'నేనేంటో అందరికీ తెలుసు' ..మంత్రి కొండా ఫిర్యాదుపై స్పందించిన పొంగులేటి

సీతక్క, సురేఖ ఇద్దరూ సమ్మక్క-సారక్కలాగ పనిచేస్తున్నారు అంటూ కితాబు

Update: 2025-10-13 12:40 GMT

మంత్రుల మద్య వివాదాలు తెలంగాణలో హైలెట్ అవుతున్న వేళ తనపై సహచర మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారన్న వార్తలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు."నేను ఏంటో అందరికీ తెలుసు. రూ.70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయపడే అవసరం లేదు. నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. నా మీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏం ఉంది’’ అని పొంగులేటి అన్నారు.

మేడారం సమ్మక్క- సారలమ్మ దేవతలను సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క దర్శించుకున్నారు.అయితే ఈ పర్యటనకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా వుండటం కూడా చర్చనీయాంశమైంది. పొంగులేటితో విభేదాల కారణంగానే సురేఖ ఈ పర్యటనలో పాల్గొనలేదని చెబుతున్నారు.ఈ పర్యటన సందర్భంగా పొంగులేటి తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ ఎందుకు తనపై ఫిర్యాదు చేశారో అర్ధం కావడం లేదన్నారు."సీతక్క, సురేఖ ఇద్దరూ సమ్మక్క-సారక్కలాగ పనిచేస్తున్నారు "అంటూ కితాబు కూడా ఇచ్చారు.
మేడారం పనుల పరిశీలన
మేడారం సమ్మక్క- సారలమ్మ దేవతలను దర్శించుకున్న మంత్రులు పొంగులేటి, సీతక్కలకు అధికారులు, పూజారులు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు గద్దెల ప్రాంగణ విస్తరణ పనులను పరిశీలించారు. దేవాదాయ రోడ్లు, భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం హరిత హోటల్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై మహా జాతరలో తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ, దేవతల దర్శనం తదితర అంశాలపై చర్చించారు.నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మేడారం అభివృద్ధికి రూ.212 కోట్ల నిధులతో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించామని మంత్రి పొంగులేటి తెలిపారు. నిధులు ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, మేడారంలో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలని సూచించారు. అభివృద్ధి పనులపై అందరి సూచనలు తీసుకుంటాం, కేవలం ప్రాంగణం అభివృద్ధి కోసమే రూ.101 కోట్లు కేటాయించాం, ఎంత ఖర్చయినా సరే మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
పొంగులేటిపై కొండా ఫిర్యాదు
తన శాఖలో, వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనం చేస్తున్నారని, ఆయన జోక్యం మితిమీరుతోందని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి శనివారం కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు చేసిన విషయాన్ని మంత్రి పీఏ ఒక ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. ఈ వివాదం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిన సందర్భంగా పొంగులేటి వివరణ ఇచ్చారు.అయితే మంత్రుల వివాదాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. అవన్నీ తమ కుటుంబంలో వచ్చే సమస్యలేనని, ఇంటి గొడవల్లాగా పరిష్కరించుకుంటామని తేల్చేశారు.
Tags:    

Similar News