోనయ్యేవారనీ, ఏదో ఒక చర్యకు పూనుకునేవారనీ, కనీసం విలేఖరులు ప్రశ్నించడానికి మంత్రులో, పార్టీ అధికారప్రతినిధులో, మరొకరో అందుబాటులో ఉండి స్పష్టాస్పష్టంగానైనా ఏదో ఒక స్పందన వెలిబుచ్చేవారనీ, బొత్తిగా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయేవారు కాదనీ- ఇప్పుడొకసారి వెనుదిరిగి చూసుకుంటే అనిపిస్తుంది.

ఇవాల్టికివాళ అదే తమిళనాడులో ఒక మంత్రి శైవ, వైష్ణవాల గురించి తప్పుడు మాటలు అన్నాడని అతన్ని మంత్రిపదవినుంచి తప్పించినట్టు వార్త.

తప్పో ఒప్పో అలా ఉంచి సీత విషయంలో ఏకైక జనవాక్యాన్ని అంతగా పట్టించుకుని చర్య తీసుకున్న శ్రీరామచంద్రుడి భక్తులుగా తమను చెప్పుకునేవారై కూడా, ఏకంగా సర్వోన్నతన్యాయస్థాన వాక్యాన్ని సైతం పట్టించుకోకుండా నాలుగురోజులుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండగలడంలోని వైరుధ్యం వింతగా కాదు, విపరీతంగా తోస్తుంది.

గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అన్న వ్యాసోక్తి నా ఇష్టానికి విరుద్ధంగా పదేపదే నా చెవుల్లో అల్లరిగా మోగుతూ నన్ను అపహాస్యం చేస్తున్నట్టు అనిపిస్తున్నది ఇందుకే.

జనం మరచిపోవాల్సిందే తప్ప; 96 మాసాలు గడిచినా పై స్థాయిలో గడ్డ కట్టుకున్న నిశ్శబ్దం కరిగి నీరుకాగలదని ఇప్పటికైతే అనిపించడం లేదు. ఆ ఊహ తలకిందులై ఏదైనా జరిగితే అంతకన్నా కావలసిందేముంటుంది



Tags:    

Similar News