AAP చీఫ్ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ బృందం
"ఏసీబీ అధికారుల దగ్గర వారెంట్ లేదు. అధికారిక అనుమతి లేదు. తమ ఉద్దేశ్యమేంటో కూడా స్పష్టంగా చెప్పడం లేదు,"- ఆప్ లీగల్ సెల్ చీఫ్ సంజీవ్;
ఢిల్లీ(Delhi)లో శుక్రవారం రాజకీయ ఉద్రిక్తత తలెత్తింది. ఫిరోజ్ షా రోడ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసానికి అవినీతి నిరోధక విభాగం (ACB) అధికారులు చేరుకున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందురోజు తన పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులను బీజేపీ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని గురువారం కేజ్రీవాల్ అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ (LG) వీకే సక్సేనా దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో ACB బృందం కేజ్రివాల్ ఇంటికి చేరుకుంది. అయితే కేజ్రివాల్‌ను కలవనీయకుండా ఆప్ నేతలు ఏసీబీ అధికారులను అడ్డుకున్నారు. బీజేపీ ఒత్తిడి మేరకే ఏసీబీ వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఆప్ లీగల్ సెల్ చీఫ్ సంజీవ్ నసియార్ మాట్లాడుతూ.. "ఏసీబీ అధికారుల దగ్గర విచారణకు సంబంధించి వారెంట్ లేదా అధికారిక అనుమతి లేదు. కేజ్రివాల్ ఇంటి బయట కూర్చొని తమ ఉద్దేశ్యమేంటో కూడా స్పష్టంగా చెప్పడం లేదు," అని పేర్కొన్నారు.
‘‘ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే .. కేజ్రివాల్ నుంచి ఫిర్యాదు స్వీకరించేందుకని చెప్పారు. అయితే మా రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇప్పటికే ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది కేవలం బీజేపీ రాజకీయ నాటకం," అని నసియార్ విమర్శించారు.
"16 మందికిపైగా మా అభ్యర్థులను మరో పార్టీలోకి చేరేందుకు ఒత్తిడి చేశారు. ఇప్పటికే ఒక ఫోన్ నంబర్‌ను విడుదల చేశాం. ఇప్పుడు అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నాం. దర్యాప్తులో అన్ని వివరాలు బయటపడతాయి. బీజేపీ(BJP)కి ధైర్యముంటే, ఒక్కరిపైనైనా చర్య తీసుకోవాలి," అని సవాలు విసిరారు సంజయ్ సింగ్.
70 స్థానాలున్న ఢిల్లీ(Delhi) అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగాయి. రేపు (ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.