‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, దేశం దృష్టికి ఆకర్షించేందుకే..’
భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించవచ్చని నిందితులు పేర్కొన్నారని పోలీసులు తమ చార్జీషీట్‌లో పొందుపర్చారు.
భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించవచ్చని నిందితులు పేర్కొన్నారని పోలీసులు తమ చార్జీషీట్‌లో పొందుపర్చారు. వెయ్యి పేజీలకు పైగా ఉన్న చార్జిషీట్‌ను జూన్‌లో పాటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేశారు.
సరిగ్గా 22 ఏళ్ల తర్వాత మరో ఘటన..
పార్లమెంటుపై టెర్రరిస్టులు డిసెంబర్ 13, 2001 దాడిచేశారు. సరిగ్గా 22 సంవత్సరాలు తర్వాత అదే తేదీన మరోసారి కొంతమంది యువకులు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి అలజడి సృష్టించారు. విజిటర్ గ్యాలరీలోంచి ఒక్కసారిగా హాల్‌లోకి దూకి స్మోక్ బాంబ్‌లను ప్రయోగించారు. దీంతో కొంతమంది పార్లమెంటేరియన్లు భయపడి బయటకు పరుగులు తీశారు.
నిందితులు తమ ప్లాన్ ను అమలు చేయడానికి దాదాపు రెండేళ్లపాటు వివిధ ప్రాంతాల్లో పలుమార్లు సమావేశమయ్యారు. మొదటి సమావేశం ఫిబ్రవరి, 2022లో మైసూరులో జరగ్గా. చివరి సమావేశం గురుగ్రామ్‌లో నిర్వహించారు.
చార్జిషీట్‌లో ఏముంది?
నిందితులు తమ ప్లాన్‌ను అమలు చేయడానికి మైసూరు, గురుగ్రామ్, ఢిల్లీలో మొత్తం ఐదు సమావేశాలు నిర్వహించారు. వెయ్యి పేజీలకు పైగా ఉన్న చార్జిషీట్‌ను జూన్‌లో పాటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేశారు. దీనిపై కోర్టు గత నెలలో విచారణ చేపట్టింది. కర్ణాటకకు చెందిన డి మనోరంజన్ నేతృత్వంలోని యువకుల బృందం సోషల్ మీడియాలో కలిశారని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్టు చేసిన ఆరుగురు నిందితుల్లో మనోరంజన్ కూడా ఉన్నారని వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్ లోపల, బయట స్మోక్ బాంబులతో..
నిందితులు డిసెంబర్ 13, 2023న జీరో అవర్లో పార్లమెంట్ లోపల, వెలుపల స్మోక్ బాంబ్‌ల దాడికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు సాగర్ శర్మ, మనోరంజన్ పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి పసుపు వాయువును విడుదల చేసే డబ్బాలను తెరిచారు. అదే సమయంలో పార్లమెంటు వెలుపల మరో ఇద్దరు నిందితులు అమోల్ షిండే, నీలం ఆజాద్ ఇలాంటి పనే చేశారు. మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ షిండే, నీలం ఆజాద్‌ను అదే రోజు అరెస్టు చేశారు. డిసెంబర్ 15న లలిత్ ఝా, 16న మహేష్ కుమావత్‌ను అరెస్టు చేశారు. వీరిపై ఢిల్లీ పోలీస్ యాంటీ టెర్రర్ యూనిట్ స్పెషల్ సెల్ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని 16, 18 సెక్షన్లు, భారతీయ శిక్షాస్మృతిలోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులంతా తీహార్ జైలులో ఉన్నారు.
మనోరంజన్ ఎవరు?
మనోరంజన్ ఇంజనీరింగ్ కోర్సును ఆపేసి 2014లో కాంబోడియా వెళ్లాడు. అక్కడ 8 నెలలు గడిపాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 2015లో మోటార్‌సైకిల్‌పై లడఖ్‌కు వెళ్లాడు. లడఖ్ పర్యటనలో అప్పుడు హైదరాబాద్‌లో చదువుకుంటున్న ఒక చైనీస్ విద్యార్థి మనోరంజన్ బైక్‌పై మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకున్నాడు.
మొదటి సమావేశం స్నేహితుడి ఇంట్లో..
నిందితుల మొదటి సమావేశం 2022 ఫిబ్రవరిలో మైసూరులో మనోరంజన్ స్నేహితుని ఫ్లాట్‌లో జరిగింది. ఇందులో మనోరంజన్ డి, సాగర్ శర్మ, అమోల్ షిండే, లలిత్ ఝా, మహేష్ కుమావత్‌తో సహా 10 మంది హాజరయ్యారు. ఈ సమావేశంలో కొన్ని హింసాత్మక నిరసనల వీడియోలను మనోరంజన్ వారికి చూపించాడు. పార్లమెంటు లోపల, వెలుపల "రక్షిత జెల్"ను ఉపయోగించడం గురించి చర్చించారు. మార్చి 2018లో కొసావోలో టియర్ గ్యాస్ ఉపయోగించి అధికారాన్ని లాక్కోవడం గురించి కూడా వారంతా చర్చించారు.
ఇక రెండో సమావేశం ఆగస్టు 2022లో గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌లో జరిగింది. ఇందులో ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నారు. తాము చేస్తు్న్నది తప్పని తెలిసి తొలి సమావేశానికి హాజరయిన వారిలో కొందరు రెండో సమావేశానికి హాజరుకాలేదు. తమ గ్రూప్‌లో ఒక మహిళ కూడా ఉండాలని భావించి, నీలంను చేర్చుకున్నారు.
మూడో సమావేశంలో ఆరుగురే..
ఆగస్టు 2023లో సెంట్రల్ ఢిల్లీలోని పహర్‌గంజ్‌లోని ఒక హోటల్‌లో మూడో సారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంటులో పొగ డబ్బాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులు హాజరయ్యారు. వీరు అదే హోటల్‌లో సెప్టెంబర్, 2023న మళ్లీ సమావేశమయ్యారు. ఎంట్రీ పాసులు పొందడం, పార్లమెంటు లోపల పొగ డబ్బాలను ఉపయోగించడం గురించి చర్చించారు. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు.
వీరి చివరి సమావేశం గురుగ్రామ్‌లో జరిగింది. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర తమ ప్లాన్‌కు డేట్ ఫిక్స్ చేశారు. నలుగురు నిందితులు మనోరంజన్ , సాగర్ శర్మ, అమోల్ షిండే, నీలం ఆజాద్ తమ సిమ్ కార్డులను ధ్వంసం చేసి లలిత్ ఝాకు అప్పగించారు. అలా చేయమని చెప్పింది కూడా లలిత్ ఝానే.
భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు..
పార్లమెంటు గేటు వద్ద తమ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంతో పాటు వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి పనిని ఝాకి అప్పగించారు షిండే, నీలమ్. నిందితులు సోషల్ మీడియా పేజీ "భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్" సభ్యులని, వీరు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోడానికి సిగ్నల్ యాప్‌ను ఉపయోగించారని పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.