ఆర్టీసీ సమ్మె సైరన్ మోగుతుందా? ఆగుతుందా?
కార్మికుల గోడు వినేవాళ్లున్నారా?;
"సమ్మె తప్పదు..ఇప్పటికే ఏడాది ఓపిక పట్టాం" టీజీ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతల మాట ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి. ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా మా బతుకులు మారవా? మమల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేది ఎప్పుడు? ఉద్యమ స్పూర్తితో తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు దాటినా ప్రభుత్వాలు మేలు చేసింది ఏంటి? పనిభారం పెరిగిందే తప్ప, సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్న తమకు న్యాయం జరగడం లేదన్నది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆవేదన.
"ఇప్పడిప్పడే లాభాలబాటలో సాగుతున్న ఆర్టీసీ సంస్థకు సమ్మె పేరుతో కార్మికులే నష్టం కల్గించుకుంటామంటే ఎలా..? ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా వుంది. తొందరపాటు నిర్ణయాలు, అనవసర రాజకీయ జోక్యంతో రచ్చ చేసుకోవద్దు.విపక్షాల మాయ మాటలకు ప్రభావితం కాకండి. సంస్థ భవిష్యత్ మనుగడకు ఆటంకం కల్గించకండి" ఇది ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మిక సంఘాలు తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మే 7వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి.6తేదీ అర్థరాత్రి నుంచే బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేస్తామంటున్నాయి. అసలే మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలవుతోంది. ఆర్టీసీ లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగితే, అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఇటు సంస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది. మొండిగా కార్మికులు సమ్మెకు దిగితే ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం లేదు.
సమ్మెకు ప్రధాన కారణాలు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చకపోవడం
కార్మికుల సంక్షేమం , హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవడం
ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం
డిపోల ప్రైవేటీకరణను వ్యతిరేకించడం
ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటు నుంచి తీసుకోకుండా , సంస్థ పెట్టుబడులు పెట్టాలని డిమాండ్
2021 నుండి పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్
రద్దు చేసిన కార్మిక సంఘాలను పునరుద్దరణ జరగాలి. కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలి
సమ్మె తప్పదంటున్న ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటినే నెరవేర్చమని కోరుతున్నాం, ఇంకా చేస్తాం, చూస్తాం అంటే ఎట్లా? అందుకే సమ్మె ఆపేది లేదంటున్నారు టీజీ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల భాస్కరరావు. తాము తమ సమస్యలను ఎప్పటినుంచో ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నామని, జనవరి27 నే మేము సమ్మె నోటీసు ఇచ్చినా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇతరత్రా కారణాలతో వాయిదా వేస్తూ వచ్చామని ఫెడరల్ తెలంగాణాకు భాస్కరరావు తెలిపారు.గత ప్రభుత్వం ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తున్నామని హడావుడి చేసిందని, ఆనాడే ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ సమ్మె తో సమస్య పరిష్కారం అవుతుందని భావించినా, గవర్నర్ అనుమతి కూడా లభించినా, ప్రభుత్వం జీవో ఇవ్వకుండా ప్రభుత్వంలో విలీన ప్రక్రియ జాప్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోయిందని, ప్రభుత్వానికి కూడా తగిన సమయం ఇచ్చే తాము సమ్మె కు దిగుతున్నామన్నారు.
తెలంగాణ ఏర్పాటు నాటికి ఆర్టీసీ లో 56 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ పదేళ్లలో16 వేల మంది పదవీవిరమణ చేశారని, కొత్త నియామకాలు లేక పనిభారం పెరిగిందని, అయినా సంస్థను మెరుగ్గా నడపడంలో కార్మికుల పాత్ర ఎనలేనిదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనియన్ల లేకుండా చేసిందని, సంస్థ యాజమాన్యం కార్మిక యూనియన్లు లేకపోవడంతో సమస్యలను చిన్నవిగా చూస్తోందని, ఎవరైనా అడిగినా అధికార ,ఎన్నికైన యూనియన్ ప్రతినిధులు కాదన్న అంశాన్ని సంస్థ యాజమాన్యం తెరమీదకు తెస్తోందన్నారు. ఉద్యోగులకు బకాయి వున్న రెండు పీఆర్సీలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చిననాటి నుంచి ప్రయాణీకుల సంఖ్య పెరిగినా, బస్సులు పెరగలేదన్నారు. సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం, ఇతరత్రా రాయితీ సొమ్ము ఏటా 350 కోట్ల దాకా ప్రభుత్వం సంస్థకు ఇవ్వాల్సివున్నా, 250 కోట్ల వరకే ఇస్తోందని, ఇంకా ప్రభుత్వం నుంచి 2000 వేల కోట్ల వరకూ ఆర్టీసీ కి రావాల్సి వుందని భాస్కరరావు తెలిపారు. ఉద్యోగుల పిఎఫ్ సకాలంలో అందించాలన్నారు. కార్మిక సంఘాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించి, గుర్తింపు ఇవ్వాల్సివుందన్నారు. ఇలా సంస్థ యాజమాన్యం ముందు 21 డిమాండ్లను వుంచామని, పట్టించుకోక పోవడం దారుణమని భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగి దుద్దుకూరి వెంకటప్పయ్యతో పాటు ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న రామారావు, బాలకృష్ణ మరికొందరు ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ బస్సుల సంఖ్యతో పెంపుతోపాటు, కొత్తగా నియామకాలు జరగాలన్నారు.గవర్నమెంట్ లో విలీన ప్రక్రియ ఆలస్యం కారణంగా ప్రభుత్వ ఉద్యోగిగా మారకుండానే పదవీవిరమణ చేశానన్న వెంకటప్పయ్య, పదవీ విరమణ తరువాత బెనిఫిట్స్, రావాల్సిన సొమ్మును తనలాంటి వారందరికీ బకాయి పెట్టకుండా వెంటనే ఇవ్వాలన్నారు. ఉద్యోగుల పిఎఫ్ సొమ్మును సంస్థ వాడుకొని, అవసరమైన సమయంలో ఉద్యోగులకు ఇవ్వడం ఆలస్యం చేయటం జరుగుతోందని వారంతా తెలిపారు. కార్మికులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే
విషయంలో ఉత్సాహం కనబరిచే యాజమాన్యం, సమస్యల పరిష్కారంలో ఎందుకు జాప్యంచేస్తోందని ప్రశ్నిస్తున్నారు.
తాజా పరిణామాలు చూస్తే....
ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం , కార్మిక శాఖ చర్చలు జరపలేదు .ఎటువంటి స్పందన లేకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి.మే 6వ తేదీ అర్ధరాత్రి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడే పురస్కరించుకుని కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ, సమ్మె ప్రతిపాదన విరమించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చలు జరపాలని కోరారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోందని, సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులదేనని ముఖ్యమంత్రి అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, కార్మికులు సమ్మె నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయన కోరారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కార్మికులను సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
గత పదేళ్లలో ఆర్టీసీ అభివృద్ధి చెందలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు విడుదల చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
సమ్మె అనివార్యమైతే ప్రభావం ఎలా వుంటుంది..
ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా అంతరాయం కలిగే అవకాశం ఉంది.
వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.అయితే కార్మిక సంఘాలు తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాయి. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను నివారించడానికి ప్రయత్నాలు చేస్తోంది. సమ్మె మొదలైతే ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళల ఉచిత ప్రయాణంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి
టీఎస్‌ఆర్టీసీ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో సంస్థ గణనీయమైన మెరుగుదల కనబరిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణం 'మహాలక్ష్మి' పథకం కారణంగా టీఎస్‌ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల సంఖ్య రోజుకు సగటున 45.49 లక్షల నుండి 59.10 లక్షలకు పెరిగింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 104.11 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన టీఎస్‌ఆర్టీసీ, జనవరి 2025 నాటికి 529.20 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ లాభాలు 709.29 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 2025-26లో లాభాలు 1,008.79 కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రుణభారం విషయానికి వస్తే...
ఆర్థికంగా పుంజుకుంటున్నప్పటికీ, టీఎస్‌ఆర్టీసీకి ఇంకా భారీగా అప్పులు ఉన్నాయి. ఫిబ్రవరి 28, 2025 నాటికి సంస్థ మొత్తం అప్పులు 9,897.55 కోట్లు. ఇందులో బ్యాంకు రుణాలు 2,719.71 కోట్లు , ఉద్యోగుల పెండింగ్ చెల్లింపులు 7,177.84 కోట్లు ఉన్నాయి.
ప్రభుత్వ సహకారం మాటేమిటి?
తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీకి ఆర్థికంగా సహాయం చేస్తోంది. రాయితీ ఛార్జీల తిరిగి చెల్లించడం , రుణాల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తోంది. సంస్థకు ఉద్యోగుల జీతాలు , నిర్వహణ ఖర్చులు అధికంగా ఉన్నాయి. 2023-24లో మొత్తం ఆదాయంలో ఉద్యోగుల ఖర్చు 46 శాతంగా ఉంది. ఇంధన ధరల హెచ్చుతగ్గులు కూడా సంస్థపై ప్రభావం చూపుతున్నాయి.
ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా వుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆర్టీసీ నష్టాల నుండి ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోందని, ఈ సమయంలో ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం సంస్థకు మంచిది కాదని అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని ఆర్థికంగా దోచుకుందని ఆయన ఆరోపించారు.మొత్తంగా చూస్తే, తెలంగాణ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ఇంకా భారీగా అప్పులు ఉన్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సహకారం , ఆదాయ వృద్ధి సంస్థను నిలదొక్కుకోవడానికి సహాయపడవచ్చు. అయితే ఇప్పటికే వున్ అప్పులను తగ్గించుకోవడం , ఖర్చులను నియంత్రించడం సంస్థకు ముఖ్యమైన సవాళ్లుగా ఉన్నాయి.
తెలంగాణ ఆర్టీసీపై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రభావం సానుకూలంతో పాటు ప్రతికూలంగా కూడా ఉంది.
ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది మొత్తం ప్రయాణికుల సంఖ్యను పెంచింది. గతంలో రోజుకు సగటున 45.49 లక్షల మంది ప్రయాణిస్తుండగా, పథకం తర్వాత ఈ సంఖ్య 59.10 లక్షలకు చేరుకుంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఆర్టీసీకి ఆర్థికంగా మద్దతు ఇస్తోంది. సామాజిక ప్రయోజనం సమకూరుతోంది.
ఈ పథకం మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, వారి ప్రయాణ సౌకర్యాన్ని పెంచింది. ఇది వారి విద్య, ఉద్యోగం ఇతర అవసరాల కోసం ప్రయాణించడానికి సహాయపడుతోంది.
మహాలక్ష్మి పథకం తో ఆర్టీసీ పై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి.ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీ బస్సులపై ఒత్తిడి పెరిగింది. కొన్ని రూట్లలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది.
ఎక్కువ మంది ప్రయాణికులను తరలించడానికి అదనపు బస్సులు సిబ్బంది అవసరం అవుతోంది. కొత్త నియామకాలు లేక వున్న సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ,
రద్దీ కారణంగా కొన్నిసార్లు బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
అయితే, పెరిగిన రద్దీని నిర్వహించడం , ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఆర్టీసీకి ఒక సవాలుగా మారింది.