ముఖ్యమంత్రులకు అంత భూదాహమెందుకు…

నాడు కేసీఆర్.. నేడు రేవంత్.. ఎవరైనా ఇంతేనా?;

Update: 2025-04-09 02:30 GMT

అధికారమే పరమావధి... అధికారంలోకి రావడం కోసం అడ్డమైన హామీలు.. ప్రభుత్వం లోకి వచ్చాక హామీలు నెరవేర్చలేక , ప్రజలను మెప్పించలేక , ఖాళీ ఖజానా వెక్కిరిస్తుంటే.. నిధుల కోసం వేట... దొరికిన కాడికి అప్పులు తెచ్చినా.. నిధుల కొరత... అందుకే ప్రభుత్వ భూములే ముఖ్యమంత్రులకు వరంగా మారుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వున్నా, నిన్నటి కేసీఆర్ పాలనలో అయినా అంతకుముందు ఉమ్మడి ప్రభుత్వ మైనా అభివృద్ధి మాటున అందినకాడికి ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నారు.. పెట్టారు కూడా.. ఆల్ ఫ్రీ అంటూ అందలమెక్కుతున్నారే గాని, ప్రజలు వాళ్ల కాళ్లమీద నిలబడి ఆర్థికంగా ఎదిగే మార్గాలను మాత్రం ప్రభుత్వాలు వెదకడం లేదన్నది మేథావుల మాట. అనవసపు వాగ్థానాలతో చేతులు కాల్చుకుంటూ, ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని కొనితెచ్చుకుంటున్నాయి.

ఫోర్త్ సిటీకి హెచ్ సీ యూ తరలింపు యోచన

ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెసు ప్రభుత్వం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల , హెచ్ సీ యూ భూములపై కన్నెయడం వాటిని అమ్మకానికి పెట్టాలనుకోవడం పెను దుమారం గా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే తలవంపులు తెచ్చేలా తయారైంది. అయినా తగ్గనంటున్న ప్రభుత్వం ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నే ఫోర్త్ సిటీకి తరలిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కీలకనేత మల్లు రవి ఇలాంటి వ్యాఖ్యలు చేసి యూనివర్సిటీ విద్యార్దులే కాదు, అందరూ ఉలిక్కిపడేలా చేశారు. . హెచ్ సీయూ ని ఫోర్త్ సీటీకి తరలించి అక్కడ వెయ్యి ఎకరాలు దానికి కేటాయించినా, హైదరాబాద్ లో కీలకమైన ప్రాంతం గచ్చిబౌలి లో ఏకంగా రెండు వేల ఎకరాలను ప్రభుత్వం అభివృద్ధి చేసుకోవచ్చు.. అదే అమ్ముకోవచ్చు.. ఖజానా నింపుకోవచ్చు... ఇప్పుడు కంచె గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిగా వున్న 400 ఎకరాలను అభివృద్ధి చేసి ప్రైవేటు సంస్థలకు మరింత ఐటీ అభివృద్ధి కోసం అమ్మతానంటున్న ప్రభుత్వం కనీసం 15 వేల కోట్లు గ్యారెంటీ గా వస్తాయని భావిస్తోంది. అయితే అవి 25 వేల కోట్లు పైగానే వస్తాయని మరికొందరు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ కు లంగ్ స్పేస్ గా వున్న ఆ ప్రాంతంలో అభివృద్ధి పేరిట వేలాది చెట్లను నరికేయాల్సి రావడం, దానిని ఆవాసంగా చేసుకొని జీవిస్తున్న నెమళ్లు, జింకలు మరికొన్ని జీవాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తింది. అసలే కాంక్రీటు జంగిల్ గా మారుతున్న హైదరాబాద్ లో ఇలాంటి చోటవున్న జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి వుంది. ప్రభుత్వం కూడా పర్యావరణాన్ని కాపాడే చర్యలు తీసుకుంటామని అంటోంది. అసలు ప్రభుత్వ భూములను ఇలా అమ్ముకుంటూ పోతే భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది.

చంచల్ గూడ జైలు , రేస్ కోర్స్ వంటివి తరలించే యోచన

హైదరాబాద్ నడిబొడ్డున వందల ఎకరాలలో వున్న చంచెల్ గూడ జైలు, మలక్ పేటలో వున్న రేస్ కోర్స్ ఇలా కొన్నింటిని నగరం వెలుపలికి తరలిస్తే , ఆ వందల ఎకరాల భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. ప్రభుత్వానికి రాబడితో పాటు హైదరాబాద్ అభివృద్ధి మరింత పెరుగుతుందన్నది ప్రభుత్వం ఆలోచన .అది బాగానే వున్నా

బ్రిటిష్ కాలం నుండి వున్న చారిత్రక కట్టడాలు, హెరిటేజ్ ప్రదేశాల రూపురేఖలే మారుస్తామంటే ఎలా....

చంచల్ గూడ జైలు తరలింపు వంటి ఆలోచన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ దే కాదు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా వున్న కేసీఆర్ కూడా అదే ఆలోచన చేశారు. చెంచల్ గూడ జైలును చర్లపల్లికి తరలించి వాటి స్థానంలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు గతంలో సీఎం కేసీఆర్ , మంత్రులు ప్రకటించినా ,అది కార్యరూపం దాల్చలేదు. వరంగల్ సెంట్రల్ జైలును తరలించినట్లే చంచల్ గూడ జైలును కూడా తరలించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ విద్యావ్యవస్థలు, లేకుంటే హార్డ్ వేర్ పార్క్ వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు.

50 ఎకరాల విస్తీర్ణం లో వున్న చంచల్ గూడ , జైలే కాదు నగరం మధ్యలోనే వున్న మలక్ పేట రేస్ కోర్స్ ను అక్కడి నుంచి తరలించాలని నాడు కేసీఆర్, నేడు రేవంత్ ఆలోచన చేస్తున్నారు. రేస్ క్లబ్ భూమి కూడా 168 ఎకరాల వరకూ వుంది. ఇక అంబర్ పేటలో వున్న సీటీ పోలీస్ లైన్ భూములను అంటే 200 ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.వందల ఎకరాలలో వున్న కొన్ని నిర్మాణాలకు వాస్తవంగా అంత స్థాయిలో భూములు అక్కరలేకున్నా, వందల ఎకరాలు ఖాళీగా వుండటంతో ఆయా ప్రాంతాలలో సంవత్సరాలుగా చెట్లు పెరిగి, నగరవాసులకు ఆక్సిజన్ అందిస్తున్నాయి.

ప్రభుత్వ భూములపై ముఖ్యమంత్రుల చూపెందుకు?....

రానురాను ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారిపోతున్నాయి. ఎకానమీ ట్రలియన్ డాలర్లకు చేరిపోతోంది. ప్రభుత్వ పథకాలు , నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. రాష్ట్రాల బడ్జెట్ కూడా లక్షల కోట్ల కు చేరింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ తాజా బడ్జెట్ కూడా 3 లక్షల కోట్లు దాటింది. రాష్ట్ర ఆదాయ వనరుల కన్నా, ప్రభుత్వ కమిట్మెంట్లకు , ఉచిత హామీల అమలుకు కావాల్సిన సొమ్ము అధికంగా వుంటోంది. అప్పులు చేయక తప్పడం లేదు. అయినా ఆర్థిక లోటు వెంటాడుతోంది .అందుకే ల్యాండ్ బ్యాంక్ పై ప్రభుత్వాల చూపు పడింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగర శివార్లలో వున్న కోకాపేట ప్రభుత్వ భూములను హెచ్ ఎం డి ఏ వేలం ద్వారా అమ్మితే ఎకరానికి 100 కోట్ల రికార్డు ధర పలికింది. బడా వ్యాపార సంస్థలు పోటీ పడి రేటు పెంచేశాయి. ఈ లెక్కన నగర శివారు భూముల ధరలే అలా వుంటే, హైదరాబాద్ నడిబొడ్డున వున్న ప్రభుత్వ భూములను విక్రయిస్తే వేల కోట్ల రూపాయలు ఖజానాకు చేరినట్లే...ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతే, రేపటి రోజున ఉస్మానియా విశ్వవిద్యాలయం , సెక్రటేరియట్, అసెంబ్లీ లనూ వేరే చోటకు తరలించి ఆ భూములనూ అమ్మరన్న గ్యారెంటీ ఏమిటి ? ఈ ప్రశ్నను ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. తెలంగాణ ఏర్పాటైన తరువాతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో కూడా ప్రభుత్వ భూముల అమ్మకం సాగింది. ఆ మాటకొస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్న వివాద HCU నాలుగు వందల ఎకరాల భూమి కూడా గతంలో చంద్రబాబు విక్రయించినదే...

బ్రిటిష్ కాలంలో రాచరికానికి చిహ్నంగా జిల్లా కలెక్టరేట్లు కూడ వందల ఎకరాలలో నిర్మించారు. మారుతున్న కాలంలో వృధాగా వున్న భూమిని సద్వినియోగం చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పై వుంది.

ప్రభుత్వ భూములు అమ్మాలా.. మేథావుల మాటేమిటి ?

మారుతున్న కాలంలో ప్రభుత్వాలు వృధా గా వున్న ప్రభుత్వ భూములను సద్వినియోగం చేసుకోవాల్సిందే.. కాని అన్ని భూములను ఏకపక్షంగా తెగనమ్ముదామని చూడటం మంచిది కాదు.. అభివృద్ధికి అనుగుణంగా కొత్తగా ఆలోచనలు చేయాలన్నది మేథావుల మాటగా వుంది.

తెలంగాణ లో జరుగుతున్న ప్రభుత్వ భూముల అమ్మకం , హెచ్సీయూ భూములపై చర్చ వంటి పలు అంశాలపై ఫెడరల్ తెలంగాణ తో తన అభిప్రాయాలు పంచుకున్న సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు లక్ష్మీనారాయణ ప్రభుత్వాలకు విలువైన సూచనలు చేశారు.ప్రస్తుతం ప్రభుత్వాల రాబడికి మద్యం అమ్మకాలు, భూముల అమ్మకాలే ఆధారాలుగా మారిపోయాయన్నారు. ఆకాశహర్మాల వంటి భవనాల నిర్మాణంతో వర్టికల్ అభివృద్ధి పెరిగిపోతున్న నేపధ్యంలో వృధా గా వున్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి చేయాల్సిన అవసరం వుందన్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు పర్యావరణం, హెరిటేజ్ కట్టడాలను పరిరక్షించే బాధ్యతను మరవకూడదన్నారు. అభివృద్ధి పేరిట నగరమంతా కాంక్రీటు జంగిల్ గా మారిపోతే, హైదరాబాద్ కు ఢిల్లీ కాలుష్యం వంటి పరిస్థితి తప్పదన్నారు. ల్యాండ్ యుటిలైజేషన్ కు మంచి విధానాలను తీసుకురావాల్సిన అవసరం వుందని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఫ్రీ స్కీములు ప్రకటించి లక్షల కోట్ల బడ్జెట్ కోసం ప్రభుత్వ భూములను అమ్మేయడం కూడా మంచి పద్దతి కాదన్నారు. ఫ్రీ బేసిడ్ పథకాలు కాకుండా వేరే రకంగా ప్రజలను ప్రోత్సహిస్తే స్వాగతిస్తారని, ఉదాహరణకు యువత చదువుకునేందుకు జీరో ఇంట్రస్ట్ రుణాలు అందించి, ఆ వడ్డీ మాత్రం ప్రభుత్వం కట్టాలన్నారు...

ప్రభుత్వ భూముల అమ్మకమే ఏకైక మార్గం కాకుండా అమెరికా లో అమలవుతున్న LULU ( Locally Unwanted Land Use) విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. చైనా వంటి దేశాలలో పూర్తిగా భూములను అమ్మకుండా లీజు పద్దతిని అవలంభిస్తారని, అభివృద్ధి తో పాటు ప్రభుత్వాలకు రాబడి వుంటుందని తెలిపారు. భూమి పరిమితం, అవసరాలు అపరిమితం కాబట్టి, ఉన్న భూవనరులను ఉపయోగించుకుంటూ అభివృద్ధికి కొత్తగా ఆలోచనలు చేయాలన్నారు.

బయోడైవర్సిటీ, సెంటిమెంట్, హెరిటేజ్ సైట్స్ ఈరకంగా ప్రభుత్వ నిర్ణయాలకి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయన్న జేడీ లక్ష్మినారాయణ హైదరాబాద్ నగరంలాంటి చోట లంగ్ స్పేస్ లు ఉండటం అత్యంత ముఖ్యమని తెలిపారు.

ఈ విషయమై రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ నగరాల నడిబొడ్డున వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వాలు ఒక విధానం కోసం ఆలోచన చేయాలన్నారు. హెరిటేజ్ భవనాలను సంరక్షిస్తూనే, పర్యావరణాన్ని దృష్టిలో వుంచుకొని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములను అమ్మడం లీగల్ గా తప్పుకాకున్నా, భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఒకచోట వెయ్యి ఎకరాలు విక్రయిస్తే.. మరోచోట 2వేల ఎకరాలు కొనాలని, రైతులు ఇతరుల నుంచి బలవంతంగా ల్యాండ్ లాక్కోవడం కాదన్నారు. అయితే దీనిని ఒక్క తెలంగాణనో, మరో రాష్ట్రం సమస్య కాదని అన్ని రాష్ట్రాలకు ,కేంద్రానికి సంబంధించిన సమస్యగా చెప్పుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో IITకి 550 ఎకరాలు, JNTUకి 750 ఎకరాల భూమి వుందని వాటి పైనా చర్చ జరుగుతోందన్నారు.

ప్రభుత్వాల ఆలోచనలు మారాలా?

ప్రస్తుతం ప్రభుత్వం ఒకవైపు ఆరు గ్యారెంటీ లను సాఫీగా అమలు చేయాలి, ప్రభుత్వ నిర్వహణ కొనసాగించాలి, ప్రతిష్టాత్మకంగా చెప్పుకొన్న మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కు నిధులు కావాలి, అభివృద్ధి పథకాలను చేపట్టాలి.. ఇలా నిధులకోసం , ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడతానంటే కుదరని పని. అందుకే ఏ విషయంలోనైనా ప్రభుత్వ పెద్దలు సమగ్రంగా చర్చించి , నిర్ణయాలు ప్రకటించాలి. ఏ ప్రాజెక్టు చేపట్టినా ఏకపక్ష ధోరణి కాకుండా, తొందరపాటు లేకుండా చూసుకోవాలి. హైదరాబాద్ కంచె గచ్చిబౌలి 400 ఎకరాల వివాదమే కాదు, గతంలో లగచర్ల ఫార్మా సిటీ విషయంలోనూ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి, ఆ ప్రాజెక్టు నే ఆపాల్సివచ్చింది. ప్రతిసారీ ముఖ్యమంత్రుల భూదాహం అన్న విమర్శలూ ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం సై అంటే తాము నై అనాలన్న సిద్ధాంతాన్ని విడనాడి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం వుంది.

Tags:    

Similar News