సివిల్ వివాదాలకు కోర్టులు ఉన్నాయ్: శివధర్ రెడ్డి
అదే విధంగా లంచం విషయంలో కూడా తాను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా.
తెలంగాణ పోలీసులకు నూతన డీజీపీ శివధర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సివిల్ వివాదాలకు పోలీసులు దూరంగా ఉండాలన్న హైకోర్టు వ్యాఖ్యలను ఆయన పునరుద్ఘాటించారు. సివిల్ వివాదాలను చూసుకోవడానికి కోర్టులు ఉన్నాయని, అలా కాదని పోలీస్ స్టేషన్‌లు సివిల్ అంశాల్లో తలదూరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తన ఫిలాసఫీ అంటూ శివధర్ రెడ్డి.. సోమవారం పోలీస్ సిబ్బందికి లేఖ రాశారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన పాధ్యత అని చెప్పారు. పోలీసు సిబ్బంది సంక్షేమం తన వ్యక్తిగత ప్రియారిటీ అని చెప్పారు. సివిల్ వివాదాలకు పోలీస్ స్టేషన్ అడ్డాలుగా మారితే చూస్తూ ఊరుకోనని తేల్చి చెప్పారు. కాబట్టి సివిల్ వివాదాలకు పోలీసులు దూరం పాటించాలని, వాటిని సివిల్ కోర్టులకు వదిలిపెట్టాలని వివరించారు.
అదే విధంగా లంచం విషయంలో కూడా తాను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటానని చెప్పారు. ఎవరయినా లంచం తీసుకుంటే చర్యలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. ఒక్క పోలీసు అధికారి లంచం తీసుకున్నా అది పోలీస్ శాఖ మొత్తానికి చెడ్డపేరు తెస్తోందన్నారు. అవినీతి, ఖాకీ యూనిఫాం ఒకే చోట ఉండలేవని అన్నారు. కేసుల విషయంలో బేసిక్ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. పేద ప్రజలు ఆపదలో ఉంటే పోలీసులు వెంటనే ఆ సమస్యలను పరిస్కరించాలని ఆదేశించారు. అప్పుడే ప్రజలు పోలీసులు ఎల్లప్పుడూ ఆదుకుంటారని చెప్పారు.
సివిల్ వివాదాల్లో పోలీసులకు హైర్ట్ చెప్పిందిదే..
‘‘పోలీసుల వల్లే కక్షిదారులు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. న్యాయస్థానాల పనిని కూడా తామే చేయాలని పోలీసులు అనుకుంటున్నారు. శాంతి భద్రతలు, దర్యాప్తు కంటే గిఫ్ట్ డీడ్, విల్లు వంటి సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడమే ఎక్కువగా కనిపిస్తోంది. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను, దావాలను ఉపసంహరించుకోవాలని పోలీసులు ఎలా చెప్తారు? ఆ అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? ఎక్కడ ఉంది?’’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. బార్కాస్‌లోని ఇంటి స్థలంపై కోర్టులో ఉన్న దావాను వెనక్కి తీసుకోవాలని తనపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగానే ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.