యమునా జలాలపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీ టార్గెట్ చేస్తూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో హర్యానా కాషాయ నేతలు భగ్గుమంటున్నారు.;
ఢిల్లీ అసెంబ్లీ (Delhi Polls) ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీ టార్గెట్ చేస్తూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో హర్యానా కాషాయ నేతలు భగ్గుమంటున్నారు. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే పరిశ్రమల వ్యర్థాలను యమునానదిలోకి వదులుతున్నారని మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఆరోపించారు. అమోనియా శాతం అధికంగా ఉన్న యమునా నది నీటిని శుద్ధి చేయడం కష్టమని, ఈ నీటిని ప్రజలకు సరఫరా చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఆమె చెప్పారు. ఢిల్లీ జల్ బోర్డు అమోనియా స్థాయిని 1 పిపిఎమ్ వరకు శుద్ధి చేయగలదని, అయితే హర్యానా నుంచి యమునా నది నీటిలో అమోనియా స్థాయి 700 శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. “హర్యానాలో బీజేపీ నాయకులు కావాలని నీటిలో విషం కలుపుతున్నారు. ఈ నీరు త్రాగితే ఢిల్లీలో చాలా మంది చనిపోతారు. నీటిని శుద్ధి చేయడం కష్టమయ్యే స్థాయిలో విషపూరితం చేశారు,” అని కేజ్రీవాల్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
సైనీ కౌంటర్..
ఆప్ ఆరోపణలను హర్యానా(Haryana) ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) ఖండించారు. తమ ప్రభుత్వం కావాలని పరిశ్రమల వ్యర్థాలను నదిలోకి వదులుతోందన్న ఆప్ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అసత్య ఆరోపణలు చేయడం కేజ్రీవాల్‌కు అలవాటైపోయిందన్నారు. అవాస్తవాలు మాట్లాడుతున్న కేజ్రీవాల్ తక్షణమే హర్యానా, ఢిల్లీవాసులకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని సైనీ హెచ్చరించారు. యమునాను పవిత్ర నదిగా భావించే తమ రాష్ట్ర ప్రజలు ఎందుకు కలుషితం చేస్తారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు సైనీ.